‘మొబైల్ ప్రపంచాన్ని సృష్టిద్దాం’
* ఈ-గవర్నెన్స్ సదస్సులో మోదీ
* ట్వీటర్ ద్వారా ప్రసంగం..
* భారీ తెరపై వెంట వెంటనే ప్రసారం
* మొబైల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యమిద్దాం
గాంధీనగర్: దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా వీలైనన్ని ప్రభుత్వ సేవలను అందించేందుకు (మొబైల్ గవర్నెన్స్‌కు) అవకాశాలను అన్వేషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ఐటీ నిపుణులను కోరారు. తన కలల ప్రాజెక్టు ‘డిజిటల్ ఇండియా’లో ఈ-గవర్నెన్స్ ప్రధానమైన అంశమని... దేశాభివృద్ధి వేగంగా కొనసాగేందుకు అధునాతన టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ-గవర్నెన్స్‌పై గుజరాత్‌లో గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో శుక్రవారం 18వ జాతీయ సదస్సు జరిగింది. ఐటీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో మోదీ ట్వీటర్ ద్వారా ప్రసంగించారు.
ఆయన వరుసగా చేసిన ‘ట్వీట్ల’ను సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ తెరపై వెంట వెంటనే ప్రసారం చేశారు. ‘‘మనం ఈ-గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం.. దీంతోపాటు ‘మొబైల్ ఫస్ట్’పై దృష్టిపెట్టి ఎం-గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇద్దాం. ‘డిజిటల్ ఇండియా’ ప్రాజెక్టులో ఈ-గవర్నెన్స్ ఒక ప్రధాన భాగం. ప్రభుత్వ వ్యవహారాలు, సేవలు, అభివృద్ధిలో జాప్యం వంటి అడ్డంకులెన్నో ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఈ-గవర్నెన్స్ వల్ల తొలగిపోతాయి. డిజిటల్ ఇండియా రూపకల్పనకు అవసరమైన అత్యుత్తమ మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. భారత్‌ను సాంకేతికంగా సాధికారికత సాధించిన దేశంగా నిలుపుతాం.’ అని మోదీ పలు ట్వీట్లలో పేర్కొన్నారు. యువ శక్తి దేశానికి ఒక ఆస్తి అని... టెక్నాలజీ సహాయంతో యువతలో నైపుణ్యాల అభివృద్ధికోసం ప్రోత్సాహం అందించడం అవసరమని చెప్పారు. ఈ సదస్సుకు నేరుగా హాజరుకావాలనుకున్నా.. పలు కారణాల వల్ల రాలేకపోయానని చెప్పారు.