తొలిరోజు వాహన రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు
• రవాణా శాఖ సాఫ్ట్‌వేర్ అనుసంధానంలో లోపాలు
• కొత్త జిల్లాల్లో మొరాయించిన వ్యవస్థ
• ఐటీ సిబ్బందితో రెండు బృందాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తాయి. కొత్త జిల్లాల పరిధిలో కొత్త కార్యాలయాలు ఏర్పాటు చేసి సాఫ్ట్‌వేర్ అనుసంధానం చేశారు. ఆయా జిల్లాల స్వరూపం, మండలాలు, వాటి పరిధిలోని గ్రామాల పేర్లను జిల్లాల వారీగా సాఫ్ట్‌వేర్‌తో జతచేశారు. అయితే ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కొన్ని పేర్లు, సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన పేర్లతో మ్యాచ్ కాకపోవడంతో కంప్యూటర్లు మొరాయించాయి.
కొన్ని చోట్ల సర్వర్లు ఇబ్బంది పెట్టాయి. తాత్కాలికంగా ప్రైవేటు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన వనపర్తి, నాగర్‌కర్నూలు, భూపాలపల్లి, వికారాబాద్‌లలో సమస్య తీవ్రమైంది. దీంతో కొత్త జిల్లాల తొలిరోజు వాహన రిజిస్ట్రేషన్లు, ఇతర పనులు ఆగిపోయాయి. దీంతో రవాణా శాఖ వెంటనే ఐటీ సిబ్బందితో కూడిన రెండు బృందాల ద్వారా సమస్యను పరిష్కరించింది. దసరా ముందు రోజు రాత్రి పొద్దు పోయే వరకు కొత్త జిల్లాల స్వరూపంలో మార్పులు జరగడంతో సాఫ్ట్‌వేర్ అనుసంధానంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని అధికారులు తెలిపారు.
పాత నంబర్లు అలాగే..
కొత్త జిల్లాలకు రవాణా శాఖ కొత్త కోడ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు కోడ్‌లు మార్చాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రంగారెడ్డి టీఎస్7, మేడ్చల్ టీఎస్8, కామారెడ్డి టీఎస్17, నిర్మల్ టీఎస్18, మంచిర్యాల టీఎస్19, కొమురంభీమ్ టీఎస్ 20, జగిత్యాల టీఎస్ 21, పెద్దపల్లి టీఎస్ 22, రాజన్న సిరిసిల్ల టీఎస్ 23, వరంగల్ రూరల్ టీఎస్ 24, జయశంకర్ భూపాలపల్లి టీఎస్ 25, మహబూబాబాద్ టీఎస్ 26, జనగాం టీఎస్ 27, భద్రాద్రి టీఎస్ 28, సూర్యాపేట టీఎస్ 29, యాదాద్రి టీఎస్ 30, నాగర్‌కర్నూలు టీఎస్ 31, వనపర్తి టీఎస్ 32, జోగులాంబ గద్వాల టీఎస్ 33, వికారాబాద్ టీఎస్ 34, మెదక్ టీఎస్ 35, సిద్దిపేట టీఎస్ 36 నంబర్లను రవాణా శాఖ కేటాయించింది.