కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్..! | TG 01 allocation to instead of AP 01 | Sakshi
Sakshi News home page

కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్..!

Published Mon, May 26 2014 12:30 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

TG 01 allocation to instead of AP 01

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వాహనాల రిజిస్ట్రేషన్, సిరీస్ నంబర్లు మారనున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబరు ఏపీతో మొదలయ్యేది. ఆదిలాబాద్ జిల్లా పేరు ఇంగ్లిషు అక్షరం ‘ఏ’తో ప్రారంభం కావడంతో, ఇంగ్లిష్ అక్షరమాలలో ‘ఏ’ మొదటిది కావడంతో మన జిల్లాకు ఏపీ 01 అనే సిరీస్‌తో ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే ఉండడంతో, ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయాయి.

రాష్ట్ర రవాణాశాఖ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు రెండు రాష్ట్రాల్లో వేరు వేరుగా నిర్వహించనున్నాయి. తెలంగాణలోని జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ ‘టీజీ’తో మొదలయ్యే అవకాశాలు ఉండడంతో, ‘టీజీ 01’ అనే మొదటి సిరీస్ నంబరును మన జిల్లాకే కేటాయించనున్నట్లు సమాచారం. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల మార్పుతో మరో రెండు, మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

 పాత వాహనాలకు మారని సిరీస్
 గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జిల్లా వాహనదారులకు ఇప్పటివరకు ఏపీ 01 సిరీస్ కేటాయిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఏపీ సిరీస్ నుంచి టీజీ సిరీస్‌కు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మారనున్నాయి. దీంతో ఇది వరకే ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారుల్లో గం దరగోళం నెలకొంది. పాత నంబర్ల ఆధారంగా నే ఇప్పటికే ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు(ఆర్‌సీ) వాహనదారులకు అందించారు.

జిల్లాలో లక్షల సంఖ్యలో వాహనాలు పాత సిరీ స్(ఏపీ 01)తో ఉన్నాయని, ఆయా వాహనాల నంబర్లను మార్చడం కుదరదని, అపాయింటెడ్ డే వరకు రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు ఏపీ 01 అనే సిరీస్‌తోనే నంబర్లను ఇవ్వనున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనదారులు టీజీ సిరీ స్‌తో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు కావాలం టే, అపాయింటెడ్ డే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంలో కొత్త సిరీస్ నంబర్లతోనే వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాహనదారుల అభిప్రాయం.

 మంచిర్యాల జిల్లాగా మారితే!
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాలు 10 ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలోనే ఏడు సిరీస్‌లు ఉన్నాయి. దీంతో తెలంగాణలోని 10 జిల్లాలకు 15 సిరీస్‌ల వరకు నంబర్లను కేటాయిస్తున్నారు. కొత్త జిల్లాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిర్యాల కూడా జిల్లాగా మారనుంది.

దీంతో మంచిర్యాల జిల్లాకు ఏ నంబరు సిరీస్‌ను అందిస్తారోనని వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది. 01 నుంచి 15 వరకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు నంబర్లను కేటాయిస్తుండగా, కొత్తగా ఏర్పాటయ్యే మంచిర్యాలకు ఆ తరువాత నంబరును కేటాయిస్తారా? లేదంటే ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం మరోసారి సిరీస్‌లను క్రమబద్ధీకరిస్తారా? అనే విషయాలపై స్పష్టత లేదు. ఒకవేళ అక్షరమాల ప్రకారం నంబర్లను కేటాయిస్తే టీజీ 13 వచ్చే అవకాశం ఉందని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పడితే వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లు మారనుండడంతో, వాహనదారుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలను, తీసుకునే రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ అప్పాయింటెడ్ డే తరువాతే తీసుకోవాలన్న ఆలోచనలో వాహనదారులు ఉన్నారు. దీంతో వాహన కొనుగోళ్లు మందగించినట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement