ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
1500 మంది రైతుల అరెస్ట్
హొసూరు/కెలమంగలం : కావేరి నదిపై మేకదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ వల్ల తమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ తమిళనాడుకు చెందిన రైతులు ఉద్యమించారు. రాష్ర్ట సరిహద్దులోని మేకదాటు ప్రాంతాన్ని ముట్టడించేందుకు రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, సంఘ సంస్థలు, రైతులు సుమారు రెండు వేలకు పైగా తరలి వచ్చారు. దీంతో శనివారం డెంకణీకోటలో ఉద్రిక్తత నెలకొంది. డెంకణీకోటకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేకదాటు వరకు రైతులు ర్యాలీగా వెళ్లి, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవాలని కావేరి హక్కుల విడుదల సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు కావేరి నదీ పరివాహక ప్రాంతాలైన తిరుచ్చి, తిరువారూరు, తంజావూరు, నాగై, సేలం, క్రిష్ణగిరి, ధర్మపురి, నామక్కల్ తదితర జిల్లాల రైతులు శుక్రవారం రాత్రికి డెంకణీకోట, హొసూరుకు చేరుకున్నారు.
శనివారం ఉదయం డెంకణీకోట పాతబస్టాండు నుంచి ర్యాలీ మొదలైంది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు పాడికట్టి దానిపై ఓ రైతును పడుకోబెట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ 50 మీటర్ల దూరం వెళ్లగానే భారీగా మొహరించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరిస్థితి విషమిస్తుండడంతో చేతికి చిక్కిన 1500 మంది రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని ఉంచేందుకు సరైన వసతి లేకపోవడంతో వెంటనే కల్యాణమంటపాలకు తీసుకెళ్లారు.
మేకదాటు ఉద్రిక్తత
Published Sun, Mar 8 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement