appointed day
-
ఇక నుంచి ఎవరి బిల్లులు వారివే
ఉభయ ప్రభుత్వాల నిర్ణయం కొన్ని శాఖల్లో ఇంకా రగులుతున్న బిల్లుల చిచ్చు హైదరాబాద్: అపాయింటెడ్ డేకు ముందు సచివాలయంలో మే నెలలో వినియోగించిన విద్యుత్తు బిల్లులను నిష్పత్తి ప్రకారం చెల్లించేందుకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అపెక్స్ కో-ఆర్డినేషన్ కమిటీ సూచనలతో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు జనాభా నిష్పత్తి ప్రకారం చెల్లించేందుకు అంగీకరించారు. మే నెలలో వినియోగించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ 58.32, తెలంగాణ ప్రభుత్వం 41.68 నిష్పత్తి ప్రకారం పంచుకున్నాయి. సచివాలయంలోని తెలంగాణా ప్రభుత్వానికి ఎ,బి, సి,డి బ్లాకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జే, కే, ఎల్, హెచ్ (సౌత్), హెచ్(నార్త్) బ్లాకులు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సచివాలయం మొత్తం ఐదు సర్వీసు నెంబర్లతో కనెక్షన్లు ఉండటంతో మంచినీటి, విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై వివాదాలు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అపాయింటెడ్ డేకు ముందు మే నెలలో విద్యుత్తు బిల్లు వాడకంపై నిష్పత్తి ప్రకారం చెల్లిద్దామనే ఒప్పందానికి ఇరు ప్రాంతాల అధికారులు వచ్చారు. ఐదు కనెక్షన్లకు గాను మే నెల విద్యుత్తు బిల్లు రూ.56,94,680 కాగా, ఆలస్య చెల్లింపు ఛార్జీలు రూ.1,06,351 మొత్తం కలిపి రూ.58,01,031 చెల్లించాలని సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్) పేర్కొంది. అయితే ఇకనుంచి ఎవరి బిల్లు వారే చెల్లించేలా సీపీడీసీఎల్ వేర్వేరు విద్యుత్తు మీటర్లు బిగించాలని సాధారణ పరిపాలన విభాగం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఈ వోను కోరింది. జీఏడీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ శుక్రవారం జీవో జారీ చేశారు. అబ్కారీ భవన్‌కు కరెంట్ కట్:ఆంధ్ర, తెలంగాణ ఎక్సైజ్ శాఖలో విద్యుత్తు బిల్లుల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మీరు చెల్లించాలంటే, మీరు చెల్లించాలని ఎవరికి వారే మిన్నకుండిపోయారు. అబ్కారీ భవన్‌కు రూ.8 కోట్ల విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయి. -
జిల్లా పరిషత్‌కు ‘ఖజానా’ షాక్!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ యంత్రాంగానికి ఖజానాశాఖ షాకిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు చేసిన ఎన్నికల నిధులను విడుదల చేయలేమని తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం పాత బిల్లుల మంజూరు కుదరదని తెగేసి చెప్పింది. దీంతో ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వెచ్చించిన నిధులను సమకూర్చుకునేందుకు.. నిబంధనలకు విరుద్ధంగా మండల పరిషత్‌లలోని సాధారణ నిధులను వాడుకుంటోంది. జిల్లావ్యాప్తంగా మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4.30 కోట్లను కేటాయించింది. దీంట్లో సుమారు రూ.3.60 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ సొమ్మును మే నెలాఖరులోపు వినియోగించుకోవాలని నిర్దేశించింది. జూన్ 2 అపాయింటెడ్ డే కావడంతో ఆ లోపే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన పద్దులను తొలగించి.. జీరో పద్దులను తెరవాలని ప్రభుత్వం సూచించింది. మే రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటికీ జిల్లా పరిషత్ అధికారులు బిల్లుల సమర్పణలో జాప్యం చేశారు. ఈ క్రమంలోనే జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు ఇతర జిల్లాల నుంచి వ చ్చిన ఎంపీడీఓలు.. అదే నెల 24న సొంత జిల్లాలకు తిరిగి వెళ్లిపోయారు. దీంతో ఎన్నికల నిర్వహణా వ్యయానికి సంబంధించిన బిల్లులు/క్లెయిమ్‌లు ట్రెజరీలకు చేరడంలో ఆలస్యమైంది. కొత్త ఎంపీడీఓలు బాధ్యతలు స్వీకరించిన అనంతరం 30వ తేదీన బిల్లులు ప్రతిపాదించినప్పటికీ, వాటిని ఖజానాశాఖ అనుమతించలేదు. జూన్ 2న రాష్ట్రం లాంఛనంగా విడిపోవడంతో ఉమ్మడి రాష్ర్టంలో ఖర్చుచేసిన బిల్లులు మంజూరు చేసేదిలేదని ట్రెజరీ శాఖ కొర్రీ పెట్టింది. ఈ పేచీ తో ఎన్నికలకు వ్యయం చేసిన సుమారు రూ.60 లక్షల నిధుల విడుదల నిలిచిపోయింది. ఎన్నికల నిధుల విడుదలకు రాష్ట్ర విభజన ఆంక్షలు వర్తించవని తొలుత ఖ జానా శాఖ చెప్పడంతోనే బిల్లుల సమర్పణలో జాప్యం జరిగిందని, ఇప్పుడు ఆ శాఖ మాటమార్చడం దారుణమని అంటోంది. ఎన్నికల నిర్వహణలో వినియోగించుకున్న సేవలకుగానూ చెల్లించాల్సిన నిధులను మండల పరిషత్‌లలోని జనరల్‌ఫండ్స్‌తో సర్దుబాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఆయా మండలాల్లో అత్యవసర పనుల నిర్వహణకు నిధులు అందుబాటులో లేకుండా పోయాయని జిల్లా పరిషత్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు నిర్ధేశించిన నిధులపై ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించడం సరికాదని, ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆయన చెప్పారు. -
తొలగని ఆంక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖజానా విభాగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2న అపాయింటెడ్ డే నుంచి తిరిగి చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అపాయింటెడ్ డే పూర్తయినప్పటికీ అంతర్గతంగా విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఖజానా విభాగంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపులతోపాటు కార్యాలయ నిర్వహణ, పెన్షన్లు, ప్రభుత్వ పనులు, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల గ్రాంటులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఖజానా విభాగం ద్వారానే పూర్తవుతాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు రూపొందించిన బిల్లుల ఆధారంగా నిధులను విడుదల చేస్తారు. జూన్ రెండో తేదీ వరకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో జూన్ ఒకటో తేదీ వరకు అన్నిరకాల చెల్లింపులు పూర్తి చేశారు. అయితే కొన్ని కార్యాలయాలు సమర్పించిన బిల్లుల్లో తప్పులు దొర్లడం, మరికొందరు జాప్యం చేయడంతో వారికి సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. రెండో తేదీ తర్వాత వీటిని క్లియర్ చేసుకోవచ్చని భావించిన పలు విభాగాల అధికారులకు తాజాగా ఇబ్బందులు వచ్చిపడ్డాయి. విభజన క్రమంలో భాగంగా సర్వర్ల బదలాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఖజానా శాఖ వెబ్సైట్ నిలిచిపోయింది. వారంపాటు ఇంతే! ఖజానా చెల్లింపుల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు సర్వర్ల విభజన పూర్తికావడానికి నాలుగైదు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజనలో భాగంగా డీడీఓల ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్ అయ్యాయి. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏప్రిల్, మే నెలలకే సరిపోవడంతో.. జూన్‌లో కొత్త బడ్జెట్ వస్తేనే చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ భేటీ తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు చెల్లింపుల సంగతి ఇంతేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త చెక్కులతోనే.. కొత్త రాష్ట్రం ఆవిర్భావంతో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పంచాయతీలు, మండల పరిషత్‌లు అవసరమైన నిధులను ఖజానా శాఖ ఇచ్చిన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన పూర్తయిన నేపథ్యంలో అవన్నీ రద్దయ్యాయి. తిరిగి కొత్త ఎల్ఓసీల ద్వారా నిధుల విడుదల చేయాలని ఖజానా శాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా నిధులు డ్రా చేసే అన్ని కార్యాలయాలకు ఇప్పటికే ఖజానా శాఖ కొత్త చెక్ పుస్తకాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త చెక్కుల ద్వారానే చెల్లింపులు చేపడతామని, పాత చెక్కులు చెల్లవని జిల్లా ఖజానా శాఖ అధికారి ఏ.నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘ప్రత్యేక’ పండుగ
ఆరు దశాబ్దాల పోరాటం ఫలించిన వేళ.. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఎదురవుతున్న వేళ.. తెలంగాణ సంబరం అంబరాన్నంటుతోంది. ఇప్పటికే వేడుకలతో ఊరూ.. వాడా తెలం‘గానం’ మారుమోగుతోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజకీయ పార్టీలు, తెలంగాణ జేఏసీ, ఉద్యోగులు, టీఎన్జీవోలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు ఉత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతున్నాయి. సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కలెక్టర్ అహ్మద్ బాబు సంబంధిత శాఖల అధికారులతో వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సమీక్షించారు. జూన్ 2 అపాయింటెడ్ డేను పురస్కరించుకుని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆటల పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజులపాటు ఈ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు.. ప్రధాన పార్టీలు కూడా ‘తెలంగాణ’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించాయి. టీఆర్ఎస్ శ్రేణులు ఈ ఏర్పాట్లలో మునిగి తేలుతున్నాయి. అధినేత కేసీఆర్ జూన్ 2 నాడే ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మరింత ఉత్సాహంగా సంబరాలు నిర్వహించాలని భావిస్తున్నాయి. ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనుక తమ పార్టీ అధినేత్రి సోనియా కృషి ఎంతో ఉం దని, తెలంగాణ కల సాకరమైన వేళ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. బీజేపీ ఆధ్వర్యంలో కూడా సంబ రాలు నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయిం చింది. జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. టీఎన్జీవోలు.. ప్రజాసంఘాలు.. టీఎన్జీవో, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు సంసిద్ధమయ్యారు. టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఆదివారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం పట్టణంలో ర్యాలీ నిర్వహించి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించాలని భావిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. వారం రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు వారం రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ కళాకారులు భావిస్తున్నారు. తెలంగాణవాదుల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ధూం ధాం కార్యక్రమాలను పలు చోట్ల నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, అన్ని పట్టణాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సిద్ధమయ్యారు. -
మద్యం సరఫరాకు బ్రేక్
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో మద్యం సరఫరా నిలిచిపోయింది. విభజన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు, ఇతర లెక్కలను చూసేందుకు మే 27వ తేదీ నుంచి 2వ తేదీ వరకు బేవరేజెస్ అధికారికంగా సెలవులు ప్రకటించారు. కానీ ఈ సెలవులు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెలవుల నేపథ్యంలో జిల్లాలో మద్యం కొరత తలెత్తకుండా ఎక్సైజ్ శాఖ, బేవరేజెస్ అధికారులు వైన్‌షాపులు, బార్లకు వారి నెలవారీ లెసైన్స్‌ల స్థాయిని బట్టి ముందే కేటాయించారు. ఈ కారణంగా జిల్లాలో మే నెల చివరిలో మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా అంతంతమాత్రంగా విక్రయాలు... జిల్లాలో 156 వైన్స్ షాపులు , 44 బార్లు, మూడు క్లబ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.45 నుంచి రూ. 55 కోట్ల వరకు విక్రయాలు జరుగుతాయి. కానీ గడచిన మూడు నెలలుగా మాత్రం వ్యాపారం మాత్రం ఆశించిన రీతిలో జరుగలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు, దాడులు నిర్వహించారు. దీంతో వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకోకపోవడంతో ఆశించిన మే వ్యాపారం జరుగలేదు. కానీ మే నెలలో మాత్రం రూ.84.73 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. సెలవులతో ఇబ్బంది... వేసవి సెలవులు కావడంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జాన్ 2న అపాయింటెడ్ డే కావటంతో రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి. దీంతో రాష్ట్రం విభజనకు ముందే బేవరేజెస్‌ను రెండు రాష్ట్రాలకు సమపద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మే 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే బేవరేజెస్‌కు కొద్ది రోజుల పాటు మూసి వేయాలని నిర్ణయించి నిల్వ ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పది రోజుల పాటు జిల్లాలో మద్యం సరఫరా లేకపోవడంతో వైన్స్, బారుల్లో అనివార్యంగా కొరత ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో రోజుకు సగటున పదివేల కేసుల మద్యాన్ని విక్రయిస్తుంటారు. నెలాఖరు కావడం, లెసైన్స్ కాలపరిమితి ముగియనుండడంతో వైన్ షాపుల్లో 30 శాతానికి తక్కువగానే మద్యం నిల్వలు ఉన్నాయి. అలాగే ఈ పదిరోజుల్లో విక్రయాలకు గాను జిల్లాలో లక్ష కేసులు మద్యం అవసరం ఉంది. మద్యం డిపోల బంద్ ఇంకొన్ని రోజులు పెరిగే అవకాశం..? డిపోలకు ఈ నెల 2 తేదీన మద్యం వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా పది రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లపై వేసే సీల్, లేబుళ్లు, తెలంగాణ ప్రభుత్వ నూతన సీఎం సంతకం చేసిన తర్వాత బాటిల్‌కు వేయాల్సిన సీల్ మద్యం డిపోలకు వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కనీసం 10 రోజుల సమయం పడుతుందని వైన్ షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ఇదంతా జరిగితే జూన్ 15 వరకు మద్యం సరఫరాకు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
రిజిస్ట్రేషన్లకు విరామం
- నేటినుంచి మూడు రోజులపాటు సర్వర్ నిలిపివేత - జూన్ 2 తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - రాష్ట్రాలకు వేర్వేరు సర్వర్లు నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు విరామం లభించనుంది. ఈ కారణంగా జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూల్లో ఆస్తుల క్రయవిక్రయూలకు సంబంధించిన లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నారుు. ఆస్తుల క్రయ, విక్రయూలు, బహుమతులు వంటి రిజిస్ట్రేషన్లతోపాటు ఈసీ, పీసీల జారీకి బ్రేక్ పడనుంది. మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయ్యే ఎంకంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), పబ్లిక్ నకలు (పీసీ) ధ్రువీకరణ పత్రాల జారీ కూడా నిలిచిపోనుంది. ‘అపాయింటెడ్ డే’ రోజుగా పేర్కొంటున్న జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ సర్వర్లను వేరు చేయనున్నారు. ఈ దృష్ట్యా మే 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరగవు. జూన్ 1 ఆదివారం సెలవు. జూన్ 2న ఆన్లైన్ సర్వర్ సేవలు అందుబాటులోకి వస్తేనే రిజిస్ట్రేషన్లు తిరిగి మొదలవుతారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి ఒకే సెంట్రల్ సర్వర్ ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లావాదేవీలు నిర్వహించింది. జిల్లాలోని 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూల ద్వారా రోజుకు సగటున 300 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నారు. తద్వారా నిత్యం ఆ శాఖకు రూ.1.50 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. వరుసగా మూడు రోజులపాటు రిజిస్ట్రేషన్లు జరగవనే సమాచారంతో అత్యవసరంగా లావాదే వీలు జరపాలనుకునే వారు గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయూల వద్ద క్యూ కట్టారు. విద్యుత్ కోతలు, సర్వర్లు మొరారుుంచడంతో లావాదేవీలు మందకొడిగా సాగారు. -
‘తెలంగాణ పొద్దు పొడుపును స్వాగతిద్దాం’
హైదరాబాద్: సుధీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న సందర్భంగా 10 జిల్లాల్లో రాష్ట్ర ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణలో పొద్దుపొడిచే సమయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పార్టీ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచి అన్ని ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, కాగడా ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. దీపాలంకరణ, బాణసంచా కాల్చడం ద్వారా తెలంగాణకు ఘనస్వాగతం పలకాలని, అపాయింటెడ్ డే 2వ తేదీన పార్టీ తరుపున ఉత్సవాలు చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ జెండావిష్కరణలు, రక్తదాన శిబిరాలు, వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. జూన్ 2ను అవతరణ దినోత్సవంగా పాటించాలి: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం జూన్2న అధికారికంగా అవతరించబోతున్న సందర్భంగా ఏటా ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నిర్ణయించినట్లు చైర్మన్ ఎం. రాజేందర్ రెడ్డి తెలిపారు. జూన్2న వేడుకల్లో భాగంగా ఉదయం 10 గంటలకు అన్ని కోర్టుల ముందు తెలంగాణ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలని జేఏసీ తీర్మానించిందన్నారు. జంట నగరాలు, రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు జెండా ఆవిష్కరణల అనంతరం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్ అసంబద్ధం
* ఢిల్లీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ * ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపొద్దు * మోడీ సన్నిహితులతో మాట్లాడి ఆర్డినెన్స్ వద్దని చెప్పా * హడావుడిగా తెస్తే ప్రధాని తన ముఖానికి మసి పూసుకున్నట్లే * ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలి * పోలవరానికి వ్యతిరేకం కాదు, ఎత్తు తగ్గించాలని కోరుతున్నాం * వార్‌రూమ్‌కు చంద్రబాబు వస్తే స్వాగతిస్తామని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపు ప్రాంతాలను విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నిస్తోందని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాబోయే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే సీఆర్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం అసంబద్ధమని, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యే ముందు మంగళవారం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంట్లో ఆమోదం పొందిన బిల్లుకు విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. నాలుగు రోజుల్లో పార్లమెంట్ సమావేశం కానున్న సమయంలో కొంపలంటుకున్న చందంగా కేబినెట్ తొలి భేటీలోనే ఆర్డినెన్స్‌ను తేవడమంటే అది ప్రధాని తన ముఖానికి మసి పూసుకున్నట్లే అవుతుంది. ప్రధాని దీన్ని పట్టించుకోకుంటే అప్రజాస్వామికంగా వ్యవహరించినట్లవుతుంది. తెలంగాణకు ఏమాత్రం మింగుడుపడని ఈ నిర్ణయాన్ని మోడీ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాకే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో కోరారని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. దీన్ని వ్యతిరేకిస్తున్నా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో మాట్లాడానని, ఆర్డినెన్స్ తేవొద్దని కోరినట్లు చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి నోట్‌నే తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ దాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిసిన వెంటనే ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఫోన్లో మాట్లాడాను. ఇది ఎవరికీ మంచిది కాదని, ఈ నిర్ణయం మోడీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పా’ అని కేసీఆర్ తెలిపారు. ‘రాష్ర్ట విభజన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది. అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉంది. అది కూడా దానికదే జరిగిపోతుంది. ఇప్పుడు చట్టాన్ని మార్చాలంటే ఆర్టికల్ 3ని అనుసరించాలి తప్పితే ఆర్డినెన్స్ ద్వారా చేయలేరు. ఏ రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా, ఒక రాష్ట్రంలోని ప్రాంతాలను ఇంకో రాష్ట్రంలో కలపాలన్నా రెండు ప్రభుత్వాల శాసనసభలను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్టికల్ 3 చెబుతోంది. దీన్ని అనుసరించకుండా ఆదరాబాదరగా చేయడం మంచిది కాదని చెప్పాం. ప్రధాని మా మాటను మన్నిస్తారనే భావిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. దీనిపై మోడీ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని, అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడినట్లు కేసీఆర్ వెల్లడించారు. అయితే మంగళవారం కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరిగినప్పటికీ అందులో పోలవరం అంశం చర్చకు రాకపోవడం గమనార్హం. బుధవారం కూడా కేబినెట్ మరోసారి భేటీ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ఎత్తును తగ్గించాల్సిందే.. ఇక పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డ్యామ్ ఎత్తును తగ్గించి ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు మేం ఏమాత్రం వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుతో 139 గ్రామ పంచాయతీలు ముంపునకు గురవుతున్నాయని నీటి పారుదల శాఖ 111 జీవో ద్వారా తెలిపింది. శబరీ నది ద్వారా వచ్చిన నీటిని ఆంధ్రానే వాడుకోవాలి. దానికి మేము అంగీకరిస్తాం. అయితే నిర్మాణ పద్ధతిపైనే వివాదం ఉంది. గిరిజన ప్రాంతాల ముంపు తక్కువగా ఉండేలా డ్యామ్ ఎత్తును తగ్గించాలి. దీనిపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని టీఆర్ఎస్ అధినేత తెలిపారు. భూకంపాలు రావడానికి అత్యంత ఆస్కారమున్న ప్రదేశాలను దేశంలో పదకొండింటిని గుర్తిస్తే.. అందులో పోలవరం డ్యామ్ కట్టే ప్రదేశం రెండో స్థానంలో ఉందని ఆంధ్రా ప్రాంత ఇంజనీర్లు కూడా చెప్పినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఈ దృష్ట్యానే డ్యామ్ ఎత్తును తగ్గించాలని కోరుతున్నామన్నారు. భద్రాచలం తెలంగాణలో ఉండి ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపితే తలాతోక లేకుండా తయారయ్యే పరిస్థితి ఉంటుందని, దీనిపై మాట్లాడటానికి కేబినెట్లో తెలంగాణ మంత్రులు లేరని ఆయన వ్యాఖ్యానించారు. వార్‌రూమ్‌కు వస్తానంటే ఎవరొద్దన్నారు.. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘వార్ రూమ్ అంటే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం. అక్కడ నాలుగు కంప్యూటర్లు, నలుగురు మనుషులు కూర్చొని వివరాలు, ఫిర్యాదులు తీసుకుంటారు. దీన్ని వివాదం చేస్తానంటే బాబు ఖర్మ. ఆయన ఆలోచన లేకుండా మాట్లాడుతుండు. వార్ రూమ్‌కు నేనే వస్తానంటే.. ఎవరొద్దన్నారు. మేము స్వాగతిస్తున్నాం’ అని బదులిచ్చారు. కేంద్రం నుంచి కొత్త రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవడంపై మాట్లాడుతూ... తాము 11 మంది ఎంపీలం ఉన్నామని, రాష్ర్ట వాటా కోసం కొట్లాడి సాధించుకుంటామని చెప్పారు. -
పోస్టింగ్‌ల కోసం ప్రదక్షిణలు!
సత్తుపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది...నూతన ప్రభుత్వమూ అధికారంలోకి రానుంది...ఇక మంచి పోస్టింగ్‌ల కోసం అధికారులు హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పలువురు అధికారులు తమకు తెలిసిన టీఆర్ఎస్ నేతలను వెంటబెట్టుకొని అగ్రస్థాయి నేతల వద్దకు వెళ్లి తెలంగాణ ఉద్యమం, సకలజనుల సమ్మెలో ఎట్లా పని చేశామో ఏకరువు పెడుతూ తమ బయోడేటాలను వాళ్ల ముందు ఉంచుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలతో జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లో మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉండటంతో మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభించారు. ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో ఆరాతీస్తూ... తమ పనిని చేయించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీస్ శాఖలో కూడా బదిలీలు జరగవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ పది తరువాతనే.... జూన్ 2 అపాయింటెడ్ డే రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పరిపాలనపై పూర్తి పట్టు సాధించేందుకు అధికార యంత్రాంగం కూర్పుపై ఆయన దృష్టిసారించే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీ నుంచి ఇతర జిల్లాల్లో పని చేసిన అధికారులను సొంత జిల్లాలకు బదిలీపై తిరిగి పంపించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈలోగానే తమతమ పరిచయాలతో మంచి పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడకు బదిలీపై వచ్చిన అధికారులు కూడా ఆయా జిల్లాల్లో కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే వారిలో కొందరు అధికారులు ఈ జిల్లాలోనే పని చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా బదిలీల మాటే. ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతారు.. కొత్తవారు ఎవరు పోస్టింగ్ తెచ్చుకుంటారోనని చర్చలు జోరుగా సాగుతున్నాయి. -
కొత్త రాష్ట్రం.. కొత్త సిరీస్..!
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వాహనాల రిజిస్ట్రేషన్, సిరీస్ నంబర్లు మారనున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబరు ఏపీతో మొదలయ్యేది. ఆదిలాబాద్ జిల్లా పేరు ఇంగ్లిషు అక్షరం ‘ఏ’తో ప్రారంభం కావడంతో, ఇంగ్లిష్ అక్షరమాలలో ‘ఏ’ మొదటిది కావడంతో మన జిల్లాకు ఏపీ 01 అనే సిరీస్‌తో ఇప్పటివరకు వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే ఉండడంతో, ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలుగా విడిపోయాయి. రాష్ట్ర రవాణాశాఖ అపాయింటెడ్ డే(జూన్ 2) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు రెండు రాష్ట్రాల్లో వేరు వేరుగా నిర్వహించనున్నాయి. తెలంగాణలోని జిల్లాలకు వాహనాల రిజిస్ట్రేషన్ ‘టీజీ’తో మొదలయ్యే అవకాశాలు ఉండడంతో, ‘టీజీ 01’ అనే మొదటి సిరీస్ నంబరును మన జిల్లాకే కేటాయించనున్నట్లు సమాచారం. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల మార్పుతో మరో రెండు, మూడు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పాత వాహనాలకు మారని సిరీస్ గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జిల్లా వాహనదారులకు ఇప్పటివరకు ఏపీ 01 సిరీస్ కేటాయిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఏపీ సిరీస్ నుంచి టీజీ సిరీస్‌కు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మారనున్నాయి. దీంతో ఇది వరకే ఏపీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారుల్లో గం దరగోళం నెలకొంది. పాత నంబర్ల ఆధారంగా నే ఇప్పటికే ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు(ఆర్సీ) వాహనదారులకు అందించారు. జిల్లాలో లక్షల సంఖ్యలో వాహనాలు పాత సిరీ స్(ఏపీ 01)తో ఉన్నాయని, ఆయా వాహనాల నంబర్లను మార్చడం కుదరదని, అపాయింటెడ్ డే వరకు రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు ఏపీ 01 అనే సిరీస్‌తోనే నంబర్లను ఇవ్వనున్నట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనదారులు టీజీ సిరీ స్తో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు కావాలం టే, అపాయింటెడ్ డే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంలో కొత్త సిరీస్ నంబర్లతోనే వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని వాహనదారుల అభిప్రాయం. మంచిర్యాల జిల్లాగా మారితే! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 24 జిల్లాలుగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండడంతో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాలు 10 ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలోనే ఏడు సిరీస్‌లు ఉన్నాయి. దీంతో తెలంగాణలోని 10 జిల్లాలకు 15 సిరీస్‌ల వరకు నంబర్లను కేటాయిస్తున్నారు. కొత్త జిల్లాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మంచిర్యాల కూడా జిల్లాగా మారనుంది. దీంతో మంచిర్యాల జిల్లాకు ఏ నంబరు సిరీస్‌ను అందిస్తారోనని వాహనదారుల్లో ఉత్కంఠ నెలకొంది. 01 నుంచి 15 వరకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు నంబర్లను కేటాయిస్తుండగా, కొత్తగా ఏర్పాటయ్యే మంచిర్యాలకు ఆ తరువాత నంబరును కేటాయిస్తారా? లేదంటే ఇంగ్లిష్ అక్షరమాల ప్రకారం మరోసారి సిరీస్‌లను క్రమబద్ధీకరిస్తారా? అనే విషయాలపై స్పష్టత లేదు. ఒకవేళ అక్షరమాల ప్రకారం నంబర్లను కేటాయిస్తే టీజీ 13 వచ్చే అవకాశం ఉందని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త జిల్లాలు ఏర్పడితే వాహనాల రిజిస్ట్రేషన్ల నంబర్లు మారనుండడంతో, వాహనదారుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. దీంతో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలను, తీసుకునే రిజిస్ట్రేషన్ నంబర్లను తెలంగాణ అప్పాయింటెడ్ డే తరువాతే తీసుకోవాలన్న ఆలోచనలో వాహనదారులు ఉన్నారు. దీంతో వాహన కొనుగోళ్లు మందగించినట్లు సమాచారం. -
అస్తవ్యస్తం.. అసమగ్రం.. అస్పష్టం
జూన్ 2 ముంచుకొస్తున్నా నత్తనడకన విభజన ప్రక్రియ మే 15 నాటికి పూర్తవ్వాలన్న గవర్నర్ ఆదేశాలు గాలికి ఉద్యోగుల కేటాయింపుపై ఇంకా రగడే స్థానికతను ఉల్లంఘించారంటూ ఆరోపణలు ‘రెండు రాష్ట్రాల ప్రయోగాత్మక పాలన’ ఊసే లేదు ఐఏఎస్‌ల కేటాయింపే ఇంకా కొలిక్కి రాలేదు 20 సంస్థలను విభజించాలి... పూర్తయింది రెండే సచివాలయం, అసెంబ్లీల విభజన ఉత్తర్వులే రాలేదు డిజిటైజ్డ్ ఫైళ్లను ఎవరికి అప్పగించాలో అయోమయం సాక్షి, హైదరాబాద్: అంతా అయోమయం... గందరగోళం... అసమగ్రం... అసంపూర్ణం. వెరసి... విభజన ప్రక్రియ ఆద్యంతం అస్తవ్యస్తం! ఓ వైపు అపాయింటెడ్ డే అయిన జూన్ 2 ముంచుకొస్తున్నా విభజన ప్రక్రియ మాత్రం ఇంకా నత్త నడకనే సాగుతోంది. దాంతో... మే 26 నుంచి ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాల పాలన వ్యవస్థలు విడిగా కార్యక్రమాలు ప్రారంభించాలని తొలుత భావించినా అదిప్పుడు సాధ్యం కావడం లేదు. చివరి నిమిషం దాకా ఏదీ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. పాలనకు గుండెకాయగా చెప్పే సచివాలయంలోనే విభజన ఇంకా ఎటూ తేలలేదు. బ్లాకులవారీగా ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరిపినా ఏ కార్యాలయం ఏ బ్లాకులో పని చేయాలనే విషయమై సాధారణ పరిపాలన శాఖ ఇప్పటిదాకా ఉత్తర్వులే జారీ చేయలేదు. ఉద్యోగుల తాత్కాలిక విభజన ఉత్తర్వులు వెలువడి, వారు ఏ రాష్ట్రంలో పని చేయాలన్న స్పష్టత కూడా ఇంకా రావాల్సే ఉంది. విభజన తరువాత వారు ప్రస్తుత శాఖల్లోనే పని చేయాలా, మరే శాఖకైనా మార్చి సర్వీసు ఆర్డర్ ఇస్తారా అంటూ ఉద్యోగుల్లో నెలకొన్న సంశయాన్ని తీర్చే నాథుడే లేడు! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీని జూన్ 2గా పేర్కొంటూ మార్చి 4న కేంద్రం అపాయింటెడ్ తేదీని ప్రకటించడం తెలిసిందే. అప్పటి నుంచి విభజన ప్రక్రియ కోసం 22 రకాల కమిటీల ఏర్పాటు, అధ్యయనాలు, సమావేశాలు, సర్క్యులర్ల జారీ తదితరాలన్నీ జరిగాయి. కానీ గడువు ముంచుకు వచ్చిన ఈ సమయంలోనూ ప్రక్రియ ఇంకా పూర్తి కావడమే లేదు. దాదాపు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నా విభజన ప్రక్రియలో ఆశించిన వేగం మాత్రం కనిపించడం లేదు. దీనిపై కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక సీఎంలిద్దరూ దీన్ని సజావుగా పరిష్కరించుకునే అవకాశమున్నా ముందుగానే విభజనను చేపట్టి జటిలం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఖాతాను ప్రారంభించడం, ట్రెజరీ కార్యాలయాలు, వాణిజ్య పన్నుల శాఖలో టిన్ నంబర్ కేటాయించడం మాత్రం ఇప్పటిదాకా జరిగాయి. ఈ రెండూ జూన్ 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. విభ జనకు సంబంధించి అంశాలవారీగా పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే... అసెంబ్లీ, శాసనమండలి ఇబ్బంది: వీటి కేటాయింపుపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత స్వీకరించాక గాని దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. వారిని సంప్రదించకుండా వీటిని కేటాయిస్తే అనవసర రాద్ధాంతం తప్పకపోవచ్చు. ప్రస్తుత అసెంబ్లీని తెలంగాణకు, పాత అసెంబ్లీ భవనాన్ని సీమాంధ్రకు; ప్రస్తుత శాసనమండలిని తెలంగాణకు, జూబ్లీ హాల్‌ను సీమాంధ్ర మండలికి అని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో భావించారు. కాని ఎందుకో గానీ ఆ తరవాత దీనిపై అధికారులకే స్పష్టత లేకుండా పోయింది! కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపు ఇబ్బంది: దీనికోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది నివేదిక ఇంకా ఇవ్వనే లేదు. నివేదిక ఆధారంగానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపు ఉంటుంది. వారికి ఆప్షన్లుండవని తెలిసి కూడా ‘ఏ రాష్ట్రంలో పని చేయడానికి ఆసక్తి ఉందో తెలపండి’ అంటూ అధికారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు తీసుకున్నారు. వారికి పోస్టింగులు ఎలా, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. వారికి పోస్టింగులిస్తే తప్ప పాలన సాధ్యమే కాదు. ఈ మార్గదర్శకాలకు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఆయన ఆమోదం తెలపాల్సి ఉంది. జూన్ 1 అర్ధరాత్రి వారి పోస్టింగులపై స్పష్టత ఇస్తారంటున్నా, ఆ మర్నాటి నుంచే రెండు రాష్ట్రాలూ విడిగా కార్యకలాపాలు ప్రారంభించడం కష్టసాధ్యంగానే కన్పిస్తోంది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ఇబ్బంది: ఇది మే 25 నాటికి పూర్తయి 26 నుంచి రెండు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా విడిగా పని చేయాలన్నది నిర్ణయం. కానీ అది అమలు కావడం లేదు. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల్లో స్థానికత వివాదం తలెత్తింది. పైగా ఈ జాబితాను కేంద్రానికి పంపాలి. వారు అన్నీ సమగ్రంగా ఉన్నాయో, లేదో పరిశీలించాలి. కేంద్రం ఆమోదం పొందితే తప్ప ఉద్యోగుల కేటాయింపు కొలిక్కి రాదు. పైగా కేటాయింపులో స్థానికతను సరిగా పాటించలేదు. ఇంకా పలు అభ్యంతరాలను ఉద్యోగులు లేవనెత్తుతున్నారు. వారి మధ్య ఇంకా మరెన్నో సమస్యలున్నాయి. అవన్నీ ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియదు. కార్పొరేషన్లు/సంస్థల విభజన ఇబ్బంది: జూన్ 2 నాటికి 20 ప్రభుత్వ రంగ సంస్థలు/సహకార సంస్థలను విడదీయాలన్నది లక్ష్యం. కానీ ఇప్పటికి కేవలం ఆర్టీసీ, జెన్కోలను మాత్రమే విభజించారు. మిగతా సంస్థల విభజన ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. తాజాగా మరో 38 సంస్థలను ప్రస్తుతానికి విభజనకు దూరంగా ఉంచుతూ పదో షెడ్యూల్లో పొందుపరిచారు. విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు, ఉన్నత విద్యామండలి విభజనపై సైతం సందిగ్ధతే కొనసాగుతోంది. ఏపీపీఎస్సీ స్థానంలో తెలంగాణకు టీపీఎస్సీ ఏర్పాటుపై అధికార వర్గాల్లోనే స్పష్టత లేదు. రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు, నంబర్లపై సైతం ఇప్పటికీ ఆ శాఖ అధికార వర్గాల్లో కూడా అయోమయమే నెలకొని ఉంది! భవనాలు, హెచ్ఓడీ కార్యాలయాలు ఇబ్బంది: భవనాల కేటాయింపునకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులూ వెలువడలేదు. కేవలం లీకులతోనే కాలం గడుపుతున్నారు. సచివాలయంలోని నాలుగు బ్లాకులను తెలంగాణకు, ఐదింటిని సీమాంధ్రకు కేటాయించినట్టు బయటకొచ్చినా.. వాటిపై ఇంకా తుది ఉత్తర్వులు రాలేదు. ఈ బ్లాకుల కేటాయింపు పూర్తయితే తప్ప ఆయా బ్లాకుల్లో ఏ ఫ్లోర్ ఏ శాఖకు కేటాయించాలన్నది సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించలేదు. పలు విభాగాల అధిపతుల కార్యాలయాల్లోనూ ఇరు రాష్ట్రాలకు వసతి సౌకర్యాలు ఏ మేరకు ఇవ్వాలన్న దానిపై ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. మంత్రుల నివాసాలు ఇబ్బంది: దీనిపైనా అధికారులు ఇంకా దృష్టి సారించలేదు. బంజారాహిల్స్, కుందన్‌బాగ్‌లో మంత్రుల నివాసాలున్నాయి. వాటిలో వేటిని ఎవరికివ్వాలి, ఒక రాష్ట్ర మంత్రులకు పూర్తిగా ఒకవైపు ఇవ్వాలా, లేక వారు కోరే విధంగా కేటాయించాలా వంటి పలు అంశాలపై ఇంకా సందిగ్ధమే నెలకొని ఉంది. తనకు కేటాయించిన తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్దని, దాన్ని కుందన్‌బాగ్‌లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనకు క్యాంపు కార్యాలయంగా కేటాయించిన లేక్‌వ్యూ అతిథి గృహం అక్కర్లేదని, ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని చెబుతున్నారు. ఆయన కోసం సచివాలయంలో ముస్తాబు చేస్తున్న ‘హెచ్ ’ బ్లాక్ వాస్తుపరంగా బాలేదని ఆయన మనుషులు తాజాగా శనివారం తేల్చారు. ఇప్పుడు కొత్తగా ‘ఎల్’ బ్లాక్‌ను పరిశీలించారు! ఫైళ్ల డిజిటైజేషన్ ఇబ్బంది: ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. కానీ ఈ ఫైళ్లను ఎవరికి అప్పగించాలి, ఆ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలేవీ ఇవ్వలేదు. సిబ్బందిని కొత్త రాష్ట్రానికి పంపిణీ చేశాక ఈ కంప్యూటర్లను ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తీసుకెళ్లాలో లేదో కూడా తెలియని పరిస్థితి! ఉద్యోగుల విభజనపై కసరత్తు మళ్లీ మొదటికి రాష్ట్ర విభజనలో కీలకాంశమైన ఉద్యోగుల విభజనపై ఇప్పటి వరకూ జరిగిన కసరత్తు మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగుల విభజనలో సీనియారిటీ, స్థానికత అంశాలు అసమగ్రంగా ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతుండగా.. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి(ఎంసీహెచ్ఆర్డీ) కేంద్రంలో రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అనుమానాలు, సందేహాలను తెలుసుకుని రమేశ్ నివృత్తి చేయనున్నారు. -
సింగరేణిలో స్థానికేతరుల సంగతేంటి?
శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : ‘మన తెలంగాణ.. మన సింగరేణి..’ అని నినదిస్తూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కార్మికులు ఇక న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాల్లో వాటా కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో ఉల్లంఘించి అక్రమంగా సింగరేణి లో తిష్టవేసిన అధికారులు, ఉద్యోగులను తిప్పి పంపిస్తారన్న చర్చ జరుగుతోంది. జూన్ 2 అపాయింటెడ్ డే దగ్గర పడుతున్నా సింగరేణిలో ఉద్యోగుల విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదు. విభజన మార్గదర్శకా లు ప్రభుత్వం ఇచ్చిందా?ఇవ్వాలేదా?యాజమాన్యం ప్రకటించడం లేదు. అసలు కంపెనీలో ఉద్యోగుల వి భజన ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు వ్య క్తం అవుతున్నాయి. సంస్థలో స్థానికేతరులు 1,500 మంది అధికారులు, సుమారు 4వేలకుపైగా ఉద్యోగు లు పని చేస్తున్నారని జేఏసీ పేర్కొంటుంది. రాష్ట్రంలో వాడివేడిగా ఉద్యోగ విభజన జరుగుతుంటే సింగరేణి లో మాత్రం ఉలుకు పలుకు లేదు. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ శాఖ ల్లో ఉన్న స్థానికేతరుల జాబితా సిద్ధమైంది. రాష్ట్ర కేడ ర్ ఉద్యోగాల్లో పంపకాలు జరిగాయి. సెక్రెటరేట్ మొ దలుకుని పలు శాఖల్లో విభజన వేగం పుంజుకుంది. జిల్లాలవారీగా కూడా స్థానికేతురుల రిపోర్టు ప్రభు త్వం తెప్పించుకుంటుంది. కానీ, సింగరేణిలో మా త్రం విభజన వాతావరణం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణే. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ ఉండేది. ఇప్పడు ఆర్టీసీలో కూడా ఉద్యోగ విభజన జరుగుతుండటంతో సింగరేణే అతిపెద్ద సంస్థగా అవతరించింది. తెలంగాణ అధికారుల ఎదురుచూపు సింగరేణిలో 2,600 మంది అధికారులు పని చేస్తున్నా రు. ఇందులో సుమారు 1,500 మంది స్థానికేతరులే. కీ పోస్టుల్లో ఉన్నది వారే. అసిస్టెంట్ సూపరింటెండెంట్లుగా కూడా ఎక్కువ మంది సీమాంధ్ర ప్రాంతాని కి చెందిన వారే ఉన్నారు. అక్కడక్కడ బీహార్, బెంగా ల్ వారు కూడా ఉన్నారు. విభజన జరుగుతున్నందు న స్థానికేతరులను వెనక్కి పంపిస్తే తమకైన పదోన్నతులు వస్తాయని తెలంగాణ ప్రాంత అధికారులు ఎ దురుచూస్తున్నారు. సివిల్,పర్చేస్, ఫైనాన్స్ వంటి వి భాగాల్లో వారే ఎక్కువగా ఉన్నారు. ఏజెంటు కార్యాల యాలు, జీఎం కార్యాలయాల్లో, కొత్తగూడెం కార్పొరే ట్ కార్యాలయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవో ఉల్లంఘించి ఎక్కువ మంది పని చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అక్రమంగా తిష్టవేసిన వారందరిని తిప్పి పంపించి ఆ పోస్టుల్లో అర్హులైన తెలంగాణ వారి తో భర్తీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నాక మన ఉద్యోగాలు మనకు దక్కకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ పోస్టులో.. ఇదిలా ఉంటే సింగరేణిలో ఉన్న కొందరు స్థానికేతరులైన అధికారులు తెలంగాణపై వివక్ష చూపుతున్నారనడానికి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంటే నిదర్శనం. 60 ఏళ్లు పోరాడింది మన ప్రాంత ఉద్యోగాలు మనకే ద క్కాలని, ఒక పక్క విభజన జరుగుతుంతే మరో పక్క కంపెనీలోని ఉద్యోగాలు స్థానికేతరులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ధన్బాద్లో ఈ నెల 20న క్యాంపస్ సెలక్షన్స్ పేరుతో ఈ పోస్టుల భర్తీకి పూనుకున్నారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. మొత్తం 20 పోస్టులు ఇందులో ఉన్నాయి. ఆ ప్రాంతానికి చెందిన వారికి ప్రయోజనం చేకూర్చడం కోసమే సింగరేణిలో పని చేసే ఆ రాష్ట్ర అధికారులు కొందరు దీని వెనుక మంత్రాంగం నడిపారని విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఎంతో మంది కార్మికులు పిల్లలు ఉన్నత చదువులు చదివి విదేశాల్లో నేడు కొలువులు చేస్తున్న ఈ రోజుల్లో ఇక్కడ ఆ పోస్టులను ఇక్కడి వారిని కాదని ఎవరికో కట్టబెట్టడం ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సింగరేణి సీఅండ్ఎండీతో మాట్లాడి ఈ పోస్టుల భర్తీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ దృష్టి సారించాలి.. సింగరేణిలో విభజన పర్వంపై ప్రభుత్వంలో కూర్చోబోయే టీఆర్ఎస్ పార్టీ నేతలు దృష్టిసారించాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. సింగరేణిలో ఉద్యోగ విభజనపై ఈ ప్రాంత టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలని కోరుతున్నారు. దీనిపై గుర్తింపు సంఘంబాధ్యత ఉందని పేర్కొంటున్నారు. -
ఖజానా కార్యాలయాలు కిటకిట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘సమైక్య’ బొక్కసానికి త్వరలో గడువు ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో ఆలోపు ఉమ్మడి రాష్ట్రం ఖాతా నుంచి ఇరుప్రాంతాలకు సంబంధించిన చెల్లింపులు వీలైనంత త్వరితగతిన పూర్తిచేయాలని సర్కారు భావించింది. దీంతో ఈ నెల 25వ తేదీ నాటికి ఉద్యోగుల జీతాలతో సహా అన్ని రకాల చెల్లింపులు చేపట్టేందుకు యంత్రాం గం చర్యలు వేగిరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 21లోగా అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు ఖజానా అధికారులకు చేరవేస్తే.. ఆ ప్రకారం చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తారని ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో బిల్లుల సమర్పణకు దిగిన అధికారులు గడువులోగా ప్రక్రియ పూర్తిచేశారు. బిల్లుల సమర్పణకు బుధవారం ఆఖరు తేదీ కావడంతో అధికారుల్లో హడావుడి మరింత పెరిగింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కార్యాలయ నిర్వహణ తదితర బిల్లులతో సహా.. తాజా బిల్లులన్నీ కట్టకట్టి ఖజానా అధికారులకు సమర్పించే పనిలోపడ్డారు. జిల్లా ఖజానా శాఖ పరిధిలో 34 ప్రభుత్వ శాఖలకు సంబంధించి చెల్లింపులు జరుగుతున్నాయి. అదేవిధంగా 9 ఉప ఖజానా శాఖల పరిధిలో మండల కార్యాలయాలతో పాటు మిగిలిన జిల్లా శాఖ కార్యాలయాలకు సంబంధించి చెల్లింపులు చేపడుతున్నారు. బుధవారం చివరిరోజు కావడంతో ఆయా కార్యాలయాలన్నీ బిల్లుల సమర్పణలతో కిటకిటలాడాయి. కొన్నిచోట్ల చిన్నపాటి తప్పిదాల కారణంగా బిల్లులు సమర్పించలేదు. ఉద్యోగులకు మే నెల వేతనాలు కూడా ఈ నెల 25లోపు రానున్నాయి. అంతేకాకుండా జూన్ నెల 2న అపాయింట్మెంట్ తేదీ ఉన్నందున ఒకటోతేదీకి సంబంధించిన వేతనం కూడా ఈలోపు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగులు నిధులు వెనక్కి.. అపాయింట్మెంట్ తేదీ నాటికి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి(డీడీఓ)ల ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉండాలి. అయితే చెల్లింపుల ప్రక్రియ పూర్తయినప్పటికీ.. మిగులు నిధులుంటే వాటిని ఈ నెల 27తేదీ లోపు సంబంధిత ఉన్నతాధికారి కార్యాలయంలో జమ చేయాల్సి ఉంటుంది. దీంతో మిగులు లెక్కలు తేల్చడంలో డీడీఓలు బిజీ అయ్యారు. చిల్లిగవ్వైనా సరే మిగిలి ఉంటే వాటిని వెంటనే హెడ్ఆఫీస్ ఖాతాలో జమచేసి అందుకు సంబంధించిన రసీదులను సంంబధిత అధికారులకు చేరవేయాలని జిల్లా ఖజానా శాఖ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
సస్పెన్స్..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాల భవితవ్యం పూర్తిస్థాయిలో తేలనుంది. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో పేర్కొన్న విధంగా అపాయింటెడ్ డే తర్వాత 136 రెవెన్యూ గ్రామాలు సాంకేతికంగా జిల్లా నుంచి విడిపోయి సీమాంధ్రలో కలుస్తాయి. అయితే.. ఈ గ్రామాల పరిపాలన, ఇక్కడి ప్రజలకు పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన ఏ ప్రభుత్వం చూడాలనే దానిపై మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియపరిస్తే ఆ మేరకు ఆర్టినెన్స్లో పేర్కొని ఆమోదిస్తారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్పాయి. అయితే, ఈలోపు ముంపు ప్రాంతాలను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ, ఏ గ్రామం ఏ ఎంపీటీసీ స్థానం పరిధిలోనికి వెళుతుంది... ఏ జడ్పీటీసీ స్థానం కిందకు వెళుతుంది అనే అంశాలపై నోటిఫికేషన్ వెలువడనుంది. కేంద్ర అధికారితో కలెక్టర్ భేటీ... పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిపై చర్చించేందుకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ మంగళవారం రాజ్‌భవన్‌లో కేంద్ర ఉన్నతాధికారి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్న రాజీవ్‌శర్మ కలెక్టర్‌ను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే ప్రాంతాలు కనుక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అక్కడి ప్రజల పాలన ఎలా? పన్నుల వసూళ్లు ఎలా చేయాలి? వారికి పునరావాసం ఏ ప్రభుత్వం కల్పించాలి? అందుకు సంబంధించిన నిధులెక్కడి నుంచి వస్తాయి? అసలు పునరావాసం కింద గోదావరి జిల్లాలకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు అంగీకరిస్తారా? అంగీకరించని పక్షంలో ఖమ్మం జిల్లాలోనే పునరావాసం కల్పించే అవకాశం ఉందా? అనే అంశాలపై సమగ్ర వివరాలను తెలుసుకున్నారు. అయితే, పునరావాస కల్పన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెపుతారని, ఇందుకు సంబంధించిన నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికార వర్గాలంటున్నాయి. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే పరిపూర్ణం... కాగా, పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న కొన్ని మార్పుల మేరకు కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాలను మళ్లీ తెలంగాణలోకి తేవాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాల అభిప్రాయం మేరకు కూడా ఆర్డినెన్స్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, మొదటి నుంచీ భద్రాచలం పట్టణంతో సహా ఆ డివిజన్ మొత్తాన్ని పూర్తిగా సీమాంధ్రలోనే విలీనం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో కూడా సాధారణ మెజారిటీతో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్‌లో భద్రాచలాన్ని పూర్తిగా సీమాంధ్రలో కలుపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశం లేనందున ముంపు ప్రజలను ఇప్పుడే సీమాంధ్ర పాలనలోనికి తీసుకెళ్లడం ఇబ్బందేననే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాల కన్నా ఖమ్మంతోనే అనుబంధం ఎక్కువ ని, వారిని ఇక్కడ ఉంచడమే మేలని, పునరావాసం కూడా ఇక్కడే కల్పిస్తే, ముంపు ప్రాంతంలోని భూభాగాన్ని మాత్రమే సీమాంధ్రలో కలపవచ్చనే వాదన కూడా అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే ముంపు ప్రాంతాల భవిష్యత్తును తేల్చడంలో కీలకం కానున్నాయి. -
ముంచుకొస్తున్న గడువు...!
కొత్త పరిపాలనకు రోజులు దగ్గర పడ్డాయి. జూన్ 2న తెలంగాణ అపాయింటెడ్ డే అమలు అవుతుంది. అయితే ఈ నెల 26వ తేదీ నుంచే రెండు ప్రాంతాల్లో వేర్వేరు పరిపాలన సాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగుల విభజన పూర్తయింది. పాలనాపరమైన అంశాలైన ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ, ఇతర బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇన్నాళ్లూ ఎన్నికల విధుల్లో బిజీబిజీగా గడిపిన అధికారులు ఇప్పుడు విభజన హడావుడిలోనూ బిజీగా ఉన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ పాలన స్తంభించింది. సాక్షి, కడప: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖజానా లావాదేవీల హడావుడి మొదలైంది. జూన్ రెండున రాష్ట్రం వేరుపడనున్న నేపథ్యంలో ఓటాన్ బడ్జెట్‌తోనే మొదటి త్రైమాసిక ఖాతాలోకి నిధులు వచ్చేశాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చిన నిధులను ఆయా శాఖలు ఖర్చు చేసుకోవాలంటూ జీవో 86ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆగమేఘాలపై బిల్లులు వచ్చి పడుతున్నాయి. అయితే ఎన్నికల విధులతో బిజీబిజీ ఉన్న కొందరు అధికారులు బిల్లులు సమర్పించలేదు. ఈ నెల 24నే వేతనాలు చెల్లించేందుకు ప్రణాళికలు: జిల్లాలో ఖజానాశాఖ పరిధిలో 26వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ. 80కోట్ల వేతనాలు ఇవ్వాలి. వీరితో పాటు పింఛనుదారులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలాఖరున కొందరు పదవీవిరమణ చేయబోతున్నారు. వీరందరి...అన్ని రకాల ఖర్చులకు ఈ నెల 24వ తేదీ గడువు విధించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మొదటి త్రైమాసికం బడ్జెట్‌తో సంబంధం లేకుండానే ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మే నెల ఉద్యోగుల వేతనాల బిల్లును సమర్పించేందుకు ఈ నెల 15వ తేదీ ఆఖరి గడువుగా విధించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 19 వరకూ గడువు పెంచారు. రాష్ట్ర విభజన జూన్ 2న జరుగుతున్నందున జూన్ ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సంబంధించిన బిల్లులను కూడా ఉద్యోగులు ఇప్పటికే చెల్లించినా...ఇంకా కొంతమంది చెల్లించలేదు.. అయితే గడువు విషయం ఇప్పటి వరకూ చాలామందికి తెలీదు. ఎన్నికల విధినిర్వహణలో బిజీబిజీగా ఉండి చాలామంది బిల్లులు కూడా సిద్ధం చేసుకోలేదు. జీతాలు మినహా బిల్లులు చెల్లించడానికి 2 రోజుల గడువు పొడిగించారు. విభజన హడావుడి: అపాయింటెడ్ డేను జూన్2వ తేదీగా ప్రభుత్వం ప్రకటించినా...ఈ నెల 26వ తేదీ నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేరుగా పరిపాలన సాగనుంది. దీంతో ఉద్యోగుల విభజన నుంచి అన్ని రకాల ప్రక్రియలు 25లోపే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల జీపీఎఫ్, పండుగ అడ్వాన్సుల బిల్లులను, కంటింజెంట్ బిల్లులను ఇప్పటికే చెల్లించేశారు. ఈ నెలాఖరున పదవీవిరమణ చేసే వారు కూడా ఈ నెల 24లోపే బిల్లులు సమర్పించాలి. గ్రాట్యూటీ, పదవీవిరమణ లబ్ధి నెలాఖరునే సంబంధిత లబ్ధిదారులకు అందజేస్తారు. ఎన్నికల వ్యయానికి సంబంధించి బిల్లులను కూడా ఈ నెల 24వ తేదీలోగా సమర్పించాలి. ఓటాన్ బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రెండు నెలలకు సరిపడా నిధులను ఖజానాకు ప్రభుత్వం విడుదల చేసింది. స్త్రీ శిశుసంక్షేమ శాఖలోని అన్ని రకాల బిల్లులను ఒకే ఖాతా కింద చెల్లింపునకు ప్రత్యేక అనుమతి లభించింది. ఐసీడీఎస్ పరిధిలోని పథకాలు, ఇతర బిల్లులకు చెల్లింపు ఎక్కడా ఆపకుండా ఇవ్వమని ఆదేశాలు ఉన్నాయి. ప్రణాళికా బిల్లులను కూడా ఒకే పద్దు కిందకు తెచ్చి వాటి చెల్లింపునకు కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆయా ఎన్నికల బిల్లులను కూడా ఈ నెల 24లోగా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత బిల్లులు వస్తాయో...రావో తెలీని పరిస్థితి ఉందని ఖజానా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గడువు పెంపుపై ఆదేశాలు రాలేదు - రంగప్ప, ట్రెజరీ డీడీ, కడప సోమవారం(19)తో బిల్లుల చెల్లింపునకు గడువు ముగిసింది. గడువు పెంపుపై ఇప్పటి వరకూ డెరైక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నెల 24నే వేతనాలు అందుతాయి. విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. -
ఏ గ్రామం ఏ రాష్ట్రంలో !?
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను అధికారికం చేసే అపాయింటెడ్ డే అతి సమీపంలోనే ఉంది. ఈతరుణంలో విభజనతో కీలక సంబంధం ఉన్న జిల్లా స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై అధికార యంత్రాంగం కసరత్తును పూర్తి చేసింది. పోలవరం ముంపు ప్రాంతంలోని 136 రెవెన్యూ గ్రామాలను సీమాంధ్రలో కలపాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పేర్కొన్న మేరకు ఏ గ్రామాలు ఏ రాష్ట్రంలోకి వెళతాయనే ప్రాతిపదికన జిల్లా స్వరూప చిత్రాన్ని అధికారులు తయారుచేశారు. ఈ చిత్రం ఆధారంగా తెలంగాణ, సీమాంధ్రలో కలిసే గ్రామాలపై ప్రత్యేకంగా చర్చించడం కోసం జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ మంగళవారం రాజ్‌భవన్‌కు వెళుతున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్‌తో సమావేశమై ముంపు ప్రాంతాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముంపు ప్రాంతాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, రహదారి ఇబ్బందులున్న గ్రామాల పరిస్థితి, ముంపునకు గురయ్యే ప్రజలకు పునరావాసం, ఏ రాష్ట్రం వాటా ఎంత? ఖర్చు ఎవరు భరించాలి... ఎంత భరించాలి అనే అంశాలపై ఈ సమావేశంలో గవర్నర్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగి అపాయింటెడ్ డే సమయానికల్లా అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనుంది. ఆ గ్రామాలకు వెళ్లేదెలా జిల్లాలోని 7 మండలాలకు చెందిన గ్రామాలను సీమాంధ్రలో కలపాలన్న నిర్ణయం మేరకు.... జూన్ 2 నుంచి 136 రెవెన్యూ గ్రామాలు, 211 హాబిటేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో గోదావరి, కిన్నెరసాని, శబరి నదులతో పాటు దట్టమైన అరణ్యం ఉన్న భద్రాచలం, పాల్వంచ రెవెన్యూ డివిజన్ల స్వరూపమే మారిపోనుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు తయారు చేసిన చిత్రం చూస్తే... అటు తెలంగాణలో, ఇటు సీమాంధ్రలోకి వెళ్లే 73 గ్రామాలకు కనీసం వెళ్లేందుకు రహదారి కూడా లేదు. గోదావరి ఒడ్డునే ఉన్న కొన్ని గ్రామాలను సీమాంధ్రలో కలపగా వీటికి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లాల్సి వస్తోంది. చుట్టూ సీమాంధ్ర గ్రామాలుంటే... కొన్ని గ్రామాలు తెలంగాణలో చూపడంతో తెలంగాణలోని ఆ గ్రామాలకు కూడా రహదారి సౌకర్యం లేకుండా పోతోంది. దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న చోట్ల ఎక్కువ గ్రామాలను తెలంగాణలోనే చూపించగా..., ఇక్కడికి వెళ్లాలన్నా అటవీ ప్రాంతం కంటే ముందున్న సీమాంధ్ర గ్రామాలను దాటి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్‌తో జరిగే భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది వేచిచూడాల్సిందే. మరోవైపు బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలను తెలంగాణలోనే ఉంచేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది కానీ.... అందుకు సంబంధించిన ఆర్డినెన్స్ మాత్రం రాలేదు. దీంతో ఆగ్రామాలను కూడా సీమాంధ్రలో చూపెట్టారు. మరి ఈ గ్రామాలను ఏం చేస్తారన్నది అంతుపట్టడం లేదు. ఒకసారి తెలంగాణ నుంచి సీమాంధ్రకు పంపి, మళ్లీ ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ తెలంగాణకు తెస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇక, రహదారి సౌకర్యమే సరిగా లేని ఈ గ్రామాల్లోని ప్రజలకు ఏ ప్రభుత్వం సేవలందించాలి.... పన్నులు ఎలా వసూలు చేయాలి... పున రావాసం ఎవరు, ఎక్కడ కల్పించాలన్న దానిపై కూడా గవర్నర్‌తో జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ముంపు చిత్రం ప్రకారం జిల్లా నుంచి విడిపోనున్న గ్రామాలివే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా జిల్లాలోని 7 మండలాలల్లోని 131 రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో విలీనమవుతున్నాయి. భద్రాచలం డివిజన్లో 98 రెవెన్యూ గ్రామాలు, పాల్వంచరెవెన్యూ డివిజన్లో 38 రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తున్నాయి. భద్రాచలం మండలలో పది రెవెన్యూ గ్రామాలు, 13 హేబిటేషన్స్..., కూనవరం మండలంలో 39 రెవెన్యూ గ్రామాలు, 48 హేబిటేషన్స్.., చింతూరు మండలంలో 14 గ్రామాలు, 17 హేబిటేషన్స్..., వి.ఆర్.పురం మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు, 45 హేబిటేషన్స్ సీమాంధ్రలో కలవనున్నాయి. పాల్వంచ రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూర్గంపాడు మండలంలో 7 రెవెన్యూ గ్రామాలు, 15 హబిటేషన్లు...., వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, 39 హబిటేషన్లు..., కుక్కునూరు మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు, 34 హబిటేషన్లు సీమాంధ్రలో పరిధిలోకి వెళ్లనున్నాయి. -
అపాయింటెడ్ డే 16కు మార్చండి
కేంద్ర హోం శాఖ కార్యదర్శికి టీఆర్ఎస్ వినతి సాక్షి, న్యూఢిల్లీ: తె లంగాణ రాష్ట్రం మే 16 నుంచే ఉనికిలోకి వచ్చేలా అపాయింటెడ్ తేదీని మార్చాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి టీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ నేతలు వినోద్, జగదీశ్వర్‌రెడ్డిలతో కలిసి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు బుధవారం మధ్యాహ్నం హోం శాఖ కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం నార్త్ బ్లాక్‌వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను పార్టీలు ప్రలోభాలకు గురి చేసే ప్రమాదముందన్నారు. ‘‘ఈ విషయమై టీఆర్ఎస్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హైకోర్టును ఆశ్రయించాం. ఎన్నికలు జరిగి, ఫలితాలు మే 16నే వస్తున్నా అపాయింటెడ్ తేదీ జూన్ 2న ఉండటం రాజకీయ శూన్యతకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి దాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యాక కూడా రాష్ట్రపతి పాలన ఉండటం అయోమయానికి గురి చేస్తుంది. అందుకే అపాయింటెడ్ తేదీపై పునఃపరిశీలించాలని కోరాం. విభజన ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగేలా ఉన్నందున దానితో అపాయింటెడ్ తేదీకి ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశాం ’’ అని వివరించారు. హైకోర్టు సూచన మేరకే హోం శాఖ కార్యదర్శిని కలిశామని, కేంద్ర హోం మంత్రిని కలవాలనుకున్నా ఆయన అందుబాటులో లేరని చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ప్రజా ప్రభుత్వాలు ఏర్పాటు కావాలన్న ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పోరాడుతోంది. ఇది టీఆర్ఎస్ అంశం మాత్రమే కాదు. ఇతర పార్టీలీ మాతో కలిసి వస్తాయి’’ అని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థనపై హోం శాఖ కార్యదర్శి ఎలాంటి హామీ ఇవ్వలేదని సమాచారం. అపాయింటెడ్ తేదీ విషయమై కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సూచనపై న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్టు హోం శాఖ వర్గాలు తెలిపాయి. -
‘అపాయింటెడ్ డే’పై జోక్యం చేసుకోలేం
అభ్యంతరాలేవో కేంద్రానికి విన్నవించాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ‘అపాయింటెడ్ డే’ విషయంలో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సార్వత్రి క ఎన్నికల ఫలితాలు 16న వెలువడుతున్నందున, ఆ తేదీనే ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ అభ్యర్థన ను తోసిపుచ్చింది. అధికరణ 226 కింద తాము అటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఇప్పటికే జూన్ 2వ తేదీని ‘అపాయింటె డ్ డే’గా ప్రకటించినందున, దాన్ని ఎందుకు ముందుకు మార్చాలో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఓ వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఆ వినతిపత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న మే 16వ తేదీనే ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించాలని, లేనిపక్షంలో జూన్ 2 వరకు రాష్ట్రంలో రాజకీయ శూన్యత, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడతాయని పేర్కొంటూ టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జి.జగదీష్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఈ నెల 8న విచారణ జరగాల్సి ఉండగా, వేరే కేసులను విచారించేందుకు జస్టిస్ సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సిద్ధమైన సమయంలో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి ఈ కేసునూ విచారించాలని అభ్యర్థించా రు. దీంతో ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రాష్ట్ర శాసనసభ ఐదేళ్ల కాల పరిమితి జూన్ 2తో ముగుస్తున్నందున, దానిని దృష్టిలో పెట్టుకుని ఆ తేదీని అపాయింటెడ్ డేగా నిర్ణయించారని రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం శాసనసభ రద్దయి, రాష్ట్రపతి పాలన కొనసాగుతోందన్నారు. అపాయింటెడ్ డే ప్రకటించి న తరువాత ఎన్నికల సంఘం (ఈసీ) రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించి, ఆ మేర మొదటి దశ ఎన్నికలను పూర్తి చేసిందని, 7న రెండో దశ ఎన్నికలు జరుగుతాయని, ఈ రెండు దశల ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న ప్రకటిస్తారని వివరించారు. ఆ వెంటనే రాజ్యాంగం ప్రకారం రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. అయితే జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా ప్రకటించినందున ఆ లోగా కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందినందున, ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రపతి పాలన కొనసాగించడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల అపాయింటెడ్ డేని మే 16గా నిర్ణయించాలని విన్నవించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ విష్ణువర్ధన్‌రెడ్డి తన అభిప్రాయం తెలిపారు. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకునే జూన్ 2ను ‘అపాయింటెడ్ డే’గా కేంద్రం నిర్ణయించిందని, ఇందులో ఎటువంటి తప్పూ లేదన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం... మే 16ను అపాయింటెడ్ డేగా నిర్ణయించేలా ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషన్లో లేవనెత్తిన అంశాలతో కేంద్రానికి వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు సూచించారు. -
జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు
-
పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జోగు రామన్న అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో ఎదుట జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ముగిశాయి. ఎట్టకేలకు తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అపాయింటెడ్ డేను ప్రకటించడంతో దీక్షలు విరమించారు. జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి కారింగుల దామోదర్ నేతృత్వంలో చేపట్టిన దీక్షలు గురువారానికి 1523 రోజులకు చేరాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రామన్న దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చారు. అంతకుముందు జేఏసీ నాయకులు అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం ఒక్కటై పోరాటం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చిందన్నారు. తెలంగాణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాలయులు, కార్మికులు, కులసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమించాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జేఏసీ అధికార ప్రతినిధి కారింగుల దామోదర్ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు వృథా కాలేదని, పోరాడి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దీక్షలు విరమించలేదన్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం అపాయింటెడ్ డేను జూన్ 2గా ప్రకటించడంతో దీక్షలు విరమించామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమరెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి.రవీంద్ర, సాెహ బ్రావు పవార్, జాదవ్ కిరణ్‌కుమార్, బీజేపీ నాయకలు దుర్గం రాజేశ్వర్, పాయల్ శంకర్, మడావి రాజు, సురేష్ జోషి, టీఆర్ఎస్ నాయకులు గంగరెడ్డి, గంగన్న, అనంద్, బాలశంకర్ కృష్ణ, గోలి శంకర్, ప్రశాంత్, బండారి సతీష్, రంగినేని శ్రీనివాస్, కస్తాల ప్రేమల, అంజలి, త్రిశూల, అనుసూయ, సురేఖ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు
-
జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలు
* ‘అపాయింటెడ్ డే’ ప్రకటించిన కేంద్రం * కేంద్ర హోంశాఖ గెజిట్ జారీ * శాసనసభ తుది గడువు రోజే.. రాష్ట్ర విభజన తేదీ * విభజన పూర్తిచేయటానికి మూడు నెలల సమయం * ఉమ్మడి రాష్ట్రంలోనే లోక్‌సభ, అసెంబ్లీలకు ఎన్నికలు * ప్రస్తుత నియోజకవర్గాల్లోనే యథాతథంగా పోలింగ్ * జూన్-2 నాటికి సిద్ధం కానున్న కొత్త శాసనసభలు * విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు * విభజన పనిలో కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు నిమగ్నం * కేంద్రంలో 15, రాష్ట్రంలో మరో 15 కమిటీలు ఏర్పాటు * ఈ కమిటీల సూచనలపై నిర్ణయం తీసుకోనున్న * రాష్ట్ర గవర్నర్, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాలు సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూన్ రెండో తేదీ నుంచి రెండు భాగాలుగా విడిపోతుంది. ఆ రోజున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జూన్-2వ తేదీని ‘అపాయింటెడ్ డే’గా మంగళవారం రాత్రి ప్రకటించింది. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు - 2014 రాష్ట్రపతి ఆమోదంతో ఈ నెల 1న చట్టంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విభజన అమలులోకి వచ్చే ‘అపాయింటెడ్ డే’ ఎప్పుడన్నది ఆ చట్టం గెజిట్‌లో పొందుపరచలేదు. ఈ తేదీని తర్వాత వేరుగా ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో.. సార్వత్రిక ఎన్నికలతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కూడా బుధవారం షెడ్యూలు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. షెడ్యూలుతో పాటు బుధవారం నుంచే ఎన్నికల కోడ్ కూడా అమలులోకి రానున్న పరిస్థితుల్లో అందుకు ఒక రోజు ముందు మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అమలు తేదీ (అపాయింటెడ్ డే)ని జూన్-2గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వాలు రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2వ తేదీతోనే రాష్ట్ర శాసనసభ గడువు కూడా ముగియనుంది. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంటుంది. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికలకూ జారీ చేయనున్న షెడ్యూలు ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం మొత్తం మే 15వ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశమున్నట్లు సమాచారం. అంటే.. ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రంలోనే.. ప్రస్తుతమున్న నియోజకవర్గాల ప్రకారమే.. సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టమైపోయింది. అలాగే.. 2న విభజన అమలులోకి వచ్చాకే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)- రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. విభజన పూర్తిచేయటానికి మూడు నెలలు... విభజన చట్టం గెజిట్ నోటిఫికేషన్‌కు, విభజన అమలులోకి వచ్చే అపాయింటెడ్ డేకు మధ్య దాదాపు 3 నెలల వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో విభజనకు సంబంధించి అనేక లాంఛనాలు పూర్తిచేయాల్సి ఉంది. ముఖ్యంగా సిబ్బంది పంపిణీ, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి కార్యక్రమాలు పూర్తికావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో 15 కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ వుంత్రిత్వ శాఖల అధికారులతో కూడా 15 కమిటీలను ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఈ 30 కమిటీలు విభజన పనిలో నిమగ్నమై ఉన్నాయి. ప్రధానంగా కీలకమైన ఆస్తులు, అప్పులు, ఫైళ్లు, ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గత రెండు రోజులుగా నిమగ్నమైంది. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ గురువారం నుంచి పని ప్రారంభించనుంది. అలాగే టక్కర్ కన్వీనర్‌గా నియమించిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితాల వెల్లడినాటికి పంపిణీలు పూర్తి... ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడించే నాటికల్లా తెలంగాణ రాష్ట్రం, సీమాంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన పంపిణీలు, కేటాయింపులు అన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార యంత్రాంగాలు పూర్తి చేయనున్నాయి. అయితే ఈ విభజన, పంపిణీలకు సంబంధించి అధికారులు చేసిన ప్రతిపాదనలు అన్నింటిపై ప్రస్తుతం గవర్నర్ నరసింహన్‌తో పాటు.. కేంద్ర ప్రభుత్వ అధికార యుంత్రాంగం నిర్ణయం తీసుకోనుంది. సీమాంధ్రలోనూ, తెలంగాణలోనూ ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాలు వారికి అవసరమైన రీతిలో ఏయే శాఖలను కొనసాగించాలి.. ఏయే శాఖలు అవసరం లేదు.. ఏయే ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం.. ఏయే ప్రభుత్వ రంగ సంస్థలు అవసరం లేదు.. ఉద్యోగుల అవసరాలు.. సర్దుబాట్లపై నిర్ణయాలు తీసుకుంటారు. ఇక విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో శాంతిభద్రతలు, రెవెన్యూ, భూములు తదితర అంశాలపై గవర్నర్ అంతిమంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ అంశాలపై తెలంగాణ మంత్రివర్గం సిఫారసు చేసిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే స్వతంత్రంగా గవర్నర్ నిర్ణయాలను తీసుకుంటారు. అపాయింటెడ్ డే గెజిట్ నోటిఫికేషన్ సారాంశం... ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 లోని సెక్షన్ 2 లో క్లాజ్ (ఎ) కింద ఉన్న అధికారం మేరకు.. పై చట్టం అవసరాల నిమిత్తం 2014 జూన్ రెండో రోజును అపాయింటెడ్ డేగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తోంది.’’ - ఎస్.సురేష్‌కుమార్, కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ‘పునర్విభజన’పై తొలగిన సంశయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసనసభ గడువును పొడిగిస్తారని, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడతారని, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచి విడిగా ఎన్నికలు జరుపుతారని గత వారం రోజులుగా రాజకీయ లబ్ధిని ఆశించి కాంగ్రెస్ వర్గాలు చేసిన ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. ప్రస్తుత శాసనసభ్యుల సంఖ్య ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని తాజాగా కేంద్రం ప్రకటించిన ‘అపాయింటెడ్ డే’తో తేటతెల్లమైంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని మూడో విభాగంలో గల 15, 16, 17 సెక్షన్లలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరణ ఇచ్చినప్పటికీ.. వీటికి తప్పుడు వివరణలు ఇస్తూ.. అసెంబ్లీ ఎన్నికలు విడిగా ఉంటాయని, సీట్ల సంఖ్య పెంచుతారని కాంగ్రెస్ వర్గాలు రాజకీయ లబ్ధిని ఆశించి ప్రచారం చేశాయి. ‘అపాయింటెడ్ డే’ నుంచి ఈ చట్టంలోని రెండో షెడ్యూలులో పేర్కొన్న విధంగా సీట్ల సంఖ్య ఉండాలని చట్టం స్పష్టంగా పేర్కొంది. అంటే 2008 నియోజకవర్గాల పునర్విభజన ప్రకారంగా ఉన్న సీట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు 175, తెలంగాణకు 119 సీట్లు ఉండాలని నిర్దేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 లోని 3వ క్లాజు ప్రకారం అపాయింటెడ్ డే నాటికి ఎంత సంఖ్యలో స్థానాలు ఉన్నాయో అంతే సంఖ్యలో ఎన్నికలు జరపాలి. దీని ఆధారంగానే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అందుకే.. ఈసీ ఎన్నికల షెడ్యూలు వెలువరించకముందే కేంద్ర ప్రభుత్వం ‘అపాయింటెడ్ డే’ను ప్రకటించింది. -
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం
న్యూఢిల్లీ: తెలంగాణకు జూన్ 2ను అపాయింటెడ్ డే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2ను తెలంగాణ ఆవిర్భావ దినంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. ఇదే తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినంగా నిర్ణయించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్టయింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. రేపు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో కేంద్రం హడావుడిగా అపాయింటెడ్ డే ఖరారు చేసింది. న్యాయపరమైన అంశాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగా అపాయింటెడ్ డేను కేంద్రం ప్రకటించింది. అపాయింటెడ్ డే నుంచి విభజన అంశాలు అమల్లోకి రానున్నాయి. -
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు!
* గెజిట్‌లో అపాయింటెడ్ డే ప్రకటించని కేంద్రం * ఎన్నికల అనంతరమే రాష్ట్ర విభజన, వేర్వేరు ప్రభుత్వాల ఏర్పాటు! సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలు రెండు వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతాయా? లేక ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయా? అనే ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయినట్లే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసినట్టు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శనివారం రాజపత్రాన్ని (గెజిట్) జారీ చేసినప్పటికీ అందులో అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ‘అపాయింటెడ్ డే’ను ప్రస్తావించలేదు. విభజన చట్టంలోని చిక్కుముడులు, విభజన ప్రక్రియ పూర్తి చేయటం వంటి అంశాలను తేల్చిన తర్వాతే అపాయింటెడ్ డే ఖరారు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలను ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రెండు మూడు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అపాయింటెడ్ డే ను ప్రకటించే అవకాశాలు ఏ మాత్రం లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఫలితాల అనంతరం ప్రత్యేక తెలంగాణ, విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరుగా ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. తెలంగాణ విభజనకు రాజపత్రం విడుదలైన నేపథ్యంలో తెలంగాణ మొత్తం ఒక విడత, ఆంధ్రప్రదేశ్‌లో మరో విడత పోలింగ్ జరిగే విధంగా షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2009 ఆంధ్రప్రదేశ్ మొత్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కీలకం కానున్న టీఆర్ఎస్ విలీనం ఇదిలావుంటే.. సార్వత్రిక ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనా? లేక వేర్వేరుగానా? అనేది టీఆర్ఎస్ విలీనంపై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించి వెంటనే అపాయింటెడ్ డేను ప్రకటించడంతోపాటు తెలంగాణ, సీమాంధ్రలో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలుకోగలుగుతామని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తే వేర్వేరుగా ఎన్నికలు జరపాలని భావిస్తోంది. విలీనంపై కేసీఆర్ తీసుకునే నిర్ణయాన్ని బట్టే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలా? వద్దా? అనే అంశంపై సోమవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద న్న అంశంపై కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్నారు. -
విభజన ప్రక్రియలన్నీ ముగియాలి
అపాయింటెడ్ డే ఖరారుపై జైరాం రమేశ్ వచ్చేవారంలో రాష్ర్టపతికి తెలంగాణ బిల్లు టీఆర్ఎస్ పోరాడినా అంతిమంగా తెలంగాణ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌దే బీజేపీ సీమాంధ్రకు ప్రత్యేక హోదా అడగలేదు ప్రస్తుత డిజైన్లోనే పోలవరం నిర్మాణం కిరణ్ కొత్తపార్టీతో నష్టం లేదు సాక్షి, హైదరాబాద్: ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు తదితరాలకు సంబంధించిన విభజన ప్రక్రియలన్నీ ముగిసిన తర్వాతే రెండు రాష్ట్రాల అధికారిక విభజనకు వీలుగా అపాయింటెడ్ డే నిర్ణయమవుతుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును న్యాయశాఖ పరిశీలించి వచ్చే వారం రాష్ట్రపతికి పంపుతుందని తెలిపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన తర్వాత అపాయింటెడ్ డే ఖరారవుతుందన్నారు. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన రోజును ‘నోటిఫైడ్ డేట్’గా, ఇద్దరు ముఖ్యమంత్రులు నియమితులైన రోజును ‘అపాయింటెడ్ డే’గా పిలుస్తారని ఆయన వివరించారు. 2000 సంవత్సరంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లు ఏర్పడినప్పుడు నోటిఫైడ్ డేట్ తర్వాత మూడు నెలలకు అపారుుంటెడ్ డే రావడాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ క్రెడిట్ మొత్తం కాంగ్రెస్‌దే తప్ప బీజేపీదేమీ లేదని, ఆ పార్టీ కనీసం సీమాంధ్రకు ప్రత్యేక హోదాను కూడా అడగలేదని తెలిపారు. టీఆర్ఎస్ పోరాటం చేసినా అంతిమంగా తెలంగాణ ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం, పొత్తులపై పార్టీలో చర్చలు సాగుతున్నాయని జైరాం చెప్పారు. గురువారం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పార్టీ ఎస్సీ సెల్ జాతీయ చైర్మన్ కొప్పుల రాజులతో కలసి మీడియాతో మాట్లాడారు. విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరస్పర సహకారం లేకపోతే బిల్లులో పొందుపరిచిన అంశాల అమలు కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసమే రాష్ట్ర విభజన చేశామనడం సరికాదని, తెలంగాణ ఇచ్చినా సీమాంధ్ర హక్కుల పరిరక్షణకు కూడా కేంద్రం, కాంగ్రెస్ కట్టుబడి ఉన్నాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ ఆర్టికల్ 371 డీ కొనసాగుతుందని తెలిపారు. సీమాంధ్రకు కొత్త రాజధానిగా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, గుంటూరు, ఒంగోలు ప్రాంతాలను ఏర్పాటు చేయూలంటూ వేర్వేరుగా వినతులు అందాయన్నారు. దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటయ్యాక ఆరునెలల్లో నివేదిక అందుతుందని, ఆ తర్వాత కొత్త రాజధానిపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు. సీమాంధ్రలో ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం, గిరిజన యూనివర్సిటీలు, సూపర్‌స్పెషాల్టీ మెడికల్ సెన్సైస్, దుగ్గరాజపట్నం పోర్టు, కడపలో స్టీలు ప్లాంటు, కాకినాడ-రాజమండ్రిల మధ్య పెట్రో కెమికల్స్ కాంప్లెక్సు, విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్లోనే నిర్మాణమవుతుందని, దీని బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని పేర్కొన్నారు. చేవెళ్ల ప్రాణహిత, దుమ్ముగూడెం ప్రాజెక్టులకు జాతీయహోదా అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తోందన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదాను కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కోరారన్నారు. బీజేపీ నేతలు జైట్లీ, వెంకయ్యనాయుడులు ప్రధానిని కలసినా ప్రత్యేక హోదాను కోరలేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రలో తమ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లడం పెద్ద సవాలేనన్నారు. సోనియూ సహా అందరినీ కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నా హైకమాండ్ ఆయనపై చర్యలు తీసుకోకుండా సీఎంగా ఎందుకు కొనసాగిస్తోందో తనకు తెలియదన్నారు. కిరణ్ సుప్రీంకోర్టుకు వెళ్లినా బిల్లుకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని జైరాం అభిప్రాయపడ్డారు. కిరణ్ కొత్తపార్టీ వల్ల కాంగ్రెస్‌కు నష్టముంటుందని భావించడం లేదన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు సోనియాను విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. 2న గుంటూరుకు జైరాం: విభజన అంశాలను సీమాంధ్ర ప్రజలకు వివరించాలని జైరాం రమేశ్ నిర్ణయించారు. తన పర్యటనపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన తర్వాత గాంధీభవన్‌లోనే కొద్దిసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వచ్చేనెల 2న గుంటూరు పర్యటన ఖరారు చేశారు. ఆ తర్వాత విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వాస్తవానికి శుక్రవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే అదేరోజు కేంద్ర కేబినెట్ భేటీ కానుండటంతో వాయిదా పడింది. గవర్నర్‌తో భేటీ: జైరాం రమేశ్ గురువారం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆయన వెంట ఉన్నారు. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలపై వారు చర్చించారని తెలుస్తోంది. రాష్ట్రపతి పాలనదిశగా కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో ఈ అంశంపైనా చర్చ జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. -
ఆ రోజుపై ఉత్కంఠ!
విభజన బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన నేపధ్యంలో రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే రోజు( నిర్ణీతరోజు- అపాయింటెడ్ డే) ఏ రోజా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపధ్యంలో ఆ రోజు ఖరారుపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జనలు పడుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సమావేశమైతే తేలిపోతుందని భావించారు.అయితే వారి సమావేశం పూర్తి అయినా ఒక స్పష్టత రాలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా? లేక విలీనం చేసుకుంటుందా? అన్న విషయం ఇంకా తేలలేదు. ఈ విషయంలో సోనియా గాంధీ ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేరు. పార్లమెంటు ఆమోదం పొందిన తెలంగాణ బిల్లు ఇప్పుడు మరో జంక్షన్లో ఆగింది. మరో మూడునాలుగు రోజుల్లో గెజిట్ విడుదల అవుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అందులోని ఆ నిర్ణీతరోజు ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, సిబ్బంది పంపిణీ పూర్తి అవ్వాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని కేంద్రం హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఎన్నికల తర్వాత ఏర్పడుతుందా? లేక మార్చి మొదటి వారంలోనే ఏర్పడుతుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ చిక్కుముడి వీడాలంటే ముందు కాంగ్రెస్ తాను ఆశిస్తున్న రాజకీయలబ్ధిని పూర్తిస్థాయిలో పొందే ప్రక్రియను పూర్తిచేయవలసి ఉంటుంది. టీఆర్ఎస్ ఎప్పటికీ రాజకీయ పార్టీగా కొనసాగాలని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గట్టిగా కోరుకుంటున్నారు. కాని కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అని వారంతా ఎదురుచూస్తున్నారు. విలీనం లేదా పొత్తు విషయంలో తుదినిర్ణయాన్ని సోనియాకు విడిచిపెట్టారని అంటున్నారు. ఇటు టీఆర్ఎస్ విలీనం విషయంలో కాంగ్రెస్ కూడా లోతుగా చర్చిస్తోంది. విలీనం, పొత్తు అంశాల్లో లాభనష్టాలను బేరీజు వేస్తోంది. టీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే తెలంగాణలో నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలన్నదానిపై సోనియా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఒకవేళ కేసీఆర్‌కు పార్టీని అప్పగించే పక్షంలో పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జానారెడ్డి లాంటి సీనియర్లను ఎలా మేనేజ్ చేయాలన్నదే సోనియా ముందున్న ప్రధాన ప్రశ్న. అంతర్గత కుమ్ములాటల ప్రమాదం పొంచి ఉంటుందని అధిష్టానం నేతల అభిప్రాయం. సామాజికంగా, ఆర్థికంగా భిన్నత్వం అపారంగా ఉన్న తెలంగాణలో నేతలను ఒక్కతాటిపైకి తీసుకురావడం అంత ఆషామాషీకాదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పొత్తు కుదుర్చుకుంటే రెండు పార్టీలు చెందిన వారికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చినట్లు ఉన్నా, సీట్లు పంపకాల్లోనూ పితలాటకం తప్పదు. సమన్వయం కొరవడితే బోల్తాపడక తప్పదు. ఎన్నికల విషయంలో టీఆర్ఎస్కున్న బలహీన ట్రాక్రికార్డు - కాంగ్రెస్‌ను భయపెడుతోంది. తమ పార్టీ నాయకులు పొత్తును మాత్రమే కోరుతున్నారని, అది ఇరుపార్టీలకు మంచిదని టీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు సమాచారం అందించింది. రాష్ట్రాన్ని చీల్చే పనిని తన భుజస్కందాలపై వేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్‌తో తొలుత ప్రాథమిక చర్చలు జరపాలని కేసీఆర్‌కు సోనియా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ పంచాయతీ ముగిశాకే రెండు రాష్ట్రాల ఏర్పాటులో స్పష్టత వస్తుందన్న భావన కూడా ఉంది. s.nagarjuna@sakshi.com -
ముందా.. తర్వాతా?
ఎన్నికల నేపథ్యంలో అపాయింటెడ్ డేపై ఉత్కంఠ అయితే మార్చి 5లోగా, లేదంటే జూన్ 1న? 2రాష్ట్రాల ఏర్పాటుపై అధిష్టానం తర్జనభర్జన ఇరువైపుల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లు తొందరపడితే దెబ్బతింటామంటున్న సీమాంధ్ర నేతలు.. జాప్యం వద్దంటున్న టీ నేతలు రాష్ట్రంలో ఎన్నికలు తుది విడతలో? సాక్షి, న్యూఢిల్లీ: విభజన బిల్లును పార్లమెంట్ ఆమోదిం చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉనికిలోకి వచ్చే ‘అపాయింటెడ్ డే’ ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో అపాయింటెడ్ డే ఖరారుపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా తర్జనభర్జన పడుతున్నాయి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తమకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకునే దిశగా సమాలోచనలు చేస్తున్న అధిష్టానం ప్రతి అంశాన్నీ లోతుగా విశ్లేషిస్తోంది. అయితే అపాయింటెడ్ డే పై కాంగ్రెస్‌లోని తలపండిన నేతలు కూడా తలో అభిప్రాయం వ్యక్తం చేయడంతో దానిపై తొందరపాటు నిర్ణయం తగదన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో రాష్ట్రపతి పాలన విధించడం, లేదా మరో సీమాంధ్ర నేత ను సీఎం చేసి ప్రభుత్వాన్ని కొనసాగించడమన్న రెండు మార్గాల కోణం నుంచి చూస్తే అపాయింటెడ్ డే ఖరారు మరింత చిక్కుముడిగా మారుతోంది. దాన్ని వీలైనంత త్వరగా నిర్ణయిస్తే రెండు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులను ఎంపిక చేయాల్సి వస్తుంది. పైగా రెండు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారమూ చిక్కుముడిగా మారుతుందని చెబుతున్నారు. ఆస్తులు, అప్పులు, ఆదాయ పంపిణీ, ఉద్యోగుల కేటాయింపు వంటి కీలకాంశాలను పూర్తి చేయాల్సిన పనులకు కూడా ప్రతిబంధకంగా మారుతుందని భావిస్తున్నారు. మార్చి తొలి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ రానుండటం తెలిసిందే. అంటే గట్టిగా మరో 10 రోజులు కూడా లేదు. కాబట్టి యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంటుంది. అపాయింటెడ్ డే ఆలోపు ఉండేలా నిర్ణయిస్తే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అందులోనూ సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపనున్న ప్రభావం 2 లోక్‌సభ, 3 అసెంబ్లీ స్థానాలపై పడనుంది. సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటేయాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. దీన్నెలా అధిగమించడమా అని కేంద్రం పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. అందుకే అపాయింటెడ్ డేను ఇప్పటికిప్పుడు ప్రకటించకుండా ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలకు వెళ్తే దీన్ని అధిగమించవచ్చని కేంద్ర మంత్రి ఒకరు సూచించారు. కానీ ఇంతా చేసి చివరికి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిపితే విభజన ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయా అన్న సందేహం కూడా అధిష్టానం పెద్దల్లో నెలకొంది. పైగా, ‘అపాయింటెడ్ డేను జాప్యం చేస్తే తెలంగాణ ప్రజల్లో అపోహలు తలెత్తవచ్చు. ముంపు ప్రాంతాల సమస్య, ఉమ్మడి రాజధాని తదితరాలపై ఎవరైనా సుప్రీంకోర్టును ఆశ్రయించడం వంటివి జరగవచ్చు. పైగా టీఆర్ఎస్ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కష్టం కావచ్చు’ అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. మరోవైపు సీమాంధ్ర నేతల నుంచి మరో రకం ఒత్తిళ్లు వస్తుండటం అపాయింటెడ్ డే గందరగోళాన్ని ఇంకా పెంచుతోంది. ‘‘అపాయింటెడ్ డే త్వరగా నిర్ణయిస్తే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విభజించారంటూ ఇప్పటికే సీమాంధ్ర ప్రజలు అగ్గిమీద గుగ్గిలమవుతున్న తరుణంలో అక్కడ వెంటనే ఎన్నికలు పెడితే అస్సలు లాభముండదు. సీమాంధ్రకు ప్రకటించిన ప్యాకేజీని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. అందుకు వీలుగా, సీమాంధ్ర నేతనే ప్రస్తుతానికి సీఎం చేస్తే కొంత మేలు’’ అని పలువురు నేతలు అధిష్టానానికి విన్నవించారు. అయితే విభజనకు కనీసం మూడు నెలలు పట్టవచ్చని జైరాం రమేశ్ శనివారం తనను కలిసిన తెలంగాణ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే వారినుంచి ఒత్తిళ్లు రావద్దనే ఉద్దేశంతోనే అలా చెప్పారన్న వాదన కూడా ఉంది. మరోవైపు... ఇప్పుడు మరో సీఎంను నియమించడం వల్ల ప్రయోజనమేమీ ఉండదని, పైగా విభజన ప్రక్రియలో పార్టీ నేతలే ఇబ్బందులు సృష్టించవచ్చని రాహుల్‌గాంధీకి సన్నిహితంగా ఉండే ఎంపీ సందీప్ దీక్షిత్ సూచించినట్టు సమాచారం. కిరణ్ రాజీనామాతో ఒకరకంగా మంచే జరిగింది. రాష్ట్రపతి పాలనతోనే విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయొచ్చు’’ అని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే అపాయింటెడ్ డే మార్చి 5 లోపే ఉండే అవకాశమూ లేకపోలేదని విన్పిస్తోంది. లేదంటే మాత్రం ఎన్నికలయ్యే దాకా ఆగి, జూన్ 1ని అపాయింటెడ డే గా నిర్ణయించవచ్చంటున్నారు. చివరి విడతలో ఎన్నికలు? అపాయింటెడ్ డే వీలైనంత త్వరగా ఉండేలా ప్రకటిస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి విభాగంలో విభజన ప్రక్రియ ప్రారంభం కావలసి ఉంటుంది. కానీ మార్చి తొలి వారంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వచ్చినప్పటి నుంచీ అధికారులంతా ఆ కార్యక్రమాల్లో నిమగ్నం కావల్సి వస్తుంది. అలాంటప్పుడు వారు విభజన ప్రక్రియలో భాగస్వాములవడం కష్టమంటున్నారు. దీన్ని అధిగమించడానికి, రాష్ట్రంలో పోలింగ్ వీలైనంత ఆలస్యంగా, అంటే చివరి విడతలో జరిగేలా చూడాలన్న ఆలోచన కూడా కేంద్రం పరిశీలనలో ఉందని సమాచారం. పరిస్థితులను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఆ మేరకు విజ్ఞప్తి చేయవచ్చంటున్నారు. రెండు పీసీసీలపై కసరత్తు రెండు పీసీసీలను ఏర్పాటుపై మాత్రం అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అపాయింటెడ్ డే ఒకవేళ జాప్యమైతే దానికి విరుగుడుగా రెండు ప్రాంతాలకు ముందుగానే వేర్వేరు పీసీసీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ అన్ని అంశాలపైనా సోనియా తన రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌తో శనివారం సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాలు ఏర్పడితే సమీకరణాలెలా ఉంటాయి, బలాబలాలేమిటి, పీసీసీ పదవులను ఏ సామాజిక వర్గాలకు కట్టబెడితే ఎలా ఉంటుంది, రెండు రాష్ట్రాలకు సీఎంలుగా ఎవరిని నియమిస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి వంటి అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చినట్టు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్, మంత్రులు గీతారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు శనివారం సోనియాను కలిశారు. ఇరు ప్రాంతాల్లోనూ పీసీసీ, ఇతర పదవులను బలహీన వర్గాలకు, యువకులకు ప్రోత్సహించాలన్నది రాహుల్ ఆలోచన అని పార్టీలో ప్రచారం జరుగుతోంది.