మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షిషా
మెదక్ కలెక్టరేట్: మీ సేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా తహసీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాల జారీ, ఇంటింటి ఓటరు జాబితా సర్వే, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గుర్తింపు పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వర్ సమస్య కూడా తీరిందని, ఆదాయ, కుల, రెసిడెన్షియల్ ధ్రుపత్రాలను త్వరగా జారీ చేయాలన్నారు.
ప్రధానంగా రుణసాయం కోసం దరఖాస్తు చేసుకునే బీసీ కులాల వారికి త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఓటరు జాబితా తయారీలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే గురువారం పూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో మృతిచెందిన, షిఫ్టింగ్ అయిన వారి పేర్లను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. పొరపాట్లు జరిగినట్లయితే ఫారం 6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేయాలన్నారు.
అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా వస్తున్న ఫామ్ 6,7,8 లను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ వచ్చిన పక్షం రోజులలోగా డిస్పోస్ అయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసి ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు. 1500 పైగా ఓటర్లు ఉన్న బూతులతో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలన్నారు. త్వరలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశమై తగు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్‌కు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment