మొదటి దశలో 40 సేవలు
8న మొబైల్ గవర్నెన్స్ ‘మొబైల్ వన్’ ప్రారంభం
161 నంబర్ కేటాయింపు : సీఎం
బెంగళూరు : దేశంలో మొదటిసారిగా కర్ణాటక ప్రభుత్వం అమలు చేయనున్న మొబైల్ గవర్నెన్స్ ‘మొబైల్ వన్’లో మొదటి దశలో 40 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులో మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడారు. దశలవారిగా వీటిని ప్రభుత్వం అందించే అన్ని సేవలకు మొబైల్‌వన్‌ను విస్తరించనున్నామన్నారు. దాదాపు 400 సేవలను అందించడానికి వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ఈ మొబైల్‌వన్ సేవలను పొందడానికి ప్రభుత్వం 161 నంబర్‌ను కేటాయించిందన్నారు.
ఈనెల ఏడున ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో జరగనున్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొననున్నానని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కాగా, మొబైల్ గవర్నెన్స్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈనెల 8న బెంగళూరులోని అంతర్జాతీయ వస్తు ప్రదర్శన కేంద్రంలో మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి మీడియా ప్రతినిధులకు పంపిన ఆహ్వాన పత్రికలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్వనిని ముందుగానే రికార్డ్ చేసి ఉండటం గమనార్హం