Driving license cards
-
కొత్త బండి మోజు తీరకుండానే చలాన్ల మోత.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: కొత్త బండి మోజు తీరకుండానే చలాన్లు మోత మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదవుతున్నాయి. ఆర్సీలు లేకుండా నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు. నిజానికి తప్పిదం తమది కాకపోయినా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ఆర్టీఏ కార్యాలయాల నుంచి వాహనదారులకు సకాలంలో ఆర్సీ స్మార్ట్‌కార్డులు అందకపోడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోంది. కొత్త బండి కొనుగోలు చేసిన సంతోషం క్షణాల్లో ఆవిరవుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఏలో వాహనం నమోదైన వారం, పది రోజుల్లోనే స్మార్ట్‌కార్డు ఇంటికి చేరాల్సి ఉండగా, అందుకు విరుద్దంగా నెలలు గడిచినా కార్డులు రావడం లేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖలో స్మార్ట్‌కార్డుల కొరత వల్లనే ఈ జాప్యం చోటుచేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్మార్ట్‌కార్డుల నాణ్యత పెంచేందుకు ఇటీవల పాత కాంట్రాక్ట్‌ను రద్దు చేశారు. కానీ దాని స్థానంలో కొత్త కాంట్రాక్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల రవాణాశాఖకు స్మార్ట్‌కార్డుల మెటీరియల్ సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల స్మార్ట్ కార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో కొరత ఏర్పడింది. ఇది వాహనదారులకు ఆర్థిక భారంగా మారింది. గ్రేటర్లో వేలల్లో డిమాండ్గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతాయి. అలాగే బ్యాంకు ఈఎంఐలు చెల్లించిన అనంతరం స్మార్ట్‌కార్డుల్లో హైపతికేషన్ రద్దు కోసం వచ్చే వాహనదారులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. దీంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాలకంటే హైదరాబాద్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీల కోసం ముద్రించే స్మార్ట్‌కార్డులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రెండు కేటగిరీల్లో కనీసం రోజుకు 5,000 కార్డులను ప్రింట్ చేసి స్పీడ్ పోస్టు ద్వారా వాహనదారులకు చేరవేయాల్సి ఉంటుంది. ఒక్కో కార్యాలయం నుంచి సుమారు 500 కార్డులకు డిమాండ్ ఉంటుంది. కానీ ఇందుకు తగిన విధంగా కార్డుల మెటీరియల్ లేకపోవడం వల్ల కొరత తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షకుపైగా కార్డుల కొరత ఉండగా, సెప్టెంబర్ నాటికి 40 వేలకు పైగా అందజేసినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త కార్డుల సరఫరాకు ఒప్పందం ఏర్పడనుందని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో కార్డులను జారీ చేస్తామని తెలిపారు. కానీ ప్రస్తుతం నెలకొన్న జాప్యం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ‘హైపతికేషన్ కాన్సిల్ చేసుకొని నెల దాటింది. కానీ ఇప్పటి వరకు కార్డు రాలేదు. బండి బయటకు తీయాలంటే భయమేస్తోంది..’ అని తుర్కయంజాల్ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే వాహనదారుడు విస్మయం వ్యక్తం చేశారు. ఇప్పటికే చలాన్ల పేరిట రూ.300 చెల్లించినట్లు చెప్పారు. మరోవైపు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తుందని, గంటల తరబడి పడిగాపులు కాసినా అధికారులు స్పందించడం లేదని చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడు ఆందోళన వ్యక్తం చేశారు.ఒక్కో కార్డు రూ.685డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం ఆర్టీఏకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్సుల కేటగిరీ మేరకు రూ.685 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతుంది. ఆర్సీలకు మాత్రం రూ.685 వరకు చెల్లించాలి. ఇందులో సర్వీస్ చార్జీల రూపంలో రూ.400, స్మార్ట్‌కార్డుకు రూ.250 చొప్పున చెల్లించాలి. మరో రూ.35 స్పీడ్‌పోస్ట్ చార్జీలు చెల్లించాలి. ఇలా అన్ని చార్జీలు కలిపి ముందే చెల్లించినా నెలల తరబడి పడిగాపులు కాయాల్సి రావడం గమనార్హం. చదవండి: ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటుసారథి వస్తే ఆన్లైన్లోనే.. మరోవైపు తరచూ కార్డుల జారీలో నెలకొంటున్న జాప్యం, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఆధార్ తరహా ఆన్లైన్లోనే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని అధికారులు సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న సారథి సాంకేతిక వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలైతే ఈ సేవా కేంద్రాల నుంచే స్మార్ట్ కార్డులను అందజేసే అవకాశం ఉంటుందని ఒక అధికారి చెప్పారు. ఇందుకు మరి కొంత సమయం పట్టవచ్చు. -
డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఆర్సీలపై రవాణా శాఖ సంచలన నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ స్మార్ట్ సేవలకు మంగళం పాడింది. 13 ఏళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ, తదితర ధ్రువపత్రాలకు సంబంధించిన స్మార్ట్ కార్డులు ఇప్పుడు స్మార్ట్‘లెస్’ అయ్యాయి. ఈ స్మార్ట్ కార్డుల్లో వినియోగించే చిప్స్‌ను తొలగించారు. వాహనదారుకు సంబంధించిన పూర్తి వివరాలతో రూపొందించే చిప్స్ లేకుండానే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను ముద్రించి అందజేస్తున్నారు. తైవాన్, చైనా, తదితర దేశాల నుంచి చిప్స్ దిగుమతి కావడం లేదనే కారణంతో కొంతకాలం పాటు స్మార్ట్ కార్డుల జారీని నిలిపివేశారు. ఆ తర్వాత చిప్స్ లేకుండానే కార్డులను ముద్రించి అందజేయడం ప్రారంభించారు. ప్రస్తుతం చిప్స్ కొరత లేకపోయినప్పటికీ వాటిని తిరిగి వినియోగింలోకి తేకుండానే చిప్లెస్ కార్డులనే వాహనదారులకు కట్టబెట్టడం గమనార్హం. వాహన తయారీ రంగంలో కీలకంగా భావించే చిప్స్ ప్రస్తుతం విదేశాల నుంచి నిరాటంకంగా దిగుమతి అవుతున్నాయి. దీంతో వాహన తయారీ రంగం కూడా తిరిగి వేగం పుంజుకుంది. రవాణాశాఖను మాత్రం ఇంకా చిప్స్ కొరత వెంటాడడం గమనార్హం. త్రీటైర్‌తో పాటే చిప్స్.. రవాణాశాఖ వివిధ రకాల పౌరసేవలను పారదర్శకంగా అందజేసేందుకు 2009లో త్రీటైర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అప్పటి వరకు ఉన్న టూటైర్ సాంకేతిక వ్యవస్థ స్థానంలో మరింత అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచి్చంది. దీంతో ఖైరతాబాద్‌లోని రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయం నుంచే అన్ని రకాల పౌరసేవలకు కిందిస్థాయి వరకు చేరేలా చర్యలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు, వాహన బదిలీ పత్రాలు వంటివి చిన్న సైజు స్మార్ట్ కార్డుల రూపంలోకి తెచ్చారు. వాహనదారులపైన ఇది ఆర్థికంగా భారమైనప్పటికీ పెద్ద పత్రాల రూపంలో వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తప్పింది. మరోవైపు స్మార్ట్ కార్డుల్లో చిప్స్‌ను ప్రవేశపెట్టారు. వాహనదారుడి పూర్తి వివరాలను ఇందులో నమోదు చేశారు. దీనివల్ల ఎలాంటి నకిలీ పత్రాలకు తావు లేకుండా ఆర్టీఏ సేవలు మరింత నాణ్యంగా, పారదర్శకంగా మారాయి. వాహనదారుడికి పూర్తి భద్రత లభించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి స్మార్ట్ సేవలు అందుబాటులో లేని రోజుల్లోనే ‘చిప్స్’ను పరిచయం చేయడం విశేషం. కానీ వీటిలో నమోదు చేసిన సమాచారాన్ని తెలుసుకొనేందుకు కావాల్సిన రీడర్స్‌ను మాత్రం ఆర్టీఏ సమకూర్చుకోలేకపోయింది. రవాణాశాఖలోనే కాదు పోలీసుల వద్ద కూడా చిప్స్ రీడర్స్ లేకపోవడం గమనార్హం. వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు, ఇతరత్రా సంఘటనల్లో ఈ స్మార్ట్ కార్డులలోని చిప్స్ ద్వారా సమాచారం తెలుసుకొనే అవకాశం ఉన్నా రీడర్స్ లేకపోవడంతో అవి కేవలం అలంకారప్రాయంగా మారాయి. ఏకంగా ఎత్తేశారు.. పారదర్శక సేవలను అందజేసే లక్ష్యంతో టు టైర్ నుంచి త్రీటైర్‌కు మారిన రవాణాశాఖ ఇప్పుడు చిప్స్ కొరతను సాకుగా చూపుతూ, చిప్ రీడర్స్ లేకపోవడంతో చిప్స్‌తో ఎలాంటి ఉపయోగం లేదనే అంశాన్ని ఎత్తి చూపుతూ ఇప్పుడు ఏకంగా చిప్స్‌నే తొలగించారు. దీంతో నకిలీ కార్డులకు ఊతమిచ్చినట్లయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆధార్, ఓటర్ గుర్తింపు వంటి వివిధ రకాల నకిలీ కార్డులు వెల్లువెత్తుతుండగా, చిప్స్ లేకపోవడంతో లైసెన్సులు, ఆర్సీల్లోనూ నకిలీ పత్రాలకు ఊతమిచ్చినట్లవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
నయా లుక్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయ్!
సాక్షి, సిటీబ్యూరో: నయా డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయి. ఇప్పటివరకు తెలుపు రంగు కార్డుపై నలుపు, ఎరుపు రంగులో ముద్రించిన అక్షరాలతో కనిపించిన స్మార్ట్ కార్డులు ప్రస్తుతం లేత ఆకుపచ్చ, నీలి రంగుల్లో నలుపు అక్షరాలతో అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని అమలు చేసేందుకు డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల్లో మార్పులు చేశారు. కేంద్ర మోటా రు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్మార్ట్‌కార్డులను అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పాత స్మార్ట్‌కార్డులపై ముద్రించిన అక్షరాల కంటే కొత్త కార్డులపై ముద్రించిన అక్షరాల సైజును పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే నమూనాలో ఉండేవిధంగా వీటిని రూపొందించారు. దేశంలో ఎక్కడి నుంచైనా.. ♦ కేంద్ర మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఏకీకృత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు వాహన్ సారథి పోర్టల్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, డ్రైవర్ల వివరాలు నమోదవుతాయి. ఇటీవల వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాహన్ సారథి పోర్టల్‌తో అనుసంధానమై ఉండేవి. వాహన సారథి పోర్టల్‌లో లేని రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలు లేకపోవడంతో కేంద్ర మోటారు వాహన చట్టం (సీఎంవీ) అమల్లో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయి. ♦ వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలు, వాహనదారులను ఈ చట్టం పరిధిలో గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ తాజాగా వాహన్ సారథిలో చేరడంతో తెలంగాణకు చెందిన వాహనాలు, డ్రైవర్ల వివరాలు దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు. ఇందుకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చేసినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్డుల కొరత తీరింది.. ♦ మరోవైపు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 3.5 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌కార్డుల కొరత తీరినట్లు అధికారులు తెలిపారు. కొత్త సాంకేతిక వ్యవస్థతో పాటే కార్డుల ప్రింటింగ్, పంపిణీకి తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్డులు లేకపోవడంతో 3 నెలలుగా ప్రింటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ♦ లక్షలాది మంది వాహనదారులు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ కేంద్రాల చుట్టూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొత్త కార్డులు రావడంతో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వాటిని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఏ రోజు డిమాండ్ మేరకు ఆ రోజే కార్డులను ముద్రించి అందజేసే అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఇక్కడ లైసెన్స్.. అక్కడ షికారు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో కారు నడిపినా, బైక్ నడిపినా ప్రపంచంలోఎక్కడైనా సరే ఇట్టే దూసుకుపోవచ్చు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, ట్రాఫిక్ నిబంధనలు, నిరంతర అప్రమత్తతవాహనదారులకు ప్రతిరోజు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే సిటీలోబండి నడిపిన వాళ్లు విదేశాల్లో హాయిగా ఝామ్మంటూ దూసుకెళ్తున్నారు. విదేశీ రహదారులపై పరుగులు పెడుతున్నారు. అందుకే నగరంలోఅంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులకు ఎంతో డిమాండ్ ఉంది. నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సాధారణ డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వందల సంఖ్యలో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు విడుదలవుతున్నాయి. 2019లో గ్రేటర్ హైదరాబాద్‌లో ఏకంగా 9919 అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు జారీ కావడం గమనార్హం. గత ఐదేళ్లలో ఇదే సరికొత్త రికార్డు. గ్రేటర్ పరిధిలో ఈ ఐదేళ్లలో 39835 ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ లైసెన్సులకు అంతర్జాతీయ స్థాయిలో సముచితమైన గుర్తింపు, అర్హత ఉండడమే ఇందుకు కారణం. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లేవాళ్లే కాదు..పర్యాటక వీసాలపైన వెళ్లేవాళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు సైతం తప్పనిసరిగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవడం విశేషం. ఏడాది పాటు చెల్లుబాటు... తెలంగాణ రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు విదేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ తీసుకున్న లైసెన్సుల ఆధారంగా ఆయా దేశాల్లో బండి నడిపేందుకు అనుమతినిస్తారు. ఒకవేళ విదేశాల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే అక్కడి నిబంధనల మేరకు లైసెన్సులు తీసుకోవలసి ఉంటుంది. చాలా దేశాల్లో ఈ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల ఎక్కువ మంది నగరం నుంచి ఇంటర్నేషనల్ లైసెన్సులను తీసుకుంటున్నారు. అమెరికాతో పాటు అన్ని యురోప్ దేశాల్లో, ఆసియా దేశాల్లో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు ఏడాది పాటు చెల్లుబాటు ఉండడం వల్ల అక్కడికి వెళ్లిన వెంటనే వాహనం నడిపేందుకు అవకాశం లభిస్తుంది. మరోవైపు రోడ్డు భద్రతా నిబంధనలు పటిష్టంగా ఉండడం, ట్రాఫిక్ రద్దీ లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కారు నడిపేందుకు అవకాశం ఉంటుందని స్టూడెంట్ వీసాపై జర్మనీలో ఉంటున్న తరుణ్ తెలిపారు. ఏడాది దాటిన తరువాత కూడా అక్కడే ఉండాలనుకొంటే తప్పనిసరిగా అక్కడి నిబంధనలకు అనుగుణంగా లైసెన్సుతీసుకోవలసిందే. మహిళలు సైతం భారీ సంఖ్యలోనే... హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ లైసెన్సులు తీసుకుంటున్న వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఎక్కువగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పటి వరకు రవాణాశాఖ ఇచ్చిన 39835 అంతర్జాతీయ లైసెన్సులలో సుమారు 10,500 మహిళలు ఉన్నారు. ‘‘ విదేశాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టుపైన ఆధారపడేందుకు ఎక్కువగా అవకాశం లేకపోవడం, సొంత వాహనాలను వినియోగంచడం తప్పనిసరి కావడంతో ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడే ఇంటర్నేషనల్ లైసెన్సు తీసుకెళ్తున్నారు.’’ అని నాగోల్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ప్రాంతీయ రవాణా అధికారి సురేష్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ఎలా తీసుకోవాలి.... ⇒ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే వ్యాలిడిటీ ఉన్న ఇండియన్ డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి. ⇒ పాస్‌పోర్టు, వీసా, అడ్రస్, తదితర డాక్యుమెంట్లు ఉండాలి. ⇒ ఆర్టీఏ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. రూ.1500 వరకు ఫీజు ఆన్లైన్లో లేదా, ఈ–సేవా కేంద్రాల్లో చెల్లించాలి. ⇒ అనంతరం సబంధిత ప్రాంతీయ రవాణా అధికారిని సంప్రదించాలి. ఒరిజనల్, జిరాక్స్ డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించిన అనంతరం అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులను ఇస్తారు. గత ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి జారీ అయిన డ్రైవింగ్ లైసెన్సులు... 2015 – 9606 2016 – 7024 2017 – 5862 2018 – 7424 2019 – 9919 మొత్తం : 39835 -
రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనపై ఆర్టీఏ కొరడా
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు భద్రత నిబంధనల ఉల్లం‘ఘను’లు ఠారెత్తిస్తున్నారు. రహదారులపై ఇష్టారాజ్యంగా పరుగులు తీస్తున్నారు. రహదారి భద్రతపై ఎన్ని కఠినమైన చట్టాలను తెచ్చినప్పటికీ వాహనదారులు పెద్దగా లెక్కచేయడం లేదు. నిబంధనల పట్ల అవగాహనారాహిత్యం, నిర్లక్ష్యం రోడ్డు భద్రతకు పెనుసవాల్‌గా మారింది. గత ఐదేళ్లలో ఇలా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన సుమారు 14 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులపై రవాణాశాఖ వేటు వేసింది. 3 నెలల కనిష్ట కాలపరిమితి నుంచి ఏడాది గరిష్ట కాలం వరకు డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. సెల్‌ఫోన్‌డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని తెలిసినప్పటికీ చాలామంది నిబంధనలు పక్కన పెట్టేసి ‘సెల్’మోహనరంగా అంటూ పరుగులు తీస్తున్నారు. మరోవైపు పరిమితికి మించిన ఓవర్లోడింగ్, అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వివిధ రకాల ఉల్లంఘనలు ఎక్కువగా నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల తీవ్రత నేపథ్యంలో రవాణాశాఖ ‘ఉల్లంఘనుల’పై సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రస్తుతం ఏడాది గరిష్ట కాలానికి డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో శాశ్వతంగా రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు రవాణాశాఖ సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడేవారిపైన మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాంటి వాహనదారులు తిరిగి డ్రైవింగ్ చేయకుండా నియంత్రించనున్నట్లు చెప్పారు. పరిమితికి మించిన బరువుతో పరుగులు... రాత్రి, పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్ వాహనాలు పరుగులు తీస్తున్నాయి. ప్రైవేట్ బస్సులు నిబంధనలను తుంగలో తొక్కి పరిమితికి మించిన ప్రయాణికులతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న సుమారు 1000 ప్రైవేట్ బస్సుల్లో 80 శాతం ఓవర్‌లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్ని బస్సులు పూర్తిగా సరుకు రవాణా వాహనాలుగా మారాయి. మరోవైపు వివిధ జిల్లాల నుంచి ఇసుక, కంకర, ఐరన్ వంటి వస్తువులను నగరానికి తరలిస్తున్న వాహనాలు సైతం ఓవర్‌లోడ్‌తో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఇలా రహదారి భద్రతకు ముప్పుగా మారిన ఓవర్‌లోడ్ వాహనాలు నడుపుతూ పట్టుబడిన 2532 మంది డ్రైవింగ్ లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. ఓవర్‌లోడ్ వాహనాలను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లైసెన్సులు రద్దు చేయడంతో పాటు ఇలాంటి వాహనాలను సైతం జఫ్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జేటీసీ చెప్పారు. డ్రంకెన్ డ్రైవర్లు... ఓవర్‌లోడింగ్‌తో పట్టుబడి డ్రైవింగ్ లైసెన్సులు కోల్పోయిన వారి తరువాత ఈ ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్‌లో పట్టుబడి లైసెన్సులు పోగొట్టుకున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ పోలీసులు నిరంతర తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొంత వరకు ఫలితాన్నిచ్చాయి. గత ఐదేళ్లలో డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారిలో 2117 మంది లైసెన్సులను రద్దు చేశారు. 2016లో 917 లైసెన్సులు రద్దు కాగా, 2017లో 580, 2018లో 439 చొప్పున లైసెన్సులు రద్దయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 123 లైసెన్సులను రద్దు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు భవిష్యత్తులో మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నారు. యధేచ్ఛగా సెల్‌ఫోన్ డ్రైవింగ్... సెల్‌ఫోన్ డ్రైవింగ్ సైతం హడలెత్తిస్తోంది. ఒకవైపు ఫోన్లో మాట్లాడుతూనే మరోవైపు వాహనాలను నడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వాహనాల వల్లనే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, చివరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు భద్రతకు సవాల్‌గా మారారు. ఇప్పటి వరకు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 720 మంది వాహనదారుల లైసెన్సులను ఆర్టీఏ రద్దు చేసింది. అలాగే పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 87 మంది లైసెన్సులపైన సస్సెన్షన్ విధించింది. ఇక రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు పాల్పడిన 1661 మంది సైతం తమ లైసెన్సులను కోల్పోయారు. వివిధ రకాల ఉల్లంఘనలపై ఇప్పటి వరకు రద్దయిన డ్రైవింగ్ లైసెన్సులు ఓవర్లోడింగ్ 2532 ఓవర్‌స్పీడ్ 87 ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడిన గూడ్స్ వాహనాలు 633 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 720 మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు 2117 ప్రమాదాలకు పాల్పడిన వారు 1661 కోర్టు తీర్పులతో లైసెన్సులు కోల్పోయిన వారు 908 ఇతర కేసులు 5313 వివిధ రకాల ఉల్లంఘనలపై గత 5 ఏళ్లలో సస్పెండ్ అయిన మొత్తం డ్రైవింగ్ లైసెన్సులు 13971 -
కార్డుల్లేవ్!
షాద్‌నగర్‌టౌన్: వాహనానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకున్న తర్వాత స్మార్ట్ ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డును వాహనదారులకు జారీ చేసే ప్రక్రియ పలుచోట్ల నిలిచిపోయింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు అందడం లేదు. లైసెన్స్‌లు పొందినా కార్డులు లేకపోవడంతో వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు లేకుండా వాహనాలను నడిపేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొండాపూర్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ప్రాంతాలకు సంబంధించిన సుమారు 50 వేల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు పెండింగ్‌లో ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా స్మార్టు కార్డుల ముద్రణ ప్రక్రియ సరిగా జరగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే స్మార్టు కార్డులు అందుబాటులో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయాల్లో కార్టుల ప్రింటింగ్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. షాద్‌నగర్‌లో ఉన్న ఉప రవాణా శాఖ కార్యాలయంలో కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్, కడ్తాల్, ఆమనగల్లు మండలాలకు చెందిన వారు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. ఈ కార్యాలయంలో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు మంజూరైనా వాటికి సంబంధించిన కార్డులు మాత్రం ఆరు నెలల నుంచి జారీ కావడం లేదు. దీంతో 2,804 ఆర్సీ కార్డులు, 1,225 డ్రైవింగ్ లైసెన్సుకార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్సీ కార్డులోనే వివరాలు వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆర్సీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. ఆర్సీ కార్డులు లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు జంకుతున్నారు. కొందరైతే నెలల తరబడి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. మరి కొందరు సొంత వాహనాలు ఉన్నా అద్దె వాహనాల్లో వెళ్లే పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలతో వాహనం కొనుగోలు చేసినా వాటిని వినియోగించుకోలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసినా కార్డులు లేకపోవడంతో వాటిని తిప్పలేకపోతున్నామంటున్నారు. ఇతర రాష్ట్రాలకు వాహనాలను తీసుకెళ్లినప్పుడు అక్కడి పోలీసు అధికారుల తనిఖీల్లో పట్టుబడితే పెద్ద మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని, లేదంటే.. వాహనాన్ని వదిలి పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రింటర్లు పనిచేయకపోవడంతోనే.. ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు జారీచేసేందుకు రవాణా శాఖ వద్ద ప్రత్యేకమైన ప్రింటర్లు ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సు కోసం వినియోగదారుడు రూ.1550 వరకు చెల్లిస్తున్నాడు. వాహనదారుడి వివరాలను కార్డుపై ముద్రించి ప్రామాణికమైన డ్రైవింగ్ లైసెన్సును పోస్టు ద్వారా అందజేసేందుకు రూ.35 పోస్టల్ చార్జీలతో పాటు రూ.250 సేవా రుసుము ముందే చెల్లిస్తారు. అయితే, షాద్‌నగర్ రవాణా శాఖ కార్యాలయంలో కార్డుల ప్రింటింగ్‌కు సంబంధించిన యంత్రం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అత్తాపూర్‌లో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో షాద్‌నగర్ ప్రాంతానికి సంబంధించిన కార్డులను ప్రింటింగ్ చేయాల్సి వస్తుంది. అత్తాపూర్ కార్యాలయంలో ఉన్న ప్రింటింగ్ కూడా సరిగా పని చేయకపోవడంతో అత్తాపూర్ పరిధిలోకి వచ్చే మండలాలకు సంబంధించిన కార్డుల జారీ ఆలస్యం అవుతుందని అధికారులు తెలిపారు. ఆరు నెలలుగా నిలిచిపోయాయి కార్టులు జారీ ప్రక్రియ నిలిచిపోయి సుమారు ఆరు నెలలు కావస్తోంది. వాహనదారులు తమ సమస్యలను ఆర్టీఏ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పోలీసు అధికారుల తనిఖీల్లో వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు అన్నీ చూస్తున్నారని, అయితే కార్డులు లేకపోవడంతో వారు జరిమానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఎం వాలెట్ పద్ధతి ద్వారా స్మార్ట్ ఫోన్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు చూసుకునే అవకాశం ఉన్నా గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలా మంది స్మార్టు ఫోన్లు లేకపోవడం, ఎం వాలెట్ విధానం గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వెంటనే కార్డులు జారీచేసే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వెంటనే జారీ చేయాలి డ్రైవింగ్ లైసెన్సు కోసం సుమారు మూడు నెలల కింద దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు డ్రైవింగ్ లైసెన్సు కార్డు పోస్టు ద్వారా వస్తుందని చెప్పారు. కానీ నేటి వరకు రాలేదు. వాహనాన్ని బయటికి తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారని భయమేస్తోంది. డ్రైవింగ్ లైసెన్సు కార్డు ఉంటే ఇబ్బందులు ఎదురుకావు. కార్డులను జారీ చేసే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. – సాయికుమార్, విఠ్యాల, ఫరూఖ్‌నగర్ -
‘స్మార్ట్’కు సారీ...ఆగిన లైసెన్సుల జారీ
కరీంనగర్‌కు చెందిన భూమయ్య తన కొత్త వాహనంలో శబరిమల వెళ్లాడు. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసినా స్మార్ట్‌కార్డు రాకపోవడంతో ఏపీ, తమిళనాడు, కేరళలలో పలుచోట్ల చలానాలు చెల్లించాడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ఓ ప్రముఖ క్యాబ్ సంస్థలో ఉద్యోగి. అక్టోబరులో తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకున్నా ఇంత వరకూ అందలేదు. ఈ కారణంతో ఆ కంపెనీ ఇతనికి డ్యూటీలు ఇవ్వడం మానేసింది. ఇది ఒక్క భూమయ్య, శ్రీకాంత్ పరిస్థితే కాదు. ఇటీవల ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం ఎదురుచూస్తోన్న వేలాదిమంది వాహనదారుల దుస్థితి. వీరంతా కొత్త వాహనాలు కొన్నారు. రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. ఇంతవరకూ వీరికి ఆర్సీ (రిజిస్ట్రేషన్ కార్డు), డ్రైవింగ్ లైసెన్సులు అందలేదు. మోటారు వాహన చట్టం నిబంధనల ప్రకారం.. రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ టెస్టు, రెన్యువల్ పూర్తయిన 15 రోజుల్లోగా పోస్టులో ఇంటికి కార్డులు అందాలి. కానీ, వేలాదిమంది వాహనాలకు రిజిస్ట్రేషన్ పూర్తయినా.. ఇంతవరకూ కార్డులు అందలేదు. కారణం ఏంటి? స్మార్ట్‌కార్డుల ముద్రణకు రిబ్బన్ల కొరత 2017, అక్టోబరులోనే ఏర్పడింది. వీటి ముద్రణకు కావాల్సిన కార్డులు, రిబ్బన్లకు ఐటీ విభాగం టెండర్లు పిలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టరు తెలంగాణ రవాణాశాఖకు రిబ్బన్ల సప్లయి చేసే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అతనికి రూ. 8 కోట్లు చెల్లించాలి. కేవలం రూ. 4 కోట్లే చెల్లించారు. మిగిలిన బకాయిలు అలాగే ఉండిపోయాయి. దీంతో రిబ్బన్ల సరఫరాను సదరు కాంట్రాక్టరు నిలిపివేశాడు. దీంతో ఆర్సీ కార్డులతోపాటు డ్రైవింగ్ లైసెన్సుల ముద్రణ కూడా నిలిచిపోయింది. సర్క్యులర్ విడుదల చేయరా? గ్రేటర్ పరిధిలో ప్రతీరోజు 1500 కొత్త వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. గ్రేటర్లో 11, తెలంగాణ వ్యాప్తంగా 70 వరకు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు ఒక్కో కార్యాలయానికి 300 వరకు వాహనాలు వస్తుంటాయి. 3నెలలుగా వీరందరికి కార్డులు జారీకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో కలిపి 2 లక్షలకుపైగా కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని సమాచారం. అయినా ఆ శాఖ అధికారులు ఆర్సీలు లేవన్న సాకుతో జరిమానాలు, కేసులు బుక్ చేస్తుండటం గమనార్హం. వీటిపై సర్క్యులర్ జారీ చేయక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఉపాధి కోల్పోతున్న డ్రైవర్లు.. ఆర్టీసీ, ప్రైవేటు రంగం, రక్షణ రంగంలోని పలువురు డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కాకపోవడంతో వారికి డ్యూటీలు వేయడం లేదు. నగరంలో క్యాబ్‌లు నడిపే చాలా మంది డ్రైవర్లకు లైసెన్సు ఈ కారణం గా 4నెలలుగా పలు కంపెనీలు డ్యూటీలు వేయడం లేదు. దీంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. తాత్కాలిక ఆర్సీ 15 రోజులే వ్యాలిడిటీ. ఆ తరువాత ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ పోలీసులు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. – దయానంద్, తెలంగాణ ఆటో అండ్ మోటార్ వెల్ఫేర్ యూనియన్ కార్డులకు కొరత లేదు.. రిబ్బన్లకు ఎక్కడా కొరత లేదు. గతంలో కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ, ఇపుడు లేదు. రిబ్బన్లు వచ్చాయి. అందరికీ కార్డులు జారీ చేస్తున్నాం. – రమేశ్, జేటీసీ, ఆర్టీఏ -
ప్రజల వద్దకే రవాణా సేవలు
తణుకు అర్బన్: పట్టణానికి చెందిన సుబ్బారావు ద్విచక్ర వాహనం పై వెళ్తూ వృద్ధురాలిని ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో వృద్ధురాలి తలకు తీవ్ర గాయమైంది. సదరు వాహనదారుడు సుబ్బారావుకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా ఆ వృద్ధురాలికి వాహన బీమా సౌకర్యం పొందలేక ఆ కుటుంబం వైద్య సేవలు చేయించేందుకు ఇబ్బందులు పడింది. వైద్యసేవలు చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి వృద్ధురాలిని ఢీకొట్టినందుకు సుబ్బారావుకు న్యాయస్థానం భారీగా జరిమానా విధించింది. అలాగే భీమవరంలో వెంకటేశ్వరరావు అనే యువకుడు ఆటో నడుపుతూ ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతిచెందడంతో సదరు ఆటో డ్రైవర్ వెంకటేశ్వరరావుకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో న్యాయస్థానం, జరిమానా, జైలు శిక్ష విధించింది. మీ ముంగిట్లోకి.. ఎందరో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు. ఇటువంటి వారి కోసం రవాణా శాఖ మీ ముంగిట్లోకి రవాణా సేవలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు కలిగి ఉండాలనే లక్ష్యంతో గత నెల 18 నుంచి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో లెర్నర్ లైసెన్స్(ఎల్ఎల్ఆర్) మేళా నిర్వహించింది. దీనికి ప్రజల నుంచి కూడా స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 78 గ్రామాల్లో నిర్వహించిన ఈ మేళాలో 4,856 మంది ఎల్ఎల్ఆర్ పొందారు. నెల రోజుల తరువాత సంబంధిత రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి లైసెన్స్ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 7 రవాణా శాఖ కార్యాలయాల ద్వారా.. జిల్లాలోని 7 రవాణా శాఖ కార్యాలయాలైన ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, కొవ్వూరు కార్యాలయాల పరిధిలోని గ్రామాల్లో ఆయా మోటారు వెహికల్ ఇనస్పెక్టర్లు ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు వచ్చిన వాహనదారుల ధ్రువ పత్రాలను పరిశీలించి వారికి కంప్యూటర్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో అర్హులైన వారికి అదేరోజు ఎల్ఎల్ఆర్ అందజేశారు. మామూలు రోజుల్లో స్లాట్ బుకింగ్‌కు మీ సేవా కేంద్రాలకు, ఎల్ఎల్ఆర్, లైసెన్స్ కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు అధికసంఖ్యలో హాజరై ఈ మేళాలో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందారు. జిల్లాలోని 7 రవాణా కార్యాలయాల ద్వారా మూడు నెలల్లో నమోదయ్యే ఎల్‌ఎల్‌ఆర్‌ల సంఖ్య కేవలం వారం రోజుల్లో నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. లైసెన్స్ లేకుంటే చిక్కులే.. వాహనదారుడికి, ఎదురుగా వచ్చే వారికి కూడా ధీమా కలిగించేది డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ లేని పక్షంలో జరిగే అనర్థాలు కోకొల్లలు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కీలకం కానుంది. లైసెన్స్ లేని ప్రయాణాలు జరిమానాలు నుంచి జైలు శిక్షల వరకు తీసుకువెళ్తున్నాయి. ప్రమాద బాధ్యుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో బాధితులకు బీమా సౌకర్యం కూడా అందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి పాల్పడిన వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే సదరు వ్యక్తిని రికార్డుల నుంచి మార్చి బాధితుడికి బీమా సౌకర్యం అందేలా చేయాలనే ఒత్తిడి అధికారులకు వస్తోన్న సందర్భాలు జిల్లాలో వస్తున్నాయి. వాహన యజమాని నుంచి బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాల్సి వస్తోన్న సందర్భాల్లో సైతం అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ఎల్ఎల్ఆర్ మేళా వివరాలివి..ఎల్ఎల్ఆర్ మేళాకు మంచి స్పందన ముంగిట్లో రవాణా శాఖ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎల్ఎల్ఆర్ మేళాకు జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 4,856 మంది ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బాధితులకు బీమా సౌకర్యం అందని పరిస్థితులు వస్తున్నాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లైసెన్స్ మంజూరు చేసే క్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తాం.– ఎన్.శ్రీనివాస్, తణుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ -
యువత చెంతకే డ్రైవింగ్ లైసెన్సులు
నగరంపాలెం(గుంటూరు): యువతకు సులభ పద్ధతిలోనే డ్రైవింగ్ లెసెన్సుల జారీ చేసే పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రస్తుతం రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సుల రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్ విధానం అమలు కావటంతో కార్యాలయాలకు, మీ సేవలకు రాకుండానే వ్యక్తిగతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీంతో రాష్ట్ర రవాణా శాఖ అర్హత గల విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా నిర్వహించే లెర్నింగ్ లైసెన్సు టెస్టులు కళాశాలలోనే నిర్వహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా తొలి దశలో ప్రతి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఎల్ఎల్ఆర్ టెస్టులు నిర్వహించి అర్హులందరికీ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారులను గత రెండు నెలలు క్రితం ఆదేశించారు. అక్కడికక్కడే ఎల్ఆర్ మంజూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కి కేవలం విద్యార్థుల ఆధార్ నంబరు, బయెమెట్రిక్ డివైజ్‌పై ఫింగర్ ఉంచటం ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. రవాణాశాఖ అధికారులు ఎల్ఎల్ఆర్ టెస్ట్ నిర్వహించే రోజును వారం ముందే ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యానికి అర్హులను పరీక్ష నిర్వహించే రోజు ఆధార్ కార్డులతో హాజరు కావల్సిందిగా సమాచారం అందిస్తారు. ఎల్ఎల్ఆర్ టెస్ట్‌కి సంబంధించి రోడ్ సిగ్నల్స్, రూల్స్ ఆఫ్ రోడ్ రెగ్యూలైజేషన్, జనరల్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్ యూజర్ గైడ్ అందిస్తారు. జిల్లాలోని ప్రతి ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్ఎల్ఆర్ టెస్ట్‌లను ప్రతి ఒక వారం ఒక చోట నిర్వహించటానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా ఉప రవాణా కమిషనర్ జీసీ రాజరత్నం తెలిపారు. -
కార్డులు నోస్టాక్
తిమ్మాపూర్ : ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయాల్లో వాహన రిజిష్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్ కార్డులు కొరత ఏర్పడింది. ఒక్కో కార్యాలయంలో వేలాది కార్డులు జారీ చేయాల్సి ఉంది. జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయంతోపాటు పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల యూనిట్ కేంద్రాల్లో సుమారు 10వేలకు పైగా కార్డులు జారీ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క తిమ్మాపూర్ కార్యాలయంలోనే గతనెల 10 తేదీ నుంచి వాహన రిజిష్ట్రేషన్ కార్డులు, 21తేదీ నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌ల కార్డులు జారీకి నోచుకోలేదు. కార్యాలయంలో టీఎస్ 02 ఈఏ 3888 రిజిష్ట్రేషన్ వరకే కార్డులు జారీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం టీఎస్ 02 ఈబీ సీరిస్ మొదలవుతుంటే ఇప్పటివరకు సుమారు 6వేల కార్డులు జారీ కాలేదు. అలాగే లెసైన్స్ కార్డులు సైతం 1400 వరకు జారీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఇలాంటి కార్డులు పది వేల వరకు ఉన్నా...ఎప్పుడు వస్తాయో తెలియదని ఉద్యోగులే చెబుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అధికారులు సమాధానమిస్తున్నారు. చాలామంది కార్డుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. రోడ్లపై పోలీసులు విస్తృత స్థాయిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఆర్టీఏ శాఖ నిర్లక్ష్యం కారణంగా వేలాది రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయ రశీదు చూపిస్తే వదిలి పెట్టేలా ఎస్సైలు, సీఐలకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, రవాణాశాఖ అధికారులు స్పందించి కార్డులను త్వరగా జారీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు.