తిమ్మాపూర్ : ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయాల్లో వాహన రిజిష్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్ కార్డులు కొరత ఏర్పడింది. ఒక్కో కార్యాలయంలో వేలాది కార్డులు జారీ చేయాల్సి ఉంది. జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయంతోపాటు పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల యూనిట్ కేంద్రాల్లో సుమారు 10వేలకు పైగా కార్డులు జారీ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క తిమ్మాపూర్ కార్యాలయంలోనే గతనెల 10 తేదీ నుంచి వాహన రిజిష్ట్రేషన్ కార్డులు, 21తేదీ నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌ల కార్డులు జారీకి నోచుకోలేదు.
కార్యాలయంలో టీఎస్ 02 ఈఏ 3888 రిజిష్ట్రేషన్ వరకే కార్డులు జారీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం టీఎస్ 02 ఈబీ సీరిస్ మొదలవుతుంటే ఇప్పటివరకు సుమారు 6వేల కార్డులు జారీ కాలేదు. అలాగే లెసైన్స్ కార్డులు సైతం 1400 వరకు జారీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఇలాంటి కార్డులు పది వేల వరకు ఉన్నా...ఎప్పుడు వస్తాయో తెలియదని ఉద్యోగులే చెబుతున్నారు.
ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అధికారులు సమాధానమిస్తున్నారు. చాలామంది కార్డుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. రోడ్లపై పోలీసులు విస్తృత స్థాయిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఆర్టీఏ శాఖ నిర్లక్ష్యం కారణంగా వేలాది రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయ రశీదు చూపిస్తే వదిలి పెట్టేలా ఎస్సైలు, సీఐలకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, రవాణాశాఖ అధికారులు స్పందించి కార్డులను త్వరగా జారీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
కార్డులు నోస్టాక్
Published Wed, Aug 27 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement
Advertisement