సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది.
ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో..
రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు.
ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు.
మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో..
ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది.
ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి.
ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో?
అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment