Vehicle Registration
-
వాహనం రిజిస్ట్రేషన్ కోసం TS నుండి TGని కేంద్రం ఆమోదించింది
-
Telangana: ఇకపై ‘టీఎస్’ బదులు ‘టీజీ’.. కేంద్రం గెజిట్ విడుదల
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్‌ను టీఎస్ నుంచి టీజీగా వాడనున్నారు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్లో సీరియల్ నంబర్ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది. అయితే, గత నెల ఫిబ్రవరిలో తెలంగాణ కేబినెట్ వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు టీఎస్ నుంచి టీజీగా మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి అనుబంధంగా మంగళవారం రవాణా, రహదారుల శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది. -
రవాణా కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ములుగు: ములుగు జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇన్ని రోజులు వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల విషయంలో ఇప్పటి వరకు ఉమ్మడి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీదనే ఆధార పడాల్సి వచ్చింది. వాహనదారులకు ఆ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. జిల్లాకు ప్రత్యేక కోడ్ టీఎస్ 37ను కేటాయిస్తూ రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా కేంద్రంలో కార్యాలయ ఏర్పాటుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా రంగరావుపల్లి సమీపంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఆవరణలో భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. రంగులు అద్ది ముస్తాబు చేశారు. భవనం ముందున్న సుమారు రెండెకరాల ఖాళీ స్థలంలో మట్టిపోసి రోలర్‌తో చదును చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి అయిన తరువాత రాష్ట్ర రవాణా శాఖ, కలెక్టర్ ఆదేశాలతో ఈ నెల చివరి వారంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. స్థానికులకు ఉపాధి రవాణా శాఖ కార్యాలయ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. ఇప్పటికే లిటిల్ ఫ్లవర్ స్కూల్ చుట్టపక్కల అద్దె గదులను వ్యాపారులు వెతుకుతున్నారు. సరైన భవనాలు లేని పక్షంలో డబ్బాలను ఏర్పాటు చేసుకొని ఆన్లైన్ చేసేందుకు చదువుకున్న యువత మొగ్గు చూపుతున్నారు. భూపాలపల్లి నుంచి సిబ్బంది కేటాయింప ములుగు జిల్లాలో ఏర్పాటు కానున్న ఆర్టీఓ కార్యాలయానికి ఇప్పటి వరకు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా శ్రీనివాస్ మాత్రమే పూర్తి బాధ్యతల్లో ఉన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యావంతులు, కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. తాత్కాలికంగా ప్రస్తుతం భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రవాణా శాఖ కార్యాలయం నుంచి సిబ్బందిని కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా బండారుపల్లి సమీపంలో రవాణా శాఖకు కలెక్టర్ రెండు ఎకరాల భూమిని కేటాయించారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యేంత వరకు తాత్కాలిక భవనంలో కొనసాగనున్నాయి. తగ్గనున్న దూరభారం.. పెరగనున్న ఆదాయం జిల్లాలోని చిట్టచివరిగా ఉన్న మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), కన్నాయిగూడెం మండలాల వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు భూపాలపల్లికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాకు ప్రత్యేక రవాణా శాఖ కార్యాలయం కేటాయించడంతో సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఉపయోగకరంగా మారనుంది. దూరభారం భారీగా తగ్గనుంది. సుధీర్ఘ ప్రయాణం చేయలేక చాలా మంది ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోలేని వారంతా ప్రస్తుతం జిల్లా కేంద్రానికి వచ్చి తీసుకోవచ్చు. కార్యాలయం ప్రారంభమైతే వాహనాదారులు లైసెన్స్‌ల కోసం క్యూ కట్టనున్నారు. ఇదే సమయంలో స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ లైసెన్స్‌లకు వచ్చే ఆదాయం భారీగా పెరుగనుంది. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటు అవుతుందని తెలిసి వాహనదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.. జిల్లా కేంద్రంలో కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాకు టీఎస్ 37 కోడ్‌ను కేటాయించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మిగిలి ఉన్నాయి. రెండు లేదా మూడు రోజుల్లో సామగ్రి వస్తుంది. పనులు పూర్తి అయ్యాక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అధికారిక భవనం పూర్తి అయ్యేంత వరకు తాత్కాలికంగా లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ పక్కన అద్దె భవనంలో కార్యాలయాన్ని కొనసాగిస్తాం. – శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ అధికారి -
బీహెచ్ నెంబర్ ప్లేట్ గురించి తెలుసా? రిజిస్ట్రేషన్ ఎలా?
సాక్షి,ముంబై: దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం భారత్(BH) అనే నంబరు ప్లేట్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బీహెచ్ సిరీస్ నంబరు ప్లేట్‌ను వాహన వినియోగదారులందరూ వాడుకోవచ్చా? ఈ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ వల్ల లాభాలేంటి? ఆగస్టు 26, 2021 ప్రతిపాదించి, సెప్టెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానంలో ఎవరు బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్లకు అర్హులు, తదితర విషయాలను ఒకసారి చూద్దాం! భారతదేశంలోని రక్షణ సిబ్బంది ,ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యం కోసం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా వాహనాల కోసం భారత్ (BH) రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రవేశపెట్టారు. జీఎస్ఆర్594(E) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్ విధానానికి అర్హులు. అలాగే నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో తిరిగే ప్రైవేటు ఉద్యోగులు తమ వ్యక్తిగత కార్ల కోసం BH రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధాణంగా వాహన వినియోగదారులు ఎన్ని స్టేట్స్ మారితే అన్నిసార్లు రిజిస్ట్రేషన్, నో అబ్జెక్షన్, ఇలాంటి తప్పనిసరిగా చేయించుకోవాలి. అయితే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటి బాదరబందీ లేకుండా బీహెచ్ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏ ప్రైవేటు వాహనమైనా ప్రాంతం మారినప్పుడు రీరిజిస్ట్రేషన్ కోసం ఎన్ఓసీ అవసరం లేకుండానే నేరుగా వాహనదారుడే అప్లై చేసు కోవచ్చు. తద్వారా వారి సమయం, డబ్బు రెండూ సేవ్ అవుతాయన్నమాట. అలాగే బీహెచ్ విధానంలో రెండేళ్ల కొకసారి ఆ స్టేట్ విధానాల ప్రకారం రోడ్ ట్యాక్స్ చెల్లించాలి. (ఇదీ చదవండి: ChatGPT రెసిపీ వైరల్..ఏలియన్స్ కంటే ఏఐ చాలా డేంజర్ బ్రో!) ఎక్కడ, ఎలా అప్లై చేసుకోవాలి? ఆర్టీవో కార్యాలయంలో లేదా వాహన్ పోర్టల్ లో ఈ బీహెచ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కొనుగోలుదారు తరపున, డీలర్ వాహన పోర్టల్‌లో ఆన్లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ప్రభుత్వ సంస్థ ఉద్యోగి గుర్తింపు, ఇతర అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఇతర వివరాలను పూరించడంతో పాటు, డీలర్ సరైన రుసుము లేదా పన్ను చెల్లించాలి. అలాగే సంబంధిత ప్రూఫ్స్ సమర్పించి ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరోవైపు సాధారణ నంబరు ప్లేట్లా కాకుండా ఈ బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్లో మొదట సంవత్సరం, తర్వాత బీహెచ్ అని, ఆ తర్వాత వాహన రిజిస్ట్రేషన్ డిజిట్స్ ఉండటం విశేషం. (భారీగా లిథియం నిక్షేపాలు: ఇక భవిష్యత్తంతాఅద్భుతమే! ఆనంద్ మహీంద్ర) -
బిగిస్తున్న ‘ఎన్ఓసీ’ ఉచ్చు
డబ్బులకోసం గడ్డి తిన్నారు.. కాసులు కనిపించగానే కళ్లుమూసుకుని సంతకాలు పెట్టేశారు. ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. కర్ణాటక నుంచి నకిలీ ఎన్ఓసీలు తెచ్చి కార్లు విక్రయించిన కేసులో విచారణ ముమ్మరం కావడంతో.. కొందరు ఆర్టీఏ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, అనంతపురం: కర్ణాటక వాహనాలకు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసిన కార్ల కుంభకోణం కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొన్న కొంతమంది రిమాండ్‌కు వెళ్లి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ కేసు ఆర్టీఏ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. నకిలీ ఎన్ఓసీలతో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న అధికారుల్లో కలవరం మొదలైంది. అధికారుల సహకారంతోనే.. గతేడాది సెప్టెంబర్‌లో రవాణాశాఖలో అతి పెద్ద కుంభకోణం వెలుగుచూసింది. నాగాలాండ్‌లో బీఎస్–3 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బీఎస్–4గా రిజిస్ట్రేషన్ చేసిన కుంభకోణాన్ని అధికారులు బయటపెట్టారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి రిమాండ్‌కు వెళ్లి వచ్చారు. సెప్టెంబర్‌లోనే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తక్కువ ధరకు కర్ణాటక వాహనాలను కొనుగోలు చేసి నకిలీ ఎన్ఓసీలను సృష్టించడం.. జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించి వాటిని ఎక్కువ మొత్తానికి అమాయకులకు అంటగట్టిన ముఠా ఆగడాలు బయటపడ్డాయి. అయితే వ్యవహారంలో ప్రైవేటు వ్యక్తులే కాకుండా.. కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ముందునుంచీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగంలోకి కర్ణాటక పోలీసులు నకిలీ ఎన్ఓసీలు సృష్టించి కార్లను రిజిస్ట్రేషన్ చేసిన కేసును కర్ణాటక పోలీసులు ఛాలెంజింగ్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ప్రైవేటు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎన్ఓసీలతో జిల్లాకు వచ్చిన వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై చర్యలకు సమాయత్తమైనట్లు సమాచారం. ఇప్పటికే ఫైల్స్‌ను అప్రూవల్ చేసిన ఆర్టీఓ కార్యాలయ క్లర్క్, ఏఓలపై సస్పెన్షన్ వేటు పడింది. త్వరలో మరికొంతమంది అధికారులపై వేటు పడనున్నట్లు తేలింది. దాదాపు 80 వాహనాల వరకూ నకిలీ ఎన్ఓసీలతో అక్రమంగా రిజస్ట్రేషన్ అయినట్లు గుర్తించిన పోలీసులు.. వాటికి రిజిస్ట్రేషన్ చేసిన బాధ్యులెవరన్నది కూడా నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొంతమంది ఆర్టీఏ అధికారులు బెంగళూరు పోలీసుల విచారణకు హాజరై వచ్చినట్లు తెలిసింది. త్వరలోనే మరికొందరిపై వేటు పడే అవకాశముండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. -
ఆర్సీలు, లైసెన్సు పత్రాలు చూపినా ఓకే
సాక్షి, అమరావతి: వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు కార్డుల డెలివరీలో రవాణాశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనదారుడు ఇంటి చిరునామా సరిగా ఇవ్వకపోవడం, కార్డుల ముద్రణలో సాంకేతిక సమస్యలు ఎదురు కావడంతో ఈ కార్డులు డెలివరీ కావడం లేదు. ఆధార్ కార్డుల్లో అడ్రస్ వేరుగా ఉండటం, లైసెన్సుకు దరఖాస్తు, వాహన రిజిస్ట్రేషన్ సమయంలో అడ్రస్ మార్చకపోవడం వల్ల రోజూ డెలివరీ అయ్యే ఆర్సీ, లైసెన్సు కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో తిరిగి రవాణాశాఖ కార్యాలయాలకు వస్తున్నాయి. దీంతో తనిఖీల సమయంలో వాహనానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించినా.. అనుమతించాలని రవాణాశాఖ అధికారులు జిల్లాల పోలీస్ అధికారులకు లేఖలు రాస్తున్నారు. రిజిస్ట్రేషన్, కార్డులు గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో సరిగా అందించలేదు. కాంట్రాక్టు సంస్థ సరఫరా చేయకపోవడంతో కొన్ని జిల్లాల్లో కొరత ఏర్పడింది. దీంతో వాహన తనిఖీల సమయంలో పత్రాలు చూపిస్తే పోలీసులు అనుమతించకుండా జరిమానా వసూలు చేశారు. ఇప్పుడు వాహన తనిఖీలు ముమ్మరం చేస్తున్న దృష్ట్యా పత్రాలు చూపిస్తే అనుమతించాలని రవాణా అధికారులు జిల్లా స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీల ద్వారా పోలీస్ శాఖను కోరారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రహదారి భద్రత మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మాసోత్సవాల్లో భాగంగా రోడ్ సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ ఆదేశాలతో పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీ చేశారు. వాహనదారులు పత్రాలు చూపిస్తూ.. లైసెన్సు, రిజిస్ట్రేషన్ కార్డులు చూపించ కపోవడంతో పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఆర్సీ కార్డుల జారీలో జాప్యంతో పాటు కోవిడ్ కారణంగా పత్రాలు ఫోన్లో చూపించినా.. వదిలిపెట్టాలని, జరిమానా విధించవద్దని సూచనలు జారీ అయ్యాయి. గతేడాది 1,932 లైసెన్సుల సస్పెన్షన్ రాష్ట్రంలో గతేడాది పదేపదే ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు సంబంధించిన 1,932 లైసెన్సులను రవాణా శాఖ సస్పెండ్ చేసింది. లైసెన్సులు లేకుండా వాహనం నడిపితే జైలుకు పంపుతామని రవాణాశాఖ స్పష్టం చేసింది. వాహన డ్రైవర్లు ఉల్లంఘనలకు పాల్పడినా, ప్రమాదాలకు కారకులైనా.. వారికి పునశ్చరణ తరగతులు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
చంద్రబాబుకు టీడీపీ నేతల షాక్.. ఫోన్లు స్విచ్చాప్!
సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడిన నేపథ్యంలో వారికి అండగా నిలబడాలన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలే ఝలక్ ఇచ్చారు. జేసీ కేసులో ఆయన రాంగ్ స్టెప్ వేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి రాగా.. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పరిటాల సునీత లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. (ఫోర్జరీ పత్రాల్లో సంతకాల ఆధారంగానే కేసులు) అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, ఉన్నం హనుమంతచౌదరి, జితేంద్ర గౌడ్, కందికుంట ప్రసాద్ సైతం వీరి బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి అడ్డంగా దొరికిపోయిన జేసీ కుటుంబంపై సానుభూతి ఎందుకంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా నేతలంతా లోకేష్ వెంటే ఉండాలంటూ ఎన్టీఆర్ భవన్ నుంచి మెసేజ్‌లు రావడంతో.. టీడీపీ ముఖ్య నాయకులంతా ఫోన్లు స్విచ్చాప్ చేసి ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. కాగా.. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం విదితమే.(‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు) -
జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు
సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉంటున్న వీరికి వైద్య సిబ్బంది స్వాబ్ పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కడప సెంట్రల్ జైలులో ఖైదీలకు ములాఖత్ నిలిపివేశారు. అయితే నేడు జేసీ కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రికి రానున్నారు. కాగా.. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో ఉంట్నున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు కడప జైలుకి జేసీ ప్రభాకర్‌రెడ్డి -
‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, అనంతపురం: నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో జేసీ సోదరులతో చేయి కలిపిన పాత్రదారులపై ఉచ్చు బిగిస్తోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొక్కి అక్రమార్జన కోసం జేసీ సోదరులు అడ్డదారులు తొక్కారు. జాతీయస్థాయి స్కాం ఎక్కడ బయట పడుతుందోనని మరిన్ని నేరాలకు పాల్పడ్డారు. ఇందులో కొందరు అధికారులు, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు ప్రమేయముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. 154 బీఎస్–3 వాహనాలకు రిజిస్ట్రేషన్.. ప్రభుత్వం నిషేధించిన బీఎస్–3 లారీలు, టిప్పర్లను నాగాలాండ్ రాష్ట్ర రాజధాని కోహిమాలో ఒకేసారి 154 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ అక్రమ బాగోతంలో కీలక నిందితుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జఠాధర కంపెనీ డైరెక్టర్‌గా బాధ్యతలు వ్యవహరిస్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 మార్చిలో సుప్రీంకోర్టు బీఎస్–3 వాహనాలపై ఆంక్షలు విధించింది. 2017, ఏప్రిల్ 1 తర్వాత సదరు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడం చట్టారీత్యా నేరం. ఈ విషయం తెలిసినప్పటికీ జేసీ సోదరులు వాహనాలను కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ అనంతరం ఎన్ఓసీలతో జిల్లాకు తీసుకొచ్చారు. ఒక్కో వాహనంపై రూ.3 నుంచి రూ.4 లక్షల్లోపు ఖర్చు చేసి రూ. కోట్లు లబ్ధి పొందారు. చదవండి: అనంతపురం జైలు వద్ద హైడ్రామా! మరింత లోతుగా దర్యాప్తు.. జేసీ బ్రదర్స్ అవినీతి బండారం బయటపడడంతో ఆధారాలు సేకరించిన అధికారులు శనివారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ కుంభకోణంలో సూత్రదారులు, పాత్రదారులందరిపైనా వేటు పడే అవకామున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. జేసీ బ్రదర్స్ అవినీతి అక్రమాలు బయటపడిన తర్వాత రాష్ట్ర రవాణాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నేరుగా నాగాలాండ్‌కు వెళ్లి సదరు వాహనాలకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న జేసీ సోదరులు సదరు వాహనాలను కనుమరుగు చేసేందుకు యత్నించారు. కొన్ని వాహనాలను ఇతరులకు విక్రయించగా.. మరికొన్నింటిని ఇతర రాష్ట్రాలకు బదలాయించారు. ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. చదవండి: ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..! పాత్రదారులందరిపైనా వేటు.. జేసీ బ్రదర్స్ కంపెనీలు చేసిన అవినీతి కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులందరిపైనా త్వరలో వేటు పడనున్నట్లు తెలుస్తోంది. వాహనాల లావాదేవీల్లో పాత్రదారులను ఇప్పటికే గుర్తించారు. అయితే వాహనాలు కొని మోసపోయి వారిపైనా కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకేసారి నాగాలాండ్ నుంచి 154 వాహనాలు (అందులో వందకు పైగా జిల్లాకు) ట్రాన్స్ఫర్ అయినా ఆర్టీఏ అధికారులు పసిగట్టలేదు. నకిలీ పోలీసు క్లియరెన్స్‌ల ద్వారా ఇతరులకు విక్రయించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్ర కూడా లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని అరెస్ట్‌లుంటాయని సమాచారం. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాల కుంభకోణంలో పాత్ర ఉందని భావిస్తున్న వారిందరిలోనూ ఆందోళన ప్రారంభమైంది. -
కడప జైలుకి జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: జేసీ బ్రదర్స్ కంపెనీ.. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు ఫోర్జరీ, నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు వాడినందునే రవాణా శాఖ పోలీసులతో క్రిమినల్ కేసులను నమోదు చేయించింది. ఆ తప్పుడు పత్రాల్లో ఉన్న సంతకాల ఆధారంగానే కేసులు పెట్టింది. ఇప్పటివరకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే 27 క్రిమినల్ కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో ఈ నకిలీ రిజిస్ట్రేషన్ వాహనాలు కొనుగోలు చేసిన వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తే చీటింగ్ కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీలను జటాధర కంపెనీ ప్రతినిధులు ఆయా జిల్లాల్లో విక్రయించారు. కొనుగోలు చేసిన వారు కూడా తాము మోసపోయామని గుర్తించి జేసీ బ్రదర్స్ కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు) మార్చిలోనే రవాణా శాఖ లేఖ ఈ ఏడాది మార్చి 11న నేషనల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర బీమా కంపెనీలకు రవాణా శాఖ లేఖ రాసింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన 56 వాహనాలకు సంబంధించిన బీమా పత్రాలను పరిశీలిస్తే 55 వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలు బీమా కంపెనీల వద్ద లేవు. దీంతో వాహనాల బీమా పత్రాలు సైతం నకిలీవేనని తేలింది. ► జేసీ బ్రదర్స్ కంపెనీ అక్రమంగా 154 వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించింది. ఇందులో ఏపీలో గుర్తించిన 101 లారీల్లో 95 లారీల రిజిస్ట్రేషన్లను రవాణా శాఖ రద్దు చేసింది. ► ఈ 95 లారీల్లో 80 లారీలు అనంతపురంలో, కర్నూలులో 5, చిత్తూరులో 5, కడపలో 3, గుంటూరులో 2 ఉన్నాయి. ఇంకా ఆరు లారీల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాల్సి ఉంది. ► 154 వాహనాల్లో నాగాలాండ్‌లో 98, ఏపీలో 32, ఇతర రాష్ట్రాల్లో 24 లారీలను జేసీ బ్రదర్స్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించింది. 62 వాహనాలు సీజ్ చేశాం బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో.. అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. 154 వాహనాల్లో 101 ఏపీలోనే ఉన్నాయి. తాజాగా వాటిలో 95 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేయడంతోపాటు ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశాం. – ప్రసాదరావు, సంయుక్త రవాణా కమిషనర్ కడప కేంద్ర కారాగారానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి కడప అర్బన్/అనంతపురం క్రైమ్: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను అనంతపురం పోలీసులు ఆదివారం కడప కేంద్ర కారాగారానికి తరలించారు. మొదట అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లె కారాగారానికి తీసుకెళ్లారు. అయితే.. అక్కడ కరోనా కేసు నమోదు కావడంతో అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తాడిపత్రి జైలుకు మార్చాలని జడ్జి ఆదేశించడంతో అక్కడ శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కడప జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేయడంతో అనంతపురం నుంచి తెల్లవారుజామున 3.58 గంటల సమయంలో కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా జైలు అధికారులు కరోనా పరీక్షలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలుగా ప్రభాకర్‌రెడ్డికి 2707, అస్మిత్‌రెడ్డికి 2708 నంబర్లను కేటాయించారు. -
జేసీ ట్రావెల్స్: అంతులేని అక్రమాలు..!
సాక్షి, తాడిపత్రి: జేసీ బద్రర్స్‌కు చెందిన మోటార్ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో పలు దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అశోక్ లేలాండ్ కంపెనీ తుక్కు కింద విక్రయించిన వాహనాలను సేకరించిన తాడిపత్రికి చెందిన జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ వాటికి నకిలీ పత్రాలు సృష్టించి 2018లో వాటిని నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని రాష్ట్రంలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ 68 వాహనాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఈ ఏడాది జనవరి 10న అశోక్ లీలాండ్ కంపెనీకి మెయిల్ చేయగా, అన్ని అంశాలను పరిశీలించిన కంపెనీ అదే నెల 23న అంటే, ఈ ఏడాది జనవరి 23వ తేదీన పూర్తి వివరాలు పంపించింది. కాలం చెల్లిన 66 వాహనాలలో 40 వాహనాలను తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి, మరో 26 వాహనాలను జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు తుక్కు కింద విక్రయించినట్లు అశోక్ లీలాండ్ కంపెనీ తెలిపింది. (మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్) ఆ కంపెనీలు ఎవరివి?: జఠాధర ఇండస్ట్రీస్ జేసీ ప్రభాకర్‌రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డికి చెందింది కాగా, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ జేసీ ప్రభాకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్‌రెడ్డికి చెందింది. పలు అశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి.. ఆ సమాచారం అందుకున్న తర్వాత రవాణా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా, ఆ వాహనాలన్నింటినీ నాగాలాండ్ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఎన్ఓసీ తీసుకుని అనంతపురం జిల్లాకు తరలించినట్లు తేలింది. అనంతరం రవాణా శాఖ, అనంతపురం జిల్లా పోలీసు శాఖకు చెందిన అధికారుల బృందం నాగాలాండ్ రాజధాని కోహిమాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి పూర్తి సంబంధిత వాహనాల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల వివరాలు సేకరించగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. (జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం) అక్రమాలు ఎలా?: తమ వాహనాల రిజిస్ట్రేషన్ కోరుతూ, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ తరపున జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమాదేవి దరఖాస్తుపై సంతకం చేశారు. ఆ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఈ రెండు కంపెనీలు ఇచ్చిన అశోక్ లీలాండ్ కంపెనీ ఇన్వాయిస్లలో ఎక్కడా ఒకదానితో మరొక దానికి పోలిక లేకుండా వేర్వేరు తేదీలతో ఉన్నాయి. అంతే కాకుండా అశోక్ లీలాండ్ కంపెనీ ఇచ్చిన ఇన్వాయిస్లను అసంపూర్తిగా సమర్పించిన ఈ రెండు కంపెనీలు తమ వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్ పొందాయి. ఉత్తరాఖండ్‌లోని కళ్యాణ్పూర్, తమిళనాడు హోసూరులో ఉన్న అశోక్ లీలాండ్ కంపెనీలు ఆ ఇన్వాయిస్లు ఇచ్చాయి. ఆ వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసినప్పటికీ, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు రికార్డులు సృష్టించి వాటిని యథేచ్ఛగా నడిపారు. బీఎస్–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి విక్రయించరాదని, అదే విధంగా ఆరోజు నుంచి వాటికి ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయొద్దని సుప్రీంకోర్టు మార్చి 29, 2017న ఆదేశాలు జారీ చేసింది. బీఎస్–4 ప్రమాణాలకు అనువుగా లేని వాహనాలు ఒకవేళ మార్చి 31, 2017 నాటికి విక్రయించి ఉంటే, వాటి రిజిస్ట్రేషన్‌కు మాత్రం కోర్టు మినహాయింపు ఇచ్చింది. అంతులేని అక్రమాలు: ఈ నేపథ్యంలో పై రెండు కంపెనీలు యథేచ్ఛగా మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించాయని తేలింది. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, అవి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నట్లు చూపి, ఎక్కడో సుదూరంలో ఉన్న నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించారు. అంతే కాకుండా కేవలం కొద్ది రోజుల్లోనే వాటికి ఎన్ఓసీ సంపాదించి, ఇక్కడ అనంతపురం జిల్లాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సొంత జిల్లా కావడంతో యథేచ్ఛగా ఆ వాహనాలు తిప్పారు. ఆ విధంగా వారు చీటింగ్‌కు పాల్పడ్డారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ, రహదారులపై తిరగడానికి ఏ మాత్రం అనువుగా లేని, తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలకు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించి జిల్లాలో తిప్పారు. రహదారి భద్రత లేకపోవడమే కాకుండా, వాతావరణ కాలుష్యానికి కూడా కారకులయ్యారు. ఇంకా ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు: వీటన్నింటి నేపథ్యంలో అనంతపురం 1వ టౌన్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ యజమానులు, వారి భాగస్వాములతో పాటు, ఆయా సంస్థల ప్రతినిధులపై చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తుక్కు కింద కొనుగోలు చేసిన వాహనాలను నకిలీ, తప్పుడు ధృవపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించడం, వాటికి ఎన్ఓసి పొంది 2 రోజుల నుంచి 2 వారాల్లోనే అనంతపురంలో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఇంకా వాటిని యథేచ్ఛగా జిల్లాలోనూ, దేశంలోనూ తిప్పడం కచ్చితంగా చీటింగ్‌కు పాల్పడడమే. రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేయడమే. ఇంకా ఏమేం చేశారు?: అంతే కాకుండా వాటిలో పలు వాహనాలను ఈ రెండు కంపెనీలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విక్రయించాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, తాడిపత్రికి చెందిన సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీలపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే తుక్కు కింద బీఎస్–3 ప్రమాణాలతో కూడిన 154 వాహనాలను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేశాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ 50 వాహనాలు కొనుగోలు చేయగా, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ మరో 104 వాహనాలను తుక్కు కింద కొనుగోలు చేసింది. వాటికి కూడా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించి రహదారులపై తిరగడానికి ఫిట్‌గా ఉన్నాయంటూ, బీఎస్–4 ప్రమాణాలతో కూడి ఉన్నాయంటూ దేశంలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాటిలో అత్యధికం అనంతపురం జిల్లాలోనే జరిగాయి. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీ పేర్ల మీదే కాకుండా, కొన్ని వాహనాలను వ్యక్తిగత పేర్లతోనూ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయా వాహనాల ఛాసిస్ నెంబర్లను పరిశీలించగా, అన్నీ బీఎస్–3కు చెందినవే తప్ప, బీఎస్–4 ప్రమాణాలతో కూడినవి కావని తేలింది. ఇదే విషయాన్ని అశోక్ లీలాండ్ కంపెనీ ప్రతినిధులు కూడా నిర్ధారించారు. వాటన్నింటినీ బీఎస్–4 ప్రమాణాల వాహనాలుగా చూపడానికి నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లు సృష్టించారు. 154 వాహనాల లావాదేవీల నిషేధం: రాష్ట్రంలో 101 వాహనాలు రిజిస్టర్ అయి ఉండగా, వాటికి సంబంధించి మరే లావాదేవీ జరగకుండా డేటా బేస్ బ్లాక్ చేశారు. 28 వాహనాలను ఇప్పటికే ఎన్ఓసీపై వేరే రాష్ట్రాలకు తరలించారు. వాటికి సంబంధించి ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులకు సమాచారం పంపించారు. ఆ వాహనాలపై ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా బ్లాక్ చేయాలని అధికారులు కోరారు. ఇంకా మిగిలిన వాహనాలను ఇతర రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ల రద్దు: రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో 89 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు. వాటిలో అనంతపురం జిల్లాలో 77 వాహనాలు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 5 చొప్పున, గుంటూరు జిల్లాలో మరో 2 వాహనాలు ఉన్నాయి. మిగిలిన వాహనాలకు సంబంధించి ఆర్సీ రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో 6 వాహనాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. అందువల్ల వాటి ఆర్సీ రద్దు చేయాలంటే హైకోర్టు అనుమతి కావాలి. అందుకే అధికారులు వేచి చూస్తున్నారు. ఇంకా కడప జిల్లాలో 3 వాహనాలు, అనంతపురం జిల్లాలో మరో 3 వాహనాల ఆర్సీలు రద్దు చేయాల్సి ఉంది. మొత్తం 154 వాహనాలకు సంబంధించి ఇంకా ఎలాంటి లావాదేవీలు జరగకుండా ‘వాహన్’ డేటాబేస్‌లో వాటిని బ్లాక్ చేయమని కోరుతూ రవాణా శాఖ జాయింట్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయిన ఆ వాహనాల ఆర్సీల రద్దు కోసం ఆయా రాష్ట్రాలను కోరాలని అధికారులు నిర్ణయించారు. ఆ వాహనాలు రహదారులపై కనిపిస్తే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయా రాష్ట్రాల అధికారులను ఏపీ అధికారులు కోరారు. వాహనాల స్వాధీనం: రాష్ట్రంలో నమోదై ఉన్న 101 వాహనాల్లో ఇప్పటికే 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా మిగిలిన 41 వాహనాల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 వాహనాలను స్వాధీనం చేసుకోగా, కడప, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో 14 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్ కేసుల నమోదు: ఈ వ్యవహారానికి సంబంధించి అనంతపురం జిల్లాలో రవాణా అధికారి (డీటీసీ) 24 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అదే విధంగా కర్నూలు డీటీసీ మరో 3 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జఠాధర ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన జేసీ ఉమారెడ్డి, సి.గోపాల్‌రెడ్డి అండ్ కంపెనీకి చెందిన గోపాల్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి మంతనాలు: తమ నుంచి వాహనాలు కొనుగోలు చేసిన పలువురితో జేసీ ప్రభాకర్‌రెడ్డి మంతనాలు జరిపి, వారితో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. ఒక్కో వాహనానికి రూ.12 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు తిరిగి ఇస్తానని, అందువల్ల తమపై ఫిర్యాదు చేయవద్దని 35 వాహనాల యజమానులను ఆయన కోరినట్లు సమాచారం. అందువల్లనే ఆయా వాహనాలకు సంబంధించి ఇప్పటికీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. నకిలీ ఇన్సూరెన్సు పాలసీలు: నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్‌తోనే వారి అక్రమాలకు తెర పడలేదు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు అవసరమైన ఇన్సూరెన్సు పత్రాలను కూడా వారు నకిలీవి ఆర్టీఏ అధికారులకు సమర్పించారు. ఇంకా కేసులు ఫైల్ చేయాల్సి ఉంది!: ఆ విధంగా నకిలీ పత్రాలు, డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్, సుప్రీంకోర్టు ఆదేశాలు యథేచ్ఛగా బేఖాతరు చేయడం, ఫిట్నెస్, రోడ్ సేఫ్టీ లేకున్నా ప్రజల ప్రాణాలు ఫణంగా పెట్టి వాహనాలను యథేచ్ఛగా రహదారులపై తిప్పడమే కాకుండా, చివరకు ఇన్సూరెన్సు పత్రాలు కూడా నకిలీవి సమర్పించిన ఈ రెండు కంపెనీలపై ఇంకా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
-
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్
అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయనతో పాటు కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని హైదరాబాద్ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల కొనుగోలుకు సంబంధించి సుమారు మూడు గంటల పాటు విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి. చదవండి: జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం -
జేసీ బ్రదర్స్ చాతుర్యం: స్క్రాప్‌లోనూ స్కాం
సాక్షి, అనంతపురం: బీఎస్–3 వాహనాలను బీఎస్–4 వాహనాలుగా రిజిస్ట్రేషన్లు చేయించి అతి పెద్ద కుంభకోణానికి జేసీ సోదరులు పాల్పడ్డారు. ఈ అవినీతి బాగోతం రాష్ట్ర ఉన్నతాధికారులు బయటపెట్టారు. అయితే సదరు వాహనాలను సీజ్ చేయాల్సిన అధికారులు యజమానులతో కుమ్మక్కయ్యారు. విడిభాగాలు తొలగించుకున్న తర్వాత సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిలు అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. అప్పటికే ట్రావెల్స్ రంగంలో ఆరితేరిన జేసీ సోదరులు అతి తక్కువ రేటుకు వస్తున్నాయని చెప్పి బీఎస్ 3 వాహనాలను కొనుగోలు చేశారు. సుప్రీంకోర్టు బీఎస్3 వాహనాల విక్రయాలు రద్దు చేయాలని ఉత్తర్వులు వెలువడించిన తర్వాత షోరూంలలో నిలిచిపోయిన వాహనాలను కొనుగోలు చేశారు. అదికూడా నాగాలాండ్ రాష్ట్రంలో అశోక్‌లైలాండ్ కంపెనీ చెందిన దాదాపు 160 వాహనాలు కొనుగోలు చేశారు. ఈ తంతంగమంతా ఆలస్యంగా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ అక్రమ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. సదరు వాహనాలన్నీ బీఎస్3 కాగా నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్4గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ జిల్లాకు వచ్చి మీడియా సమావేశంలో ధ్రువీకరించారు. ఇలా జిల్లాలో దాదాపు 80 వాహనాలున్నాయని గుర్తించారు. మిగిలినవి వివిధ జిల్లాలో తిరుగుతున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఆ వాహనాలు ఎక్కడున్నా సీజ్ చేయాలి’ యజమానులకు సహకరిస్తున్న ఆర్టీఏ ఉద్యోగులు దాదాపు నాలుగు నెలల క్రితం ఆర్టీఏ జాయింట్ కమిషనర్ జిల్లాకు వచ్చి జేసీ బ్రదర్స్ అవినీతి వ్యవహారం బయటపెట్టారు. సదరు వాహనాలను జప్తు చేయడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ జిల్లాలో అధికారులు మాత్రం ఆ దిశగా పనిచేయడం లేదు. ఇప్పటి వరకూ 50 వాహనాలు సీజ్ చేశారు. మిగిలిన 30 వాహనాలను గుర్తించాల్సి ఉంది. అయితే నాలుగు నెలల క్రితమే వాహనం నెంబర్‌తో సహా ఏఏ వాహనాలు అక్రమంగా రిజిస్ట్రర్ అయ్యాయో అధికారులు బహిర్గతపర్చారు. దాని ఆధారంగా యజమానులను సులభంగా గుర్తించవచ్చు. కానీ ఇక్కడి అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోలేదు. పైగా యజమానులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం.. నాగాలాండ్‌లో కొనుగోలు చేసిన వాహనాలను కొన్నింటిని జేసీ ఉమారెడ్డి పేరుతో ఉండగా మరికొన్ని జఠాధర కంపెనీకి సి. గోపాల్‌రెడ్డితో ఉన్నాయి. వాహనాలను పట్టుకోవడంలో జాప్యం చేయడంతో అక్రమార్కులు ముందు జాగ్రత్తలు పడుతున్నారు. కొన్ని వాహనాలను ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టారు. మరికొన్నింటికి విడిబాగాలు తొలగించి విక్రయించేశారు. ఏకంగా టైర్ల వద్ద నుంచి బ్యాటరీలు, ఇంజన్, బాడీ మొత్తం తొలగించిన వాహనాలు కూడా ఉన్నాయి. కేవలం ఛాసీలు మాత్రమే ఉంటుండడంతో అవే వాహనాలను తీసుకొచ్చి ఆర్టీఏ కార్యాలయంలో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం ఇలా తొలగించడానికి వీల్లేదు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆర్టీఏ ఉన్నతాధికారులు సదరు యజమానులపై సానుభూతి చూపిస్తుండడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కొత్త ట్విస్ట్ -
కోడెల తనయుడి బైక్ షోరూమ్ సీజ్
సాక్షి, గుంటూరు, అమరావతి/నరసరావుపేట, నగరంపాలెం (గుంటూరు): అధికారం ఉన్నప్పుడు ‘కేట్యాక్స్’ వసూలు చేయడంలోనే కాదు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను ఎగ్గొట్టడంలోనూ కోడెల కుటుంబానిది అందె వేసిన చెయ్యి. పారదర్శకత కోసం రవాణా శాఖలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను అడ్డుగా పెట్టుకుని శివరామ్ భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాను నిర్వహిస్తున్న గౌతమ్ హీరో బైక్ షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహన విక్రయాలు నిర్వహించి, ప్రభుత్వానికి వెళ్లాల్సిన రూ.కోటి వరకూ స్వాహా చేశాడు. దీంతో ఆ షోరూమ్‌లను సీజ్ చేశారు. గౌతమ్ హీరో షోరూమ్‌లో గత ఆరు నెలల్లో 800 బైక్‌లకు టీఆర్ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకూ గండి కొట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000–1300 వరకూ చెల్లించాలి. లైఫ్ ట్యాక్స్ కింద బైక్ ధరపై 9–14శాతం కట్టాలి. గౌతమ్ షోరూమ్ నుంచి విక్రయించిన బైక్‌లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైకుకు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్ ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. అక్రమాలు తేలడంతో గుంటూరులోని గౌతమ్ షోరూమ్‌తో పాటు, నరసరావుపేటలో హీరో కంపెనీ ద్విచక్రవాహనాలకు ఆధరైజ్డ్ డీలర్‌గా వ్యవహరిస్తున్న యర్రంశెట్టి మోటార్ షోరూమ్, సర్వీసు సెంటర్లను రవాణా వాహనాల అధికారులు శనివారం సీజ్ చేశారు. కోడెల కుటుంబానికి సన్నిహితులైన యర్రంశెట్టి రాము, బాబ్జీ సోదరులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో 300 వాహనాలకు లెక్కతేలలేదని ఎం.వి.ఐ. అనిల్‌కుమార్ తెలిపారు. పన్నులు చెల్లించని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులు ఎస్పీకి సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలపై విచారణ గౌతమ్ హీరో షోరూంలో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖకు లైఫ్ టాక్స్‌లు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలు విక్రయించినట్లు తేలిందన్నారు. దీంతో శనివారం గౌతమ్ హీరో, యర్రంశెట్టి హీరో షోరూంలను సీజ్ చేశామన్నారు. – జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు -
ఆర్టీఏ.. అదంతే!
‘హలో సార్.. నాలుగు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించిన పరీక్షలో పాస్ అయ్యాను. వారం రోజుల్లో లైసెన్స్ నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ఇప్పటి వరకు రాలేదు’ ఇదో వాహనదారుడి ఆందోళన. ‘కొత్త బండి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆరు నెలలైంది.ఇంకా ఆర్సీ రాలేదు. ట్రాఫిక్ పోలీసులుఇబ్బందులకుగురిచేస్తున్నారు’ మరో వాహనదారుడి ఆవేదన. ‘వాహనం అడ్రస్ మార్పు కోసం అధికారులనుసంప్రదిస్తే సరైన స్పందన లేదు. పట్టించుకునేవాళ్లే లేరంటూ’ నగర శివార్లలోని ఒక ఆర్టీఏకార్యాలయంలో ఎదురైన పరిస్థితిపైఓ మహిళ విస్మయం. సాక్షి, సిటీబ్యూరో: ఇలా ఒక్కరో, ఇద్దరో కాదు. లక్షలాది మంది వాహనదారులు ఆర్టీఏ పౌరసేవల్లో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి, నిబంధనల మేరకు అన్ని డాక్యుమెంట్లను అందజేసినప్పటికీ డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలు తదితర పౌరసేవలు లభించక నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాదిలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2.15 లక్షల ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా పెం డింగ్ జాబితాలో ఉన్నట్లు అంచనా. ఒకట్రెండు ఆర్టీఏ కార్యాలయాల్లో సత్వరమే పరిష్కారం లభిస్తున్నప్పటికీ చాలాచోట్ల అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. ఆర్టీఏ పౌరసేవలపైన నిర్దిష్టమైన కాలపరిమితిని విధించారు. అంతర్రాష్ట్ర బదిలీలపైన మాత్రమే 30 రోజుల గడువు విధించారు. మిగతా అన్ని రకాల పౌరసేవలు... ముఖ్యం గా డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలు, అడ్రస్ మార్పులు తదితర వారం, పది రోజుల్లో లభించే విధంగా సిటిజన్ చార్టర్‌ను రూపొందించారు. కానీ అది ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వారంరోజుల కాలపరిమితి 6 నెలల వరకు కొనసాగడం గమనార్హం. ఎందుకిలా.? రవాణాశాఖ పౌరసేవలపై వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదులను పరిష్కరించేందుకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పటిష్టమైన ఆన్లైన్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ ట్రాకింగ్ సిస్టమ్ (ఓజీఆర్టీఎస్) ఏర్పాటు చేశారు. వాహన వినియోగదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లోని ‘సిటిజన్ చార్టర్ కంప్లయింట్స్’ను ఎంపిక చేసుకొని తమ ఫిర్యాదును తెలియజేయవచ్చు. అలాగే బీఎస్ఎన్ఎల్ ద్వారా స్వీకరించేందుకు ‘1100’, ఇతర ఫోన్ల నుంచి స్వీకరించేందుకు ‘18004251110’ అనే రెండు టోల్‌ఫ్రీ నంబర్లను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. జిల్లాల విభజన వరకు ఈ వ్యవస్థలు సక్రమంగానే పని చేశాయి. వినియోగదారుల నుంచి అందే ఫిర్యాదుల్లో చాలా వరకు అప్పటికప్పుడు పరిష్కరించడమో లేదా ఎప్పటిలోగా తమ సమస్యను పరిష్కరిస్తారో తెలియజేసేవారు. కానీ 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి, పైస్థాయి ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం కొరవడింది. అన్ని చోట్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ వాటికి ప్రాంతీయ రవాణా అధికారులు, యూనిట్ మోటారు వాహన ఇన్స్పెక్టర్ల స్థాయిలో పరిష్కారాన్ని సాధించడంలో ఓజీఆర్ఆటీఎస్ వ్యవస్థ విఫలమైంది. దీంతో ఫిర్యాదులు పెద్ద ఎత్తున పెండింగ్ జాబితాలో చేరిపోయాయి. మరోవైపు తమకు సకాలంలో సరైన పరిష్కారం లభించకపోవడంతో వినియోగదారులు పదే పదే ఫిర్యాదులు చేయడం కూడా మరో కారణం. ఇదే అసలు సమస్య.. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కిందిస్థాయి నుంచి పైవరకు సమన్వయ లేమితో పాటు ఇటీవల కాలంలో డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు (ఆర్సీలు) ముద్రించేందుకు అవసరమైన కార్డులు, రిబ్బన్ల కొరత మరో ప్రధానమైన సమస్యగా మారింది. రవాణాశాఖకు స్టేషనరీ అందజేసే ప్రైవేట్ సంస్థలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో సుమారు రూ.7 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సదరు సంస్థలు కార్డులు, రిబ్బన్ల పంపిణీకి చేతులెత్తేయడంతో వినియోగదారులకు సకాలంలో అందజేయలేకపోయారు. కేవలం వారం రోజుల్లో అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల కోసం 4 నెలల నుంచి 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న వినియోగదారులు కూడా ఉన్నారు. మంత్రి సమీక్షతో కదలిక.. ఇటీవల రవాణాశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్డుల పంపిణీ స్తంభించిపోవడం, స్టేషనరీ కొరత, ప్రింటర్లు, స్కానర్లు లేకపోవడం, పనిచేయని కంప్యూటర్లు తదితర అంశాలను పరిశీలించారు. వాహనదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా ఓజీఆర్టీఎస్ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు. మరోవైపు తేలిగ్గా ఫిర్యాదు చేసేందుకు ఒక వాట్సప్ నంబర్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ‘కొద్ది రోజుల క్రితమే కొత్త ప్రింటర్లు, స్కానర్లు, స్టేషనరీ వచ్చాయి. త్వరలోనే వాహనదారుల సమస్యలన్నింటినీ పరిష్కస్తాం’ అని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
డిజిలాకర్ వినియోగం ఇలా...!
ఈ సారి ఎప్పుడైనా రోడ్డు మీద ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని ఆపితే ఎంచక్కా జేబులోంచి మొబైల్‌ఫోన్ తీసి డిజిటల్ రూపంలో భద్రపరిచిన వాహన పత్రాలు చూపించొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్కు, ఇన్సురెన్స్, తదితర ధృవీకరణపత్రాలను కాగిత రూపంలోనే కాకుండా అవి డిజిటల్ రూపంలో ఉన్నా అధికారికంగా చెల్లుబాటు అవుతాయని తాజాగా కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని అన్ని రాష్ట్రాల రవాణాశాఖలను కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో డిజిలాకర్ యాప్ లేదా ఎం పరివాహన్ ప్లాట్ఫోమ్లో ఈకాపీల రూపంలో వివిధ డాక్యుమెంట్లు ఇలా దాచుకోవచ్చు... డ్రైవింగ్‌కు సంబంధించిన పత్రాలే కాకుండా ఓటరు ఐడీకార్డు, ఆధార్‌కార్డు, విద్యాసంబంధిత సర్టిఫికెట్లు ఏవైనా డిజిలాకర్ మొబైల్ యాప్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వెబ్సైట్లతో పాటు మొబైల్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంది. మీ డాక్యుమెంట్లన్నింటిని డిజిటల్ లాకర్లో భద్రపరుచుకోవడమే ’డిజిలాకర్’. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పనిచేస్తుంది.ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్ నెంబర్లకు దీనిని లింక్చేస్తారు. క్లౌడ్ పద్ధతిలో (ఓ సాఫ్ట్వేర్)లో డేటానంతా స్టోర్ చేస్తారు. మీ డాక్యుమెంట్లను పీడీఎఫ్, జేపీఈజీ లేదా పీఎన్జీ ఫార్మాట్లో స్కాన్ చేసి వాటిని ఆ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఎప్పుడు అవసరం పడినా దాని నుంచి వాటిని ఉపయోగించవచ్చు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లపై మీరు ఎలక్ట్రానిక్(ఈ) సంతకం కూడా చేయొచ్చు. ఈ విధంగా మీ పత్రాలపై మీరు సొంతంగా అటెస్ట్ చేసినట్టు అవుతుంది. అదే విధంగా సీబీఎస్ఈ, రిజిస్ట్రార్ ఆఫీస్ లేదా ఆదాయపన్ను శాఖలు కూడా వారి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ కాపీలు కూడా నేరుగా మీ ఈలాకర్లోకి పంపవచ్చు. ఆధార్ పథకాన్ని అమలుచేస్తున్న ’యూనిక్ ఇండెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సంస్థతో పాటు, రోడ్డురవాణా, హైవేల మంత్రిత్వశాఖ. ఆదాయపు పన్ను శాఖ, సీబీఎస్ఈ తో సహా వివిధ స్కూలు బోర్డులు, వివిధ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, సంస్థలు డిజిలాకర్‌లో రిజిష్టరయి ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం 1.35 కోట్ల మంది డిజిలాకర్ను ఉపయోగిస్తున్నారు. పాన్‌కార్డులు, మార్కుషీట్లు, కుల, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు ఇలా వివిధ సేవల కోసం దానిని వాడుతున్నారు. ఎలా ఉపయోగించాలి... డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సిస్టమ్‌లో ముందుగా డిజిలాకర్ వెబ్‌సైట్‌కు వెళ్లడం లేదా స్మార్ట్‌ఫోన్‌లో డిజిలాకర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. వన్ టైమ్ పాస్వర్్డ కోసం మీ ఆధార్‌కార్డు, మొబైల్‌నెంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించాలి. ఏదైనా సంస్థ మీ ఈడాక్యుమెంట్లను అందులో అప్లోడ్ చేసినా మీ అకౌంట్లో కనిపిస్తుంది. మీ డాక్యుమెంట్లు కూడా మీరే స్వయంగా అప్లోడ్ చేయడంతో పాటు వాటిపై సంతకం చేయొచ్చు. ఈ డాక్యుమెంట్లను ఇతరులతో పంచుకునే (షేర్ చేసుకునే) సౌకర్యాన్ని కూడా మీరు పొందవచ్చు. దీని కోసం ఈడాక్యుమెంట్లో లింక్ షేర్ చేయాల్సి ఉంటుంది. -
ప్లేట్ ఫిరాయింపు..
హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లంటే వాహనదారులు ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో రవాణా శాఖ కార్యాలయంలో ఈ డిజిటల్ నంబరు ప్లేట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. వివిధ కారణాలతో వాహనదారులు వీటిని నివినియోగించుకోవడం లేదు. కనీసం వీటిని వాహనానికి పెట్టుకోవడానికి కూడా ముందుకు రావడం లేదు. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్ల కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ద్విచక్ర వాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనాలకు రూ.619 చొప్పున వాహనాదారులు రవాణా శాఖ కార్యాలయంలో డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ డబ్బులను సంబంధిత హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ల తయారీ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తారు. ఈ నంబరు వాహనం రిజిస్ట్రేషన్ అయిన 4 రోజులలోపే రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంది. వాహనాదారు మొబైల్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలల్లో డబ్బు చెల్లిస్తూ వాటిని సొంతం చేసుకుంటున్నారు వాహనాదారులు. ఈ హైసెక్యూరిటీ నంబరు పలకలను వాడటానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఊదాహరణకు టీఎస్ 36 జెడ్ 0001 నంబరు గల వాహనాన్ని వినియోగదారు ఫాన్సీ నంబరు కావడంతో వేలల్లో డబ్బు ఖర్చు చేసి ఈ నంబరును సొంతం చేసుకుంటున్నాడు. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను మాత్రం వినియోగించుకోవడం లేదు. కారణం ఏమిటంటే అతను తన వాహనంపై టీఎస్ 36 జెడ్ 1 అని ఉంటే... 1ని హైలైట్ చేస్తు రాసుకుంటారు. ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లలో ఈలాంటి అవకాశం వాహనదారుకు లభించదు. అందుకే వాహనదారులు ఈ హైసుక్యూరిటీ ప్లేట్లను విస్మరిస్తున్నారు. వాహనం నంబరుపై తన ఇష్టమైన వేరే అంకేలు గల డూప్లికేట్ నంబరు ప్లేట్లను వాడుతున్నారు. దీంతో వీరు ప్రమాదంలో భాగస్వామ్యులైతే వారిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందుకే ప్రతి వాహనదారు ఖచ్చితంగా హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాలి. వీటితో అనేక లాభాలు వాహనదారులకు ఉన్నప్పటికీ వాటిపై వాహనదారుల్లో అవగాహన కరువైంది. దీంతో భారత ప్రభుత్వం 2013 డిసెంబర్ నుంచి ఏంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు గదుల్లోనే మూలుగుతున్నాయి. 2013 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి వాహనానికి ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్లేట్లలోని లేజర్ కోడింగ్‌తో వాహనదారు పూర్తి వివరాలు ఉంటాయి. ఈ ప్లేట్లతో భారత దేశంలో గల వాహనాలన్నింటినీ ఆన్లైన్లో గుర్తించడం సాధ్యం అవుతుంది. ఒకవేళ వాహనం దొంగతనానికి గురైతే ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లతో వాహనాన్ని తొందరగా పట్టుకోవచ్చు. వాహనదారు వాహనాన్ని ఎవరైనా తస్కరిస్తే దాన్ని గుర్తించడం తెలికవుతుంది. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్, తదితర వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. వాడకపోతే ఏమవుతుంది ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాహనదారులు వాడకపోతే... వాహనానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలైనా... నిలిపివేయబడతాయి. దీంతో వాహనదారులు వాహనాన్ని ఇతరులకు అమ్మాలన్నా... ఇతరుల నుంచి ఖరీదు చేయాలన్నా కష్టం అవుతుంది. రవాణా శాఖ అధికారులు వాహన ఇన్సూన్స్, ఫిట్నెస్, ట్యాక్స్ తదితర ముఖ్య సేవలు నిలిపివేస్తారు. జిల్లాలో 2013 నుంచి 46,535 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి వాహనాదారులు తీసుకుపోయిన నంబరు ప్లేట్లు 39,515 ఇంకా వాహనాదారులు వాడని ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు 7,020. హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే వాడాలి ప్రతి వాహనాదారు ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లనే తన వాహనానికి ఉపయోగించాలి. ఒకవేళ ఉపయోగించని వాహనాలు తనిఖీల్లో అధికారులకు పట్టుబడితే సీజ్ చేస్తారు. వాహన సేవలు నిలిపి వేస్తారు. వాహనాదారులు ఖచ్చితంగా ఈ హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లను వాడాల్సిందే. ఈహైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు వాడటంతో వాహనాదారులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. – రామేశ్వర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా రవాణా శాఖ అధికారి -
ఇక రవాణా సేవలకూ ‘ఆధార’మే!
-
రవాణా సేవలకూ ‘ఆధార’మే!
ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ నిర్ణయం - మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కూడా.. నేటి నుంచే అమల్లోకి.. - వాహనం రిజిస్ట్రేషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు.. - అన్ని రకాల సేవలకూ వర్తింపు సాక్షి, హైదరాబాద్: మీ వాహనం రిజిస్ట్రేషన్ కావాలా.. యాజమాన్యం మార్పు జరగాలా.. డ్రైవింగ్ లైసెన్సు కావాలా.. అయితే ఆధార్ కార్డు ఉండాల్సిందే. తమ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తోంది. అంటే ఇక నుంచి ఆధార్‌కార్డు ఉంటేనే రవాణా శాఖ సేవలు పొందే అవకాశం ఉంటుంది. నేటి నుంచే.. ప్రభుత్వపరంగా ప్రతి లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విభాగాలకు సూచించింది కూడా. ఈ క్రమంలో రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర రవాణా సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో రవాణా సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా అమలు చేయడానికి రవాణా శాఖ వెనకడుగు వేసింది.ఇలా రెండు సార్లు జరిగింది. తాజాగా మళ్లీ రవాణా శాఖ సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని వెంటనే అంటే బుధవారం నుంచే అమల్లోకి తెచ్చింది. వన్‌టైం పాస్వర్డ్ కూడా.. ప్రతి లావాదేవీకి వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానాన్ని కూడా అమలుచేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రవాణా శాఖ సేవలు పొందేటప్పుడు కొంతమంది తప్పుడు ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారని.. దాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రఘునాథ్ తెలిపారు. ఏదైనా సేవ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అందులో పేర్కొన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుందని, దానిని నమోదు చేస్తేనే దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలని, తప్పుడు ఫోన్ నంబర్ నమోదు కాకుండా ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని పోలీసు శాఖ కూడా కోరడంతో రవాణా శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించేవారికి పెనాల్టీ పాయింట్ల విధింపును చేపట్టిన విషయం తెలిసిందే. నిర్ధారిత మొత్తానికి పాయింట్లు చేరుకుంటే.. ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయా లని నిర్ణయించారు. కానీ దీనికి సంబంధించి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి ని అధిగమించేందుకు పోలీసు శాఖ ఆధార్, ఓటీపీ విధానంపై దృష్టి సారించింది. -
వాహన రిజిస్ట్రేషన్‌లో ఆధార్ తప్పనిసరి
♦ వివరాలు రవాణాశాఖ వెబ్సైట్లోనూ ఉంచాలి ♦ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీలలో ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయాలని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు. వాహనాలను ఇతరులకు అమ్మినప్పుడు అవి కొన్నవారి పేరుపైకి బదిలీకావాల్సి ఉందని, కానీ ఇది జరగకపోవటం వల్ల బీమా పొందడం, పోలీసు కేసులు లాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి, కొన్నవారి పేరుపై వాహనాలు బదిలీ అయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని పేర్కొన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో రవాణా, పోలీసు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లారీలు, ఆటోల ఫైనాన్షియర్లు తమ డబ్బులు కట్టలేదన్న ఉద్దేశంతో వాహనాలను లాక్కెళ్లి ఇతరులకు అందజేస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో పాతవారి పేరిటే వాహనాలు ఉన్నందున ప్రమాదాల సమయంలో చిక్కులు ఏర్పడుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్, విక్రయాల వివరాలను సైతం రవాణాశాఖ వెబ్సైట్లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఫైనాన్షియర్ల ఆగడాల నుంచి ఆటోవాలాలను రక్షించాలని, వారి ఆటోలను వారిపేరిటే రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. నగరంలో వాహన ప్రమాదాలు, మరణాల రేటు తగ్గిందని నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, జేటీసీలు రఘునాథ్, పాండురంగనాయక్, డీటీసీ ప్రవీణ్‌రావు, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
► సెకెండ్ వెహికల్ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు ► రవాణా ఆదాయానికి భారీ గండి ► గ్రేటర్ పరిధిలో అక్రమాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడిన 10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై ప్రభుత్వం శనివారం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ఆదేశాలు వెలువరించారు. సస్పెండైన వారంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లా ల్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న క్లర్క్‌లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, మేడ్చెల్‌లో ఇద్దరు సస్పెండ్ అయ్యారు. రెండో వాహనం రిజిస్ట్రేషన్లలో వాహనదారుల నుంచి తీసుకున్న 14 శాతం పన్నును ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకు న్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లు వెత్తాయి. 2014 నుంచి 2015 వరకు జరిగిన ఈ అక్రమాల్లో మొత్తం 36మంది ఉద్యోగులు భాగస్వా ములై ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. వారందరికీ గత సంవత్సరమే చార్జి మెమోలు జారీ చేశారు. వారిలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని ప్రస్తుతం సస్పెండ్ చేశారు. భారీ ఎత్తున ఆదాయానికి గండి... సాధారణంగా వాహనాల రిజిస్ట్రేషన్లపై రవాణా శాఖ వాటి ఖరీదులో కొంతమొత్తాన్ని జీవితకాల పన్నురూపంలో వసూలు చేస్తుంది. ద్విచక్ర వాహనాలపై 9 శాతం, కార్లపైన 12 శాతం చొప్పున వసూలు చేస్తారు. సదరు వ్యక్తులు తమకు అప్పటికే ఒక వాహనం ఉండి రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం వాహనం ఖరీదులో 14 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇలా రెండో వాహనం రిజిస్ట్రేషన్లపైన వాహనదారులు చెల్లించే పన్ను పెద్ద ఎత్తున దారి మళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొందరు ఉద్యోగులు వాహనదారుల పేరు, ఇంటి నంబర్, చిరునామా వంటి వివరాల్లో స్వల్ప మార్పులు చేసి ప్రభుత్వ ఖజానాకు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. అప్పటి రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఈ కుంభకోణాన్ని గుర్తించి పెద్ద ఎత్తున క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు తప్పిదాలకు పాల్పడినట్లు గుర్తించి మెమోలు జారీ చేశారు. తాజాగా 10 మంది ఉద్యోగులను తీవ్రమైన తప్పులకు పాల్పడినట్లు గుర్తించి సస్పెండ్ చేయడం గమనార్హం. పేర్లు ప్రకటించకపోవడంతో ఆ 10 మంది ఎవరన్న దానిపై ఆర్టీఏ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్ వంటి అన్ని చోట్ల ఈ పన్ను ఎగవేత ఉదంతాలు చోటుచేసుకున్నాయి. -
పెట్రో వాహనాల నమోదుపై పరిమితి
ఇంధన ఖర్చు రూ. 3.9లక్షల కోట్లు ఆదా ► విరివిగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలి ► నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ నివేదిక న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌పై పరిమితి విధించి, ఎలక్ట్రిక్, షేర్డ్ వాహనాలను భారీగా వాడాలని నీతిఆయోగ్ సూచించింది. తద్వారా ఇంధనానికి అయ్యే ఖర్చులో 2030 నాటికి దాదాపు 6000 కోట్ల డాలర్లను(రూ. 3.9 లక్షల కోట్లు) ఆదాచేయవచ్చని పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి భారీగా పన్ను మినహాయింపులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ విధానం చైనాలో విజయవంతమయ్యిందని తెలిపింది. ఈ మేరకు నీతిఆయోగ్, రాకీ మౌంటేన్ ఇన్స్టిట్యూట్ నివేదికను తయారుచేశాయి. దీన్ని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ విడుదల చేశారు. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ వాహనాలను ఉపయోగించడం వల్ల 2030 నాటికి 67 శాతం ఇంధన శక్తిని కాపాడుకోవడచ్చని, 37 శాతం కార్బన్ ఉద్గారాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. అలాగే 15 కోట్ల 60 లక్షల టన్నుల ఆయిల్‌ను ఆదా చేయవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ స్థానంలో బ్యాటరీల దిగుమతిని కూడా భారీగా తగ్గించుకొని, ఇక్కడే తయారుచేసుకోవాల్సి ఉందన్నారు. వీటికి గిరాకీ పెంచడానికి మొదటగా ప్రభుత్వ వాహనాలు, ప్రజా రవాణా వాహనాల మార్పుపై దృష్టిసారించాలని సూచించారు. ‘సురక్షితమైన, అతి తక్కువ ఖర్చులో సమర్థవంతమైన సేవలను అందించడానికి విభిన్న మార్గాలను అనుసరించాలి. తద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చు’ అని 140 పేజీల నివేదిక ముందుమాటలో నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియా పేర్కొన్నారు. -
బండి కొన్నా.. రోడ్డెక్కలేదు!
► రాష్ట్రంలో వెయ్యి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ గల్లంతు! ► బీఎస్–3 టూవీలర్ల అమ్మకాల్లో డీలర్ల దందా ఎఫెక్ట్ ► మార్చి 31 రాత్రి 12 తర్వాత విక్రయించిన ఫలితం ► అర్ధరాత్రి తర్వాత రవాణాశాఖ సర్వర్ అనుసంధానం బంద్ ► అయినా వాహనాలు అంటగట్టిన డీలర్లు ► అవి రోడ్డెక్కితే భారీ పెనాల్టీలు విధిస్తున్న పోలీసులు ► డీలర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు సాక్షి, హైదరాబాద్: వాహనం కొన్నారు.. డబ్బులూ చెల్లించారు.. కానీ అసలు రిజిస్ట్రే షన్ అయ్యే పరిస్థితి లేదు.. తాత్కాలిక రిజిస్ట్రే షన్ కూడా కాలేదు..రోడ్డెక్కితే పోలీసులు పట్టుకుంటున్నారు.. వాటిని కొన్నవారు ఎటూ పాలుపోక తల పట్టుకుంటున్నారు.. తమ సమస్య పరిష్కరించాలంటూ రవాణా శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భారత్ స్టేజ్ (బీఎస్–3) వాహనాల విక్రయానికి గడువు ముగిసే చివరి రోజున డీలర్ల దందా కారణంగా తలెత్తిన పరిస్థితి ఇది! వెయ్యి మంది దీనితో ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి దాటాక విక్రయించిన ఫలితం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 31 తర్వాత బీఎస్–3 వాహనాల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు బీఎస్–3 ప్రమాణాలతో ఉన్న ద్విచక్రవాహనాలను వదిలించుకునేందుకు ధరలు ఓ మోస్తరుగా తగ్గించి విక్రయించాయి. దీంతో చాలా మంది వాహనాలు కొనేందుకు ఎగబడ్డారు. రాష్ట్రంలో సాధారణంగా జరిగే విక్రయాల కన్నా.. మార్చి 31 రోజున 4 వేల ద్విచక్ర వాహనాలు అద నంగా అమ్ముడవడం గమనార్హం. సాధార ణంగా వాహనాన్ని అమ్మినప్పుడు డీలరే తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ మేరకు వారికి రవాణాశాఖ సర్వర్‌తో ఆన్లైన్ అనుసంధానం అందుబాటులో ఉంటుంది. అయితే మార్చి 31 రాత్రి 12 కాగానే రవాణా శాఖ సర్వర్‌తో అనుసంధానం నిలిచిపోయింది. ఈ విషయం తెలిసి కూడా కొందరు డీలర్లు తెల్లవారే వరకూ వాహనాలను విక్రయించారు. అలా రాత్రి 12 తర్వాత విక్రయించిన దాదాపు వెయ్యి ద్విచక్ర వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ జరగలేదు. దాంతో వాటికి పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి లేదు. దీంతో ఆందోళన చెందిన ఆ వాహనాలు కొన్నవారు డీలర్ల వద్దకు వెళ్తే.. సమస్య రవాణాశాఖ సర్వర్‌లో ఉందని, అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో వారంతా రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లగా.. రాత్రి 12 తర్వాత కొన్న వాహనాలకు రిజిస్ట్రేషన్ ఉండదని, అది డీలర్ల తప్పేనని, తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఆ వాహనాలు కొన్నవారి పరిస్థితి గందరగోళంగా మారింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ కూడా లేకుండా వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేక వాటిని ఇళ్లలోనే ఉంచేస్తున్నారు. తప్పు డీలర్లదే.. అయినా కేంద్రాన్ని అడిగాం.. ‘‘మార్చి 31 అర్ధరాత్రి 12 తర్వాత కూడా కొందరు డీలర్లు బీఎస్–3 ద్విచక్ర వాహనాలను విక్రయించారు. వాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ విషయంలో డీలర్లదే తప్పు. అలాంటి వాహనాలు వెయ్యి వరకు ఉన్నాయని గుర్తించాం. ఆ వాహనాలు కొన్నవారు మా చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు డీలక్లు కూడా వచ్చి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మార్చి 31 రాత్రి 12 తర్వాత అమ్మిన వాహనాల విషయంలో ఏం చేయమంటారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..’’ – రఘునాథ్, ఉప రవాణా కమిషనర్ -
‘ప్లేటు’ మారితే వాహనం సీజ్
నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల దృష్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు ఆదేశాలు జారీ ‘నిషా’చరుల రక్తపరీక్షలకూ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నగరంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అమల వుతోంది. క్షేత్రస్థాయి అధికారులు నేరుగా జరిమానా లు విధించట్లేదు. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు తీసి ఈ–చలాన్ పంపిస్తున్నారు. వీటిని పంపాలంటే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ నిర్దేశిత ప్రమాణాలతో ఉండటం అవసరం. అలా కానప్పుడు ఈ–చలాన్ చేరకపోవడమో, వేరే వారికి వెళ్లడమో జరుగుతుంది. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న అనేక వాహనాలకు నంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఈ ప్రక్రియ దెబ్బతింటోంది. దీంతో ట్రాఫిక్ విభాగం అధికారులు.. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. నగరవ్యాప్తంగా సోమవారం నుంచి ఈ స్పెషల్‌డ్రైవ్ ప్రారంభమైంది. అక్రమ నంబర్ ప్లేట్ల కారణంగా ఈ–చలాన్ నుంచి తప్పించుకోవడంతో పాటు అసాంఘిక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఉగ్రవాదుల కదలికలు సైతం కనిపెట్టడం కష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. మందుబాబులకు బ్లడ్ టెస్టులు సైతం... ఇక నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు స్పెషల్‌డ్రైవ్స్‌లో వాహనచోదకుల్ని అవసరమైన సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు పరీక్షిస్తారు. అప్పటికీ వారు సందేహం వ్యక్తం చేస్తే సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి రక్తనమూనాలను సేకరించడం ద్వారా పరీక్షించాలని నిర్ణయించారు. నిబంధనలు, సూచనలివే.. ► ద్విచక్ర వాహనాలు, తేలికపాటి వాహనాలు, కార్లకు తెల్లరంగు ప్లేటుపై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ► కమర్షియల్, గూడ్స్ వాహనాలకు పసుపు రంగు ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్ ఉండాలి. ► నంబర్ ప్లేట్‌పై పేర్లు, బొమ్మలు, సందేశాలు తదితరాలు నిషేధం. ► ఎవరైనా బోగస్ నంబర్ ప్లేట్లు కలిగి ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేస్తారు. ► వాహనచోదకులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (కనీసం జిరాక్సు ప్రతులైనా) లేదంటే స్మార్ట్‌ఫోన్‌లోని ఆర్టీఏ యాప్‌లో కచ్చితంగా వీటిని కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ 200 ్ఠ 100 మిల్లీ మీటర్లు, తేలికపాటి వాహనాలు, ప్యాసింజర్ కార్లకు 340 ్ఠ 200 మిల్లీ మీటర్లు లేదా 500 ్ఠ 120 మిల్లీమీటర్లు, మీడియం, హెవీ కమర్షియల్ వాహనాలకు 340 ్ఠ200 మిల్లీ మీటర్ల సైజుల్లో ఉండాలి. అన్ని సర్టిఫికెట్లు ఉండాల్సిందే ‘వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేటు ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే తక్షణం చలాన్ జారీ చేయడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటాం. వాహనచోదకులు ఆ వాహనా నికి సంబంధించిన ధ్రువీకరణలు తీసుకువచ్చి న తర్వాత పరిశీలిస్తాం. ఆ వాహనం ఇన్సూ రెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉన్నాయా? లేదా? అనేది పరిగణనలోకి తీసుకుంటాం. అవి లేకుంటే దానికి సంబంధించి చలాన్ జారీచేసి ఆ మొత్తం వసూలు చేస్తాం. ఇవన్నీ పూర్తయిన తర్వాతే వాహనాన్ని తిరిగి అప్పగిస్తాం’. – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
గాడిన పడని ఆన్లైన్ వాహన రిజిస్ట్రేషన్
* షోరూం నిర్వాహకులకు అవగాహన లోపంతో దరఖాస్తుల తిరస్కరణ * రిజిస్ట్రేషన్ వారం నుంచి రెండు వారాల పాటు జాప్యం గుంటూరు (నగరంపాలెం): రవాణాశాఖలో వాహనదారులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వాహన డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ఇంకా గాడిన పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 17 నుంచి ద్విచక్ర, నాన్‌ట్రాన్స్‌పోర్ట్ లైట్ మోటర్ వాహనాలు కొనుగోలు చేసిన షోరూం లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి నంబరు కేటాయించే విధానం ప్రారంభించారు. దీని కోసం జిల్లాలోని సుమారు 40 వాహన షోరూంలకు, 150 మంది సబ్ డీలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం, షోరూంలో అప్లికేషన్ ఆన్లైన్లో అప్‌లోడ్‌కు ప్రత్యేక సాఫ్ట్వేర్ అందించారు. జిల్లాలో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే గుంటూరు ఆర్టీఏ కార్యాలయానికి ఏపి07సిజడ్, నరసరావుపేట ఆర్టీఏ కార్యాలయానికి ఏపి07డిఏ, పిడుగురాళ్ళ యూనిట్ కార్యాలయానికి ఏపి07డీబీ, తెనాలి యూనిట్ కార్యాలయానికి ఏపి07డీసీ సిరీస్‌ను కేటాయించారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం మినహా అక్టోబర్ 17 నుంచి కొనుగోలు చేసిన నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు అన్నీ షోరూం ద్వారానే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే గత నెలరోజులుగా æ వాహన డీలర్ల నుంచి రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులు చిన్నచిన్న సాంకేతిక సమస్యలతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. షోరూంలో వాహనం కొనుగోలు చేసిన తర్వాత పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు నగదు ద్వారా కొనుగోలు చేస్తే కొనుగోలుదారుని ఫొటో, వాహనం రెండు ఫొటోలు ఇతర పత్రాలు కలిపి మొత్తం 12 , ఫైనాన్స్ ద్వారా అయితే 15 పత్రాలను అన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేయాల్సిన ఫారమ్స్ అన్నీ జీపీఆర్ఎస్ కోఆర్డినేషన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే ఫొటో తీయాల్సి ఉంటుంది. నివాస ధ్రువీకరణ పత్రాలతోనే ప్రధాన సమస్య.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్ నివాస ధ్రువీకరణ పత్రంపై సరైన అవగాహన షోరూం నిర్వాహకులకు లేకపోవడంతో ఎక్కువ శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఆధార్‌కార్డులో ఉన్న చిరునామా పోస్టల్ అడ్రస్, మండలాలు సక్రమంగా ఉండడం లేదు. అప్లికేషన్లో అప్లోడ్ చేసే ప్రూఫ్‌లు సక్రమంగా ఫొటో తీయలేకపోవడంతో క్లారిటీగా ఉండడం లేదు. ఇన్వాయిస్ల మీద, ఇతర ఫారమ్స్ మీద షోరూం మేనేజర్ల సంతకాలు ఉండడం లేదు. వాహనాలు సగం మాత్రమే కన్పించేలా ఫొటోలు తీస్తున్నారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయానికి గత నెలరోజులుగా సుమారు 900 వరకు ఆమోదం పొందితే 600 వరకు చిన్నచిన్న కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన వాటిలో కూడా ఎక్కువ శాతం ఒకటి కంటే ఎక్కువ సార్లు తిరస్కరణకు గురై సరిచేసి పంపినవే. తెనాలి, పిడుగురాళ్ళ, నరసరావుపేట కార్యాలయాల్లో ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. దీంతో 24 గంటల్లో జరగాల్సిన వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారం నుంచి పదిహేను రోజుల వరకు పడుతోంది. ఆన్లైన్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన ఫారమ్స్ క్లర్క్, ఎంవీఐ, ఏవో అన్ని పత్రాలపై కామెంట్ రాయాల్సి రావడంతో పనిభారం పెరుగుతోంది. షోరూం నిర్వాహకులకు త్వరలో శిక్షణ కార్యక్రమం –డీటీసీ డీలర్ల వద్ద వాహనాలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో షోరూం నిర్వాహకులు అప్లోడ్ సక్రమంగా చేయకపోవడంతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనరు జీసీ రాజరత్నం తెలిపారు. ఆధార్ కార్డును చిరునామాగా చూపే సమయంలో చిరునామా పూర్తిగా నమోదు చేయడం లేదన్నారు. ఇతర అడ్రస్ ప్రూఫ్‌కు ఎక్స్ట్రా ఇమేజ్ ఆప్షన్‌ను వినియోగించడం లేదన్నారు. అప్లోడ్ చేసిన ప్రూఫ్లలోని వివరాలు సక్రమంగా కన్పించడం లేదన్నారు. డీలర్లు అప్లోడ్ చేసిన వివరాలను పరిశీలించడానికి మినహా సరిచేసే అవకాశం కార్యాలయ సిబ్బందికి లేకపోవడంతో తిరస్కరించక తప్పడం లేదన్నారు. దీనిపై డీలర్లకు అవగాహన కోసం మరోసారి స్వల్పకాలిక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
నేటి నుంచి షోరూంలలోనే రిజిస్ట్రేషన్
రవాణాశాఖలో సంస్కరణలు కొన్నచోటే శాశ్వత రిజిస్ట్రేషన్ వెంటనే నంబరు కేటాయింపు నెల్లూరు (టౌన్): రవాణాశాఖ పలు సంస్కరణల అమలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఎల్ఎల్ఆర్, లైసెన్స్‌లకు సంబంధించి శ్లాట్‌ను ఆన్లైన్లో ప్రవేశపెట్టింది. ఇది విజయవంతం కావడంతో శనివారం నుంచి వాహనాలు కొన్న షోరూంల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పటి దాకా షోరూంలలో కేవలం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) మాత్రమే చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి పరుగు తీయాల్సి వచ్చేది. ఈ ప్రయాసలను తగ్గించేందుకు రవాణాశాఖ వాహనం కొన్నచోటే శాశ్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. షోరూంల డీలర్లకు గురు, శుక్రవారాల్లో ఆన్లైన్ విధానంలో శాశ్వత రిజిస్ట్రేషన్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫ్యాన్సీ నంబర్లు సైతం ఆన్లైన్లో.. వాహనాలకు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లను సైతం వారం తర్వాత ఆన్లైన్లో ఉంచేందుకు రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో నెల్లూరుతో పాటు కావలి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో వాహనాలు రిజిస్ట్రేషన్లు, ఎల్‌ఎల్‌ఆర్‌లు, లైసెన్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రెన్యూవల్స్, ట్రాన్స్ఫర్లు తదితర 83 రకాలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవల కోసం ప్రతి వాహనదారుడు, వినియోగదారుడు రవాణా కార్యాలయానికి వెళ్లాల్సిని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రవాణా అధికారులు, ఏజెంట్లు కుమ్మక్కై వాహనదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు రావడంతో వాహనదారుడు నేరుగా ఆన్లైన్లో సేవలు పొందే విధంగా రవాణాశాఖ చర్యలు చేపట్టింది. 24గంటల్లో శాశ్వత రిజిస్ట్రేషన్ షోరూంల్లో ఆన్లైన్ విధానం ద్వారా వాహనానికి 24గంటల లోపు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇప్పటి దాక వాహనదారుడు కేవలం టీఆర్ మాత్రమే చేయించుకుని కొన్ని నెలల పాటు శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిరుగుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక నుంచి షోరూంలో వాహనదారుడి సంతకం, వేలిముద్రలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రతి దరఖాస్తు ఆన్లైన్లో రవాణాశాఖకు చేరుతుంది. సంతకం, ఆధార్‌కార్డులోని వేలిముద్రను సరిపోల్చడంతో సేవలు పూర్తవుతాయి. అనంతర వాహనదారుడు ఈమెయిల్ ఐడీకి వాహనానికి సంబంధించిన శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరును పంపిస్తారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు – శివరాంప్రసాద్, ఉప రవాణా కమిషనర్, రవాణాశాఖ వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. శనివారం నుంచి షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. వాహనం కొనుగోలు చేసిన వ్యక్తి వేలిముద్రలు, వాహనం ఫోటోలను షోరూం నిర్వాహకులు రవాణా కార్యాలయానికి అన్లైన్లో అనుసంధానం చేస్తారు. కార్యాలయంలో అధికారులు వాటిని నిర్ధారించిన తరువాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను చేయనున్నారు. -
తొలిరోజు వాహన రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు
• రవాణా శాఖ సాఫ్ట్వేర్ అనుసంధానంలో లోపాలు • కొత్త జిల్లాల్లో మొరాయించిన వ్యవస్థ • ఐటీ సిబ్బందితో రెండు బృందాల ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయి. కొత్త జిల్లాల పరిధిలో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసి సాఫ్ట్వేర్ అనుసంధానం చేశారు. ఆయా జిల్లాల స్వరూపం, మండలాలు, వాటి పరిధిలోని గ్రామాల పేర్లను జిల్లాల వారీగా సాఫ్ట్‌వేర్‌తో జతచేశారు. అయితే ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని పేర్లు, సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన పేర్లతో మ్యాచ్ కాకపోవడంతో కంప్యూటర్లు మొరాయించాయి. కొన్ని చోట్ల సర్వర్లు ఇబ్బంది పెట్టాయి. తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వనపర్తి, నాగర్‌కర్నూలు, భూపాలపల్లి, వికారాబాద్‌లలో సమస్య తీవ్రమైంది. దీంతో కొత్త జిల్లాల తొలిరోజు వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర పనులు ఆగిపోయాయి. దీంతో రవాణా శాఖ వెంటనే ఐటీ సిబ్బందితో కూడిన రెండు బృందాల ద్వారా సమస్యను పరిష్కరించింది. దసరా ముందు రోజు రాత్రి పొద్దు పోయే వరకు కొత్త జిల్లాల స్వరూపంలో మార్పులు జరగడంతో సాఫ్ట్వేర్ అనుసంధానంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు. పాత నంబర్లు అలాగే.. కొత్త జిల్లాలకు రవాణా శాఖ కొత్త కోడ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు కోడ్లు మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంగారెడ్డి టీఎస్7, మేడ్చల్ టీఎస్8, కామారెడ్డి టీఎస్17, నిర్మల్ టీఎస్18, మంచిర్యాల టీఎస్19, కొమురంభీమ్ టీఎస్ 20, జగిత్యాల టీఎస్ 21, పెద్దపల్లి టీఎస్ 22, రాజన్న సిరిసిల్ల టీఎస్ 23, వరంగల్ రూరల్ టీఎస్ 24, జయశంకర్ భూపాలపల్లి టీఎస్ 25, మహబూబాబాద్ టీఎస్ 26, జనగాం టీఎస్ 27, భద్రాద్రి టీఎస్ 28, సూర్యాపేట టీఎస్ 29, యాదాద్రి టీఎస్ 30, నాగర్‌కర్నూలు టీఎస్ 31, వనపర్తి టీఎస్ 32, జోగులాంబ గద్వాల టీఎస్ 33, వికారాబాద్ టీఎస్ 34, మెదక్ టీఎస్ 35, సిద్దిపేట టీఎస్ 36 నంబర్లను రవాణా శాఖ కేటాయించింది. -
వాహన రిజిస్ర్టేషన్ల ఆలస్యానికి కారణం అదే!
♦ నిషేధం ఉన్నా దొడ్డిదారిన ఎంవీఐల బదిలీలు.. ♦ ఆర్టీఏ కార్యాలయాల్లో నిలిచిపోతున్న పౌరసేవలు సాక్షి,సిటీబ్యూరో: రవాణాశాఖలో ‘ఆన్ డిప్యుటేషన్’ పెద్ద సమస్యగా మారింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్నా.. రెండేళ్లుగా ఎంవీఐలు, ఏఎంవీఐలు ఈ ‘మార్గాన్ని’ అడ్డుపెట్టుకుని, ఎవరికి వారు పైరవీలు చేసుకుని తమకు నచ్చిన చెక్‌పోస్టుకు వెళ్లిపోతున్నారు. దీని మూలంగా ఆర్టీఏ కార్యాలయాలకు సిబ్బంది కొరత సవాల్ గా మారింది. వీరి స్థానంలో కొత్త అధికారులు రాకపోవడం లేదు. దీంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు, వినియోగదారులకు లెర్నింగ్ లైసెన్సులు, రెన్యువల్స్, వాహన బదిలీ వంటి పౌర సేవలు అందించే ఈ కార్యాలయానికి వచ్చే వినియోగదారులకు సకాలంలో పనులు జరగడం లేదు. అరకొర సిబ్బందితో అవస్థలు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాలు, నాలుగు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లకు పౌరసేవల కోసం రోజూ వేల సంఖ్యలో వాహన వినియోగదారులు వస్తారు. లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ, సుమారు 1500 మంది లైసెన్సుల కోసం సంప్రదిస్తుంటారు. మరో 1000 మంది వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వస్తుంటారు. ఈ రెండు కేటగిరీలు కాకుండా ఇతరత్రా పౌరసేవల కోసం వందల సంఖ్యలో వినియోగదారులు ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తారు. ఉప్పల్, తిరుమలగిరి, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, మేడ్చెల్ వంటి కార్యాలయాలకు వాహనదారుల రద్దీ భారీగా ఉంటుంది. కానీ ‘ఆన్ డిప్యుటేషన్’ బదిలీల కారణం గా చాలా చోట్ల ముగ్గురు ఎంవీఐలు చేయాల్సిన పనిని ఒక్కరే చేయాల్సి వస్తోంది. మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయంలో ఒకే ఒక్క ఎంవీఐ విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, కనీసం ఐదుగురు ఎంవీఐలు పనిచేయాల్సిన సికింద్రాబాద్ వంటి ఆర్టీఏ కార్యాలయంలోనూ ఒక్కరిపైనే పనిభారం పడుతోంది. మేడ్చెల్ లో ఇద్దరు ఎంవీఐలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీఏ పరిధిలో 45 మంది ఎంవీఐలు అవసరముండగా ప్రస్తుతం 22 మంది మాత్రమే ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గత రెండేళ్లుగా 38 మందికి పైగా సిబ్బంది వివిధ కారణాలతో ఆన్ డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. చెక్‌పోస్టు డ్యూటీల కోసమేనా.. కొంతకాలంగా సాధారణ బదిలీలు, పదోన్నతులు నిలిచిపోవడంతో ఈ తర హా ఓడీ బదిలీలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. చాలామంది ఎంవీ ఐలు ఆఫీస్ డ్యూటీల పట్ల విముఖత వ్యక్తం చేస్తూ చెక్‌పోస్టులకు వెళ్లేందుకు పైరవీలు చేసుకుంటున్నారు. చెక్‌పోస్టుల్లో ఎక్కువ శాతం పైఅధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణకు దూరంగా ఉండడం.. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా ఆఫీసుల్లో వచ్చే అక్రమార్జన కంటే చెక్‌పోస్టుల్లో వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. -
నేనే నంబర్-1
9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.2.70 లక్షలు ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు లక్షలు, కోట్లు వెచ్చిస్తుంటారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తమ అదృష్ట సంఖ్య రాకపోతే నిరుత్సాహపడుతుంటారు. అందుకే చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎంత డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకునేందుకు తహతహలాడుతుంటారు. అచ్చం అలాంటిదే మంగళవారం తిరుపతి ఆర్టీవో కార్యాలయంలో చోటుచేసుకుంది. తిరుపతి ఆర్టీవో వివేకానందరెడ్డి సమక్షంలో ఏపీ03-బివి 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. ఈ నంబర్‌ను పుత్తూరుకు చెందిన ఓ విద్యాసంస్థ యాజమాన్యం రూ.2,69,999 వెచ్చించి సొంతం చేసుకుంది. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత పెద్దమొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని తెలిసింది. - తిరుపతి, మంగళం -
రిజిస్ట్రేషన్ లేకపోతే..
* వాహనం సర్వీసింగ్ కట్ * ఈమేరకు జిల్లా వాహన డీలర్లకు రవాణాశాఖ లేఖ * బీమా కోల్పోతారంటూ వాహనదారులకు అవగాహన సాక్షి ప్రతినిధి, కర్నూలు: మీ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? అయితే ఇక నుంచి మీ బండిని వాహన డీలర్లు సర్వీసు చేయరు. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు జిల్లాలోని వాహన డీలర్లందరికీ లేఖలు రాశారు. అనేక మంది వాహనదారులు వాహనాలు కొనుగోలు చేసిన తర్వాత పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీనిని నిలువరించే యంత్రాంగం ప్రస్తుతానికి ఏదీ అమల్లో లేదు. దీంతో వాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్ లేకుండానే ఎంచక్కా వాహనాల్లో.... ప్రధానంగా టూ వీలర్, కార్లు, ట్రాక్టర్లల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని కట్టడి చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని వాహనాలు పర్మినెంటు రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్నాయనే దానిపై వారు లెక్కలు తీస్తున్నారు. రిజిస్ట్రేషన్ లేకపోతే...బీమా కట్! రిజిస్ట్రేషన్ లేని వాహనంపై ప్రయాణిస్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే బీమా కంపెనీలు సదరు వాహనానికిగానీ... వాహనంపై ప్రయాణించే వారికి కానీ బీమా మొత్తాన్ని అందజేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ప్రమాదం జరిగిన వాహనానికిగానీ, వాహనంపై ప్రయాణిస్తున్న వారికిగానీ ఎటువంటి బీమా మొత్తం అందలేదు. ఈ నేపథ్యంలో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వాహనదారులకు కూడా ఉపయోగకరమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) మీరాప్రసాద్ తెలిపారు. అందుకే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ డీలర్లకు లేఖలు రాసినట్లు ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆదాయానికి అవకాశం ! వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు మొదట తాత్కాలిక (టెంపరరీ) రిజిస్ట్రేషన్ (టీఆర్) నంబరును కేటాయిస్తారు. వాస్తవానికి టీఆర్ నంబరు వచ్చిన నెల రోజుల్లోగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చేయించుకోని పక్షంలో ఎటువంటి జరిమానాలు విధించే అధికారం రవాణాశాఖకు లేదు. దీంతో అనేక మంది పర్మినెంటు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆదాయాన్ని రవాణాశాఖ తాత్కాలికంగా కోల్పోయినట్టు అవుతోంది. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యతో తప్పకుండా వాహనదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ ఆదాయం కూడా పెరుగుతుందని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద రవాణాశాఖ తాజా నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏపీ నుంచి టీఎస్‌కు వాహన రిజిస్ట్రేషన్
ఆన్లైన్లో సులువుగా మార్చుకునేలా కొత్త సాఫ్ట్వేర్ ♦ ఈ నెలాఖరు నుంచి ప్రక్రియ మొదలయ్యే అవకాశం ♦ ఆర్థిక భారం వాహనదారులపైనే సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ పరిధిలో ఏపీ సిరీస్‌తో ఉన్న దాదాపు 74 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాహనదారులే నేరుగా ఆన్లైన్ ద్వారా రాష్ట్ర, జిల్లా కోడ్లను సులువుగా మార్చుకునేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నారు. కొత్త విధానంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ పాతదే ఉండనుండగా... స్టేట్ కోడ్, జిల్లా కోడ్లు మారనున్నాయి. విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కొత్త కోడ్లను కేటాయించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ రిజిస్ట్రేషన్ సిరీస్ వాహనదారులు ఆన్లైన్లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త నంబర్ సిరీస్‌కు సంబంధించి ఆర్సీ కార్డును ఇంటికి పంపుతారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాహనదారుడే ఖర్చు భరించాలి. ఆన్లైన్లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ. 100 వరకు సర్వీసు చార్జీతోపాటు కొత్త ఆర్సీ కార్డు తయారీకి అయ్యే చార్జీని కూడా వారే చెల్లించాలి. అలాగే కొత్త రిజిస్ట్రేషన్ ప్లేటుకు సంబంధించి తప్పనిసరిగా హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాల్సిందే. గతంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉన్నవారు కూడా మళ్లీ రెండోసారి ఈ ఖర్చు భరించాల్సి రానుంది. వెరసి ద్విచక్ర వాహనదారులకు దాదాపు రూ. 450 వరకు, కార్లకు అది మరో రూ. 200 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ అవుతాయని అధికారులు చెబుతున్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ సిరీస్ అమలులోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గత ఏడాదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా దానికి సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ మొదలు కాలేదు. -
ఆన్లైన్లోనే వాహన రిజిస్ట్రేషన్ సిరీస్ మార్పు
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ సిరీస్ అమలులోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నెంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గత ఏడాదే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కానీ విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ ఇప్పటిదాకా మొదలు కాలేదు. ఈ నెలాఖరుకుగాని, మే మొదటి వారంలోగాని ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 74 లక్షల వాహనాలు ప్రస్తుతం ఏపీ సీరీస్‌తో కొనసాగుతున్నాయి. వాటన్నింటిని టీఎస్ సిరీస్‌లోకి మార్చాల్సి ఉంది. సర్వీసు ఛార్జి, ఆర్సీ బుక్కు ఖర్చు భరించాల్సిందే.. స్టేట్ కోడ్‌తోపాటు జిల్లా కోడ్ కూడా మారుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కూడా కొత్త కోడ్లను కేటాయించింది. రిజిస్ట్రేషన్ నంబరు మాత్రం పాతదే కొనసాగనుండగా స్టేట్, జిల్లా సిరీస్‌లు మారతాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 74 లక్షల వరకు వాహనాల నంబర్ సిరీస్ మార్చాల్సి ఉన్నందున వాహనదారులు నేరుగా ఆన్లైన్లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త నంబరు సిరీస్‌కు సంబంధించి ఆర్సీ కార్డు ఇంటికి పంపుతారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాహనదారుడికి ఖర్చు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ.100 వరకు సర్వీసు ఛార్జీ భరించాల్సి ఉంటుంది. కొత్త ఆర్సీ కార్డు తయారీకి అయ్యే వ్యయాన్ని కూడా వాహనదారులే భరించాలి. అదికాకుండా కచ్చితంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్లేటుకు సంబంధించి హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాల్సిందే. గతంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉన్నవారు కూడా మళ్లీ రెండోసారి ఖర్చు భరించాల్సి వస్తుంది. వెరసి ద్విచక్రవాహనదారులకు రూ.450 వరకు, కార్లకు అది మరో రూ.200 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ అవుతాయని సమాచారం. -
రెండో వాహనం ఉంటే పన్ను మినహాయింపు?
ఇప్పటికే వాహనం ఉండి.. మరో వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఇలా రెండో వాహనం కొనుగోలు చేసేవారిపై ప్రస్తుతం విధిస్తున్న అదనపు పన్ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేయడానికి సిద్ధపడుతోంది. ప్రస్తుతం ఒక వాహనం కలిగి ఉన్న వ్యక్తి తన పేరుతోనే రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనపు పన్ను భారం మోయాల్సి వస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో సాధారణంగా వసూలు చేసే జీవిత కాల పన్నుతోపాటు మరో 2 శాతం పన్నును రవాణా శాఖ వసూలు చేస్తోంది. అయితే కొందరు యజమానులు వాహనాలు అమ్మేసినా కొనుగోలుదారులు పేరు మార్పించుకోకపోవడం వల్ల పాత యజమానులే అదనపు భారం భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరికొందరు అదనపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ముందు జాగ్రత్తగా తొలి వాహనాన్ని కుటుంబ సభ్యుల్లో మరొకరి పేరిట బదిలీ చేయించిన తర్వాత రెండో వాహనం కొనుగోలు చేస్తున్నారు. ఇంకా కొందరు అసలు గతంలో తమకు వాహనం లేదని బుకాయించడం.. అధికారులు ధ్రువీకరించుకోలేక ఇబ్బంది పడటం జరుగుతోంది. దీనిపై పరిష్కారమార్గాలను అన్వేషించిన అధికారులు.. రెండో వాహనం పన్ను ఎత్తివేత సరైందనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించనున్నారు. -
వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండిలా
పాలకోడేరు రూరల్ :వాహనాలను కొనుగోలు చేసిన వారు విధిగా రిజస్ట్రేషన్ చేయించుకోవాలి. వాహన కంపెనీ డీలర్ నుంచి టీఆర్ తీసుకున్న 30 రోజుల్లో పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు భీమవరం ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్డీవో) జె.రమేష్‌కువూర్. రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం, తదితర వివరాలు ఆయన మాటల్లోనే.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) వాహనం కొనుగోలు చేసినప్పుడు సదరు వాహన కంపెనీ డీలర్ తాత్కాలిక రిజస్ట్రేషన్ (టీఆర్) నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌తో ఉండే రిజస్ట్రేషన్ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. 30 రోజుల్లోపు వాహనానికి పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోవాలి. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందండిలా పర్మినెంట్ రిజస్ట్రేషన్ కోసం సమీపంలోని ప్రాంతీయు రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వాహనానికి సంబంధించి డీలర్ ఇచ్చిన పత్రాల కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనం అయితే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, హెల్మెట్ బిల్లు జత చేయాలి. కారు యజమాని అయితే ఆధార్, పాన్ కార్డు కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనానికి అయితే రూ.445, ఆటోకు రూ.350, కారుకు రూ.635, ట్రాక్టర్‌కు రూ.700, లారీకి రూ.900, ఇతర మినీ లారీలకు రూ.625 చొప్పున చలానా రూపంలో చెల్లించాలి. అనంతరం దరఖాస్తును ఆర్టీవో సిబ్బంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) విభాగానికి పంపిస్తారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం.. హెచ్ఎస్ఆర్పీ విభాగం దరఖాస్తును పరిశీలించి అదే రోజున పర్మినెంట్ నంబర్ కేటాయించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) ఇస్తుంది. ఈ నంబర్ ప్లేట్ కోసం ద్విచక్ర వాహనానికైతే రూ.245, నాలుగు చక్రాల వాహనాలకైతే రూ.630 రుసుము వసూలు చేస్తారు. అనంతరం వాహనాన్ని పరిశీలన కోసం రిజస్ట్రేషన్ దరఖాస్తును అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)కి పంపిస్తారు. ఏఎంవీఐ ఆ వాహనాన్ని పరిశీలిస్తారు. డీలర్ ఇచ్చిన పత్రాల్లోని వివరాల ఆధారంగా వాహనం మోడల్, ఛాసిస్ నంబర్, ఇంజిన్, వాడే ఇంధనం తదితర అన్ని వివరాలను పరిశీలిస్తారు. ఫారం-21 ప్రకారం అన్నీ పరిశీలించి.. వివరాలన్నీ సక్రమంగా ఉంటే ఆమోదం తెలియజేస్తారు. అనంతరం దరఖాస్తును ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయినట్టే. అనంతరం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (ఆర్సీ) వివరాలు పొందుపర్చిన కార్డును దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లో పోస్టు ద్వారా వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఆర్సీ కార్డులో వాహనం రకం, మోడల్, వాడే ఇంధనం, రంగు, యూజవూని పేరు, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. రిజస్ట్రేషన్ చేయించకపోతే.. వాహనం కొనుగోలు సవుయుంలో ఇచ్చే తాత్కాలిక రిజస్ట్రేషన్ గడువు 30 రోజుల్లోపు పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే తనిఖీల సమయంలో వాహనాన్ని సీజ్ చేస్తారు. వాహన యజమానికి జరిమానా కూడా విధిస్తారు. ద్విచక్ర వాహనమైతే రూ.2 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
ఆన్లైన్ వాహన రిజిస్ట్రేషన్ ప్రారంభం
సీతమ్మధార: ఆన్ లైన్ లో వాహనాల రిజిస్ర్టేషన్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. విశాఖ నగరంలోని సిరిపురంలో గల వరుణ్ మోటార్స్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రిటైర్డు హెడ్మాస్టర్ ఈశ్వర శర్మ, శాంతి దంపతులు కొనుగోలు చేసిన వ్యాగన్ ఆర్ వాహనానికి అధికారులు అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సేవలతో వాహనం ఎక్కడ కొంటే అక్కడే రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు వీలుంటుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జూన్ నుంచి ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ , ఫిట్ నెస్ సర్టిఫికెట్ లను కూడా ఆర్టీవో కార్యాలయం వద్దకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ట్రాన్స్ పోర్టు కమిషనర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
ఎక్కడ..ఎవరికి..ఎలా..!
వాహనాల స్టాంపు డ్యూటీపై గందరగోళం ఆర్టీఏ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయం కరువు రుణప్రాతిపదికన వాహనాలు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు వాహనాల రిజిస్ట్రేషన్లలో జాప్యం సిటీబ్యూరో: ఫైనాన్స్ వాహనాలపై 0.5 శాతం చొప్పున ప్రభుత్వం విధించిన స్టాంపు డ్యూటీపై గందరగోళం నెలకొంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసి నెలరోజులు గడుస్తున్నా జీవో అమలుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు రవాణాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగాల మధ్య సమన్వయకొరవడడంతో స్టాంపు డ్యూటీ ఎక్కడ చెల్లించాలి, ఎవరికి చెల్లించాలో తెలియని సందిగ్థత నెలకొంది. స్టాంపు డ్యూటీ చెల్లించినట్లుగా ఆధారం ఉంటే తప్ప వాహనాలు నమోదు చేయడం సాధ్యం కాదని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎక్కడ చె ల్లించాలి, ఏ విధంగా చెల్లించాలో తెలియక వాహనదారులు అయోమయానికి లోనవుతున్నారు. వాహన రుణాలపై ఫైనాన్షియర్లు, వాహనదారులకు మధ్య కుదిరిన రుణ ఒప్పందం మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి చేరేవిధంగా ప్రతి వాహనంపైన 0.5 శాతం చొప్పున స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.బ్యాంకులు, సహకార సంస్థలు తదితర పెద్ద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు సక్రమంగానే జరుగుతున్నా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఫైనాన్షియర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ జీవో ప్రకారం 0.5 శాతం చొప్పున ద్విచక్ర వాహనాలపైన రూ. 250 వరకు, కార్లు, ఇతర వాహనాలపైన రూ. 1500 నుంచి రూ.2500 వరకు వాహన ఖరీదు, తీసుకున్న రుణానికి అనుగుణంగా స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. గ్రేటర్‌లోని 10 ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజూ 1000 నుంచి 1200 వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. మరో 500 వాహనాలు రుణ ప్రాతిపదికన చేతులు మారుతున్నాయి. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫారమ్ 34 సమర్పించడానికి ముందు తప్పనిసరిగా వాహనయజమానికి, రుణదాతకు మధ్య కుదిరిన ఒప్పందంపై 0.5 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాలి. అవగాహన లేమితోనే అసలు సమస్య... వాహనాల హైపొతికేషన్, లీజ్ అగ్రిమెంట్, తదితర అంశాలపైన కుదుర్చుకొనే ఒప్పందాలపై స్టాంపు డ్యూటీ చెల్లించాలనే అంశం మోటారు వాహన చట్టాల్లోనే ఉంది. బ్యాంకులు, బడా ఫైనాన్స్ సంస్థలు ఈ మేరకు ముందస్తుగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగానికి కొంత మొత్తాన్ని చెల్లించి ఫ్రాంకిన్ మిషన్లను వినియోగిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని చిన్న ఫైనాన్షియర్లు జరిపే క్రయవిక్రయాల్లో ఇది వసూలు కాకపోవడంతో ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. అయితే స్టాంపు డ్యూటీని ఆర్టీఏలో తీసుకోవడం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఖాతాలో జమ అయ్యేటట్లుగా ఆధారం ఉంటేనే వాహనం రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నారు. ఈ చెల్లింపులకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఆర్టీఏ కేంద్రా ల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు, లేదా ఈ సేవా కేంద్రాల నుంచి స్వీకరించడం వంటి ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఫైనాన్షియర్లు ఫ్రాంకిన్ మిషన్లు వినియోగిస్తున్నప్పటికీ అవి ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్రతో ఉండడం వల్ల ఆర్టీఏ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్లపైన జాప్యం నెలకొంటోంది. రవాణా అధికారులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల విభాగం అధికారులు కలిసి సమావేశమై ఒక అంగీకారానికి వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
వాహనాల రిజిస్ట్రేషన్ ఇక ప్రైవేట్‌కు ?
కొనుగోలు చేసిన చోటే రిజిస్ట్రేషన్ హైసెక్యూరిటీ నెంబర్ప్లేట్లు కూడా అక్కడే ఆటో మొబైల్ షోరూమ్‌లకు అప్పగింత హైదరాబాద్ : బండి కొన్న చోటే శాశ్వత రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేస్తోంది. వాహనదారులు పదే పదే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త వాహనాలకు సంబంధించిన పౌరసేవలన్నీ ఒకే చోట లభించేలా వాహనాల రిజిస్ట్రేషన్లను ఆటోమొబైల్ డీలర్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఇటీవల నగరంలోని ద్విచక్ర వాహన డీలర్లు, కార్ల డీలర్లతో రవాణాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలోనూ ఇదే అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్లను వచ్చే జనవరి నుంచి ఆటోమొబైల్ డీలర్లకు అప్పగించాలని ఏపీ రవాణాశాఖ నిర్ణయించిన దృష్ట్యా అదే పద్ధతిని ఇక్కడ కూడా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కమిషనర్ ఈ అంశంపై డీలర్లతో చర్చలు జరిపిన ట్లు తెలిసింది. ప్రస్తుతం పంజాబ్, మహారాష్ట్ర, రాజస్తాన్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో షోరూమ్‌ల వద్దే వాహనదారులకు అన్ని రకాల పౌరసేవలను అందజేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో తెలంగాణలోనూ అదే పద్ధతిని ప్రవేశ పెట్టడం వల్ల వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందని డీలర్లు ఈ సందర్భంగా కమిషనర్‌కు చెప్పారు. పైగా కొత్త వాహనాల విషయంలో మోటారు వాహన తనిఖీ అధికారులు ప్రత్యేకంగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం ఇంజిన్, చాసిస్ నెంబర్ల నమోదు కోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయడంలో అర్థం లేని పని అనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)లు మాత్రమే షోరూమ్‌లలో జరుగుతుండగా శాశ్వత రిజిస్ట్రేషన్లు కూడా త్వరలోనే షోరూమ్‌లకు బదిలీకానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 1000 నుంచి 1500 ద్విచక్ర వాహనాలు, 200 నుంచి 300 వరకు కార్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. నగరంలోని ఖైరతాబాద్‌తో పాటు, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, మెహిదీపట్నం, బహదూర్‌పురా, అత్తాపూర్, కూకట్పల్లి, మేడ్చల్, ఇబ్రహీంపట్నం తదితర కార్యాలయాల్లో వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ సేవలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో వీటిని ప్రైవేటీకరించడం ద్వారా నగరంలోని 50 ఆటో మొబైల్ కార్ల షోరూమ్‌లు, మరో 200 ద్విచక్ర వాహనాల షోరూమ్‌ల వద్ద వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయం లభిస్తుంది. నెంబర్ప్లేట్లు కూడా ... రిజిస్ట్రేషన్లతో పాటు వాహనదారులు తమకు నచ్చిన నెంబర్లను కూడా షోరూమ్‌లలోనే ఎంపిక చేసుకోవచ్చు. అదృష్ట సంఖ్యలు, ఫ్యాన్సీ నెంబర్లకు నగరంలో అనూహ్యమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. వీటి కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి రవాణాశాఖ అధికారులు వేలం పాట నిర్వహించి విక్రయిస్తున్నారు. షోరూమ్‌లలోనే నెంబర్లు ఎంపిక చేసుకొనే అవకాశంతో పాటు, హై సెక్యూరిటీ నెంబర్ప్లేట్లు కూడా అక్కడే అమర్చేలా పౌరసేవలను వికేంద్రీకరించాలని రవాణాశాఖ భావిస్తోంది. మరింత దోచుకుంటారు... శాశ్వత రిజిస్ట్రేషన్లను షోరూమ్‌లకు అప్పగించే ప్రతిపాదనకు ఆర్టీఏ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే రూ.100 రుసుముతో అందజేయాల్సిన తాత్కాలిక రిజిస్ట్రేషన్ సేవలను రూ.500 చొప్పున , హ్యాండ్లింగ్ చార్జీల పేరిట వాహనదారుల నుంచి రూ.3000 నుంచి రూ.5000 వరకు డీలర్లు అదనంగా వసూలు చేస్తూ వాహనదారులను దోచుకుంటున్న పరిస్థితుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్లను కూడా వారికే కట్టబెట్టడం వల్ల ఈ దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీఏ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
హెల్మెట్‌పై ఆర్టీఏ వినూత్న ప్రచారం
గులాబీలతో నిరసన స్వాగతం శిరస్త్రాణం వినియోగంపై వాహనదారులకు అవగాహన సాక్షి,సిటీబ్యూరో : హెల్మెట్ వాడకంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు రవాణాశాఖ వినూత్న ప్రచారం చేపట్టింది. హెల్మెట్ ధరించకుండా ఆర్టీఏ కార్యాలయాల్లోకి వచ్చే వారికి గాంధీగిరి తరహాలో గులాబీలతో నిరసన స్వాగతం పలికింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలను అందజేశారు. హెల్మెట్‌తో వచ్చిన వారికి అభినందనలు తెలిపారు. అలాగే వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను అందజేశారు. రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకపోవడంతోనే మృత్యువాత పడ్డారని జేటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకొనేవారు వాహనంతో పాటు హెల్మెట్ కూడా తీసుకోవాలని రఘునాథ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, దశరథం పాల్గొన్నారు. కాగా, ఖైరతాబాద్‌తో పాటు సికింద్రాబాద్, మలక్‌పేట, ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్ తదితర ఆర్టీఏ కార్యాలయాల్లోను హెల్మెట్‌పై అవగాహన కోసం అధికారులు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 18 నుంచి హెల్మెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ హెల్మెట్‌పై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న ఆర్టీఏ అధికారులు ఈ నెల 18 నుంచి హెల్మెట్ లేకుండా వచ్చే వాహనదారులను ఆర్టీఏ కార్యాలయాల్లోకి అనుమతించకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. హెల్మెట్ ధరించని వారికి వాహన రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర పౌరసేవలను కూడా అందజేయబోమని జేటీసీ స్పష్టం చేశారు. -
ఫొటోతో వాహన రిజిస్ట్రేషన్
ఆర్సీ కార్డుపై యజమాని ఫొటో ముద్రణ * వాహన నేరాలకు కళ్లెం వేసే దిశగా చర్యలు * రవాణాశాఖ కసరత్తు * పాత వాహనాలకూ అమలు! * నేడు ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి * రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. సాక్షి, హైదరాబాద్: వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక నుంచి యజమాని ఫొటో తప్పనిసరి. ‘వాహన నేరాల’కు కళ్లెం వేసేందుకు వాహనాల ఆర్సీ(రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) కార్డుపై యజమాని ఫొటోను కూడా ముద్రించనున్నారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. బుధవారం నుంచి ఇది రాష్ట్రవ్యాప్తం గా అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించే విషయంలో గందరగోళం నెలకొం టోంది. వాహనం నడుపుతూ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి- ఆ వాహనానికి సంబంధమే ఉండడం లేదు. దానిపై చలానాలు విధించినప్పుడు తాను ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదని అసలు యజమానులు పేర్కొంటున్నారు. డ్రైవర్-వాహన యజమాని ఒక్కరా కాదా అనే విషయంలోనూ అధికారులకు స్పష్టత ఉండడం లేదు. ఇక ఒకే నంబర్‌తో రెండుమూడు వాహనాలు ఉంటున్నాయి. కారుకు, ద్విచక్రవాహనానికి కూడా ఒకే నంబరు ఉంటున్న దాఖలాలున్నాయి. వీటితోపాటు తప్పుడు రిజిస్ట్రేషన్లు, దొంగ వాహనాలను మరొకరి పేర తప్పుడు పత్రాలతో బదిలీ చేయడం, అసలు యజమాని ప్రమేయం లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకు రుణాలు పొందడం వంటి ఘటనలు ఎక్కువైన నేపథ్యంలో పోలీసు, రవాణా శాఖలు దీనిపై దృష్టిసారించాయి. అందులో భాగంగానే ఈ కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక ఇప్పటికే రిజిస్ట్రేషన్ జరిగిన పాత వాహనాలను కూడా దశలవారీగా ఈ కొత్త విధానం పరిధిలోకి తేనున్నట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఫొటో జతచేసే డ్రైవ్ చేపట్టడం లేదని, ఏదైనా ప్రక్రియ కోసం రవాణాశాఖకు వచ్చినప్పుడు ఫొటోను జతచేసే పని చేపడతామని ఆయన చెప్పారు. ఆర్టీఏలో హెల్మెట్ తప్పనిసరి..! రక్షణశాఖ కార్యాలయ ప్రాంగణానికి వెళ్లేప్పుడు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. తాజాగా రవాణాశాఖ కూడా ఇదే విధానా న్ని అమలు చేయబోతోంది. అప్పట్లో హెల్మెట్ల వాడకాన్ని తప్పనిసరి చేయడంపై వ్యతిరేకత రా వడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. అయితే వాహనాలతో ముడిపడిన కార్యాలయ ప్రాంగణంలోకి ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలనే ఆ నిబంధనను తప్పనిసరి చేయాలని రవాణాశాఖ భావిస్తోంది. దీనిపై త్వరలో ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. -
బ్రోకర్లకు అడ్డుకట్ట
రవాణాలో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం జూలై నుంచి అమలుకు ప్రయత్నాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్ల రద్దు వాహన యజమానులకు ఊరట మర్రిపాలెం : వాహన యజమానులకు ఊరట లభించనుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పుకు సిద్ధమవుతోంది. కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్ల రద్దు నిర్ణ యం త్వరలో ప్రకటించనుంది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరుకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలులోకి రానున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాహనం కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం యజమానులు బోలెడంత ప్రయాసపడతారు. రద్దీ రోజులు, శుభ దినాలలో కౌంటర్ల వద్ద కిక్కిరిసిపోతారు. క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉంటారు. ఇదే అదునుగా భావిస్తోన్న బ్రోకర్లు జేబులు నింపుకుంటున్నారు. వాహన షోరూమ్ యాజమాన్యాలతో కుమ్మక్కై వాహన యజమానుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా వాహన యజమాని రిజిస్ట్రేషన్ చేసుకునేలా రవాణా శాఖ సిద్ధపడింది. యజమాని రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి చొరవ చూపనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా...! వివిధ కంపెనీల షోరూమ్‌లకు వచ్చే స్టాక్‌ను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరిశీలిస్తారు. ప్రతీ వాహనం ఇంజన్, చాసిక్ నంబర్లు నమోదు చేసుకుంటారు. వాహనాల వివరాలు రవాణా కార్యాలయంలో పొందుపరుస్తారు. వాహనం కొనుగోలు సమయంలో యజమాని చిరునామా, గుర్తింపు, ఆధార్ పత్రాలు షోరూమ్‌లో స్వీకరిస్తారు. యజమాని సంతకం కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ను అదే రోజు అందచేస్తారు. షోరూమ్‌లలో వాహనాల అమ్మకాలను బట్టి ప్రతీ రోజు ఫైళ్లను రవాణా కార్యాలయానికి చేరవేస్తారు. యజమాని వివరాలు, పత్రాలు సరిపోల్చి రిజిస్ట్రేషన్ కార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. ఒకవేళ యజమాని పేరుతో మరో వాహన ఉన్నట్టుగా తేలితే అదనంగా టాక్స్ చెల్లించాలి. అటువంటి సమాచారం షోరూమ్‌కు అక్కడి నుంచి వాహన యజమానికి తెలియజేస్తారు. యజమానులకు ఊరట... షోరూమ్‌లలో శాశ్వత రిజిస్ట్రేషన్ జరపడంతో యజమానులు సేద తీరుతారు. బ్రోకర్ల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రవాణా శాఖ తెలియజేసిన ధరలు షోరూమ్‌లలో చెల్లించడంతో లాభపడతారు. శాశ్వత రిజిస్ట్రేషన్ల బాధ్యతలు షోరూమ్‌లకు అప్పగించడంతో యజమానులు రవాణా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. యధావిధిగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు...! రిజిస్ట్రేషన్‌కు ముందుగా వాహనం యజమాని ఫ్యాన్సీ నంబర్లు బుకింగ్ జరుపుకోవచ్చు. రవాణా శాఖ నిర్ధేశించిన నంబర్లకు డీడీ చెల్లించి పొందవచ్చు. ఆన్లైన్లో నంబర్ వివరాలు ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. షోరూమ్‌లో వాహనం కొనుగోలు సమయంలో రిజర్వేషన్ కేటగిరీలో నంబర్ ఫీడింగ్తో రిజిస్ట్రేషన్ అవుతుంది. సాధారణ నంబర్ పొందగోరు వారికి సీరియల్ ప్రకారం ఆన్లైన్లో కేటాయిస్తారు. -
‘మొదటి’కే మోసం...
♦ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లో గందరగోళం ♦ పేర్ల నమోదులో లోపించిన శాస్త్రీయత ♦ ఏ రెండు పేర్లు కలిసినా తప్పని ఇబ్బందులు ♦ ముప్పుతిప్పలు పెడుతున్న ఆర్టీఏ అధికారులు ♦ ‘సాంకేతిక వైఫల్యం’ సాకు.. సాక్షి,సిటీబ్యూరో : రాంనగర్‌కు చెందిన కల్లూరి వసంత... తాను కొత్తగా కొనుగోలు చేసిన మారుతి స్విఫ్ట్ డిజైర్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే ఆమె పేరిట ఒక ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉందని, తాజాగా రెండో వాహనం (కారు) రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే రెండు శాతం జీవితకాల పన్ను అదనంగా చెల్లించాలని అధికారులు సెలవిచ్చారు. దాంతో ఆమె విస్మయానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయలేదని, ఇదే మొట్టమొదటి వాహనమని చెప్పారు. కానీ ఆర్టీఏ అధికారులు అంగీకరించలేదు. గతంలో తనకు ఎలాంటి వాహనాలు లేవని స్వతహాగా నిరూపించుకొంటే తప్ప అదనపు పన్ను రద్దు చేయబోమన్నారు. ఇంకేముంది. 2 నెలల పాటు నగరంలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో వడపోసి బహదూర్‌పురాకు చెందిన తన లాంటి పేరే ఉన్న మరో మహిళ కు హోండా యాక్టివా ఉన్నట్లు నిరూపించారు. అలా ఆమె ఎంతో సంతోషంగా కొనుక్కొన్న కారు రిజిస్ట్రేషన్ కావడానికి ఏకంగా 2 నెలలు పట్టింది. ఇది ఒక్క వసంత సమస్య కాదు. నగరంలోని వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య.కంఫ్యూటర్లో వాహనదారుల వివరాలను నమోదు చేయడంలోని అశాస్త్రీయత, అసమగ్రత, సాంకేతిక లోపాల కారణంగా ఒకే తరహా ఇంటిపేర్లు, వ్యక్తుల పేర్లు ఉన్న వాహనదారుల పాలిట ‘ సెకెండ్ వెహికిల్’ ఒక వేధింపుగా మారింది. ఎందుకిలా... మోటారు వాహన చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉంటే రెండో వాహనం ఖరీదులో ద్విచక్రవాహనం అయితే 5 శాతం, కారు అయితే 2 శాతం చొప్పున జీవితకాలపన్ను చెల్లించాలి. కానీ కొంతమందికి మొదటి వెహికిల్ లేకపోయినప్పటికీ కొత్తగా కొనుగోలు చేసిన దాన్ని సెకెండ్ వెిహ కిల్‌గా పరిగణించి పన్ను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు ఆర్టీఏ అధికారులు ఆన్లైన్లో నమోదైన వివరాలను ఆధారంగా చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు సుమారు 1500 వాహనాలు రిజిస్ట్రేషన్ అయితే, వాటిలో 25 శాతం వాహనాలపై వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 2009 నుంచి 2013 వరకు దశలవారీగా ప్రవేశపెట్టిన త్రీటైర్ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా తలెత్తిన దుష్ఫలితం ఇది. టూటైర్ సాంకేతిక పరిజ్ఞానం నుంచి టూటైర్లోకి మారుతున్న దశలో వాహనాల వివరాలను శాస్త్రీయంగా న మోదు చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఒకే పేరు ఉన్న ఇద్దరు వ్యక్తులు వాహనాల రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తోంది. ఆనంద్‌నగర్‌కు చెందిన ఒక వాహనదారుడు కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్‌కు వెళ్లాడు. అప్పటికే ఒక వాహనం అతని పేరిట ఉన్నట్లు అధికారులు యదావిధిగా చెప్పారు. నల్గొండలోని రామన్నపేటకు చెందిన తన ఇంటిపేరే కలిగిన మరో వ్యక్తి వివరాలను సేకరించి తెస్తే తప్ప అధికారులు అతని వాహనం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏజెంట్లు, దళారులను ఆశ్రయించి వచ్చే వారికి మాత్రం మినహాయింపు లభించడం కొసమెరుపు... -
ఆధార్ అంతంతే..
ప్రభుత్వం మాట మాట్లాడితే చాలు ప్రతి పనికి ఆధార్ అనుసంధానం అంటుంది. రేషన్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్, పింఛన్లు, ఇలా వివిధ అంశాలకు ఆధార్ అనుసంధానం వేగవంతంగా పూర్తిచేసినా వాహనాల విషయానికొచ్చేసరికి అధికారులకు తిప్పలు తప్పడం లేదు. ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు వాహనదారులు ముందుకు రావడం లేదు. వాహనం ఉందంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోననే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. సాక్షి, కడప: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఆధార్ అనుసంధానానికి ఆశించిన స్పందన లభించడం లేదు. గత నవంబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టినా ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. కృష్ణా జిల్లాలోని గుడివాడ, కర్నూలు జిల్లాలోని నంద్యాలను ముందుగా పెలైట్ ప్రాజెక్టుగా తీసుకుని ఉద్యమంలా అనుసంధాన కార్యక్రమం చేపట్టినా.. ఆ రెండు ప్రాంతాలతోపాటు మిగతా జిల్లాల్లోనూ అనుసంధాన కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. ఆధార్ అనుసంధానానికి సంబంధించి మిగతా అన్ని కార్యక్రమాలకు ప్రజలు సహకరించినా వాహన రిజిస్ట్రేషన్ అనుసంధానానికి మాత్రం వాహనదారుల సహకారం కరువవుతోంది. ప్రభుత్వం ప్రజల్లో ఉన్న భయాందోళనలు,.అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు దీనిపై ప్రచారం కల్పించి ఉంటే వాహనదారుల నుంచి మంచి స్పందన లభించేదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా పెట్రోలు బంకుల వద్ద అనుసంధానానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా వాహనదారులు తమకు అవసరం లేదంటూ కరాఖండిగా చెప్పి వెళ్లిపోతున్నారు. సగం కూడా పూర్తికాని అనుసంధానం.. రాష్ట్రంలో రవాణాశాఖకు సంబంధించి అధికారులు అనుసంధానం చేయాలని కృత నిశ్చయంతో పరుగులు పెడుతున్నా అనుకున్న లక్ష్యాలను సాధించడం కష్టంగా మారింది. కొంత సిబ్బంది కొరత కూడా జిల్లా రవాణాశాఖాధికారులను వేధిస్తోంది. నవంబరులో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ సగానికి సగం కూడా ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం అధికారులను కలవరపెడుతోంది. రాష్ర్టంలో ఇప్పటివరకు 30 శాతమే రాష్ట్రంలో వాహన లెసైన్స్‌లు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి రవాణాశాఖ ప్రత్యేకంగా చేపట్టిన ఆధార్ అనుసంధానం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు అనంతపురం జిల్లా 41.33 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, విశాఖపట్టణం 14.38 శాతంతో ఆఖరు స్థానంలో ఉంది. వైఎస్సార్ జిల్లాలో మొత్తం లెసైన్సులు 6 లక్షల 69 వేల 833 ఉండగా 1 లక్ష 88వేల 635 ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. వాహనదారుల్లో అనుమానాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేకంగా వాహనదారుల్లో అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి ప్రచారం చేసినా ప్రజల్లో మాత్రం భయాందోళనలు తొలగడం లేదు. అధికారులు చెబుతున్నా....రేపు ఇబ్బంది జరిగితే ఎవరికి చెప్పుకోవాలని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వాహన రిజిస్ట్రేషన్ ఆధారంగా అనుసంధానం చేయడంతో తద్వారా పేరు, ఊరు, వాహన వివరాలు నమోదు కావడంతో ప్రభుత్వం ఏదో ఒక సాకు చూపి అసలుకే ఎసరు పెడుతుందని పలువురు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ప్రధానంగా రేషన్‌కార్డులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సబ్సిడీల్లో కోత, ఇళ్ల మంజూరు, రుణాలు, ఇతర పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ వాహనాల ఆధార్ అనుసంధానానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
నంబర్ ప్లేట్ కొంటేనే వాహన రిజిస్ట్రేషన్
హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల విషయంలో రవాణా శాఖ కొత్త మెలిక సాక్షి, హైదరాబాద్: హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) ప్రాజెక్టును నిర్బంధం చేశారు. అధికారికంగా ఎలాంటి ఆదేశాలు వెలువరించకుండానే అధికారులు దాని నిర్బంధ అమలును ప్రారంభించారు. ఇక నుంచి హెచ్ఎస్ఆర్పీ రుసుం చెల్లిస్తేనే వాహనం రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే తొలుత హెచ్ఎస్ఆర్పీ ధరను ఆ సంస్థ కౌంటర్లో చెల్లించాలి. దాని చెల్లింపు పూర్తయిందని ఆన్లైన్లో పరిశీలించి అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే వాహనం రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఈ నిర్ణయం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. హెచ్ఎస్ఆర్పీ విషయంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించకుండానే అధికారులు దాన్ని తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకి స్తున్నారు. ఢిల్లీలాంటి చోట్ల తక్కువ ధరకే ఈ ప్లేట్లను సరఫరా చేస్తుండగా, తెలంగాణలో ఎక్కువ ధర ఖరారు చేయడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ధరలిలా.. ద్విచక్ర వాహనాలు: రూ.245 ఆటోరిక్షాలు: రూ.252 కార్లు, తేలిక వాహనాలు: రూ.619 భారీ వాహనాలు: రూ.649 -
పార్కింగ్ స్థలం చూపితేనే వాహనం రిజిస్ట్రేషన్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన సాక్షి, ముంబై: ఇకపై యజమానులు పార్కింగ్ స్థలం చూపిస్తేనే వారి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని బొంబాయి హైకోర్టు సూచించింది. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు, రోడ్డు, ఫూట్‌పాత్‌పై ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ‘జనహిత్ మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు సూచనలు చేసింది. అస్తవ్యస్తమైన పార్కింగ్, నగరంలో పెరుగుతున్న వాహనాల సమస్యను ఎలా అధిగమిస్తారని న్యాయమూర్తులు నరేష్ పాటిల్, అజయ్ గడ్కరిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని, బీఎంసీని ప్రశ్నించింది. వచ్చే ఐదేళ్లకు మీ ప్రణాళిక ఏమిటని నిలదీసింది. రోడ్లపై కార్లను నిలపడాన్ని అనుమతించకూడదని ఆదేశించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ముంబైలోనే నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు గత ఐదేళ్లలో రూ.25 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది జస్బీర్ సలుజా కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ప్రభుత్వంపై మరింత మండిపడింది. ఇలా చేయడంవల్ల ప్రభుత్వ ఖజానాలో భారీగానే ధనం చేకూరుతుంది, కానీ రాకపోకలు సాగించే జనానికి తగినంత స్థలం లేకపోవడం వల్ల ప్రయోజనమేంటని కోర్టు నిలదీసింది. ప్రభుత్వం స్కైక్ వాక్‌లు నిర్మించిందని, కానీ వాటిని ప్రజలు వినియోగించడం లేదన్న న్యాయవాది వ్యాఖ్యలను కూడా కోర్టు తిరస్కరించింది. ‘‘మీరు నిర్మించిన స్కై వాక్‌లు ప్రణాళికాబద్ధంగా లేవు. వాటిపై లైట్లు లేనందున అవి మహిళలకు సురక్షింతం కావు. వృద్ధులు వాటిపైకి ఎక్కి, దిగలేరు’’ అని మందలించింది. ‘‘విదేశాల్లో వాహన యజమానులు బాటసారులను గౌరవిస్తారు. వారికి రోడ్డు దాటే అవకాశం ఇస్తారు. కాని మనదేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వాహన యజమానులను ఆదరిస్తారు’’ అని ధర్యాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థను మార్చాలంటే ముందు వాహన యజమానులు పార్కింగ్ స్థలం చూపించాలి. ఆ తరువాతే ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ పనులు జరగాలి. అప్పుడే నగరంలో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పడతాయని కోర్టు అభిప్రాయపడింది. -
13 నుంచి ఆర్టీఏ మొబైల్ గవర్నెన్స్ ప్రారంభం
హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌరసేవలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, వాటికి కేటాయించిన నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా వాహనదారులకు అందజేసే సరికొత్త మొబైల్ గవర్నెన్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. వినియోగదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లవ లసి ఉంటుంది. ఆ వాహనానికి అధికారులు కేటాయించిన నంబర్ తదితర అంశాలను ఎస్సెమ్మెస్ రూపంలో చేరవేస్తారు. అంతేకాకుండా రవాణా వాహనాలు చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు, గడువు ముగిసిన పర్మిట్లు, వాహన బదలాయింపు, చిరునామా మార్పు వంటి అన్ని రకాల పౌరసేవలపై మొబైల్ సందేశాల ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, సకాలంలో పన్నులు చెల్లించకపోయినా రవాణా శాఖ నుంచి వాహనదారుడి సెల్‌ఫోన్‌కు హెచ్చరికలు అందుతాయి. మొదట కొత్త వాహనాలను మొబైల్ గవర్నెన్స్ పరిధిలోకి తెస్తారు. ఆ తరువాత పాత వాహనాలను కూడా దీని పరిధిలోకి తెచ్చేందుకు వాహనదారులు తమ మొబైల్ నంబర్లను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు. -
టీ సర్కారుకు హైకోర్టు అక్షింతలు
-
టీ సర్కారుకు హైకోర్టు అక్షింతలు
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రీరిజిస్ట్రేషన్ జరుగుతున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వాహనాల రీరిజిస్ట్రేషన్ చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న వాహనాలకు నెంబరు ప్లేట్లను 'టీఎస్' సిరీస్‌కు మారుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్డులు నోస్టాక్
తిమ్మాపూర్ : ప్రాంతీయ రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయాల్లో వాహన రిజిష్ట్రేషన్, డ్రైవింగ్ లెసైన్స్ కార్డులు కొరత ఏర్పడింది. ఒక్కో కార్యాలయంలో వేలాది కార్డులు జారీ చేయాల్సి ఉంది. జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయంతోపాటు పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల యూనిట్ కేంద్రాల్లో సుమారు 10వేలకు పైగా కార్డులు జారీ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క తిమ్మాపూర్ కార్యాలయంలోనే గతనెల 10 తేదీ నుంచి వాహన రిజిష్ట్రేషన్ కార్డులు, 21తేదీ నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌ల కార్డులు జారీకి నోచుకోలేదు. కార్యాలయంలో టీఎస్ 02 ఈఏ 3888 రిజిష్ట్రేషన్ వరకే కార్డులు జారీ అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం టీఎస్ 02 ఈబీ సీరిస్ మొదలవుతుంటే ఇప్పటివరకు సుమారు 6వేల కార్డులు జారీ కాలేదు. అలాగే లెసైన్స్ కార్డులు సైతం 1400 వరకు జారీ చేయాల్సి ఉంది. జిల్లాలో ఇలాంటి కార్డులు పది వేల వరకు ఉన్నా...ఎప్పుడు వస్తాయో తెలియదని ఉద్యోగులే చెబుతున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉందని అధికారులు సమాధానమిస్తున్నారు. చాలామంది కార్డుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడం లేదు. రోడ్లపై పోలీసులు విస్తృత స్థాయిలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఆర్టీఏ శాఖ నిర్లక్ష్యం కారణంగా వేలాది రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఆర్టీఏ కార్యాలయ రశీదు చూపిస్తే వదిలి పెట్టేలా ఎస్సైలు, సీఐలకు పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, రవాణాశాఖ అధికారులు స్పందించి కార్డులను త్వరగా జారీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
వాహన రిజిస్ట్రేషన్లపై గందరగోళం
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాల వారీగా కోడ్ నంబర్లు కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజులుగా జిల్లాలో కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఏపీ సిరీస్ టీఎస్ సిరీస్‌గా మారడంతో పాత వాహనదారులు అయోమయంలో పడ్డారు. టీఎస్ సిరీస్‌తో కొత్త రిజిస్ట్రేషన్లు సజావుగానే సాగుతున్నా పాత వాహనాల విషయంలోనే ఇంక స్పష్టత రాలేదు. ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను టీఎస్ సిరీస్‌తో మార్పు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి నాలుగు నెలలు మాత్రమే గడువు ఇచ్చింది. స్పష్టమైన విధివిధానాలేవి? పాత వాహనాల ఏపీ సిరీస్‌ను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా దీనిపై స్పష్టమైన విధి విధానాలు అందకపోవడంతో రవాణా శాఖ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. పాత వాహనాలన్నింటినీ నాలుగు నెలల్లోగా కొత్త సిరీస్‌లోకి మార్చుకునేందుకు గడువు ఇచ్చారు. పాత వాహనాల నంబర్ల మార్పు విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా.. నంబర్ ప్లేట్ మారితే కొత్త ఆర్సీ బుక్కుకు రుసుము ఉంటుందా.. నంబరు ప్లేటు మార్చుకొని కొత్త నంబరు ప్లేటు తీసుకుంటే అయ్యే ఖర్చు ఎవరు భరించాలి..? అనే విషయాలపై అధికారులకు ఇంక స్పష్ట మైన ఆదేశాలు రాలేదు. దీంతో పాత వాహనాల నంబర్లు మార్చుకునేందుకు వస్తున్న వాహనదారులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. పాత వాహనాల నంబర్ల మార్పుపై తమకేలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా... జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో సుమారు 300ల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఫ్యాన్సీ నంబర్లపై 20 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలకు టీఎస్ 01 యూఏ 0001, రవాణేతర వాహనాలకు టీఎస్ 01 ఈఏ0001 సంఖ్యతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక పాత వాహనాల విషయానికొస్తే జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,30,016 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ద్విచక్రవాహనాలు 95,437, ఆటోరిక్షాలు 7,780, గూడ్స్ క్యారేజ్‌లు 5,203, కార్లు 4,864, మోపెడ్లు 3, 714, ట్రాక్టర్లు(ప్రైవేట్ )2,554, ట్రాక్టర్లు కమర్షియల్ 2,134, జీపులు 575, మోటర్ క్యాబ్‌లు 1189 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఏపీ 01 సిరీస్ కోడ్‌పై కొనసాగుతుండగా, నాలుగు నెలల్లో టీఎస్‌గా మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. వాహనాల నంబ ర్లు కూడా మారుతుందనే ప్రచారం జరగడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచకపోవడంతో ప్రసుత్తం పాత వాహనాల చార్జీలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.400, కారులకు రూ. 625, మోటర్ క్యాబ్‌లకు రూ. 860, హెవీ గూడ్స్లకు రూ.1,360 చొప్పున రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి నెల రిజిస్ట్రేషన్లతో రూ.20 లక్షల ఆదాయం సహకూరుతోంది. -
వాహన రిజిస్ట్రేషన్లు షురూ
టీఎస్ 02 ఈఏ, ఈబీ, ఈసీ, ఈడీ సిరీస్‌లు - ఫ్యాన్సీ నెంబర్లకు పాత పద్ధతే - రిజర్వయిన 02 నంబర్లు - ఆర్టీవో దుర్గప్రమీల తిమ్మాపూర్ : జిల్లాలో కొత్త సిరీస్‌తో వాహన రిజిష్ట్రేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాకు 02 కోడ్‌ను కేటాయించడంతో టీఎస్02 పేర రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 02 ఈఏ సిరీస్‌తో మొదలు కాగా, జగిత్యాల ఆఫీసులో టీఎస్ 02 ఈబీ...తో, పెద్దపల్లి ఆఫీసులో టీఎస్ 02 ఈసీ...తో, కోరుట్ల ఆఫీసులో టీఎస్ 02 ఈడీ...తో నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిష్ట్రేషన్లు ప్రారంభించారు. జిల్లాలో ట్రాన్స్‌పోర్టు వాహనాలకు, మాక్సీ క్యాబ్‌లకు టీఎస్ 02 యూఏతో రిజిస్ట్రేషన్ మొదలుపెట్టారు. పోలీసు శాఖ వాహనాలకు టీఎస్ 02 పీ.., ఆర్టీసీ వాహనాలకు టీఎస్ 02 జెడ్...,ను కేటాయిస్తూ పాత నంబర్ల తర్వాతే నంబర్లను కేటాయించాలని ఉత్తర్వులో పేర్కొన్నట్లు ఆర్టీవో దుర్గప్రమీల తెలిపారు. 01 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.50వేలు చెల్లించాల్సి ఉండగా ఎవరూ తీసుకోలేదు. దీని తర్వాత 02 నంబర్ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల కేంద్రాల్లో రిజర్వేషన్ అయింది. కరీంనగర్లో టీఎస్ 02 ఈఏ 0002 నంబర్‌ను వరద శేషయ్య, జగిత్యాలలో టీఎస్ 02 ఈబీ 0002 నంబర్‌ను అర్చన, పెద్దపల్లిలో టీఎస్ 02 ఈసీ 0002 నంబర్‌ను బి.స్రవంతి రిజర్వు చేసుకున్నారు. అలాగే కరీంనగర్లో 06, 07 నంబర్లు రూ.పది వేలకు, 11 నంబర్ రూ.5వేలకు రిజర్వ్ అయ్యాయి. ట్రాన్స్‌పోర్టుకు సంబంధించి టీఎస్ 02 యూఏ 0002 నంబర్ అబ్దుల్ షకీల్‌కు కేటాయించినట్లు ఆర్టీవో తెలిపారు. టీఎస్ 02 ఈఏ 0333 నంబర్ గంగాధరకు చెందిన కొత్త జైపాల్‌రెడ్డి రూ.30వేలకు అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆమె తెలిపారు. నంబర్ రిజర్వేషన్ ప్రక్రియలో పాత పద్ధతినే పాటిస్తున్నామని పేర్కొన్నారు. -
ఇక టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుతో ఆరంభమైనట్లు రవాణాశాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం వాహనాల రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాజాగా ప్రభుత్వం టీఎస్ పేరుతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమైంది. అంతకుముందు ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని వివిధ జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ల కోడ్ల వివరాలు.. ఆదిలాబాద్ TS - 01, కరీంనగర్ - 02 వరంగల్ - 03, ఖమ్మం - 04, నల్లగొండ - 05 మహబూబ్‌నగర్ - 06, రంగారెడ్డి - 07, 08 హైదరాబాద్ - 09, 10, 11, 12, 13, 14 మెదక్ - 15, నిజామాబాద్ -16 ఆర్టీసీ వెహికల్స్‌కు TS Z, పోలీసు వాహనాలకు TS P 09 రవాణా వాహనాలకు... T,U,VW,X,Y సిరీస్‌లు వాడుతూ రిజిస్ట్రేషన్ -
జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయింపు
సంగారెడ్డి డివిజన్: మెదక్ జిల్లాకు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త సిరీస్‌ను కేటాయించింది. మెదక్ జిల్లాకు ఏపీ 23 స్థానంలో టీఎస్ 15 సిరీస్‌ను రవాణాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు గురువారం ఉ త్తర్వులు జారీ అయ్యాయి. గత కొన్ని రోజులుగా మెద క్ జిల్లా వాస్తులు, వాహనదారులు జిల్లాకు ఏ కోడ్ వ స్తుందోనని ఎదరుచూస్తున్నారు. వారి ఎదురుచూపుల కు సమాధానం దొరికింది. ఇకపై నూతన వాహనాల రిజిస్ట్రేషన్ జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో ప్రారంభం కా నున్నాయి. సోమవారం నుంచి కొత్త సిరీస్‌తో వాహనా ల రిజిష్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నా యి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2వతేదీ నుంచి జిల్లాలో తాత్కాలికంగా వాహనాల రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాకు కొత్త సిరీస్ కేటాయించాల్సి ఉన్నందున రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. జిల్లాలో ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతాయి. రవాణాశాఖ సంగారె డ్డి, సిద్దిపేట, పటాన్‌చెరులలో వాహనాల రిజిస్ట్రేషన్ చేస్తుంది. గత రెండు వారాలుగా జిల్లాలో సుమారు వెయ్యికిపైగా వాహనదారులు వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం జిల్లాకు టీఎస్ 15 సిరీస్ కేటాయించటంతో వాహనదారుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండు రోజుల్లో జిల్లాలో టీఎస్ 15 సిరీస్‌తో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులతోపాటు పాత వాహనదారులు సైతం రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఏపీ 23 స్థానే పాత వాహనదారులు తమ వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ 15 రిజిస్ట్రేషన్ సిరీస్ చేర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహారణకు జిల్లాకు చెందిన వాహనం ఏపీ 23 ఎఫ్ 5544 ఉంటే కొత్తగా వాహనం నెంబరు టీఎస్ 15 ఎఫ్ 5544 గా ఉంటుంది. సిరీస్ మారనున్న నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు నామమాత్ర ఫీజు వసూలు చేసే అవకాశం ఉంటుంది. పాత వామనదారులు రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చుకోవటంపై అధికారులు రెండు రోజుల్లో స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం డబ్బులు జమచేసిన వారికి టీఎస్ 15 సిరీస్‌తోనే ఫ్యాన్సీ నెంబరు కేటాయించవచ్చని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్సీ నెంబరు కోసం డబ్బులు జమచేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అధికారులు చెబుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త సీరీస్ పై స్పష్టత రావటంతో అధికారులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై అంశంపై దృష్టి సారించనున్నారు. -
టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
-
టీజీ కాదు.. టీఎస్ తోనే వాహనాల రిజిస్టేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఇకపై తెలంగాణ స్టేట్ (TS) పేరుపై జరుగుతాయని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. టీజీ పేరుతో కాకుండా టీఎస్ పేరుతో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని మహేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, తెలంగాణలో ఏపీ పేరుపై ఉన్న పాత వాహనాల నంబర్‌ప్లేట్ మార్చడానికి 4 నెలల గడువు ఇస్తున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మార్పు సమయంలో ప్రజలపై భారం పడకుండా చూస్తామని, తెలంగాణలో 70 లక్షలకు పైగా వాహనాలున్నాయని ఓ ప్రశ్నకు మహేందర్ రెడ్డి సమాధానమిచ్చారు. -
వాహన రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కొత్త సిరీస్‌పై తొలగని ప్రతిష్టంభన మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు సాక్షి, సిటీబ్యూరో: కొత్త సిరీస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నగరంలో సోమవారం కూడా వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ వాహనాల నమోదు ప్రక్రియకు బ్రేక్ పడింది. తెలంగాణ రాష్ట్రానికి ‘టీజీ’ సిరీస్ ఉంటుందని మొదట భావించినా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ‘టీజీ’కి బదులు ‘టీఎస్’ ఉండాలని సూచించడంతో రవాణా అధికారులు మరోసారి ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపారు. టీఎస్ సిరీస్‌ను కేటాయిస్తూ కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువడలేదు. దీంతో సోమవారం కొత్త వాహనాల నమోదుకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన సిరీస్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కోడ్లపైనా స్పష్టత రావలసి ఉంది. ఒకవేళ కేంద్రం నుంచి కొత్త సిరీస్‌పై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు వెలువడినా జిల్లా కోడ్లు, ప్రాంతీయ రవాణా కేంద్రాల నెంబర్ల రూపకల్పనకు కొంత సమయం పట్టొచ్చని రవాణా అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు రానిదే తాము అడుగు ముందుకు వేయలేమని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రోజు వెయ్యికిపైగా కొత్త వాహనాలు గ్రేటర్ పరిధిలోని పది ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వెయ్యికి పైగా కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వీటిలో 75 శాతం ద్విచక్ర వాహనాలే. కానీ రవాణాశాఖ సెంట్రల్ సర్వర్ నిలిపివేతతో గత నెల 31 నుంచే వాహనాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సోమవారం రెండు రాష్ట్రాల్లోనూ సెంట్రల్ సర్వర్ పునరుద్ధరణ జరిగింది. లర్నింగ్ లెసైన్స్‌లు, శాశ్వత డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల బదిలీ వంటి కార్యకలాపాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలకు సాంకేతిక పరిజ్ఞాన విస్తరణ జరిగినా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిరీస్‌పై స్పష్టత లేకపోవడం వల్ల నగరంలో వాహనాల నమోదు శాశ్వత నమోదు ఆగిపోయింది. మరోవైపు రాష్ర్ట అవతరణ ఉత్సవాల దృష్ట్యా పౌరసేవల కోసం వచ్చే వినియోగదారుల సంఖ్యా పలుచబడింది. -
టీఎస్ సిరీస్ కేటాయింపులో జాప్యం
ఇంకా అందని కేంద్ర ఉత్తర్వులు తెలంగాణలో కొత్త వాహనాలకు నంబర్లు పెండింగ్ అందుబాటులోకి రవాణా శాఖ వెబ్సైట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. వాహనాలకు కేటాయించే సిరీస్‌పై స్పష్టత రాని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణకు టీజీ సిరీస్ కేటాయిస్తూ నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే టీజీ బదులు టీఎస్(తెలంగాణ స్టేట్) సిరీస్‌ని కేటాయించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో ఈ మేరకు రవాణా శాఖ అధికారులు కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు పంపారు. దీంతో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కేం ద్రం.. కొత్త నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది. కానీ సోమవారం కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఇది వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపింది. ఇప్పటికే వాహనదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. నం బర్ల్ల కేటాయింపును మాత్రం పెండింగులో పెట్టారు. తాత్కాలికంగా టీఎస్ పేరుతో నంబర్లను సిద్ధం చేసుకున్నా.. ఆ సిరీస్ విషయంలో లిఖితపూర్వక ఉత్తర్వులు అందే వరకు కేటాయింపులు చేయకూడదని అధికారులు నిర్ణయించారు. ఇక తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖకు కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. అలాగే వెంకటేశ్వర్లు, పాండురంగారావులను జాయిం ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లుగా తెలంగాణకు కేటాయిం చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీనివాస్, సుధాకర్, ప్రసాదరావులను కేటాయించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయభవనం మొదటి అంతస్తును ఆంధ్రప్రదేశ్‌కి, రెండో అంతస్తును తెలంగాణ రాష్ట్రానికి, మూడో అంతస్తులోని తూర్పు భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, పశ్చిమ భాగాన్ని తెలంగాణకు కేటాయించారు. రవాణా శాఖ కార్యకలాపాలను ఈ-సేవతో అనుసంధానించడం, స్లాట్ బుకింగ్ కనెక్టివిటీ తదితర సౌకర్యాలను రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఏర్పాటు చేశారు. -
కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్..!
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వాహనాల రిజిస్ట్రేషన్, సిరీస్ నంబర్లు మారనున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబరు ఏపీతో మొదలయ్యేది. ఆదిలాబాద్ జిల్లా పేరు ఇంగ్లిషు అక్షరం ‘ఏ’తో ప్రారంభం కావడంతో, ఇంగ్లిష్ అక్షరమాలలో ‘ఏ’ మొదటిది కావడంతో మన జిల్లాకు ఏపీ 01 అనే సిరీస్‌తో ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే ఉండడంతో, ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయాయి. రాష్ట్ర రవాణాశాఖ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు రెండు రాష్ట్రాల్లో వేరు వేరుగా నిర్వహించనున్నాయి. తెలంగాణలోని జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ ‘టీజీ’తో మొదలయ్యే అవకాశాలు ఉండడంతో, ‘టీజీ 01’ అనే మొదటి సిరీస్ నంబరును మన జిల్లాకే కేటాయించనున్నట్లు సమాచారం. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల మార్పుతో మరో రెండు, మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాత వాహనాలకు మారని సిరీస్ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జిల్లా వాహనదారులకు ఇప్పటివరకు ఏపీ 01 సిరీస్ కేటాయిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఏపీ సిరీస్ నుంచి టీజీ సిరీస్‌కు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మారనున్నాయి. దీంతో ఇది వరకే ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారుల్లో గం దరగోళం నెలకొంది. పాత నంబర్ల ఆధారంగా నే ఇప్పటికే ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు(ఆర్సీ) వాహనదారులకు అందించారు. జిల్లాలో లక్షల సంఖ్యలో వాహనాలు పాత సిరీ స్(ఏపీ 01)తో ఉన్నాయని, ఆయా వాహనాల నంబర్లను మార్చడం కుదరదని, అపాయింటెడ్ డే వరకు రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు ఏపీ 01 అనే సిరీస్‌తోనే నంబర్లను ఇవ్వనున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనదారులు టీజీ సిరీ స్తో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు కావాలం టే, అపాయింటెడ్ డే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంలో కొత్త సిరీస్ నంబర్లతోనే వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాహనదారుల అభిప్రాయం. మంచిర్యాల జిల్లాగా మారితే! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాలు 10 ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలోనే ఏడు సిరీస్‌లు ఉన్నాయి. దీంతో తెలంగాణలోని 10 జిల్లాలకు 15 సిరీస్‌ల వరకు నంబర్లను కేటాయిస్తున్నారు. కొత్త జిల్లాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిర్యాల కూడా జిల్లాగా మారనుంది. దీంతో మంచిర్యాల జిల్లాకు ఏ నంబరు సిరీస్‌ను అందిస్తారోనని వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది. 01 నుంచి 15 వరకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు నంబర్లను కేటాయిస్తుండగా, కొత్తగా ఏర్పాటయ్యే మంచిర్యాలకు ఆ తరువాత నంబరును కేటాయిస్తారా? లేదంటే ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం మరోసారి సిరీస్‌లను క్రమబద్ధీకరిస్తారా? అనే విషయాలపై స్పష్టత లేదు. ఒకవేళ అక్షరమాల ప్రకారం నంబర్లను కేటాయిస్తే టీజీ 13 వచ్చే అవకాశం ఉందని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పడితే వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లు మారనుండడంతో, వాహనదారుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలను, తీసుకునే రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ అప్పాయింటెడ్ డే తరువాతే తీసుకోవాలన్న ఆలోచనలో వాహనదారులు ఉన్నారు. దీంతో వాహన కొనుగోళ్లు మందగించినట్లు సమాచారం. -
వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్
మార్కాపురం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని మోటారు వాహనాల శాఖ సిబ్బంది ఆగస్టు 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడంతో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు, నంబర్ కేటాయింపులు, లెసైన్సులు జారీ చేయకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రవాణాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలోని మార్కాపురం, దర్శి, చీరాల, కందుకూరు, ఒంగోలులోని కార్యాలయాల్లో ప్రతిరోజూ సగటున 80 బైకులు, 20 ఆటోలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. దీని ప్రకారం సగటున నెలకు 4 వేల కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్లవుతాయి. సమ్మె కారణంగా ఐదుగురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ స్క్వాడ్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు కార్యాలయాలకు రాకపోవడంతో తాళాలు వేశారు. మానవతా దృక్పథంతో ఎంవీఐలు నేషనల్ పర్మిట్లు ఉన్న లారీలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎంవీఐలు వచ్చి వాహనాల తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాన్ని హైదరాబాదు, తెలంగాణ జిల్లాలకు వెళ్లి అనేక వ్యయప్రయాసలకోర్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. లెసైన్స్ లేని వాహనాలకు పోలీసులు పెనాల్టీ విధిస్తే ఆ జరిమానా నగదు కూడా హైదరాబాదు వెళ్లి చెల్లించాల్సి వస్తోంది. మరో వైపు కొత్త లెసైన్స్‌ల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో లెసైన్సులు లేకుండా రోడ్డుపైకి వస్తే పోలీసుల వాహనాల తనిఖీల్లో పట్టుబడుతూ చలానాలు కట్టలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం ఎంవీఐ పరిధిలో నెలకు దాదాపు 500 వరకు ఎల్‌ఎల్‌ఆర్‌ల కోసం చలానాలు కడుతుంటారు. సుమారు 200 మంది డ్రైవింగ్ లెసైన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. సమ్మె కారణంగా కొత్త రిజిస్ట్రేషన్లు, వాహనాలకు బ్రేక్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ, ఎల్‌ఎల్‌ఆర్‌ల మంజూరు నిలిచిపోయింది.