బండి కొన్నా.. రోడ్డెక్కలేదు! | BS-3 Two Wheelers Registration problems | Sakshi
Sakshi News home page

బండి కొన్నా.. రోడ్డెక్కలేదు!

Published Wed, May 10 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

బండి కొన్నా.. రోడ్డెక్కలేదు!

బండి కొన్నా.. రోడ్డెక్కలేదు!

► రాష్ట్రంలో వెయ్యి ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ గల్లంతు!
►  బీఎస్‌–3 టూవీలర్ల అమ్మకాల్లో డీలర్ల దందా ఎఫెక్ట్‌
►  మార్చి 31 రాత్రి 12 తర్వాత విక్రయించిన ఫలితం
► అర్ధరాత్రి తర్వాత రవాణాశాఖ సర్వర్‌ అనుసంధానం బంద్‌
► అయినా వాహనాలు అంటగట్టిన డీలర్లు
► అవి రోడ్డెక్కితే భారీ పెనాల్టీలు విధిస్తున్న పోలీసులు
►  డీలర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు


సాక్షి, హైదరాబాద్‌: వాహనం కొన్నారు.. డబ్బులూ చెల్లించారు.. కానీ అసలు రిజిస్ట్రే షన్‌ అయ్యే పరిస్థితి లేదు.. తాత్కాలిక రిజిస్ట్రే షన్‌ కూడా కాలేదు..రోడ్డెక్కితే పోలీసులు పట్టుకుంటున్నారు.. వాటిని కొన్నవారు ఎటూ పాలుపోక తల పట్టుకుంటున్నారు.. తమ సమస్య పరిష్కరించాలంటూ రవాణా శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌–3) వాహనాల విక్రయానికి గడువు ముగిసే చివరి రోజున డీలర్ల దందా కారణంగా తలెత్తిన పరిస్థితి ఇది! వెయ్యి మంది దీనితో ఇబ్బందులు పడుతున్నారు.

అర్ధరాత్రి దాటాక విక్రయించిన ఫలితం
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 31 తర్వాత బీఎస్‌–3 వాహనాల అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలు బీఎస్‌–3 ప్రమాణాలతో ఉన్న ద్విచక్రవాహనాలను వదిలించుకునేందుకు ధరలు ఓ మోస్తరుగా తగ్గించి విక్రయించాయి. దీంతో చాలా మంది వాహనాలు కొనేందుకు ఎగబడ్డారు. రాష్ట్రంలో సాధారణంగా జరిగే విక్రయాల కన్నా.. మార్చి 31 రోజున 4 వేల ద్విచక్ర వాహనాలు అద నంగా అమ్ముడవడం గమనార్హం. 

సాధార ణంగా వాహనాన్ని అమ్మినప్పుడు డీలరే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ మేరకు వారికి రవాణాశాఖ సర్వర్‌తో ఆన్‌లైన్‌ అనుసంధానం అందుబాటులో ఉంటుంది. అయితే మార్చి 31 రాత్రి 12 కాగానే రవాణా శాఖ సర్వర్‌తో అనుసంధానం నిలిచిపోయింది. ఈ విషయం తెలిసి కూడా కొందరు డీలర్లు తెల్లవారే వరకూ వాహనాలను విక్రయించారు. అలా రాత్రి 12 తర్వాత విక్రయించిన దాదాపు వెయ్యి ద్విచక్ర వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ జరగలేదు.

దాంతో వాటికి పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్‌ జరిగే పరిస్థితి లేదు. దీంతో ఆందోళన చెందిన ఆ వాహనాలు కొన్నవారు డీలర్ల వద్దకు వెళ్తే.. సమస్య రవాణాశాఖ సర్వర్‌లో ఉందని, అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో వారంతా రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లగా.. రాత్రి 12 తర్వాత కొన్న వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఉండదని, అది డీలర్ల తప్పేనని, తామేమీ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఆ వాహనాలు కొన్నవారి పరిస్థితి గందరగోళంగా మారింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ కూడా లేకుండా వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేక వాటిని ఇళ్లలోనే ఉంచేస్తున్నారు.

తప్పు డీలర్లదే.. అయినా కేంద్రాన్ని అడిగాం..
‘‘మార్చి 31 అర్ధరాత్రి 12 తర్వాత కూడా కొందరు డీలర్లు బీఎస్‌–3 ద్విచక్ర వాహనాలను విక్రయించారు. వాటికి తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ కాలేదు. ఈ విషయంలో డీలర్లదే తప్పు. అలాంటి వాహనాలు వెయ్యి వరకు ఉన్నాయని గుర్తించాం. ఆ వాహనాలు కొన్నవారు మా చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు డీలక్లు కూడా వచ్చి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. మార్చి 31 రాత్రి 12 తర్వాత అమ్మిన వాహనాల విషయంలో ఏం చేయమంటారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరాం. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం..’’  – రఘునాథ్, ఉప రవాణా కమిషనర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement