వాహనాలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న దృశ్యం
షాద్‌నగర్‌టౌన్: వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డును వాహనదారులకు జారీ చేసే ప్రక్రియ పలుచోట్ల నిలిచిపోయింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు అందడం లేదు. లైసెన్స్‌లు పొందినా కార్డులు లేకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండా వాహనాలను నడిపేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ప్రాంతాలకు సంబంధించిన సుమారు 50 వేల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పెండింగ్‌లో ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఆరు నెలలుగా స్మార్టు కార్డుల ముద్రణ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్టు కార్డులు అందుబాటులో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయాల్లో కార్టుల ప్రింటింగ్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. షాద్‌నగర్‌లో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయంలో కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కడ్తాల్, ఆమనగల్లు మండలాలకు చెందిన వారు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యాలయంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరైనా వాటికి సంబంధించిన కార్డులు మాత్రం ఆరు నెలల నుంచి జారీ కావడం లేదు. దీంతో 2,804 ఆర్సీ కార్డులు, 1,225 డ్రైవింగ్ లైసెన్సుకార్డులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆర్సీ కార్డులోనే వివరాలు
వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్సీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఆర్సీ కార్డులు లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. కొందరైతే నెలల తరబడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మరి కొందరు సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాల్లో వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో వాహనం కొనుగోలు చేసినా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసినా కార్డులు లేకపోవడంతో వాటిని తిప్పలేకపోతున్నామంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వాహనాలను తీసుకెళ్లినప్పుడు అక్కడి పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, లేదంటే.. వాహనాన్ని వదిలి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు.
ప్రింటర్‌లు పనిచేయకపోవడంతోనే..
ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీచేసేందుకు రవాణా శాఖ వద్ద ప్రత్యేకమైన ప్రింటర్లు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తున్నాడు. వాహనదారుడి వివరాలను కార్డుపై ముద్రించి ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సును పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో పాటు రూ.250 సేవా రుసుము ముందే చెల్లిస్తారు. అయితే, షాద్‌నగర్ రవాణా శాఖ కార్యాలయంలో కార్డుల ప్రింటింగ్‌కు సంబంధించిన యంత్రం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అత్తాపూర్‌లో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో షాద్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన కార్డులను ప్రింటింగ్ చేయాల్సి వస్తుంది. అత్తాపూర్ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్ కూడా సరిగా పని చేయకపోవడంతో అత్తాపూర్ పరిధిలోకి వచ్చే మండలాలకు సంబంధించిన కార్డుల జారీ ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు.
ఆరు నెలలుగా నిలిచిపోయాయి
కార్టులు జారీ ప్రక్రియ నిలిచిపోయి సుమారు ఆరు నెలలు కావస్తోంది. వాహనదారులు తమ సమస్యలను ఆర్టీఏ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ చూస్తున్నారని, అయితే కార్డులు లేకపోవడంతో వారు జరిమానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఎం వాలెట్ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్‌లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు చూసుకునే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది స్మార్టు ఫోన్లు లేకపోవడం, ఎం వాలెట్ విధానం గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వెంటనే కార్డులు జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
వెంటనే జారీ చేయాలి
డ్రైవింగ్ లైసెన్సు కోసం సుమారు మూడు నెలల కింద దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు డ్రైవింగ్ లైసెన్సు కార్డు పోస్టు ద్వారా వస్తుందని చెప్పారు. కానీ నేటి వరకు రాలేదు. వాహనాన్ని బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని భయమేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు కార్డు ఉంటే ఇబ్బందులు ఎదురుకావు. కార్డులను జారీ చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
– సాయికుమార్, విఠ్యాల, ఫరూఖ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment