Mobile Governance
-
‘మీ సేవ’లకు మొబైల్ గవర్నెన్స్
టెక్నాలజీతో పౌరులకు చేరువగా ప్రభుత్వ సేవలు: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: మొబైల్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీలో సోమవారం నిర్వహించిన ‘డిజిటల్ తెలంగాణ’కార్యక్రమంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న సర్వీసుల్లో మూడు(బర్త్, డెత్ సర్టిఫికెట్లు, అడంగల్ కాపీ) సేవలను మొబైల్ ద్వారా అందించే యాప్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవా కేంద్రాల ద్వారా పౌరులకు ప్రస్తుతం 321 రకాల సేవలు అందుతున్నాయని, త్వరలోనే వీలైనన్ని ఎక్కువ సేవలను మొబైల్ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖలో తొలిసారిగా ఆన్లైన్ సేవలకు శ్రీకారం చుట్టామని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇకపై యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాల్లో దర్శన టికెట్లు, వసతి సదుపాయాలను భక్తులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా పొందవచ్చని, త్వరలోనే బాసర, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు ఈ సేవలను విస్తరిస్తామన్నారు. ఐటీ శాఖ రూపొందించిన దేవాదాయ శాఖ ఆన్లైన్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి డిజిటల్ అక్షరాస్యతను నేర్పించేందుకుగానూ ప్రభుత్వం డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమలు నిమిత్తం నాస్కామ్ ఫౌండేషన్‌తో సర్కారు ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రధాన సమస్యలైన అధ్యాపకులు, ల్యాబొరేటరీల కొరతను అధిగమించేందుకు వర్చువల్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్), ఐఐఐటీ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. -
‘మొబైల్ ప్రపంచాన్ని సృష్టిద్దాం’
* ఈ-గవర్నెన్స్ సదస్సులో మోదీ * ట్వీటర్ ద్వారా ప్రసంగం.. * భారీ తెరపై వెంట వెంటనే ప్రసారం * మొబైల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిద్దాం గాంధీనగర్: దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా వీలైనన్ని ప్రభుత్వ సేవలను అందించేందుకు (మొబైల్ గవర్నెన్స్‌కు) అవకాశాలను అన్వేషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఐటీ నిపుణులను కోరారు. తన కలల ప్రాజెక్టు ‘డిజిటల్ ఇండియా’లో ఈ-గవర్నెన్స్ ప్రధానమైన అంశమని... దేశాభివృద్ధి వేగంగా కొనసాగేందుకు అధునాతన టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్‌పై గుజరాత్లో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో శుక్రవారం 18వ జాతీయ సదస్సు జరిగింది. ఐటీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో మోదీ ట్వీటర్ ద్వారా ప్రసంగించారు. ఆయన వరుసగా చేసిన ‘ట్వీట్ల’ను సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ తెరపై వెంట వెంటనే ప్రసారం చేశారు. ‘‘మనం ఈ-గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం.. దీంతోపాటు ‘మొబైల్ ఫస్ట్’పై దృష్టిపెట్టి ఎం-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇద్దాం. ‘డిజిటల్ ఇండియా’ ప్రాజెక్టులో ఈ-గవర్నెన్స్ ఒక ప్రధాన భాగం. ప్రభుత్వ వ్యవహారాలు, సేవలు, అభివృద్ధిలో జాప్యం వంటి అడ్డంకులెన్నో ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఈ-గవర్నెన్స్ వల్ల తొలగిపోతాయి. డిజిటల్ ఇండియా రూపకల్పనకు అవసరమైన అత్యుత్తమ మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. భారత్‌ను సాంకేతికంగా సాధికారికత సాధించిన దేశంగా నిలుపుతాం.’ అని మోదీ పలు ట్వీట్లలో పేర్కొన్నారు. యువ శక్తి దేశానికి ఒక ఆస్తి అని... టెక్నాలజీ సహాయంతో యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం ప్రోత్సాహం అందించడం అవసరమని చెప్పారు. ఈ సదస్సుకు నేరుగా హాజరుకావాలనుకున్నా.. పలు కారణాల వల్ల రాలేకపోయానని చెప్పారు. -
మొదటి దశలో 40 సేవలు
8న మొబైల్ గవర్నెన్స్ ‘మొబైల్ వన్’ ప్రారంభం 161 నంబర్ కేటాయింపు : సీఎం బెంగళూరు : దేశంలో మొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనున్న మొబైల్ గవర్నెన్స్ ‘మొబైల్ వన్’లో మొదటి దశలో 40 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. దశలవారిగా వీటిని ప్రభుత్వం అందించే అన్ని సేవలకు మొబైల్వన్ను విస్తరించనున్నామన్నారు. దాదాపు 400 సేవలను అందించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ మొబైల్వన్ సేవలను పొందడానికి ప్రభుత్వం 161 నంబర్‌ను కేటాయించిందన్నారు. ఈనెల ఏడున ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాగా, మొబైల్ గవర్నెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 8న బెంగళూరులోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి మీడియా ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రికలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్వనిని ముందుగానే రికార్డ్ చేసి ఉండటం గమనార్హం -
13 నుంచి ఆర్టీఏ మొబైల్ గవర్నెన్స్ ప్రారంభం
హైదరాబాద్ : రవాణా శాఖ అందజేసే పౌరసేవలు వినియోగదారులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు, వాటికి కేటాయించిన నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా వాహనదారులకు అందజేసే సరికొత్త మొబైల్ గవర్నెన్స్‌ను సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. వినియోగదారులు వాహనాన్ని కొనుగోలు చేసిన తరువాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లవ లసి ఉంటుంది. ఆ వాహనానికి అధికారులు కేటాయించిన నంబర్ తదితర అంశాలను ఎస్సెమ్మెస్ రూపంలో చేరవేస్తారు. అంతేకాకుండా రవాణా వాహనాలు చెల్లించవలసిన త్రైమాసిక పన్నులు, గడువు ముగిసిన పర్మిట్లు, వాహన బదలాయింపు, చిరునామా మార్పు వంటి అన్ని రకాల పౌరసేవలపై మొబైల్ సందేశాల ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయనున్నట్లు రవాణా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా, సకాలంలో పన్నులు చెల్లించకపోయినా రవాణా శాఖ నుంచి వాహనదారుడి సెల్‌ఫోన్‌కు హెచ్చరికలు అందుతాయి. మొదట కొత్త వాహనాలను మొబైల్ గవర్నెన్స్ పరిధిలోకి తెస్తారు. ఆ తరువాత పాత వాహనాలను కూడా దీని పరిధిలోకి తెచ్చేందుకు వాహనదారులు తమ మొబైల్ నంబర్లను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించనున్నట్లు కమిషనర్ వివరించారు.