Bike Showroom
-
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 500 బైక్‌లు
సాక్షి, విజయవాడ: విజయవాడలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని టీవీఎస్ షోరూంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మంటల్లో వందలాది కొత్త బైక్‌లు కాలి బూడిదవ్వడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. వివరాల ప్రకారం.. విజయవాడలో స్టెల్లి కాలేజీ సమీపంలోని టీవీఎస్ షోరూంలో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగింది. అన్లోడ్ చేస్తున్న సమయంలో పై ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటంతో టీవీఎస్ షోరూంలో ఉన్న 500 బైక్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్లో కొత్త బైక్‌లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే సర్వీస్ సెక్షన్‌లోని లూబ్రికెంట్స్ అగ్నికి ఆజ్యం పోశాయి. ప్రమాదం జరిగినపుడు సిబ్బంది లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. చుట్టు పక్కల జనావాసాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది అదుపుచేసింది. సమాచారం అందుకున్న పడమట పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు -
మంచిర్యాల: చిల్లరతో కాస్ట్లీ బైక్ సొంతం
మంచిర్యాల: జిల్లా కేంద్రం పరిధిలోని కోల్‌బెల్ట్ ఏరియాలో నివసించే ఒక యువకుడు చేసిన పని.. ఓ బైక్ షోరూం నిర్వాహకులకు షాకిచ్చింది. ఏకంగా వందకు పైగా సంచుల్లో నాణేలు ఇవ్వడంతో నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. తన కలల బైక్‌ను సొంతం చేసుకోవడానికే తాను ఈ డబ్బుతో వచ్చానని చెప్పడంతో వాళ్లు కంగుతిన్నారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ తారకరామ కాలనీకి చెందిన వెంకటేశ్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేశాడు. స్పోర్ట్స్ బైక్‌పై తిరగాలన్నది అతని కోరిక అట. అందుకోసం దాచుకున్న చిల్లర డబ్బును తీసుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంకి వెళ్లాడు. 112 సంచు(సీల్డ్ కవర్లు)ల్లో తెచ్చిన చిల్లరను చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు. అయితే.. చిల్లరంతా లెక్కించిన తర్వాతే బైక్ అందిస్తామని వాళ్లు తెలిపారు. ఆపై.. పదిహేను మంది సిబ్బంది గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నాణేలు లెక్కించారు. రూ.2.85 లక్షల రూపాయి విలువగా తేలడంతో.. విలువైన స్పోర్ట్స్ బైక్‌ను వెంకటేశ్‌కు అందించారు. పోగు చేసిన చిల్లరతో తన డ్రీమ్ స్పోర్ట్స్ బైక్ దక్కించుకోవడంతో వెంకటేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. -
ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం
-
మైనర్‌కు బైక్ విక్రయం.. కుటుంబ సభ్యుల గొడవ
సనత్‌నగర్: ఓ మైనర్ బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించడం వివాదానికి దారితీసింది. దీంతో బేగంపేట్‌లోని ఓ షోరూం వద్ద బాలుడి బంధువులు, షోరూమ్ నిర్వాహకుల మధ్య గొడవ జరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే నాచారం అన్నపూర్ణ కాలనీకి చెందిన జంగయ్య కుమారుడు సాయి(17) తన సోదరుడితో కలిసి బేగంపేట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కేటీఎం మోటర్స్ షోరూంలో ఈ ఏడాది సెప్టెంబర్ 30న కేటీఎం బైక్ కొనుగోలు చేశాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా తన సోదరుడు నిఖిత్(19) పేరు మీద వాహనాన్ని తీసుకున్నాడు. పది రోజుల క్రితం బాలుడు బైక్ నడుపుతూ ఘట్కేసర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. ఈ విషయం బాలుడి కుటుంబ సభ్యులకు తెలియడంతో బైక్ ఎక్కడిదని ప్రశ్నించగా.. ఇంట్లో వారికీ చెప్పకుండా తానే వాహనాన్ని కొన్నట్టు చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి జంగయ్య, బాబాయి రవినాయక్ శనివారం బేగంపేటలోని కేటీఎం షోరూంకు వచ్చి బాలుడికి ద్విచక్ర వాహనాన్ని ఎలా విక్రయించారంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీనిపై 100 డయల్ నుంచి వచ్చిన సమాచారం మేరకు బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకున్నారు. షోరూం నిర్వాహకులు తమపై దాడి చేశారని బాలుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారే తమపై దాడి చేశారని షోరూం సిబ్బంది మరో ఫిర్యాదు చేశారు. అయితే, తాము బాలుడికి ద్విచక్ర వాహనం విక్రయించలేదని, అతని సోదరుడితో కలిసి వచ్చి కొనుగోలు చేసినట్లు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సిటీలో ఇటాలియన్ బైక్స్
నాగోలు: సిటీలో ఇటాలియన్ బ్రాండ్ బైకులు అందుబాటులోకి వచ్చాయి. నాగోలులో సోమవారం బెనెల్లీ బైక్స్ షోరూం ప్రారంభమైంది. బెనెల్లీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ జబక్ దీన్ని ప్రారంభించారు. గూంచా మోటార్స్‌తో కలిసి నగరంలో రెండో షో రూమ్‌ను ప్రారంభించామని ఆయన దేశమంతటా బెనెల్లీ 3–ఎస్ బైకులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎల్బీనగర్ బెనెల్లీ షో రూమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భర్వాణి మాట్లాడుతూ బెనెల్లీ కంపెనీకి చెందిన అన్ని మోడల్స్ బైకులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. -
గౌతమ్ షోరూమ్ వద్ద హైడ్రామా, సీన్లోకి కోడెల లాయర్!
సాక్షి, గుంటూరు : కోడెల శివరాం బైక్ షోరూమ్ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తన లాయర్‌తో కలిసి కొత్త డ్రామాలకు తెరతీశారు. బైక్ షోరూమ్ నుంచి అసెంబ్లీ అధికారులు ఫర్నీచర్‌ను రికవరీ చేసుకుంటున్న క్రమంలో వారిని అడ్డుకునే యత్నం జరిగింది. ఏ హోదాతో తనిఖీలు చేస్తారంటూ కోడెల లాయర్ అసెంబ్లీ అధికారులను ప్రశ్నించారు. షోరూమ్ ప్రైవేటు ప్రాపర్టీ అంటూ వితండవాదం చేశారు. అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలున్నాయని అసిస్టెంట్ సెక్రటరీ రాజ్‌స్పష్టం చేయడంతో రికవరీ కొనసాగింది. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సోదాల్లో అసెంబ్లీకి చెందిన పలు విలువైన వస్తువులను అధికారులు గుర్తించారు. అదంతా యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యంత విలువైన విదేశీ ఫర్నీచర్‌గా తెలిసింది. వాటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. 32 కుర్చీలు, 4 సోఫాలు, 3 టేబుళ్లు, ఒక టీపాయ్, ఒక దర్బార్ ఛైర్, డైనింగ్ టేబుల్, గుర్తించి.. తహసీల్దార్ మోహనరావు ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. డైనింగ్ టేబుల్, 22 కుర్చీలు విలువే రూ.65 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక తాళాలు లేవనే కారణంతో రెండో ఫ్లోర్, నాలుగో ఫ్లోర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించలేదు. వారెంట్ లేకుండా తనిఖీలు చేస్తే కోర్టుకు వెళ్తామంటూ బెదిరింపులకు దిగారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ను దొంగచాటుగా తన ఇంటికి తరలించుకున్న కోడెల శివప్రసాదరావు తన తప్పును అంగీకరించిన సంగతి తెలిసిందే. భద్రత లేదనే అసెంబ్లీ వస్తువుల్ని తన ఇంటికి తెచ్చుకున్నానని వివరణనిచ్చారు. వాటన్నింటినీ తిరిగి ఇచ్చేస్తాననీ.. లేదంటే విలువెంతో చెబితే చెల్లిస్తానని చెప్పుకొచ్చారు. ఇక కోడెల క్యాంప్ ఆఫీస్‌లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఫర్నీచర్ రికవరీ నిమిత్తం తన నివాసం, వ్యాపార స్థలాల్లో అసెంబ్లీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేసుకోవచ్చని నిన్న వెల్లడించిన కొడెల శుక్రవారం మాటమార్చడం గమనార్హం. -
కోడెల తనయుడి బైక్ షోరూమ్ సీజ్
సాక్షి, గుంటూరు, అమరావతి/నరసరావుపేట, నగరంపాలెం (గుంటూరు): అధికారం ఉన్నప్పుడు ‘కేట్యాక్స్’ వసూలు చేయడంలోనే కాదు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను ఎగ్గొట్టడంలోనూ కోడెల కుటుంబానిది అందె వేసిన చెయ్యి. పారదర్శకత కోసం రవాణా శాఖలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను అడ్డుగా పెట్టుకుని శివరామ్ భారీ స్కామ్‌కు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తాను నిర్వహిస్తున్న గౌతమ్ హీరో బైక్ షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా వాహన విక్రయాలు నిర్వహించి, ప్రభుత్వానికి వెళ్లాల్సిన రూ.కోటి వరకూ స్వాహా చేశాడు. దీంతో ఆ షోరూమ్‌లను సీజ్ చేశారు. గౌతమ్ హీరో షోరూమ్‌లో గత ఆరు నెలల్లో 800 బైక్‌లకు టీఆర్ లేకుండానే విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోడెల శివరామ్ ప్రభుత్వ ఆదాయానికి రూ.కోటి వరకూ గండి కొట్టారని ప్రాథమిక విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం నూతన వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జి కింద ప్రభుత్వానికి రూ.1000–1300 వరకూ చెల్లించాలి. లైఫ్ ట్యాక్స్ కింద బైక్ ధరపై 9–14శాతం కట్టాలి. గౌతమ్ షోరూమ్ నుంచి విక్రయించిన బైక్‌లన్నీ రూ.60 వేల నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ లెక్కన ఒక్కో బైకుకు రూ.6వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి ఉండగా కోడెల శివరామ్ ప్రభుత్వానికి చెల్లించకుండా స్వాహా చేశారు. అక్రమాలు తేలడంతో గుంటూరులోని గౌతమ్ షోరూమ్‌తో పాటు, నరసరావుపేటలో హీరో కంపెనీ ద్విచక్రవాహనాలకు ఆధరైజ్డ్ డీలర్‌గా వ్యవహరిస్తున్న యర్రంశెట్టి మోటార్ షోరూమ్, సర్వీసు సెంటర్లను రవాణా వాహనాల అధికారులు శనివారం సీజ్ చేశారు. కోడెల కుటుంబానికి సన్నిహితులైన యర్రంశెట్టి రాము, బాబ్జీ సోదరులు దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో 300 వాహనాలకు లెక్కతేలలేదని ఎం.వి.ఐ. అనిల్‌కుమార్ తెలిపారు. పన్నులు చెల్లించని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రవాణా శాఖ కమిషనర్ పి.సీతారామాంజనేయులు ఎస్పీకి సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలపై విచారణ గౌతమ్ హీరో షోరూంలో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖకు లైఫ్ టాక్స్‌లు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేయకుండా వాహనాలు విక్రయించినట్లు తేలిందన్నారు. దీంతో శనివారం గౌతమ్ హీరో, యర్రంశెట్టి హీరో షోరూంలను సీజ్ చేశామన్నారు. – జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు -
బైక్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం
సదాశివపేట (మెదక్ జిల్లా) : సదాశివపేటలోని శ్రీకృష్ణహోండా షోరూమ్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 మోటార్ బైకులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని సిబ్బంది తెలిపారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే సదాశివపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. -
బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం
అనంతపురం : అనంతపురంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి బళ్లారి చౌరస్తాలోని ఎంజీ బ్రదర్స్ బైక్ షోరూం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.