కోడెల తనయుడి బైక్‌ షోరూమ్‌ సీజ్‌ | Kodela Sivaram bike showroom was sieged | Sakshi
Sakshi News home page

కోడెల తనయుడి బైక్‌ షోరూమ్‌ సీజ్‌

Published Sun, Aug 11 2019 4:54 AM | Last Updated on Sun, Aug 11 2019 4:39 PM

Kodela Sivaram bike showroom was sieged - Sakshi

నరసరావుపేటలో సీజ్‌ చేసిన యర్రంశెట్టి షోరూమ్‌ ముందు యజమానులతో పాటు రవాణా శాఖ అధికారులు

సాక్షి, గుంటూరు, అమరావతి/నరసరావుపేట, నగరంపాలెం (గుంటూరు): అధికారం ఉన్నప్పుడు ‘కేట్యాక్స్‌’ వసూలు చేయడంలోనే కాదు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను ఎగ్గొట్టడంలోనూ కోడెల కుటుంబానిది అందె వేసిన చెయ్యి. పారదర్శకత కోసం రవాణా శాఖలో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ను అడ్డుగా పెట్టుకుని శివరామ్‌ భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాను నిర్వహిస్తున్న గౌతమ్‌ హీరో బైక్‌ షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహన విక్రయాలు నిర్వహించి, ప్రభుత్వానికి వెళ్లాల్సిన రూ.కోటి వరకూ స్వాహా చేశాడు. దీంతో ఆ షోరూమ్‌లను సీజ్‌ చేశారు. గౌతమ్‌ హీరో షోరూమ్‌లో గత ఆరు నెలల్లో 800 బైక్‌లకు టీఆర్‌ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్‌ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకూ గండి కొట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్‌ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000–1300 వరకూ చెల్లించాలి.

లైఫ్‌ ట్యాక్స్‌ కింద బైక్‌ ధరపై 9–14శాతం కట్టాలి. గౌతమ్‌ షోరూమ్‌ నుంచి విక్రయించిన బైక్‌లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైకుకు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్‌ ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. అక్రమాలు తేలడంతో గుంటూరులోని గౌతమ్‌ షోరూమ్‌తో పాటు, నరసరావుపేటలో హీరో కంపెనీ ద్విచక్రవాహనాలకు ఆధరైజ్డ్‌ డీలర్‌గా వ్యవహరిస్తున్న యర్రంశెట్టి మోటార్‌ షోరూమ్, సర్వీసు సెంటర్లను రవాణా వాహనాల అధికారులు శనివారం సీజ్‌ చేశారు. కోడెల  కుటుంబానికి సన్నిహితులైన యర్రంశెట్టి రాము, బాబ్జీ సోదరులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో 300 వాహనాలకు లెక్కతేలలేదని ఎం.వి.ఐ. అనిల్‌కుమార్‌ తెలిపారు. పన్నులు చెల్లించని డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ కమిషనర్‌ పి.సీతారామాంజనేయులు ఎస్పీకి సూచించారు.

వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలపై విచారణ  
గౌతమ్‌ హీరో షోరూంలో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌ ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖకు లైఫ్‌ టాక్స్‌లు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేయకుండా వాహనాలు విక్రయించినట్లు తేలిందన్నారు. దీంతో శనివారం గౌతమ్‌ హీరో, యర్రంశెట్టి హీరో షోరూంలను సీజ్‌ చేశామన్నారు.  
– జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ప్రసాదరావు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement