RC
-
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..
-
వాహనాల ఆర్సీలకు మళ్లీ చిప్‌లు
సాక్షి, హైదరాబాద్: దాదాపు ఏడాది విరామం తర్వాత రాష్ట్రంలో మళ్లీ వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌ల ఏర్పాటు ప్రారంభమైంది. విదేశాల నుంచి తీసుకువస్తున్న ఈ చిప్‌లకు కొరత ఏర్పడి దిగుమతి నిలిచిపోవటంతో చిప్‌లు లేకుండానే కార్డులను జారీ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ చిప్, క్యూఆర్ కోడ్లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ ప్రారంభించింది. గురువారం నుంచి వాటి బట్వాడా మొదలైంది. ఉక్రెయిన్ యుద్ధం.. తైవాన్‌లో కొరత పేరుతో.. రాష్ట్రంలో దాదాపు ఏడాది కిందట వరకు వాహనాల లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్ కార్డులకు చిప్‌లను బిగించేవారు. ఆ చిప్ ముందు చిప్ రీడర్‌ను ఉంచగానే.. వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసిపోతుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ప్రైవేటు కంపెనీకి ఈ స్మార్ట్ కార్డుల తయారీ బాధ్యత అప్పగించారు. ఆ సంస్థనే చిప్‌ల వ్యవహారం కూడా చూస్తుంది. అయితే చిప్‌లకు కొరత ఏర్పడిందన్న పేరుతో స్మార్ట్ కార్డుల తయారీ, జారీ నిలిపేశారు. ఉక్రెయిన్, తైవాన్, చైనాల నుంచి ఆ చిప్స్ దిగుమతి అవుతాయని, చైనాతో సత్సంబంధాలు లేక వాటి దిగుమతిని కేంద్రం ఆపేసిందని చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశం నుంచి కూడా ఆగిపోయాయని, ఇక స్థానికంగా డిమాండ్ పెరిగి చిప్‌ల ఎగుమతిని తైవాన్ తాత్కాలికంగా నిలిపివేసిందని అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. చివరకు చిప్‌లు లేకుండానే కార్డుల జారీకి అనుమతించారు. మహారాష్ట్ర అధికారుల అభ్యంతరంతో.. ఆరు నెలల క్రితం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో తెలంగాణ వాహనాలను తనిఖీ చేసినప్పుడు చిప్ లేకుండా ఉన్న కార్డులపై ఆ రాష్ట్ర అధికారులు అనుమానాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. అవి అసలైనవో, నకిలీవో గుర్తించటం ఎలా అంటూ వాహనదారులను ప్రశ్నించారు. దీంతో పాటు రవాణాశాఖకు కూడా ఫిర్యాదులు పెరుగుతూ వచ్చాయి. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకుని తిరిగి చిప్‌లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. దాంతో ఆ సంస్థ చిప్‌లను సమకూర్చుకుని స్మార్ట్ కార్డుల తయారీని సిద్ధం చేసింది. గురువారం నుంచి చిప్‌లతో కూడిన స్మార్ట్ కార్డుల జారీని రవాణాశాఖ అధికారులు ప్రారంభించారు. స్మార్ట్ కార్డు ముందు వైపు చిప్ ఉంటుండగా, వెనక వైపు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సగటున నిత్యం 3,500 లైసెన్సులు, 5,500 ఆర్సీ కార్డులు జారీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కొరతను ఎలా అధిగమించారో? అప్పట్లో చిప్‌లకు కొరత ఎందుకు వచ్చిందో, ఇప్పుడు చిప్‌లు ఎలా సమకూర్చుకుంటున్నారో అధికారులు స్పష్టం చేయాలని తెలంగాణ ఆటోమోటార్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దయానంద్ డిమాండ్ చేశారు. -
ఇక డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు
సాక్షి, అమరావతి: ఇక నుంచి పేపర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, పేపర్ ఆర్సీ కార్డులుండవు. పేపర్ రహిత డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల దిశగా రాష్ట్ర రవాణా శాఖ ముందడుగు వేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింట్ చేసి జారీ చేసే పాత విధానానికి స్వస్తి పలికింది. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ కార్డుల జారీ విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రవాణా శాఖ కీలక విధాన నిర్ణయం తీసుకుంది. డిజి లాకర్ /ఎం–పరివాహన్లోఇవి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా రవాణా శాఖ ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను అందిస్తోంది. ఇందుకోసం దరఖాస్తుతో పాటు ఒక్కో కార్డుకు రూ.200 ఫీజు, రూ.35 పోస్టల్ చార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఈ విధానానికి శుక్రవారం నుంచి రవాణా శాఖ ముగింపు పలికింది. దాదాపు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న 25 లక్షలకు పైగా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌లో జారీ చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.33.39 కోట్లు కేటాయించింది. ఇక శనివారం నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల విధానం అమల్లోకి రానుంది. ఇక నుంచి దరఖాస్తుతో కార్డు కోసం రూ.200, పోస్టల్ చార్జీలకు రూ.35 వసూలు చేయరు. దరఖాస్తులను పరిశీలించి తగిన ప్రక్రియ అనంతరం డిజిటల్ విధానంలోనే వీటిని జారీ చేస్తారు. ప్రత్యేకంగా ఎం–పరివాహన్, డిజి లాకర్లో అందుబాటులో ఉంచుతారు. వాహనదారులు, దరఖాస్తుదారులు వాటిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకోవాలి. ఎక్కడైనా ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ అధికారులు అడిగితే ఆ డిజిటల్ ఫార్మాట్లో ఉన్న కార్డులను చూపితే సరిపోతుంది. మొబైల్ ఫోన్లు వాడనివారు ఆ కార్డులను ప్రింట్ తీసుకుని కూడా తమతో ఉంచుకోవచ్చు. వాటిని చూపినా అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఇక నుంచి రవాణా శాఖ జారీ చేసే అన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతారు. వాహనదారులకు సౌలభ్యం డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు, డిజిటల్ ఆర్సీ కార్డుల జారీ విధానం వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుంది. వారి నుంచి కార్డుల కోసం ఫీజులు కూడా వసూలు చేయం. అవసరమైన అన్ని కార్డులు డిజిలాకర్ విధానంలో మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉంచుకుంటే చాలు. – ఎంకే సిన్హా, రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
వాహనదారులకు కేంద్రం శుభవార్త అందించింది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల పెరుగుతున్న కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువును పొడిగించింది. అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు కానున్నట్లు పేర్కొంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. చదవండి: సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
వాహనదారులకు కేంద్రం శుభవార్త!
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆర్టీఓ కార్యాలయాలు అందించే ముఖ్యమైన సేవలను ఇప్పుడు ఆన్లైన్లో ద్వారా పొందవచ్చు అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు 18 రకాల సేవలను ఆధార్ అనుసంధానం ద్వారా వినియోగించుకునేలా మార్పులు చేసింది. ఈ సేవల కోసం ఆర్టీఓ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్సులో అడ్రస్ మార్పు, ఆర్ సీ రిజిస్ట్రేషన్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ వంటివి ఆధార్ అథెంటికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందవచ్చు. ఆన్లైన్లో లభించే ఇతర సేవలలో డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం దరఖాస్తు, మోటారు వాహన యాజమాన్య బదిలీ నోటీసు, మోటారు వాహన యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి దరఖాస్తు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో చిరునామా, డ్రైవర్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రం, దౌత్య అధికారి మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, దౌత్య అధికారి మోటారు వాహనం తాజా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు, లీజు-కొనుగోలు ఒప్పందానికి ఆమోదం, లీజు-కొనుగోలు ఒప్పందాన్ని వంటివి ఉన్నాయి. ఈ ప్రక్రియలను మరింత సౌకర్యవంతంగా చేయడానికి, ఆర్టీఓల వద్ద రద్దీని తగ్గించడానికి ఆన్లైన్లో సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రం తెలిపింది. కొత్త డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరని మంత్రిత్వ శాఖ ఇంతకుముందు విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. చదవండి: రికార్డ్ స్థాయిలో పెరిగిన ఐటీ నియామకాలు అమెజాన్.. వెనక్కి తగ్గాలి -
సారీ...నో డ్రైవింగ్ లైసెన్స్..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ మరోసారి స్తంభించింది. దాదాపు 1.5 లక్షల స్మార్ట్‌కార్డుల పంపిణీ పెండింగ్ జాబితాలో పడింది. దీంతో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలకు హాజరైన వారు, కొత్త వాహనాలను నమో దు చేసుకొన్న వాహనదారులు గత రెండు నెలలు గా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిబంధనల మేరకు రూ.వేలల్లో ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో లైసెన్సులు, ఆర్సీ కార్డులను అందుకోలేకపోతున్నా రు. గ్రేటర్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాలతో పాటు, జిల్లాల్లోనూ ప్రతి ఆర్టీఏ కార్యాలయం పరిధిలో సుమారు 8 వేల నుంచి 10 వేలకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల పంపిణీ నిలిచిపోయింది. స్పీడ్ పోస్టు ద్వారా వారం రోజుల్లో వాహనదారుల ఇంటికి చేరాల్సిన స్మార్ట్‌కార్డులు 2 నెలలు దాటినా అందకపోవడంతో వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనల మేర కు స్మార్ట్ కార్డు ప్రింటింగ్ ఖర్చుతో పాటు, పోస్టల్ చార్జీలు, వివిధ పౌరసేవల ఫీజులు, తదితర ఖర్చులన్నీ కలిపి రూ.వేలల్లో వసూలు చేస్తున్న అధికారులు సకాలంలో సేవలను అందజేయకపోవడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా తరచూ కార్డుల కొరత తలెత్తుతుండటంతో నెలల తరబడి పంపిణీ స్తంభించిపోతోంది. అయినాప్రభుత్వం ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. బకాయిలే కారణం... డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వివిధ రకాల పౌరసేవల రెన్యువల్స్ పత్రాలను రవాణాశాఖ స్మార్ట్‌కార్డుల రూపంలో అందజేస్తోంది. ఇందులో భాగంగా కార్డులు, ప్రింటింగ్‌కు అవసరమయ్యే రిబ్బన్లు, తదితర సామాగ్రిని ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఏటా సుమారు 21 లక్షల కార్డుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ద్వారా టెండర్లను నిర్వహించి అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేస్తారు. పూణేకు చెందిన ఎం–టెక్ సంస్థ గత కొన్నేళ్లుగా స్మార్ట్‌కార్డులను సరఫరా చేస్తోంది. ఒక్కో కార్డుకు రూ.21 చొప్పున చెల్లించి సదరు సంస్థ నుంచి కార్డులను కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా రవాణాశాఖ బకాయిలు చెల్లించకపోవడంతో సదరు సంస్థ తరచూ కార్డుల సరఫరాను నిలిపివేస్తోంది. ఇప్పటి వరకు సుమారు రూ.7 కోట్ల మేర బకాయిలు ఎం.టెక్కు చెల్లించాల్సి ఉన్నట్లు అంచనా. దీంతో రెండేళ్లుగా కార్డు ల జారీకి బ్రేక్ పడుతూనే ఉంది. పెద్ద సంఖ్యలో కార్డుల ప్రింటింగ్ స్తంభించిన ప్రతిసారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంట్రాక్టర్ మారితే పరిష్కారం లభిస్తుందా... ఒకవైపు కార్డుల కొరత ఇలా కొనసాగుతుండగానే మరోవైపు రవాణా అధికారులు పాత కాంట్రాక్ట్ స్థానంలో మూడు రోజుల క్రితం కొత్త సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. పూణేకు చెందిన ఎం–టెక్ సంస్థకు బదులు తాజాగా ఖైరోస్ అనే కొత్త సంస్థకు కార్డుల సరఫరా కాంట్రాక్టును కట్టబెట్టారు. పాత సంస్థ రూ.21 కి ఒక కార్డు చొప్పున అందజేస్తుండగా, ఖైరోస్ మాత్రం రూ.19.17 కే కార్డు చొప్పున ప్రింట్ చేసి ఇచ్చేందుకు ముందుకు రావడంతో పాత సంస్థ స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా ఏ సంస్థకైనా కార్డులు సరఫరా చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. మొరాయిస్తున్న ప్రింటర్లు... మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు ప్రింట్ చేసే యంత్రాలు కూడా పాడయ్యాయి. కొన్ని చోట్ల పూర్తిగా పనికి రాకుండా పోయాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో పని చేస్తున్నప్పటికీ వాహనదారుల డిమాండ్‌కు తగిన విధంగా కా>ర్డులను ప్రింట్ చేసి అందజేయలేకపోతున్నారు. ఒకవైపు సకాలంలో స్మార్ట్ కార్డులు సరఫరా కాకపోవడం, మరోవైపు ప్రింటర్లు మొరాయించడంతో కొన్ని చోట్ల 2 నుంచి 3 నెలల వరకు కూడా వినియోగదారులకు స్మార్ట్‌కార్డులు అందజేయలేకపోతున్నారు. కార్డులు, ప్రింటర్లు, టెక్నికల్ సామాగ్రి, వాహనాల అద్దెలు, తదితర ఖర్చులన్నీ కలిపి సుమారు రూ.26 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిధులు మంజూరు చేయాలని ఏడాదిగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని, దీంతో అన్ని రకాల కార్యకలాపాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇంత నిర్లక్ష్యమా... జీవితకాల పన్ను, త్రైమాసిక పన్ను, వివిధ రకాల పౌరసేవలపై విధించే ఫీజులు, అపరాధ రుసుములు, పర్మిట్లు, తదితర రూపంలో రవాణాశాఖకు ఏటా రూ.6 వేల కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. పౌరసేవలకు సంబంధించి ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, రెన్యువల్స్, తదితర సేవల కోసం ఆన్లైన్లో వాహనదారుల నుంచి ఫీజులు ముందే వసూలు చేస్తారు. ఉదాహరణకు డ్రైవింగ్ లైసెన్సు కోసం రూ.1500 ఫీజు ఉంటే అందులో నిర్ధారిత ఫీజు మినహాయించి కార్డు ధర, ప్రింటింగ్ ఖర్చు, స్పీడ్ పోస్టు కోసం రూ.250 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని రకాల ఫీజులు ముందే చెల్లించినప్పటికీ వినియోగదారులకు సకాలంలో పౌరసేవలను మాత్రం అందజేయలేకపోతున్నారు. ఏటా రూ.6 వేల కోట్ల ఆదాయాన్ని సముపార్జించే రవాణాశాఖ కేవలం రూ.26 కోట్ల బకాయిలు చెల్లించలేక, వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం గమనార్హం. -
కార్డుల్లేవ్!
షాద్‌నగర్‌టౌన్: వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డును వాహనదారులకు జారీ చేసే ప్రక్రియ పలుచోట్ల నిలిచిపోయింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు అందడం లేదు. లైసెన్స్‌లు పొందినా కార్డులు లేకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండా వాహనాలను నడిపేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ప్రాంతాలకు సంబంధించిన సుమారు 50 వేల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పెండింగ్‌లో ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా స్మార్టు కార్డుల ముద్రణ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్టు కార్డులు అందుబాటులో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయాల్లో కార్టుల ప్రింటింగ్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. షాద్‌నగర్‌లో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయంలో కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కడ్తాల్, ఆమనగల్లు మండలాలకు చెందిన వారు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యాలయంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరైనా వాటికి సంబంధించిన కార్డులు మాత్రం ఆరు నెలల నుంచి జారీ కావడం లేదు. దీంతో 2,804 ఆర్సీ కార్డులు, 1,225 డ్రైవింగ్ లైసెన్సుకార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్సీ కార్డులోనే వివరాలు వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్సీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఆర్సీ కార్డులు లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. కొందరైతే నెలల తరబడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మరి కొందరు సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాల్లో వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో వాహనం కొనుగోలు చేసినా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసినా కార్డులు లేకపోవడంతో వాటిని తిప్పలేకపోతున్నామంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వాహనాలను తీసుకెళ్లినప్పుడు అక్కడి పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, లేదంటే.. వాహనాన్ని వదిలి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రింటర్లు పనిచేయకపోవడంతోనే.. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీచేసేందుకు రవాణా శాఖ వద్ద ప్రత్యేకమైన ప్రింటర్లు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తున్నాడు. వాహనదారుడి వివరాలను కార్డుపై ముద్రించి ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సును పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో పాటు రూ.250 సేవా రుసుము ముందే చెల్లిస్తారు. అయితే, షాద్‌నగర్ రవాణా శాఖ కార్యాలయంలో కార్డుల ప్రింటింగ్‌కు సంబంధించిన యంత్రం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అత్తాపూర్‌లో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో షాద్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన కార్డులను ప్రింటింగ్ చేయాల్సి వస్తుంది. అత్తాపూర్ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్ కూడా సరిగా పని చేయకపోవడంతో అత్తాపూర్ పరిధిలోకి వచ్చే మండలాలకు సంబంధించిన కార్డుల జారీ ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా నిలిచిపోయాయి కార్టులు జారీ ప్రక్రియ నిలిచిపోయి సుమారు ఆరు నెలలు కావస్తోంది. వాహనదారులు తమ సమస్యలను ఆర్టీఏ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ చూస్తున్నారని, అయితే కార్డులు లేకపోవడంతో వారు జరిమానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఎం వాలెట్ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు చూసుకునే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది స్మార్టు ఫోన్లు లేకపోవడం, ఎం వాలెట్ విధానం గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వెంటనే కార్డులు జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వెంటనే జారీ చేయాలి డ్రైవింగ్ లైసెన్సు కోసం సుమారు మూడు నెలల కింద దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు డ్రైవింగ్ లైసెన్సు కార్డు పోస్టు ద్వారా వస్తుందని చెప్పారు. కానీ నేటి వరకు రాలేదు. వాహనాన్ని బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని భయమేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు కార్డు ఉంటే ఇబ్బందులు ఎదురుకావు. కార్డులను జారీ చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – సాయికుమార్, విఠ్యాల, ఫరూఖ్‌నగర్ -
డిజిలాకర్ను అంగీకరించండి
న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) తదితర వాహన సంబంధిత ధ్రువపత్రాలను డిజిలాకర్ లేదా ఎం–పరివాహన్ యాప్ ద్వారా అంగీకరించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మోటార్ వాహనాల చట్టం–1988, సమాచార, సాంకేతిక చట్టం–2000 ప్రకారం ఆ ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలను రవాణా శాఖ జారీ చేసిన ఒరిజినల్స్‌తో సమానంగా పరిగణించాలంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కొత్త వాహనాలఇన్సూరెన్స్ వివరాలు, రెన్యువల్ ఇన్సూరెన్స్ వివరాలను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డు ‘వాహన్’ డేటాబేస్‌లోకి ప్రతి రోజూ అప్లోడ్ చేస్తుందని, ఇవన్నీ ఎం–పరివాహన్ లేదా ఈ–చలాన్ యాప్‌లో కనిపిస్తాయని స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ వివరాలు సదరు యాప్‌ల్లో కనిపిస్తే ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. -
కార్డు..నోవేర్ –ఫైన్ బరాబర్!
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్‌కు చెందిన వినోద్ మే నెలలో డ్రైవింగ్ లైసెన్స్ చిరునామా మార్పు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. కొత్త లైసెన్స్ ‘స్మార్ట్ కార్డు’ పోస్టు ద్వారా వారం రోజుల్లో ఇంటికే వస్తుందని అధికారులు చెప్పారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అతన్ని తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సు చూపించమన్నారు. అది లేకపోవడంతో జరిమానా విధించారు. ఐ లంగర్‌హౌస్‌లో ఉంటున్న సాయితేజ నెల రోజుల క్రితం కొత్త బైక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు వాహనం రిజిస్ట్రేషన్ కార్డు (ఆర్సీ) చేతికి రాలేదు. 15 రోజుల పాటు ఎదురు చూసి అధికారులను సంప్రదించాడు. కార్డుల కొరత వల్ల పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడతడు బండి బయటకు తీస్తే పోలీసులు పట్టుకుంటారేమోనని భయపడుతున్నాడు. ఈ సమస్య వినోద్, సాయితేజలదే కాదు.. గ్రేటర్‌లోని సుమారు లక్షా 75 వేల మంది వాహన వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్య. నగరంలోని ఒక్కో ఆర్టీఏ కార్యాలయంలో 10 వేల నుంచి 25 వేల వరకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీ నిలిచిపోయింది. నగర శివారులోని ఒక్క ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పరిధిలోనే సుమారు 20 వేల స్మార్ట్ కార్డుల పంపిణీకి బ్రేక్ పడింది. ప్రధాన కార్యాలయం ఖైరతాబాద్‌లో 25 వేల కార్డులు ఆగిపోయాయి. ప్రస్తుతం అత్యంత ప్రముఖులకు మాత్రమే అతికష్టంగా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు అందజేస్తున్నారు. మేడ్చల్, అత్తాపూర్, ఉప్పల్ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత రవాణాశాఖకు సవాల్‌గా మారింది. రెండు నెలల క్రితం చోటుచేసుకున్న ఈ ప్రతిష్టంభన ఇప్పటికీకొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తాడు. రవాణాశాఖ అందజేసే పౌరసేవల కోసం చెల్లించే ఫీజుతో పాటు, కార్డుపైన వాహనదారుడి వివరాలను ముద్రించి ఒక ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సు రూపంలో పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో సహా రూ.250 సేవా రుసుం, ఇతరత్రా అన్ని ఖర్చులను ముందే చెల్లిస్తాడు. గతంలో డ్రైవింగ్ లైసెన్సు పరీక్షలు పూర్తయిన వెంటనే నేరుగా లైసెన్స్ ఇచ్చేవారు. ఆర్సీలూ అంతే. వాహనదారుల చిరునామా ధ్రువీకరణ కోసం కొంతకాలంగా పోస్టు ద్వారా పంపిణీ చేస్తున్నారు. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అన్ని రకాల ఫీజులు, సర్వీసు చార్జీలు చెల్లించిన సుమారు లక్షా 75 వేల మంది వినియోగదారులకు గత రెండు నెలలుగా స్మార్ట్ కార్డులు అందడం లేదు. ఒక్కో వినియోగదారుడు సగటున రూ.1500 ఫీజు చెల్లించినట్లు భావించినా ఈ రెండు నెలల్లో రవాణాశాఖ ఖజానాలో జమ అయిన మొత్తం అక్షరాలా రూ.26.25 కోట్లపైనే.. అంటే వాహనదారుల నుంచి ముందుగానే ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రవాణశాఖ వారికి అందించాల్సిన స్మార్ట్‌కార్డుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏడాది కాలంగా ఈ సమస్య పదే పదే పునరావృతమవుతోంది. ఈ ఏడాది కాలంలో పౌరసేవలపైన వినియోగదారుల నుంచి వందల కోట్ల రూపాయలు ఆర్జించిన రవాణాశాఖ.. వారికి అందజేయవలసిన పౌరసేవలపైన మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యానికి ప్రదర్శిస్తోంది. బకాయిలు రూ.4 కోట్లే ప్రతినెలా 1.15 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి పంపిణీ చేస్తారు. ఇందుకోసం వినియోగించే స్టేషనరీని పూణేకు చెందిన ఎంటెక్ ఇన్నొవేషన్స్ నుంచి దిగుమతి చేసుకుంటారు. సాధారణంగా వినియోగదారుల డిమాండ్ మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సంస్థ 6 లక్షల కార్డులను రవాణాశాఖకు అందజేస్తుంది. అలాగే ముంబైకి చెందిన శ్రీనాథ్ ఎంటర్ప్రైజెస్ స్మార్ట్ కార్డుల ముద్రణకు అవసరమైన రిబ్బన్‌ను సరఫరా చేస్తుంది. ప్రతి 3 నెలలకోసారి ఈ రెండు సంస్థలకు నిధులు చెల్లించాలి. ఎంటెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఇంకా 9 నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ రూ.4 కోట్ల మేర బకాయీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఆ సంస్థ మే నెలాఖరు నుంచి కార్డుల సరఫరాను నిలిపివేసింది. అప్పటి వరకు అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో నిల్వ ఉన్న కార్డులను పంపిణీ చేయగా జూన్ నుంచి తీవ్ర కొరత ఏర్పడింది. వాహనదారులకు రెండు విధాలా నష్టం.. ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. అన్ని రకాల ఫీజులు చెల్లించి సకాలంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు అందుకోలేకపోవడం ఒకటైతే.. సరైన ధ్రువపత్రాలు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసుల నుంచి ఇబ్బందులను ఎదుర్కోవడం రెండోది. చాలా వరకు తమ వద్ద ఉన్న రశీదుల ఆధారంగా వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల నుంచి బయటపడుతున్నప్పటికీ అవి కోల్పోయిన వారు మాత్రం తగిన ‘మూల్యం’ చెల్లించకతప్పడం లేదు. ఇలా ప్రతి రోజు సుమారు 250 మంది డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు లేక చలానాలు కడుతున్నారు. -
కొత్త బండి.. జేబులకు గండి
కొత్తగా బైక్ కొనాలని కొన్ని షోరూంలకు వెళితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకుంటే రవాణా శాఖ నిబంధనలతో పేరుతో షోరూం యజమానులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్, బీమా తదితరాలు వారి వద్దే చేయించుకోవాలనే నిబంధన వారికి కాసుల వర్షం కురిపిస్తోంది. వారు చెప్పినంత ఇచ్చి బైక్‌ను కొనాల్సిందే. ఇది పలమనేరు పట్టణంలో మాత్రమే కాదు జిల్లా వ్యాప్తంగా సాగుతున్న తంతు. పలమనేరుకు చెందిన శరత్చంద్ర షోరూంలో ఓ బైక్ కొన్నాడు. బైక్ విలువతోపాటు అదనంగా ఆర్సీ, ఇన్సూరెన్స్, లైఫ్‌టాక్స్, నెంబర్ ప్లేట్‌కు ఇలా అధికంగానే డబ్బులు గుంజారు. ఇదేంటని ప్రశ్నిస్తే మీరు ఏ షోరూంకు వెళ్లినా ఇంతేనని సమాధానమిచ్చారు. దీంతో విధిలేక అదనంగా డబ్బులు చెల్లించి బైక్‌ను సొంతం చేసుకున్నాడు. పలమనేరు: కొత్తగా వాహనాన్ని కొనేటప్పుడే అందుకు సంబంధించిన మొత్తం ప్రొసెస్‌తో పాటు అవసమైన సర్టిఫికెట్లను షోరూం నిర్వాహులే అందించాలని రవాణాశాఖ ఈ మధ్యనే ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా ఆన్లైన్లో సాగే ప్రక్రియే. రవాణా శాఖ నిబంధనల మేరకు ఆర్సీకి రూ.760, లైఫ్‌టాక్స్ బండి విలువలో 9 నుంచి 12శాతం, ఇన్సూరెన్స్ రూ.1800, నంబర్ ప్లేటుకు రూ. 250 వసూలు చేయాల్సి ఉంది. జరుగుతున్న తతంగం ఇలా.. అయితే కొన్ని షోరూంల నిర్వాహకులు ఆర్సీకి రూ.1000 నుంచి 1,600, టాక్స్ రూ.1200, ఇన్సూరెన్స్ రూ.2,200, నంబర్ ప్లేటుకు రూ.400 వసూలు చేస్తున్నారు. దీంతోపాటు లైసెన్స్ లేకుంటే దాన్ని తామే ఇస్తామంటూ వసూలుకు పాల్పడుతున్నారు. ఇక హెల్మెట్లు బయటి మార్కెట్‌కంటే రూ.500 వరకు ఎక్కువగా గుంజుతున్నారు. మొత్తం మీద ఓ బైక్‌కు రూ. 2వేలు అదనంగా ఇవ్వాల్సిందే. జిల్లాలో పలు వాహనాల కంపెనీలకు సంబంధించి సుమారు 220 షోరూంలున్నాయి. అన్ని చోట్ల ఇదే తంతు కొనసాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్ని చోట్ల సిండికేటే.. పట్టణాల్లోని షోరూం నిర్వాహకులంతా సిండికేట్‌గా మారి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొనుగోలుదారులు ఏ షోరూంకు వెళ్లినా ఇదే ధరలుంటాయి. దీంతో వారు చెప్పిన ధర ఇచ్చి బైక్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక షోరూంలలో వాయిదాలతో వాహనాలు కొనేవాళ్లపై ఈ వాతలు కాస్త అధికంగానే ఉంటున్నాయి. దీన్ని ప్రశ్నించినా లాభం లేకుండా ఉంది. దీనిపై ఎంవీఐ శివారెడ్డిని వివరణ కోరగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ధరల పట్టికలు పెట్టాలి ప్రభుత్వం నిర్దేశించిన ధరల వివరాలను సంబంధిత షోరూంల వద్ద రవాణాశాఖ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలి. షోరూం నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలివ్వాలి. దీనిపై కొనుగోలుదారుకు అవగాహన లేకపోవడంతో దోపిడీ సాగుతోంది.–శరత్చంద్ర, పలమనేరు ఈఎంఐలో అధిక వసూళ్లు కొనుగోలు సమయంలో మొ త్తం నగదు కట్టి బండి కొనేవాళ్లు రిసిప్టులు చూస్తారు కాబట్టి తెలుస్తుంది. వాయిదాల్లో వాహనాలు కొనేవాళ్ల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. సేవలకు ధరలను పట్టిక రూపంలో షోరూంల వద్ద తెలియజేసేలా చర్యలు తీసుకోవాలి.–చెంగారెడ్డి, కూర్మాయి, పలమనేరు -
సెల్ఫోన్లో డ్రైవింగ్ లెసైన్స్
* వాహన్ బీమా తరహాలో సరికొత్త యాప్ * అన్ని రకాల డాక్యుమెంట్లతో ‘ఎం-వాలెట్’ * త్వరలో ప్రవేశపెట్టనున్న ఆర్టీఏ సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్స్, ఆర్సీ వెంట తెచ్చుకోవడం మరిచిపోయారా. ట్రాఫిక్ పోలీసులు పట్టుకొని ఫైన్ వేస్తారేమోనని ఆందోళనకు గురవుతున్నారా... ఇక నుంచి ఇలాంటి ఆందోళనలు అవసరం లేదు. జేబులో ఎలాంటి డాక్యుమెంట్లూ లేకపోయినా సరే నిశ్చింతగా రోడ్డెక్కవచ్చు. ట్రాఫిక్ పోలీసులకు, ఆర్టీఏ అధికారులకు బెంబేలెత్తవలసిన పనిలేదు. అయితే అందుకోసం చేయాల్సిందల్లా మీ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే నుంచి ఒక మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఆ యాప్ ద్వారా మన డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవడమే. ‘స్మార్ట్’ సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోన్న రవాణా శాఖ త్వరలో ‘ఎం-వాలెట్’ పేరుతో సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు ఈ-డ్రైవింగ్ లెసైన్స్, ఈ-ఆర్సీ, ఈ-ఇన్స్యూరెన్స్, ఈ-పొల్యూషన్ తదితర వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఇటీవల ప్రవేశపెట్టిన ‘వాహన్ బీమా’ తరహాలో ఎం-వాలెట్ సేవలందజేస్తుంది. వాహనాల ఇన్సూరెన్స్ వివరాలను, వివిధ బీమా సంస్థలకు సంబంధించిన వివరాలను వాహన్ బీమా ద్వారా పొందవచ్చు. అలాగే ఎం-వాలెట్ కూడా వాహనాల డేటాతో నిక్షిప్తమై ఉంటుంది. పర్మిట్లు కూడా యాప్‌తోనే... తెలంగాణ రాష్ర్టవ్యాప్తంగా నమోదైన 80 లక్షల వాహనాలు, 60 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌ల డేటాను రవాణా శాఖ నిక్షిప్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, క్యాబ్‌లు, వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. 35 లక్షలకు పైగా డ్రైవింగ్ లెసైన్స్‌లున్నాయి. ఈ వివరాలన్నింటినీ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ సర్వర్‌లో నిక్షిప్తం చేశారు. సెంట్రల్ సర్వర్‌ను ‘టీఎస్టీడీ’ అనే యాప్‌తో అనుసంధానం చేశారు. దీంతో అధికారులు తమ సెల్ఫోన్లోనే వాహనాల వివరాలను పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రవేశపెట్టనున్న ‘ఎం-వాలెట్’ను ఈ టీఎస్‌టీడీతో అనుసంధానం చేసి వాహనదారులకు కావలసిన డ్రైవింగ్ లెసైన్స్, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్స్యూరెన్స్ తదితర డాక్యుమెంట్ల వివరాలను అందిస్తారు. భవిష్యత్తులో రవాణా వాహనాల పర్మిట్లను కూడా ఈ యాప్ ద్వారా అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ యోచిస్తోంది. ప్రైవేటు బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజీలు, క్యాబ్‌లు, ట్యాక్సీలు, లారీలు తదితర వాహనాలు నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావలసిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించి పర్మిట్లను పొందే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా చెప్పారు.