గాడిన పడని ఆన్‌లైన్ వాహన రిజిస్ట్రేషన్
* షోరూం నిర్వాహకులకు అవగాహన లోపంతో దరఖాస్తుల తిరస్కరణ
* రిజిస్ట్రేషన్ వారం నుంచి రెండు వారాల పాటు జాప్యం
గుంటూరు (నగరంపాలెం): రవాణాశాఖలో వాహనదారులకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వాహన డీలర్ల వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లాలో ఇంకా గాడిన పడలేదు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 17 నుంచి ద్విచక్ర, నాన్‌ట్రాన్స్‌పోర్ట్ లైట్ మోటర్ వాహనాలు కొనుగోలు చేసిన షోరూం లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి నంబరు కేటాయించే విధానం ప్రారంభించారు. దీని కోసం జిల్లాలోని సుమారు 40 వాహన షోరూంలకు, 150 మంది సబ్ డీలర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం, షోరూంలో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అందించారు. జిల్లాలో వాహనాలు రిజిస్ట్రేషన్ చేసే గుంటూరు ఆర్టీఏ కార్యాలయానికి ఏపి07సిజడ్, నరసరావుపేట ఆర్టీఏ కార్యాలయానికి ఏపి07డిఏ, పిడుగురాళ్ళ యూనిట్ కార్యాలయానికి ఏపి07డీబీ, తెనాలి యూనిట్ కార్యాలయానికి ఏపి07డీసీ సిరీస్‌ను కేటాయించారు. ఫ్యాన్సీ నంబర్ల కోసం మినహా అక్టోబర్ 17 నుంచి కొనుగోలు చేసిన నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాలు అన్నీ షోరూం ద్వారానే శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే గత నెలరోజులుగా æ వాహన డీలర్ల నుంచి రవాణాశాఖ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులు చిన్నచిన్న సాంకేతిక సమస్యలతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. షోరూంలో వాహనం కొనుగోలు చేసిన తర్వాత పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌కు నగదు ద్వారా కొనుగోలు చేస్తే కొనుగోలుదారుని ఫొటో, వాహనం రెండు ఫొటోలు ఇతర పత్రాలు కలిపి మొత్తం 12 , ఫైనాన్స్ ద్వారా అయితే 15 పత్రాలను అన్‌లైన్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ చేయాల్సిన ఫారమ్స్ అన్నీ జీపీఆర్‌ఎస్ కోఆర్డినేషన్ ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా మాత్రమే ఫొటో తీయాల్సి ఉంటుంది.
నివాస ధ్రువీకరణ పత్రాలతోనే ప్రధాన సమస్య..
రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంట్ నివాస ధ్రువీకరణ పత్రంపై సరైన అవగాహన షోరూం నిర్వాహకులకు లేకపోవడంతో ఎక్కువ శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఆధార్‌కార్డులో ఉన్న చిరునామా పోస్టల్ అడ్రస్, మండలాలు సక్రమంగా ఉండడం లేదు. అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేసే ప్రూఫ్‌లు సక్రమంగా ఫొటో తీయలేకపోవడంతో క్లారిటీగా ఉండడం లేదు. ఇన్‌వాయిస్‌ల మీద, ఇతర ఫారమ్స్ మీద షోరూం మేనేజర్ల సంతకాలు ఉండడం లేదు. వాహనాలు సగం మాత్రమే కన్పించేలా ఫొటోలు తీస్తున్నారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయానికి గత నెలరోజులుగా సుమారు 900 వరకు ఆమోదం పొందితే 600 వరకు చిన్నచిన్న కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదం పొందిన వాటిలో కూడా ఎక్కువ శాతం ఒకటి కంటే ఎక్కువ సార్లు తిరస్కరణకు గురై సరిచేసి పంపినవే. తెనాలి, పిడుగురాళ్ళ, నరసరావుపేట కార్యాలయాల్లో ఇదే పరిస్ధితి కొనసాగుతోంది. దీంతో 24 గంటల్లో జరగాల్సిన వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వారం నుంచి పదిహేను రోజుల వరకు పడుతోంది. ఆన్‌లైన్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చిన ఫారమ్స్ క్లర్క్, ఎంవీఐ, ఏవో అన్ని పత్రాలపై కామెంట్ రాయాల్సి రావడంతో పనిభారం పెరుగుతోంది.
షోరూం నిర్వాహకులకు త్వరలో శిక్షణ కార్యక్రమం –డీటీసీ
డీలర్ల వద్ద వాహనాలు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో షోరూం నిర్వాహకులు అప్‌లోడ్ సక్రమంగా చేయకపోవడంతో ఎక్కువ శాతం తిరస్కరణకు గురవుతున్నాయని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనరు జీసీ రాజరత్నం తెలిపారు. ఆధార్ కార్డును చిరునామాగా చూపే సమయంలో చిరునామా పూర్తిగా నమోదు చేయడం లేదన్నారు. ఇతర అడ్రస్ ప్రూఫ్‌కు ఎక్స్‌ట్రా ఇమేజ్ ఆప్షన్‌ను వినియోగించడం లేదన్నారు. అప్‌లోడ్ చేసిన ప్రూఫ్‌లలోని వివరాలు సక్రమంగా కన్పించడం లేదన్నారు. డీలర్లు అప్‌లోడ్ చేసిన వివరాలను పరిశీలించడానికి మినహా సరిచేసే అవకాశం కార్యాలయ సిబ్బందికి లేకపోవడంతో తిరస్కరించక తప్పడం లేదన్నారు. దీనిపై డీలర్లకు అవగాహన కోసం మరోసారి స్వల్పకాలిక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు.