ఆన్‌లైన్‌లోనే వాహన రిజిస్ట్రేషన్ సిరీస్ మార్పు
Published Tue, Apr 5 2016 8:27 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌ను మార్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. టీఎస్ రిజిస్ట్రేషన్ సిరీస్ అమలులోకి రాకముందు రిజిస్టర్ అయిన వాహనాల నెంబర్ సిరీస్‌ను ఏపీ నుంచి టీఎస్‌లోకి మార్చేందుకు గత ఏడాదే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. కానీ విధివిధానాలపై స్పష్టత ఇవ్వకపోవటంతో ఆ ప్రక్రియ ఇప్పటిదాకా మొదలు కాలేదు. ఈ నెలాఖరుకుగాని, మే మొదటి వారంలోగాని ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 74 లక్షల వాహనాలు ప్రస్తుతం ఏపీ సీరీస్‌తో కొనసాగుతున్నాయి. వాటన్నింటిని టీఎస్ సిరీస్‌లోకి మార్చాల్సి ఉంది.
సర్వీసు ఛార్జి, ఆర్‌సీ బుక్కు ఖర్చు భరించాల్సిందే..
స్టేట్ కోడ్‌తోపాటు జిల్లా కోడ్ కూడా మారుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రవాణాశాఖ జిల్లాలకు కూడా కొత్త కోడ్‌లను కేటాయించింది. రిజిస్ట్రేషన్ నంబరు మాత్రం పాతదే కొనసాగనుండగా స్టేట్, జిల్లా సిరీస్‌లు మారతాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 74 లక్షల వరకు వాహనాల నంబర్ సిరీస్ మార్చాల్సి ఉన్నందున వాహనదారులు నేరుగా ఆన్‌లైన్‌లో మార్పు చేసుకుని కొత్త నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త నంబరు సిరీస్‌కు సంబంధించి ఆర్‌సీ కార్డు ఇంటికి పంపుతారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాహనదారుడికి ఖర్చు కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో మార్పుచేర్పుల ప్రక్రియకు రూ.100 వరకు సర్వీసు ఛార్జీ భరించాల్సి ఉంటుంది. కొత్త ఆర్‌సీ కార్డు తయారీకి అయ్యే వ్యయాన్ని కూడా వాహనదారులే భరించాలి. అదికాకుండా కచ్చితంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్లేటుకు సంబంధించి హై సెక్యూరిటీ ప్లేటు బిగించుకోవాల్సిందే. గతంలో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేటు ఉన్నవారు కూడా మళ్లీ రెండోసారి ఖర్చు భరించాల్సి వస్తుంది. వెరసి ద్విచక్రవాహనదారులకు రూ.450 వరకు, కార్లకు అది మరో రూ.200 అదనంగా ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారం రోజుల్లో విధివిధానాలు జారీ అవుతాయని సమాచారం.
Advertisement