‘మీ సేవ’లకు మొబైల్ గవర్నెన్స్
టెక్నాలజీతో పౌరులకు చేరువగా ప్రభుత్వ సేవలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను అందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఐటీ మంత్రి కె.తారకరామారావు అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ వర్సిటీలో సోమవారం నిర్వహించిన ‘డిజిటల్ తెలంగాణ’కార్యక్రమంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలసి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా అందిస్తున్న సర్వీసుల్లో మూడు(బర్త్, డెత్ సర్టిఫికెట్లు, అడంగల్ కాపీ) సేవలను మొబైల్ ద్వారా అందించే యాప్‌ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీ సేవా కేంద్రాల ద్వారా పౌరులకు ప్రస్తుతం 321 రకాల సేవలు అందుతున్నాయని, త్వరలోనే వీలైనన్ని ఎక్కువ సేవలను మొబైల్ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. దేవాదాయ శాఖలో తొలిసారిగా ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టామని ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. ఇకపై యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాల్లో దర్శన టికెట్లు, వసతి సదుపాయాలను భక్తులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పొందవచ్చని, త్వరలోనే బాసర, కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు ఈ సేవలను విస్తరిస్తామన్నారు.
ఐటీ శాఖ రూపొందించిన దేవాదాయ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరికి డిజిటల్ అక్షరాస్యతను నేర్పించేందుకుగానూ ప్రభుత్వం డిజిటల్ లిటరసీ మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం అమలు నిమిత్తం నాస్కామ్ ఫౌండేషన్‌తో సర్కారు ఎంవోయూ కుదుర్చుకుంది. అలాగే.. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రధాన సమస్యలైన అధ్యాపకులు, ల్యాబొరేటరీల కొరతను అధిగమించేందుకు వర్చువల్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మేరకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్), ఐఐఐటీ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి.