తైవాన్‌ చిప్‌ ఆగింది.. వాహనాల ఆర్సీ, లైసెన్స్‌లకు బ్రేక్‌! | Vehicle RC And License Cards Stuck Due To Taiwan Chip Problem | Sakshi
Sakshi News home page

తైవాన్‌ చిప్‌ ఆగింది.. వాహనాల ఆర్సీ, లైసెన్స్‌ జారీ నిలిచింది!

Published Thu, Nov 17 2022 8:41 AM | Last Updated on Thu, Nov 17 2022 8:41 AM

Vehicle RC And License Cards Stuck Due To Taiwan Chip Problem - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ చిన్న చిప్‌ ఇప్పుడు వాహనదారులను హైరానా పెడుతోంది. తైవాన్‌కు చెందిన ఆ చిప్‌ ఏకంగా రవాణాశాఖలో ఆర్సీలు, లైసున్సుల జారీ ప్రక్రియనే నిలిపేసింది. నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. రవాణాశాఖ కార్యాలయాల్లో లక్షల్లో కార్డులు పేరు కుపోయాయి. వాటిని పొందాల్సిన వాహనదారు లు, డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్లు దగ్గరపెట్టు కుని తిరుగుతున్నారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల్లో ఈ ప్రింట్లను పట్టించుకోకపోవడంతో వాహనాలను అనుమతించని పరిస్థితి ఉంది. స్థానికంగా, కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు కూడా పెనాల్టీలు విధిస్తున్నారు. దీనికంతటికీ.. ఆ కార్డుల్లో ఇమడాల్సిన చిప్‌లు లేకపోవటమే కారణం. 

ఇదీ కారణం..
రాష్ట్రంలో పదేళ్లుగా లైసెన్సులు, ఆర్సీ కార్డుల్లో చిప్‌లను అమర్చుతున్నారు. ఆ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ చిప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. నకిలీ కార్డులను అడ్డుకునేందుకు వీటిని తెచ్చారు. ఈ చిప్‌ల తయారీ మన దేశంలో నామమాత్రంగానే ఉంది. అందువల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకోకతప్పని పరిస్థితి. తైవాన్, ఉక్రెయిన్, చైనా నుంచి అవి దిగుమతి అవుతున్నాయి. ఇటీవల చైనాతో సంబంధాలు దెబ్బతిన్న క్రమంలో అక్కడి దిగుమతులను కేంద్రప్రభుత్వం నిషేధించింది. 

ఇక యుద్ధంతో అల్లకల్లోలంగా మారిన ఉక్రెయిన్‌ నుంచి కూడా వాటి దిగుమతి ఆగిపోయింది. మిగిలింది తైవాన్‌. రెండు దేశాల నుంచి దిగుమతి ఆగిపోయేసరికి తైవాన్‌పై భారం పడింది. సరిపడా చిప్‌లను ఆ దేశం అందించలేకపోతోంది. ఇటీవల స్థానికంగా వాటి డిమాండ్‌ పెరగడం, ఇతర దేశాలకు ఎక్కువ మొత్తంలో సరఫరా చేయాల్సి రావడంతో తైవాన్‌ కూడా చేతులెత్తేసింది. దీంతో చిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడి స్మార్ట్‌ కార్డుల తయారీ నిలిచిపోయింది.  

మళ్లీ సాధారణ కార్డులు   
ఇప్పుడు చిప్‌లకు తీవ్ర కొరత రావటంతో మళ్లీ పాతపద్ధతిలో అవి లేకుండానే కార్డులు ప్రింట్‌ చేయాలని రవాణాశాఖ నిర్ణయించినట్టు తెలిసింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి కూడా రావటంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌కార్డుల కోసం జనం రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎంవ్యాలెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని తనిఖీలప్పుడు చూపమని అధికారులు సలహా ఇస్తున్నారు. కానీ కొన్ని చోట్ల స్మార్ట్‌ కార్డు లేకుంటే పోలీసులు పెనాల్టీలు విధిస్తున్నట్టు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా రవాణాశాఖ సరీ్వస్‌ చార్జీ విధిస్తుంది. కార్లకు రూ.450, ద్విచక్రవాహనాలకు రూ.300 చొప్పున వసూలు చేస్తోంది. కానీ, కార్డుల జారీలో అవాంతరాలున్నాయన్న సమాచారాన్ని కనీసం వారికి ఎస్‌ఎంఎస్‌ రూపంలో కూడా పంపడం లేదు.   

ఇది దారుణం 
‘స్మార్ట్‌ కార్డుల జారీ నిలిచిపోయినా వాహనదారులకు సమాచారం ఇవ్వడం లేదు. కనీసం నోటీసు బోర్డుల్లోనూ పెట్టలేదు. పత్రికా ముఖంగా కూడా తెలపలేదు. రవాణాశాఖ సర్వీస్‌ చార్జీ వసూలు చేస్తూ కూడా ఇలా చేయటం దారుణం. దీనిపై వెంటనే పూర్తి వివరాలను వెల్లడించాలి. 
– దయానంద్, తెలంగాణ ఆటో మోటార్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement