హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌరసేవలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్‌లు, వాటికి కేటాయించిన నంబర్‌లకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా వాహనదారులకు అందజేసే సరికొత్త మొబైల్ గవర్నెన్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. వినియోగదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లవ లసి ఉంటుంది. ఆ వాహనానికి అధికారులు కేటాయించిన నంబర్ తదితర అంశాలను ఎస్సెమ్మెస్ రూపంలో చేరవేస్తారు. అంతేకాకుండా రవాణా వాహనాలు చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు, గడువు ముగిసిన పర్మిట్లు, వాహన బదలాయింపు, చిరునామా మార్పు వంటి అన్ని రకాల పౌరసేవలపై మొబైల్ సందేశాల ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు.
వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, సకాలంలో పన్నులు చెల్లించకపోయినా రవాణా శాఖ నుంచి వాహనదారుడి సెల్‌ఫోన్‌కు హెచ్చరికలు అందుతాయి. మొదట కొత్త వాహనాలను మొబైల్ గవర్నెన్స్ పరిధిలోకి తెస్తారు. ఆ తరువాత పాత వాహనాలను కూడా దీని పరిధిలోకి తెచ్చేందుకు వాహనదారులు తమ మొబైల్ నంబర్‌లను ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు.
13 నుంచి ఆర్టీఏ మొబైల్ గవర్నెన్స్ ప్రారంభం
Published Sat, Oct 11 2014 2:42 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement