రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు | Telangana among top ten states in road accidents | Sakshi
Sakshi News home page

రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు

Jan 31 2025 2:06 AM | Updated on Jan 31 2025 2:06 AM

Telangana among top ten states in road accidents

2024లో తెలంగాణలో 26,000 యాక్సిడెంట్స్‌ 

సగటున రోజుకు 18 మంది మృతి   

ఏడాదిలో మరణించిన వారు సుమారు 7,700  

రోడ్డు ప్రమాదాల్లో మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ 

రవాణాశాఖ వెల్లడి..   

నేడు నెక్లెస్‌ రోడ్డులో రోడ్డు భద్రతా వాకథాన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో 2024లో సగటున రోజుకు 71 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆయా ఘటనల్లో రోజూ సగటున 18 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ సైతం ఉంది. రాష్ట్ర రవాణాశాఖ ఈ వివరాలను వెల్లడించింది. 2024లో రాష్ట్రంలో సుమారు 26,000 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం 7,700 మంది మరణించగా, కనీసం 20 వేల మంది గాయపడినట్లు రవాణాశాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. 

రహదారి భద్రతపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, అపరిమిత వేగంతో వాహనాలు నడపడం, ర్యాష్‌ డ్రైవింగ్, రోడ్డు ఇంజినీరింగ్‌లో లోపాలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. రవాణాశాఖ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంగా ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో స్కూళ్లు, కళాశాలల్లో రోడ్డు భద్రతపైన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాంగా శుక్రవారం (జనవరి 31) నెక్లెస్‌రోడ్డులో రోడ్డు భద్రతా వాకథాన్‌ నిర్వహించనున్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

మానవ తప్పిదాలే కారణం.. 
గత మూడేళ్లలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో  80 శాతం మానవ తప్పిదాల వల్లనే జరిగినట్లు రవాణాశాఖ తెలిపింది. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం, ఓవర్‌ స్పీడ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్‌ చేయడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ఈ క్రమంలో ప్రమాదాల నియంత్రణకు రవాణాశాఖ పలు చర్యలు చేపట్టింది. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు ‘4ఈస్‌’ (ఎడ్యుకేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్‌)పై దృష్టి సారించింది. మరోవైపు రహదారులపై బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

ట్రాఫిక్‌ చిల్డ్రన్స్‌ పార్క్‌.. 
నెల రోజుల పాటు చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ట్రాఫిక్‌ చిల్డ్రన్స్‌ పార్కును ఏర్పాటు చేశారు. స్కూల్‌ విద్యార్థుల్లో అవగాహనకు ఇది దోహదం చేస్తుంది. గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఈ పార్కును ప్రారంభించారు. అలాగే హెల్మెట్‌ల పంపిణీ, వైద్య, ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు క్విజ్‌ పోటీలు వంటివి నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement