తొలగని ఆంక్షలు | Treasury is likely to take some time to restore balance of payments | Sakshi
Sakshi News home page

తొలగని ఆంక్షలు

Published Fri, Jun 6 2014 12:04 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

తొలగని ఆంక్షలు - Sakshi

తొలగని ఆంక్షలు

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖజానా విభాగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2న అపాయింటెడ్ డే నుంచి తిరిగి చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అపాయింటెడ్ డే పూర్తయినప్పటికీ అంతర్గతంగా విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఖజానా విభాగంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది.
 
ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపులతోపాటు కార్యాలయ నిర్వహణ, పెన్షన్లు, ప్రభుత్వ పనులు, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, పాఠశాలల గ్రాంటులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఖజానా విభాగం ద్వారానే పూర్తవుతాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు రూపొందించిన బిల్లుల ఆధారంగా నిధులను విడుదల చేస్తారు. జూన్ రెండో తేదీ వరకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో జూన్ ఒకటో తేదీ వరకు అన్నిరకాల చెల్లింపులు పూర్తి చేశారు.
 
అయితే కొన్ని కార్యాలయాలు సమర్పించిన బిల్లుల్లో తప్పులు దొర్లడం, మరికొందరు జాప్యం చేయడంతో వారికి సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. రెండో తేదీ తర్వాత వీటిని క్లియర్ చేసుకోవచ్చని భావించిన పలు విభాగాల అధికారులకు తాజాగా ఇబ్బందులు వచ్చిపడ్డాయి. విభజన క్రమంలో భాగంగా సర్వర్ల బదలాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఖజానా శాఖ వెబ్‌సైట్ నిలిచిపోయింది.
 
వారంపాటు ఇంతే!
ఖజానా చెల్లింపుల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు సర్వర్ల విభజన పూర్తికావడానికి నాలుగైదు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజనలో భాగంగా డీడీఓల ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్ అయ్యాయి. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏప్రిల్, మే నెలలకే సరిపోవడంతో.. జూన్‌లో కొత్త బడ్జెట్ వస్తేనే చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ భేటీ తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు చెల్లింపుల సంగతి ఇంతేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 కొత్త చెక్కులతోనే..
 కొత్త రాష్ట్రం ఆవిర్భావంతో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పంచాయతీలు, మండల పరిషత్‌లు అవసరమైన నిధులను ఖజానా శాఖ ఇచ్చిన ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన పూర్తయిన నేపథ్యంలో అవన్నీ రద్దయ్యాయి. తిరిగి కొత్త ఎల్‌ఓసీల ద్వారా నిధుల విడుదల చేయాలని ఖజానా శాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా నిధులు డ్రా చేసే అన్ని కార్యాలయాలకు ఇప్పటికే ఖజానా శాఖ కొత్త చెక్ పుస్తకాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త చెక్కుల ద్వారానే చెల్లింపులు చేపడతామని, పాత చెక్కులు చెల్లవని జిల్లా ఖజానా శాఖ అధికారి ఏ.నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement