తమిళనాడు రైతుల దీక్ష.. దారుణం
తమిళనాడు రైతుల దీక్ష.. దారుణం
Published Mon, Sep 11 2017 10:35 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM
సాక్షి, న్యూఢిల్లీ: 40 రోజుల పైగా నిరసనలు చేశారు.. అయినా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. అలసిపోయి కాస్త విరామం తీసుకుని మళ్లీ పోరాటానికి దిగారు. ప్చ్.. లాభం లేకుండా పోయింది. అంతే రోజుకో రూపం దాల్చుతున్న ఆందోళన ఒక్కసారిగా దారుణంగా మారింది. అన్నం పండించే అన్నదాత చివరకు తన మలం తానే తిని ప్రభుత్వాలపై నిరసన వ్యక్తం చేశాడు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఇలా నిరసన తెలియజేశారు. దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల జాతీయ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను నేతృత్వంలో పది మంది రైతులు 58 రోజులుగా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నారు. ఆదివారం ఉదయం తమ మలాన్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో సేకరించిన రైతులు.. నినాదాలు చేస్తూ తినేశారు. సోమవారం మనిషి మాంసం తింటామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
‘గతంలో 41 రోజులపాటు ఇక్కడ దీక్షలు చేశాం. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చాం. మేం అసలు వారి(ప్రభుత్వాలు) కంటికి కనిపించటం లేదా?.’ అని అయ్యాకన్ను ప్రశ్నిస్తున్నారు. నిరసనలు చేపట్టి మంగళవారానికి సరిగ్గా 59 రోజులు పూర్తవుతుంది. అంటే మా నిరసనలకు వంద రోజులు అయినట్లే లెక్క. ఆ రోజు పూర్తి నగ్నంగా ప్రధాని కార్యాలయంకు మార్చి నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు.
రుణమాఫీ, రూ.4,000 కోట్ల కరువు సాయం, కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు తదితర డిమాండ్లతో మార్చి 14 నుంచి 41 రోజులపాటు జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళన చేశారు. ఆ తర్వాత తిరిగి నెలన్నర క్రితం మళ్లీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తుండటంతో అర్ద నగ్న, నగ్న ప్రదర్శన, విధవలుగా అవతారం, చనిపోయిన రైతుల పుర్రెలను మెడలో వేసుకొని, అర్థనగ్న ప్రదర్శనలు, ఎలుకలు-పాములు నోట్లో పెట్టుకోవటం.. ఇలా రోజుకో కొత్త రూపంలో నిరసన తెలియజేస్తున్నారు.
140 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది అత్యల్ఫ వర్షాపాతం నమోదుకావటంతో భారత వాతావరణ శాఖ తమిళనాడును కరువు రాష్ట్రంగా ప్రకటించింది. దీంతో మద్రాస్ హైకోర్టు రైతులందరికీ రుణ మాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే చిన్న, మధ్య తరహా రైతులకు మాత్రమే రుణ మాఫీకి అర్హులను చేయాలంటూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు స్టే విధించటంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైతులు ఇలా చేస్తున్నారు.
Advertisement
Advertisement