Treasury Department
-
డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. నచ్చినవారికి ఎక్కడంటే అక్కడే! ఫిర్యాదుకు రెడీ?
సాక్షి, హైదరాబాద్: ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌లో డిప్యుటేషన్లకు సంబంధించి ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలే ఫైనల్. ఉద్యోగులు ఇదేమని ప్రశ్నిస్తే దశాబ్దాల క్రితం వచ్చిన ఆకాశ రామన్నల ఫిర్యాదులను మళ్లీ తెరమీదకు తెస్తామంటూ హెచ్చరిస్తుంటారు. డిప్యుటేషన్ల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అన్ని ఆధారాలతో ఉన్నతాధికారులపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో డిప్యుటేషన్లకు సంబంధించి వికలాంగులు, మహిళలు, తీవ్ర అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న నిబంధనలున్నా అవేవి పట్టించుకోకుండా అస్మదీయులకు మాత్రమే కోరుకున్నచోట డిప్యుటేషన్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తాను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, ఒకరోజు విధులకు వెళ్లి వస్తే మూడురోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని, దూరభారంతో ఇబ్బంది పడుతున్నానని, అందుకే డిప్యుటేషన్ ఇవ్వాలని వేడుకున్నా కనికరించలేదు. ఎలాంటి ఇబ్బందిలేని ఓ అధికారికి మాత్రం వైరా నుంచి ఖమ్మం జిల్లాకేంద్రానికి డిప్యుటేషన్ ఇచ్చారు. కుటుంబసభ్యుల అనారోగ్యం కారణంగా మంచిర్యాల నుంచి క్లియర్ వేకెన్సీ ఉన్న వైరాకు డిప్యుటేష¯న్ ఇవ్వాలని కోరితే కనీస స్పందన లేదని ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో పనిచేస్తున్న మరో అవివాహిత ఉద్యోగి క్లియర్ వేకెన్సీ ఉన్న సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపాలని చాలాకాలంగా వేడుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. మానవతాదృక్పథంతో డిప్యుటేషన్లు పరిశీలించి చర్య తీసుకోవాలని ఆర్థికమంత్రి పేషీ సిఫారసు చేసినా డైరెక్టరేట్‌లో మాత్రం బుట్టదాఖలవుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. (చదవండి: ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారా?.. ఈ నియమాలు తప్పనిసరి..) సిమ్‌కార్డుల పితలాటకం తరచూ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మారుస్తుండటం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. తాజాగా మరో కంపెనీకి సెల్ నెట్‌వర్క్‌ను మార్చటంతో గ్రామీణప్రాంతాలు, కార్యాలయ ఆవరణల్లోనూ సిగ్నల్స్ రాకపోవటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం కార్యాలయాలకు రాగానే విధుల్లో లాగిన్ కావాలంటే వారి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీయే ఆధారం. కానీ, ఓటీపీ వచ్చేందుకు గంటల సమయం పడుతుండటంతో ఒక్కపూట మొత్తం అవస్థలు పడుతున్నామని, సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీనియర్ ఐఏఎస్ అండ ఉందన్న ధీమాతో నిబంధనలన్నీ బేఖాతర్ చేస్తున్న ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, ఆపై ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించాలని ఉద్యోగులు, సంఘాలనేతలు భావిస్తున్నారు. రూ.23.8 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలను స్వాధీనం చేసుకోకపోవటం, కొత్త కంప్యూటర్ల మొరాయింపు అంశంపైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. (చదవండి: పేదల భూములను లాక్కునేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్) -
అవినీతి ట్రెజర్
-
మనోజ్ 'ఖజానా' చూస్తే కళ్లు తిరగాల్సిందే..
సాక్షి, అనంతపురం : తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విలాసవంతమైన జీవితం గడుపుతున్న అతగాడి నుంచి ఏడు బైక్‌లు, రెండు కార్లు, నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన అవినీతి సొమ్ము భద్రంగా ఉండేందుకే డ్రైవర్ ఇంట్లో 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని దాచిపెట్టినట్లు అనంతపురం జిల్లా పోలీసుల విచారణలో వెల్లడైంది. బుక్కరాయసముద్రంలో వెలుగుచూసిన నిధి మొత్తం ట్రైజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్ అక్రమంగా సంపాదించినదే దర్యాప్తులో తేలింది. వాటిని తన ఇంట్లో పెట్టుకుంటే భద్రత ఉండదని భావించిన మనోజ్ తన డ్రైవర్ నాగలింగ ఇంట్లో వీటిని దాచిపెట్టారని గుర్తించారు. ఒక రివాల్వర్, మరొక ఎయిర్ పిస్టల్‌తో పాటు రెండున్నర కిలోల బంగారం, 84 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ, ఆదాయపన్ను శాఖ దృష్టికి వివరాలు పంపుతామని అనంతపురం ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. మనోజ్‌కు కారు డ్రైవర్ నాగలింగతో పాటు మామ బాలప్ప సహకారం ఉన్నట్లు తెలిపారు. (8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు) ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి మనోజ్ కారు డ్రైవర్ బంధువు ఇంట్లో.. భారీఎత్తున అవినీతి 'ఖజానా' బయటపడిన విషయం తెలిసిందే. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో ఎనిమిది ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. అయితే ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి.. అంతా ముక్కున వేలేసుకుంటున్నారు స్థానికులు. (ఇంట్లో తవ్వకాలు; బంగారు నిధి పట్టివేత) -
అవినీతి ఖజానా గుట్టురట్టు
-
8 ట్రంకు పెట్టెల్లో బంగారం, వెండి, నగదు
అనంతపురం క్రైం/అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లాలో ఊహకందని విధంగా ట్రెజరీ ఉద్యోగి కారు డ్రైవర్ బంధువు ఇంట్లో భారీ ఎత్తున అవినీతి ‘ఖజానా’ బయటపడింది. అచ్చం సినిమాను తలపించే విధంగా మారుమూల ప్రాంతంలోని ఓ చిన్న ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిపెట్టిన కిలోలకొద్దీ బంగారం, వెండి, పెద్దఎత్తున నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనమైంది. ఇదంతా అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అకౌంటెంట్‌కు చెందిన అవినీతి సంపాదన అని తెలిసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇందులోనే ఓ ఎయిర్ పిస్టోల్ కూడా లభ్యమైంది. పోలీసుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ► అనంతపురం జిల్లా ఖజానా కార్యాలయంలో మనోజ్‌కుమార్ అనే వ్యక్తి సీనియర్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడు బుక్కరాయసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన నాగలింగను కారు డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. ► ఇటీవల సీసీఎస్ పోలీసులకు మనోజ్‌కుమార్, నాగలింగపై ఫిర్యాదు వెళ్లడంతో కొన్ని రోజులుగా వారిద్దరి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ► ఈ క్రమంలో మంగళవారం సీసీఎస్ డీఎస్పీ ఇ.శ్రీనివాసులు, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు నేతృత్వంలోని బృందాలు డ్రైవర్ నాగలింగను అరెస్ట్ చేశారు. ► నాగలింగ ఇచ్చిన సమాచారం ఆధారంగా సాయంత్రం అతడి మామ బాలప్ప ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. 8 ట్రంకు పెట్టెలు లభ్యమయ్యాయి. ► వాటిని తెరచి చూడగా కిలోల కొద్దీ బంగారం, వెండి, భారీ మొత్తంలో నగదు వెలుగు చూశాయి. తహశీల్దార్ మహబూబ్ బాషా సమక్షంలో పంచనామా నిర్వహించారు. ► రెండు పెట్టెల్లోని సొత్తును లెక్కించేసరికి అర్ధరాత్రి దాటిపోయింది. మొత్తం సొత్తును లెక్కించే ప్రక్రియ కొనసాగుతోంది. ► మరోవైపు ఖజానా కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది. ‘కారుణ్య’ నియామకం పొంది.. ► జిల్లా ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ మనోజ్‌కుమార్ అవినీతి అనకొండగా ముద్ర వేసుకున్నాడు. అడ్డూఅదుపు లేకుండా అక్రమార్జనకు పాల్పడి రూ.కోట్లకు పడగలెత్తాడు. ► తండ్రి పోలీసు హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ మరణించగా, కారుణ్య నియామకం కింద మనోజ్ కుమార్‌కు 2006 నవంబర్ 17న ట్రెజరీ శాఖలో జూనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ► రెండు మూడేళ్లకే అతడు కార్యాలయంలోనే అత్యంత అవినీతిపరునిగా పేరొందాడు. బదిలీ చేసినా తిరిగి ఇక్కడికే.. ► ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు 14 ఏళ్లుగా ఇతను జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ► గతంలో ఒకసారి ఇక్కడి నుంచి బదిలీ కాగా.. రాత్రికి రాత్రి రద్దు చేయించుకుని తిరిగి అదే స్థానానికి వచ్చాడు. ► గత ఏడాది జూలైలో ధర్మవరం సబ్ ట్రెజరీకి బదిలీ రాగా.. 6 నెలలు పాటు సెలవులో వెళ్లి, తిరిగి జిల్లా ట్రెజరీ కార్యాలయానికి బదిలీ చేయించుకోవడం గమనార్హం. -
‘కార్పొరేషన్’ ఉద్యోగులకు ట్రెజరీ కష్టాలు
సాక్షి, అమరావతి: ‘‘పేరు గొప్ప–ఊరు దిబ్బ’’ అనే రీతిలో ఉంది గ్రేటర్ విశాఖ, విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగుల పరిస్ధితి. రాష్ట్రంలోని మిగిలిన కార్పొరేషన్ల ఉద్యోగులు, పెన్షనర్లు ట్రెజరీ ద్వారా ప్రతీ నెలా 1 వ తేదీన జీతాలు పొందుతుంటే, ఈ కార్పొరేషన్ల ఉద్యోగులు సకాలంలో జీతాలు పొందలేకపోతున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చి చేతులు దులుపుకుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటోతేదీ కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పది సంవత్సరాల పోరాటం ఫలించిందని ఉద్యోగుల సంబరపడ్డారు. ట్రెజరీ శాఖ కొర్రీతో రెండు కార్పొరేషన్లలోని 8 వేల మంది ఉద్యోగులు జీతాలు, పెన్షనర్లు పెన్షన్లు మే 1న పొందలేకపోయారు. జీతాలు ఆలస్యం... గ్రేటర్ విశాఖలో మినిస్ట్రీరియల్ ఉద్యోగులు 2852, పెన్షనర్లు 2 వేల మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.17.50 కోట్లు జీతాలుగా చెల్లించాలి. విజయవాడలో మినిస్ట్రీరియల్ ఉద్యోగులు 1700 మంది, పెన్షనర్లు 1650 మంది ఉంటే వీరికి రూ.16.50 కోట్లను చెల్లిస్తోంది. ఈ రెండు కార్పొరేషన్లు సాలీనా రూ.400 కోట్లను ఉద్యోగుల జీతాలకు చెల్లిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్లు పన్నులు ద్వారా లభించిన ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే కార్పొరేషన్లకు పన్నులు రూపంలో వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవడంతో తమకు జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. ట్రెజరీ శాఖ కొర్రీలు.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు 010 పద్దు ద్వారా అంటే..ట్రెజరీల ద్వారా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల వివరాలను ట్రెజరీలకు అందచేయాలని అధికారులను ఆదేశించింది. అదే ఉత్తర్వులను ట్రెజరీశాఖకు ప్రభుత్వం పంపడటంతో ఉద్యోగులు, పదోన్నతుల వివరాలను తమకు అందించాలని ట్రెజరీ శాఖ కార్పొరేషన్లను కోరింది. కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ, ప్రభుత్వం కేటగిరీల వారీగా నియమించిన ఉద్యోగుల వివరాలు, పదోన్నతుల వివరాలను పంపాలని కోరింది. విజయవాడ కార్పొరేషన్ 1981లో ఏర్పాటైంది. మున్సిపాల్టీగా ఉన్న సమయంలో ఉన్న రికార్డులు, కార్పొరేషన్‌లోని రికార్డులను వేర్వేరుగా భద్రపరచడంతో వాటిని ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. అక్రమ నియామకాలతో సమస్య... కౌన్సిల్, స్టాండింగ్ కమిటీలు చేసిన నియామకాల్లో అక్రమాలు ఉండటంతో వారి విద్యార్హతలు, అనుభవాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ట్రెజరీశాఖకు వివరాలను అందించలేకపోయారు. పూర్తి వివరాలు లేకున్నా ఆడిట్ ఆఫీసర్లు ఆ ఉద్యోగుల వివరాలను ధ్రువీకరించి నివేదిక పంపినా సరిపోతుందని ట్రెజరీ శాఖ వివరించింది. అయితే ఆడిట్ ఆఫీసర్లు సర్టిఫికెట్లు లేనిదే వారి సర్వీసులు, ఉద్యోగ నియామకాలను ధ్రువీకరించలేమని స్పష్టం చేయడంతో కథ మొదటికి వచ్చింది. వీటిని ఇచ్చే వరకు ట్రెజరీ ద్వారా జీతాల చెల్లింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తికాదని అధికారులు భావిస్తున్నారు. ఇది పూర్తికావడానికి కనీసం నాలుగైదు నెలల సమయం పడుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. దాంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు జీతాలు సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. ఆడిట్ కొర్రీలు పరిష్కారమయ్యే వరకు నగర పాలక సంస్ధలు జీతాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన తరువాత తాము నేరుగా జీతాలు చెల్లించలేమని గ్రేటర్ విశాఖ అధికారులు స్పష్టం చేశారు. విజయవాడ కార్పొరేషన్ ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ నుంచి ఇక్కడి ఉద్యోగులు వడ్డీకి రుణాలు తీసుకుంటున్నారు. ట్రెజరీ శాఖ అభ్యంతరాలకు సంబంధించిన పనులను అధికారులు వెంటనే పూర్తిచేసి తమకు ప్రతీ నెలా 1 వ తేదీన జీతాలు వచ్చేలా చూడాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
పేపర్లేకుండా.. పని..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం : పేపర్‌తో పని లేకుండా జీతాల బిల్లులన్నీ ఆన్లైన్లో సమర్పిస్తే.. నెలనెలా ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు వారి ఖాతాలో పడతాయి. ఇటువంటి కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది ఖమ్మం ఖజానా(ట్రెజరీ) శాఖ. ఇక ప్రతి చిన్న పనికి శాఖ ఉద్యోగులు ఉన్నతాధికారి వద్దకు ఫైల్ పట్టుకుని వెళ్లడం.. దీనిపై అనుమానాలుంటే సదరు అధికారికి వివరించాల్సిన అవసరం ఉండదు. వివిధ శాఖల ఉద్యోగులకు ఏ పని కావాలన్నా ఆన్లైన్లో ట్రెజరీ శాఖ ప్రత్యేక పోర్టల్‌ను సంప్రదించవచ్చు. అలాగే నేరుగా కాగితపు రహిత బిల్లులతో వేతనాల చెల్లింపును కూడా అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తింపజేసేలా ఖజానా శాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ద్వారా మే నెలకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను అందజేస్తారు. 2020 జనవరి నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో దీనిని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి నెలవారీ వేతనం పొందాలంటే ఆ శాఖకు చెందిన పాలనా సిబ్బంది నెలవారీ హాజరును ముందుగానే ట్రెజరీ శాఖకు పంపాలి. సంతకాలు చేసిన ఫైళ్లను అందజేయాలి. ఈ మొత్తం వివరాలన్నీ సక్రమంగా పంపితేనే ఉద్యోగికి వేతనాలు సక్రమంగా వస్తాయి. వివరాలు పంపడంలో ఏమాత్రం ఆలస్యమైనా.. వేతనాలు కూడా లేటుగానే వస్తాయి. ఉద్యోగులకు నెలవారీగా వేతనం అందాలంటే ఉద్యోగులకు, ట్రెజరీకి మధ్య అకౌంటింగ్ వ్యవస్థ అమలులో ఉంటుంది. అయితే ప్రస్తుతం రూపొందించిన పోర్టల్ ద్వారా ఇక ఈ వ్యవస్థ అవసరం ఉండదు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్ఎంఐఎస్) ద్వారా ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. దీని ద్వారా జిల్లాలోని 13,320 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 12,453 మంది పెన్షనర్లకు ఉపయోగం కానున్నది. ప్రస్తుత విధానం ఇలా.. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ సేవలు వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఉద్యోగి వేతనాలు, ఇతర బిల్లులు ఆన్లైన్లో నమోదు చేసి.. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలను డీడీఓ(డిపార్ట్మెంటల్ డ్రాయింగ్ ఆఫీసర్) ధ్రువీకరణతో ట్రెజరీలో ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల పనిభారంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అయితే కొత్త విధానం అమలు జరిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. హార్డ్ కాపీలను సమర్పించే అవకాశం ఉండదు. ఐఎఫ్ఎంఐఎస్ చేసే ప్రక్రియ.. ఐఎఫ్‌ఎంఐఎస్‌లో ప్రతి శాఖకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. దీని ద్వారా లాగిన్ అయిన తర్వాత పూర్తి పేరు, బ్యాంక్ అకౌంట్, పాన్‌కార్డు, ఆధార్ కార్డు వివరాలతోపాటు మొదటి పోస్టింగ్ ఎక్కడ.. గతంలో ఎక్కడ పని చేశారు.. పదోన్నతులు పొందితే ఆ వివరాలు, ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పూర్తి చేసిన వివరాలను ఆన్లైన్ ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్‌కు పంపాల్సి ఉంటుంది. డీటీఓకు వచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. వేతనాలు చెల్లించే ఈ–కుబేర్‌కు పంపిస్తారు. ట్రెజరీలో కాగితం రహిత పాలన.. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కాగితం రహిత విధానం అమలు చేయనున్నారు. మరికొద్ది నెలల్లో పూర్తిగా కాగితం రహిత పాలన అమలు కానున్నది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖల డ్రాయింగ్ అధికారులకు ఐఎఫ్ఎంఐఎస్ కేటాయించారు. ఆయా శాఖల పరిధిలోని అధికారులు, ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల వ్యక్తిగత వేతనాలు వారి ఖాతాలో జమ అయ్యేలా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో వివరాల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెల వేతనాలు ఈ విధానం ద్వారా చెల్లించనున్నారు. అయితే ఈ విధానాన్ని ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్లో ఉద్యోగుల వివరాలు అందజేసినా ట్రెజరీకి మళ్లీ హార్డ్ కాపీని కూడా సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 2020 నుంచి హార్డ్ కాపీలతో పనిలేకుండా నేరుగా వేతనాలు, ఇతర బిల్లులు అందజేయనున్నారు. వివరాలు సమర్పించాల్సి ఉంది.. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా శాఖలో ఐఎఫ్ఎంఐఎస్ అనే నూతన విధానాన్ని తెచ్చింది. దీని ద్వారా జిల్లాలోని ఉద్యోగులందరి వేతనాలు సకాలంలో అందనున్నాయి. కొత్త విధానం ద్వారా పేపర్ రహిత పాలన అమలు కానున్నది. శాఖలవారీగా వేతనాల కోసం ఆన్లైన్లో వివరాలు సమర్పించిన తర్వాత కూడా డిసెంబర్ వరకు హార్డ్ కాపీలను ట్రెజరీలో అందజేయాలి. 2020 జనవరి నుంచి హార్డ్ కాపీలు లేకుండా నేరుగా ఆన్లైన్లో వివరాలు సమర్పిస్తే ట్రెజరీ ద్వారా వేతనాలు అందనున్నాయి. – ముత్తినేని వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఖమ్మం -
ఖజానా.. ఖాళీ!
సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు కాగితాల మీద మాత్రమే నిధులు మంజూరవుతున్నాయి. నిర్వహణ ఖర్చుల కోసం పెడుతున్న బిల్లులను ఖజానా శాఖ పాస్ చేయడం లేదు. దీంతో నెలల తరబడి బిల్లులు రాక వార్డెన్లు (హాస్టల్ వెల్ఫేర్ అధికారులు)ప్రైవేట్ గా వడ్డీలకు తెచ్చి ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. పాలు, పండ్లు, గుడ్లతో పాటు కిరాణ సరుకులు, కూరగాయలు, తదితర వస్తువులను అప్పులు తెచ్చి కొనుగోలు చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నెలలు తరబడి ప్రభుత్వం నుంచి డబ్బులు అందకపోవడంతో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ భారంగా మారింది. కిరాణ సరుకులు, గుడ్లు, పాలు, పండ్లు అరువుకు తేవడంతో దుకాణదారులు డబ్బులు అడుగుతుండడంతో వారికి డబ్బులు ఎలా చెల్లించాలో అర్థంకాక సతమతమవుతున్నారు. వార్డెన్లు బిల్లుల కోసం ప్రతిరోజూ ట్రెజరీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం పైసా కూడా విదిల్చలేదు. జిల్లాలో సాంఘిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు నడుస్తున్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే బాలబాలికల కోసం ప్రీ మెట్రిక్ హాస్టళ్లను, ఇంటర్మీడియట్నుంచి పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) వరకు చదివే విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి బడ్జెట్లను మూడు, నాలుగు విడతలుగా విడుదల చేస్తుంటుంది. ఆ బడ్జెట్‌ను అవసరాన్ని బట్టి ఆయా హాస్టళ్ల వార్డెన్లకు జిల్లా సంక్షేమ శాఖల అధికారులు విడుదల చేస్తారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 8 మాసాలు కావస్తుండగా, మొదటి విడతకు సంబంధించి ఆగసుట్ వరకు బడ్జెట్ విడుదల చేశారు. ఆయా హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులకు కూడా పంపిణీ చేశారు. కాగా, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేసినట్లు చూపించినా, అది కాగితాల వరకే పరిమితం అయ్యింది. విడుదలైన బడ్జెట్ ఆధారంగానే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని బిల్లులు తయారు చేసి నవంబర్‌లో ట్రెజరీ కార్యాలయాలకు బిల్లులు పంపించారు. కానీ, ట్రెజరీలో బడ్జెట్ ఫ్రీజింగ్ మొదలు కావడంతో నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు. ఇదీ ... తంతు ! ∙ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 46, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 15 మొత్తం 61 హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 7,097 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రీమెట్రిక్కు సంబంధించి రూ.5,10,935 కాస్మొటిక్ చార్జీల కింద బడ్జెట్ విడుదలైంది. అదే విధంగా డైట్ చార్జీల కింద రూ.81.38 లక్షలు విడుదల కాగా, ఈ రెండింటి బిల్లులు ట్రెజరీకి చేరినా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు పాస్ కాకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అవస్థలు పడుతున్నారు. నాలుగు మాసాలకు సంబం ధించి బిల్లులు పాస్ కావాల్సి ఉంది. ∙బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో .. జిల్లాలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 32 ఉండగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 12 ఉన్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 3,407 మంది విద్యార్థులు ఉండగా, పోస్ట్మెట్రిక్లో 2,050 మంది ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం రూ.3.10 కోట్లు బడ్జెట్ విడుదల చేసింది. అందులో రూ.1.80 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం నవంబర్ నుంచి ఫ్రీజింగ్ కొనసాగుతుండడంతో రెండో విడత పెట్టుకున్న బిల్లులు కూడా పాస్ కాలేదు. నాలుగు నెలలకు సంబం«ధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోస్ట్ మెట్రిక్కు సంబంధించి రూ.2.98 కోట్లు రాగా, రూ.1.98 కోట్లు మొదటి రెండు మాసాల్లో ఖర్చయింది. ఆ తర్వాత పంపిన బిల్లులకు నేటికీ మోక్షం లేదు. అన్నీ ట్రెజరీల్లోనే మగ్గుతున్నాయి. ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 22 ఉండగా కళాశాల హాస్టళ్లు 11 ఉన్నాయి. ఇందుకు సంబంధించి 11,298 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టళ్ల నిర్వహణ కోసం రూ.8.57 లక్షల బడ్జెట్ కేటాయించారు. అందులో రూ.6.20 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన బడ్జెట్‌కు సంబంధించి బిల్లులు పెట్టగా ఒక్కబిల్లూ పాస్ కాలేదు. దీంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని హాస్టళ్లే ఉన్నా వాటికి సంబంధించి కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిధుల్లేకే... ఫ్రీజింగ్ ప్రభుత్వం కాగితాల మీద బడ్జెట్ విడుదల చేస్తుంది కానీ ఖజానాలో మాత్రం డబ్బులు లేవు. దీంతో బిల్లులు పాస్ చేయకుండా పెండింగ్‌లో పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బయటికి చూడడానికి బడ్జెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇటు బిల్లులు పాస్ కాకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్ పెట్టి అడ్డుకట్ట వేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా, ఇటు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, అటు హాస్టళ్లకు వస్తువులు సరఫరా చేసే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై ట్రెజరీ అధికారులను వివరణ కోరితే.. ఫ్రీజింగ్ ఉండడం వల్లే బిల్లులు పాస్ చేయలేయమని అంటున్నారు. ఇతర విషయాలు తమకేం తెలియదంటూ జవాబిస్తున్నారు. -
ఖజానా ఖాళీ.. దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ఖజానా నిండుకుంది. ఉద్యోగులు తమ జీతంలో నుంచి ప్రతినెలా దాచుకునే ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)తో పాటు ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం ఇచ్చే డబ్బులకూ చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ నెల 6వ తేదీ నుంచి బిల్లుల మంజూరుకు ఆర్థిక శాఖ బ్రేకులు వేసింది. ఒక్కపైసా కూడా చెల్లించవద్దంటూ రాష్ట్రంలోని అన్ని ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఫలితంగా నిధులు విడుదల కావడం లేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఉద్యోగుల పీఎఫ్‌తో పాటు వివిధ పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ట్రెజరీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ట్రెజరీ నుంచి కూడా బిల్లులను బ్యాంకులకు పంపుతున్నారు. బిల్లు మంజూరు కోసం ఖజానా నుంచి విత్‌డ్రా చేసేందుకు క్లిక్ చేస్తే.... ఓవర్ డ్రాఫ్టు (ఓడీ) అని చూపిస్తోంది. అంటే ఖజానాలో పైసా కూడా నిధులు లేవన్నమాట. ఒకవేళ బిల్లులు మంజూరు చేయాలంటే ఆర్థిక పరిమితికి మించి అప్పు తీసుకోవాల్సి రానుంది. ఇందుకు రిజర్వ్‌బ్యాంకు (ఆర్బీఐ) అనుమతించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఖజానాకు వివిధ మార్గాల్లో అంటే ఎక్సైజ్, పన్నులు, రవాణా రంగాల నుంచి ఆదాయం జమ అయితేనే బిల్లుల చెల్లింపు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక ఆంక్షల వల్ల కేవలం కర్నూలు జిల్లాలోనే రూ.100 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ మొత్తం రూ.2,500 కోట్ల మేరకు ఉంటుందని ట్రెజరీ వర్గాలు పేర్కొంటున్నాయి. దహన సంస్కారాలకూ డబ్బుల్లేవ్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బినిగెర ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేసే కవిత ఈ ఏడాది అక్టోబరు 21వతేదీన మరణించారు. కుటుంబ సభ్యులు ఆమె దహన సంస్కార ఖర్చుల కోసం మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి డిసెంబరు 5వ తేదీన అందచేసినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. అదేమంటే ఆంక్షలు విధించారంటూ ట్రెజరీ అధికారులు పేర్కొంటున్నారు. ఇదే కాదు.. వివాహాలు, ఇతర అత్యవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న పలువురు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) డబ్బులు మంజూరు కాకపోవడంతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. నీరు–చెట్టుకు నేరుగా నిధులు వాస్తవానికి అన్ని బిల్లులు ఆన్లైన్లోనే మంజూరు చేసేందుకు అనుగుణంగా సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం–సీఎఫ్ఎంఎస్)ను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. బిల్లులను క్రమపద్ధతిలో ఎటువంటి విచక్షణ లేకుండా ఆన్లైన్లో మంజూరు చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇందుకు విరుద్ధంగా నీరు–చెట్టు బిల్లులను సీఎఫ్ఎంఎస్ విధానంలో కాకుండా ప్రభుత్వం నేరుగా విడుదల చేసింది. ఇప్పుడు కూడా బడా కాంట్రాక్టర్లకు అలాగే బిల్లులు నేరుగా చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. -
ఖజానాలో కాగిత రహిత పాలన
ఒంగోలు టూటౌన్:ఖజానా శాఖలో కాగిత రహిత పాలనా విధానం అమలుకానుంది. పింఛన్లతో పాటు బిల్లులన్నీ ఇక ఆన్లైన్లోనే చెల్లించేందుకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు, ట్రెజరీ ఉద్యోగులకు కొత్త విధానం.. అంటే సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్ఎంఎస్)పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్ల వారీగా డ్రాయింగ్ అధికారులకు స్థానిక పేస్ ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. జిల్లా మొత్తం మీద 950 మంది డ్రాయింగ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరందరికీ కొత్త విధానంపై అవగాహన కల్పించారు. ఈ నూతన విధానాన్ని గురువారం ప్రభుత్వం ఆవిష్కరించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరు ఆధారంగా ఆన్లైన్లోనే బిల్లుల తయారీ ప్రక్రియ సాగనుంది. ఉద్యోగుల సెలవులు, ఇతరత్రా లావాదేవీలన్నింటినీ ఇక్ ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో అద్దంకి, చీరాల, కంభం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, మార్కాపురం, మార్టూరు, ఒంగోలు, పొదిలి, యర్రగొండపాలెంలో ఉపఖజానా కార్యాలయాలు ఉద్యోగులు, పింఛన్‌దారులకు సేవలందిస్తున్నాయి. వీటి పరిధిలో 32 వేల మంది వరకు వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగులు, 26 వేల మంది వరకు పెన్షన్‌దారులు ఉన్నారు. వీరుగాకుండా మరో 13 వేల మంది పొరుగుసేవలు అందించే కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరందరికీ నెలకు జీతభత్యాల రూపంలో రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. ఉద్యోగుల జీతభత్యాల బిల్లులు, ఇతర బిల్లులను ప్రతినెలా ఏజీ ఆడిట్‌కు పంపించాల్సి ఉంటుంది. పెన్షనర్లు, ఉద్యోగులు, ఇతరుల బిల్లులను చెల్లించేందుకు ఎంతో మంది ఉద్యోగులు పనిచేయాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులలో తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు సమ్మె, నిరసన కార్యక్రమాల వంటి వాటి వలన బిల్లులకు సంబంధించిన రికార్డులు నిలిచిపోవడం జరుగుతుంది. దీని వలన ఖజానాపై పెద్ద భారమే పడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కాగిత రహిత పాలనవైపు సర్కార్ దృష్టిపెట్టింది. మానవ వనరుల వినియోగం తగ్గించి ఆధునిక టెక్నాలజీతో సత్వర సేవలందించేందుకు నిర్ణయించింది. అయితే, కొత్త విధానంలో బయోమెట్రిక్ కీలకం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రతి కార్యాలయంలోని ఉద్యోగులు బయెమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్‌లో హాజరు నమోదైతేనే నెలవారీ జీతం సక్రమంగా బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఉద్యోగుల సెలవులు, ఇతరత్రా లావాదేవీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంతో సీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేసి కంప్యూటర్ ద్వారానే సమగ్ర బిల్లు విధానాన్ని అమలు చేస్తారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమలయ్యే కొత్త విధానంలో బయోమెట్రిక్ హాజరే కీలకం కానుందని ట్రెజరీ వర్గాలు తెలిపాయి. -
నేడే ఆఖరు
► సమగ్ర వివరాలు సమర్పించిన ఉద్యోగులు 50 శాతమే ► వేతనాలు నిలిపివేస్తామన్నా.. కొరవడిన స్పందన ► ఈరోజు భారీ సంఖ్యలో అందే అవకాశం సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమగ్ర సమాచారం అందించడానికి గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకు 50 శాతం ఉద్యోగుల వివరాలు మాత్రమే జిల్లా ట్రెజరీ శాఖకు చేరినట్లు తెలుస్తోంది. నిర్ణీత ఫార్మెట్లో వివరాలు అందజేయాలని, లేకుంటే ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలు నిలిపివేస్తామని గత నెలలో ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం, బడ్జెట్ అంచనాలు, ఖాళీగా ఉన్న పోస్టులు తదితర లెక్కలపై స్పష్టమైన సమాచారం రాబట్టడానికి వీలుగా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా ఈనెల 20వ తేదీలోగా శాఖల వారీగా ఉద్యోగుల వివరాలను అందజేయాలని డిస్బర్సింగ్ అండ్ డ్రాయింగ్ ఆఫీసర్ల (డీడీఓ)కు జిల్లా ట్రెజరీ శాఖ సూచిం చింది. ఆలస్యం చేయకుండా వివరాలు పంపేందుకు వీలుగా ప్రతిశాఖకు నమూనా ఫారాలను కూడా చేరవేసింది. బిల్లులతోనే వివరాలు వాస్తవంగా అన్ని శాఖల నుంచి ఉద్యోగుల పే బిల్లులు ప్రతినెలా 25వ తేదీలోగా ట్రెజరీకి అందుతాయి. వీటి ఆధారంగానే వేతనాలు విడుదల చేస్తారు. ఈ నిర్ణీత తేదీకి ఐదు రోజుల ముందుగానే అంటే 20వ తేదీలోగా వివరాలు తమకు అంద జేయాలని ట్రెజరీ శాఖ అధికారులు చెప్పినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదు. పే బిల్లుల అందజేతకు గడువు నేటితో ముగియనుంది. వివరాల అందజేతకూ ఇదే వర్తిస్తుంది. జిల్లాలో 18 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షర్లు ఉన్నారు. ఇందులో ఇంకా 50 శాతం మంది వివరాలు ట్రెజరీకి అందాల్సి ఉందని సమాచారం. ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి చాలా మంది ఉద్యోగులు వివరాలు చేరలేదని తెలుస్తోంది. ఈ శాఖ పరిధిలో జిల్లాలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ర్యాంకు వరకు దాదాపు ఐదు వేల మంది ఉంటా రని అంచనా. వీరిలో దాదాపు రెండు వేల మందే సమర్పించారని సమాచారం. తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల వివరాల పత్రాలను డీడీఓలు సేకరిస్తున్నారు. ఇలా తీసుకున్న ప్రతి ఉద్యోగి సమాచారాన్ని సర్వీస్ పుస్తకంలో ఉన్న అంశాలతో సరిచూ డాల్సి ఉంటుంది. ఇవన్నీ సహేతుకంగా ఉంటేనే ఒకే చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి అధిక సమయం పడు తోం దని అధికారులు వివరిస్తున్నారు. ఈ కారణంగా అందజేతలో కాస్త జాప్యం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. అయితే డీడీఓల నుంచి చివరి రోజు పెద్ద ఎత్తున అందవచ్చని ట్రెజరీ శాఖ భావిస్తోంది. మరోవైపు సాయంతంల్రోగా తమకు చేరిన పత్రాలకు సంబంధించిన ఉద్యోగులకే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మిగిలిన వారు అందుకు నోచుకోక పోవచ్చని పేర్కొంటున్నారు. -
ట్రెజరీ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ట్రెజరీ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని తెలంగాణ ట్రెజరీ ఎన్జీవో అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ సంఘం మొదటి వార్షికోత్సవం మంగళవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని సాయిబాబా అంధుల పాఠశాలలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ట్రెజరీ శాఖలో పనిచేస్తున్న ఎన్జీవోల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. అనంతరం టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..కొత్త జిల్లాల ఏర్పాటుతో ట్రెజరీ శాఖలో ఉద్యోగులపై పనిభారం పెరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేటెడ్ అధ్యక్షుడు పర్వతాలు, సంయుక్త కార్యదర్శి శైలజ, జిల్లా అధ్యక్షుడు జగన్, కార్యదర్శి రఫిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించేందుకు సంఘం ప్రతినిధులు పాఠశాలకు ఆర్థికసాయం అందించారు. -
ఖజానా శాఖలో బదిలీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా ఖజానా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ శాఖలో 13 మంది ఉద్యోగులకు బదిలీలు జరిగాయి. 2014 నవంబర్, 2015 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలు నిర్వహించగా, వివిధ కారణాలతో ఖజానా శాఖ ఉద్యోగులు బదిలీలకు దూరమయ్యారు. కేవలం జిల్లా స్థాయి అధికారులే బదిలీలకు పరమితమయ్యారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, షరఫ్, ఆఫీస్ సబార్టినేట్లకు బదిలీలు జరగలేదు. ఈ శాఖలో ఐదేళ్లపాటు ఒకే చోట పనిచేసిన సిబ్బంది 20 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 20 శాతం మందికే బదిలీలు పరిమితం కావడంతో మిగతా సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అదనంగా బదిలీలకు అనుమతులు ఇవ్వాలంటూ డీడీ వనజారాణి రాష్ట్ర డైరక్టర్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి అనుమతులు రావాల్సింది. జిల్లాలో జిల్లా ఖజానా కార్యాలయంతోపాటు 14 సబ్ ట్రెజరీలు ఉన్నాయి. ఈ సిబ్బందిలో ఇప్పటి వరకు 13 మందికి బదిలీలు జరిగాయి. వీరిలో ఆఫీస్ సబార్టినేటర్లు ఇద్దరు, జూనియర్ అకౌంటెంట్లు ఇద్దరు, సీని యర్ అకౌంటెంట్లు ఆరుగురు, షరఫ్ కేడరులో ముగ్గురికి బదిలీలు చేశారు. కాగా గెజిటెడ్ కేడరులో సబ్ ట్రెజరీ ఆధికారులకు బదిలీలు జరగాల్సి ఉంది. -
తొలగని ఆంక్షలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖజానా విభాగంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత నెల 25వ తేదీ నుంచి ఖజానా విభాగం ద్వారా చేపట్టే చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. జూన్ 2న అపాయింటెడ్ డే నుంచి తిరిగి చెల్లింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అపాయింటెడ్ డే పూర్తయినప్పటికీ అంతర్గతంగా విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఖజానా విభాగంలో బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపులతోపాటు కార్యాలయ నిర్వహణ, పెన్షన్లు, ప్రభుత్వ పనులు, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల గ్రాంటులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఖజానా విభాగం ద్వారానే పూర్తవుతాయి. ఇందుకు సంబంధించి ఆయా శాఖలు రూపొందించిన బిల్లుల ఆధారంగా నిధులను విడుదల చేస్తారు. జూన్ రెండో తేదీ వరకు చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో జూన్ ఒకటో తేదీ వరకు అన్నిరకాల చెల్లింపులు పూర్తి చేశారు. అయితే కొన్ని కార్యాలయాలు సమర్పించిన బిల్లుల్లో తప్పులు దొర్లడం, మరికొందరు జాప్యం చేయడంతో వారికి సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. రెండో తేదీ తర్వాత వీటిని క్లియర్ చేసుకోవచ్చని భావించిన పలు విభాగాల అధికారులకు తాజాగా ఇబ్బందులు వచ్చిపడ్డాయి. విభజన క్రమంలో భాగంగా సర్వర్ల బదలాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున ఖజానా శాఖ వెబ్సైట్ నిలిచిపోయింది. వారంపాటు ఇంతే! ఖజానా చెల్లింపుల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు సర్వర్ల విభజన పూర్తికావడానికి నాలుగైదు రోజులు పడుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విభజనలో భాగంగా డీడీఓల ఖాతాలన్నీ జీరో బ్యాలెన్స్ అయ్యాయి. మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏప్రిల్, మే నెలలకే సరిపోవడంతో.. జూన్‌లో కొత్త బడ్జెట్ వస్తేనే చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అసెంబ్లీ భేటీ తర్వాత ఈ సమస్య పరిష్కారమవుతుంది. అప్పటివరకు చెల్లింపుల సంగతి ఇంతేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త చెక్కులతోనే.. కొత్త రాష్ట్రం ఆవిర్భావంతో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు పంచాయతీలు, మండల పరిషత్‌లు అవసరమైన నిధులను ఖజానా శాఖ ఇచ్చిన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన పూర్తయిన నేపథ్యంలో అవన్నీ రద్దయ్యాయి. తిరిగి కొత్త ఎల్ఓసీల ద్వారా నిధుల విడుదల చేయాలని ఖజానా శాఖ ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా నిధులు డ్రా చేసే అన్ని కార్యాలయాలకు ఇప్పటికే ఖజానా శాఖ కొత్త చెక్ పుస్తకాలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త చెక్కుల ద్వారానే చెల్లింపులు చేపడతామని, పాత చెక్కులు చెల్లవని జిల్లా ఖజానా శాఖ అధికారి ఏ.నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఖజానా సేవలు బంద్!
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఖజా నా శాఖ ద్వారా అందుతున్న సేవలు పది రోజుల పాటు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజన కారణంగా ఈ శాఖ కూడా రెండుగా విడిపోనుండడంతో ఈ శాఖలో కార్యకలాపాలను ఈ నెల 24 నుంచి నిలిపివేయనున్నారు. తప్పనిసరిగా చెల్లించాల్సి న బిల్లులను అన్ని ఉప ఖజానా కార్యాల యాల నుంచి తెప్పించుకుని జిల్లా ఖజానా శాఖ కార్యాలయం ద్వారా పంపించారు. ఇక బిల్లుల సమర్పణకు కూడా అవకాశం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరి వేతనాలు, పింఛన్ల చెల్లింపుల కోసం బిల్లుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గతంలో మే 17 నాటికి బిల్లుల స్వీకరణ పూర్తి చేస్తామని చెప్పిన యంత్రాంగం తరవాత 19 వరకూ అవకాశమిచ్చింది. తరవాత ఆ తేదీని 21వ వరకూ పొడిగించింది. నాలుగైదు జిల్లాలను యూనిట్‌గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన బిల్లుల స్వీకరణ చేపట్టారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కొన్ని రోజులుగా ఖజానా శాఖ ఉద్యోగులు నానా హైరానా పడుతున్నారు. జిల్లాలోని అన్ని సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉన్న బిల్లులను జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడి సర్వర్‌తో సమర్పణ కార్యక్రమాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు. 21తో బిల్లుల స్వీకరణ, 24తో చెల్లింపులను నిలుపుదల చేసి, మళ్లీ ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన ఆదేశాల మేరకు బిల్లులను మంజూరు చేయనున్నారు. అంత వరకూ ఖజానా శాఖ ద్వారా బిల్లులను నిలుపుదల చేస్తారు. ఇప్పటి వరకూ జరిగిన వ్యయాలను సమైక్యాంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించుకుని అనంతరం జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ద్వారా ఆయా యంత్రాంగాల ఆధ్వర్యంలో నిర్వహించడానికి వీలుగా ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక నుంచి కార్యాలయ పరిధిలోని పనులే తప్ప బిల్లులకు సంబంధించిన పనులు మాత్రం చేసే అవకాశం లేదు. అభివృద్ధి పనులకు బ్రేక్.. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల పనులకు విఘాతం కలగనుంది. ముఖ్యంగా గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు కూడా రాష్ట్ర విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు. 24 నుంచి బిల్లులు పాస్ కావు జిల్లాకు సంబంధించిన వేతనాలు, పింఛన్లు తదితర బిల్లులు 24 తరవాత పాస్ కావు. ఇప్పటికే బిల్లుల సమర్పణ కూడా జరిగిపోయింది. బిల్లులను సమర్పించేందుకు కూడా గడువు బుధవారంతో(ఈ నెల 21తో) ముగిసిపోయింది. జూన్ రెండు తరవాతే బిల్లుల చెల్లింపులు, సమర్పణలు ఉంటాయి. ఇప్పటి వరకూ మా వద్ద పెండింగ్ బిల్లులు లేవు. - పి.వి. భోగారావు, ఖజానా శాఖ డీడీ, విజయనగరం -
అమెరికా ట్రెజరీలో భారతీయుడికి చోటు
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి వరించింది. ట్రెజరీ శాఖలోని కంప్ట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ(ఓసీసీ)లో అప్లికేషన్ సర్వీసెస్ డెలివరీ విభాగానికి ఉప ముఖ్య సమాచార అధికారిగా జవహర్ కల్యాణి నియమితులయ్యారు. అప్లికేషన్ల అభివృద్ధి, అమలు కార్యక్రమాలకు ఆయన నేతృత్వం వహించనున్నారని ఒక ప్రకటన జారీ అయింది. జవహర్‌కు ఉన్న అనుభవంతో ఈ బాధ్యతలు గొప్పగా నిర్వహించగలరని ఓసీసీ ముఖ్య సమాచార అధికారి ఎడ్వర్డ్ డోరిస్ తెలిపారు. ఇప్పటి వరకు జవహర్ కల్యాణి ఆమ్‌డాస్ ఇంక్ అనే కంపెనీలో పనిచేశారు. అక్కడ కస్టమర్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రముఖ టెలికం కంపెనీలకు బిజినెస్ ఐటీ సొల్యూషన్లు, ఇతర సేవల అభివృద్ధి, నిర్వహణ, పంపిణీ వంటి కీలక బాధ్యతలు చూశారు. ఈ రంగంలో ఆయనకు 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ముంబైలోని వీరమాత జిజాబాయ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి బీఈ పూర్తి చేసిన జవహర్ కల్యాణి అనంతరం అమెరికాలో ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎంబీయే పట్టా అందుకున్నారు. -
కార్మికులకు కనీస పెన్షన్ రూ. వెయ్యి
కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థికశాఖ ఆమోదం న్యూఢిల్లీ: సంఘటిత రంగంలోని కార్మికులకు నెలకు రూ. వెయ్యి కనీస పెన్షన్ ఇవ్వాలన్న కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 44 లక్షల మంది పెన్షనర్లలో 5 లక్షల మంది వితంతువులు సహా 27 లక్షల మందికి తక్షణ ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఉద్యోగుల భవిష్య నిధి పథకం కింద కనీస వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచాలన్న ప్రతిపాదనకు కూడా ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. -
చిదంబరమంత్రం ఫలిస్తుందా?
ముంబై: అనూహ్యంగా గత శుక్రవారం 135 పైసలు పుంజుకున్న రూపాయి మారకం విలువ మరింత కోలుకునే అవకాశాలున్నాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్), అదేవిధంగా ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి చిదంబరం భరోసా ఇవ్వడం రూపాయికి మద్దతుగా నిలిచాయని పలు బ్యాంకులకు చెందిన ట్రెజరీ విభాగం అధిపతులు పేర్కొన్నారు. కరెన్సీ స్థిరీకరణకు ప్రభుత్వం, ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటాయన్న భరోసాతో ఇన్వెస్టర్లు ఉన్నారని... ఈ వారంలో దేశీ కరెన్సీ పుంజుకునే అవకాశాలున్నట్లు ధనలక్ష్మి బ్యాంక్ ట్రెజరర్ శ్రీనివాస రాఘవన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 22న డాలరుతో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 65.56 కనిష్టానికి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల ఉపసంహరించొచ్చన్న భయాందోళనలు దీనికి ఆజ్యంపోశాయి. అయితే, 23న చిదంబరం ప్రకటన తర్వాత ఒక్కసారిగా 135 పైసలు బలపడిన రూపాయి 63.20 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా దేశీ కరెన్సీ దాదాపు 20 శాతం పతనమైంది. రూపాయి భారీ పతనం నేపథ్యంలో టాప్ బ్యాంకర్లు, విదేశీ ఇన్వెస్టర్లతో చిదంబరం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గత శనివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)లోపెట్టుబడులపై నియంత్రణ భయాలను తొలగించడం, విదేశీ నిధుల సమీకరణ ప్రణాళికలను ఈ సందర్భంగా చర్చించారు. వచ్చే వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన చర్యలు వెలువడతాయని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ పేర్కొన్నా రు కూడా. కాగా, రూపాయి 62.50-64.50 శ్రేణిలో కదలాడవచ్చనేది కొందరు మార్కెట్ వర్గాల అంచనా. ‘రూపాయి పతనానికి బ్రేక్ వేసేందుకు ఆర్బీఐ ప్రయత్నించొచ్చు. 64.50 దిగువకు పడిపోతే ఎగుమతిదారులు డాలర్లను విక్రయించే అవకాశం ఉంది’ అని స్టాన్‌చార్ట్ ఎండీ అగమ్ గుప్తా అభిప్రాయపడ్డారు. 90ల నాటి పరిస్థితుల్లోకి ఆసియా దేశాలు! అమెరికాలో వాస్తవ(రియల్) వడ్డీరేట్లు ఎగబాకడం, డాలరు విలువ దూసుకెళ్తుండటంతో ఆసియా దేశాల్లో మళ్లీ 90ల నాటి ప్రతికూల పరిస్థితులకు దారితీయొచ్చని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో పేర్కొంది. సాధారణ వడ్డీరేట్లపై ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నాక గణించేదాన్ని రియల్ వడ్డీరేటుగా పేర్కొంటారు. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ మళ్లీ కఠిన పాలసీ(ప్యాకేజీల్లో కోత, వడ్డీరేట్ల పెంపు)కి మరళొచ్చన్న అంచనాలతో ఈ రేట్లు పుంజుకుంటూ వస్తున్నాయి. డాలరు కూడా దూసుకెళ్తోంది. దీనివల్ల ఆసియా దేశాల్లో కూడా రియల్ రేట్లను ఎగదోస్తాయని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. అసలే పలు దేశాల్లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు మరింత పడిపోయేందుకు ఈ పరిణామాలు ఆజ్యంపోస్తాయని పేర్కొంది. డాలరు విలువ ఇలాగే పెరుగుతూపోతే... 1990 దశాబ్దం మధ్య నుంచి 2001 వరకూ ఆసియా దేశాల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులే పునరావృతమయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అప్పట్లో అమెరికా రియల్ రేట్లు ఎగబాకి, వాణిజ్యలోటు తగ్గిపోవడంతో డాలరు పరుగులు తీసింది. దీంతో ఆసియా దేశాల్లో కరెన్సీలు ఘోరంగా పడిపోవడంతోపాటు రియల్ రేట్లు దూసుకెళ్లి వృద్ధిరేటు ఆవిరయ్యేందుకు దారితీసింది. ముఖ్యంగా అధిక కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) సమస్యలు ఎదుర్కొంటున్న భారత్ తదితర దేశాల్లో చెల్లింపుల రిస్క్‌లు మరింత పెరిగే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. -
స్తంభించిన ప్రభుత్వ చెల్లింపులు
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వ చెల్లింపులు, రాబడి ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. సమ్మె కారణంగా మూడు రోజుల్లో ప్రభుత్వ చెల్లింపులు రూ.141 కోట్ల వరకు పెండింగ్ పడ్డా యి. ప్రభుత్వ ఉద్యోగుల రుణాలు, పీ ఎఫ్ లోన్లు, మెడికల్ బిల్స్ వంటి ఫై ల్స్ పూర్తిగా పక్కకుపోయాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్స్ కూడా పెండింగ్‌లో పడ్డాయి. చిత్తూరు ప్రధాన ఖజానా కార్యాలయంతో సహా తిరుపతి, మదనపల్లె డివిజన్లో ఉప కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో ప్రజలు ప్రభుత్వానికి ఫీజులు, పన్నులు(రాబడి), వివిధ హెడ్లు, సబ్ హెడ్ అకౌంట్ల కింద చెల్లిస్తుం టారు. ఏపీఎన్జీవో సమ్మెలో భాగంగా ఖజానా ఉద్యోగులు నిరవధిక అందోళనకు దిగారు. ఆగస్టు చివరివరకు సమ్మె ఇదే రీతిలో జరిగితే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ చెల్లింపులు, రాబడి రూ.వెయ్యి కోట్లకు పైగా కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సెప్టెంబర్ జీతాలు లేనట్లే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో వీరికి సెప్టెంబర్ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి బిల్స్ రాసి, ఖజానా శాఖ ఆమోదం పొంది, అక్క డి నుంచి బ్యాంక్‌లకు వెళితే గానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అకౌం ట్లలో పడవు. సాధారణంగా 15వ తేదీ నుంచే బిల్స్ రాసే ప్రక్రియ మొదలవుతుంది. సమ్మె కారణంగా నో వర్క్, నో పే పరిస్థితి ఉండడంతో ఖజానా శాఖ కూడా జీతాలు చెల్లిం చేందుకు వీలు కాదు. రెవెన్యూ, ఖజానా, వాణిజ్య, రిజిస్ట్రేషన్స్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్అండ్ బీ, ఉపాధి కల్పన, మున్సిపల్, పబ్లిక్ హెల్త్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, డీఆర్డీఏ, ఆర్టీవో, ఐకేపీ వంటి ప్రధాన శాఖల జీతాలు, బిల్లుల చెల్లింపుల ప్రక్రియ పూర్తిగా స్తంభిం చాయి. ఆయా శాఖల రోజువారీ అవసరాలకు కంటెన్జెన్సీ నిధులు కూడా లేక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రోటోకాల్ ఖర్చులకూ ఇబ్బందులే తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చే ప్రభుత్వ పెద్దలు, అమాత్యులు, ప్రో టోకాల్ మర్యాదలు చేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం నిరంతరం కంటెన్జెన్సీ నిధులు ఖజానా ద్వారా తెప్పించుకోవాల్సి ఉంటుంది. సమ్మె కారణంగా ప్రోటోకాల్ విధులకు అం తరాయం ఏర్పడనుంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన బిల్స్ రాసేవారు లేక, ప్రోటోకాల్ ఖర్చులకు నిధులు రాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యాంకులోనూ ఇక్కట్లు రిజిస్ట్రేషన్లు, సర్వే ఫీజులు, వివిధ సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు చలానాల రూపంలో ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా లక్షల్లో చెల్లిస్తుంటారు. పంచాయతీ కొళాయి లు, ఇతర మౌలిక సదుపాయల కల్పన ఫీజులు కూడా ఖజానాకు బ్యాంక్ చలానా ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. చలానా చెల్లించిన తర్వాత దానికి సంబంధించిన కౌంటర్ ఫైల్‌పై ట్రెజరీ నంబరు, సంబంధిత సిబ్బంది సంతకం, సీల్ వేసేందుకు ఒక ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సమ్మె వల్ల సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రజలు చెల్లింపులను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. -
ఆ నిధులకు లెక్కేదీ..?
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: వివిధ ప్రభుత్వ శాఖలకు విడుదలైన నిధుల వినియోగానికి సంబంధించి లెక్కలు తేలడం లేదా? ఆయా శాఖలకు విడుదలైన నిధులకు, వ్యయం చేసిన మొత్తాలకు పొంతన కుదరడం లేదా? మూడేళ్లలో ప్రభుత్వ శాఖలకు విడుదలైన సుమారు లక్ష కోట్ల రూపాయల వినియోగానికి సంబంధించి పూర్తిస్థాయిలో వినియోగ ధ్రువీకరణ పత్రాలు లేవా... అనే అనుమానాలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో గత మూడేళ్లలో ప్రభుత్వ శాఖలకు విడుదలైన నిధులు, వాటి వినియోగంపై తాజాగా సమగ్ర ఆడిట్‌కు సర్కారు ఆదేశించింది. ఆయా శాఖలకు ప్రభుత్వం నుంచి విడుదలవుతున్న నిధులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులను పరిశీలిస్తే భారీ మొత్తంలో తేడా కనిపిస్తోంది. ప్రభుత్వ నిధులను ఖజానాలో భద్రపరిచే పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్(పీడీ అకౌంట్స్)పై కూడా గందరగోళం నెలకొంది. ఈ విషయం కాగ్ 2011-12 నివేదికలో వెలుగుచూసింది. పీడీ అకౌంట్స్ నిర్వహణ, నిధుల వినియోగం విషయంలో నెలకొన్న డొల్లతనాన్ని కాగ్ ఆ నివేదికలో కడిగిపారేసింది. కాగ్ నివేదికను పరిశీలించిన ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పీఏసీ) మండిపడింది. కాగ్ నివేదికలోని అంశాలపై నిగ్గుతేల్చమని సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించింది. దీంతో మూడు సంవత్సరాలు అంటే 2010-11, 2011-12, 2012-13 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వ శాఖలకు మంజూరైన బడ్జెట్ (నిధులు), వాటి వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. దీనిపై ఆర్థిక శాఖ కార్యదర్శి వి.భాస్కర్, రాష్ట్ర ఖజానా శాఖ డెరైక్టర్ కె.కనకవల్లి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థలకు విడుదలైన నిధులను స్టేట్ ఆడిట్ విభాగం ఇతర ప్రభుత్వ శాఖలకు విడుదలైన నిధులు, వినియోగం విషయాలను ఖజానా శాఖ, ఆర్థికశాఖ, అంతర్గత ఆడిట్ విభాగాలు సమగ్రంగా ఆడిట్ చేయనున్నాయి. అంత్య, ఆరంభ నిల్వల్లో తేడాలు వివిధ ప్రభుత్వ శాఖల అంత్య, ఆరంభ నిల్వల్లో భారీ తేడాలున్నాయి. 2010-11 ఆర్థిక సంవత్సరానికి ఉన్న అంత్య నిల్వ (క్లోజింగ్ బ్యాలెన్స్) 2011-12కు ప్రారంభ నిల్వ అవుతుంది. అయితే వివిధ ప్రభుత్వ విభాగాల్లో 2010-11 అంత్య నిల్వకు 2011-12 ప్రారంభ నిల్వకు తేడాలున్నట్లు కాగ్ పరిశీలనలో వెల్లడయింది. దీంతో అవాక్కయిన కాగ్ అధికారులు అదే విషయాన్ని తమ నివేదికలో పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ విభాగాలు నిర్వహిస్తున్న పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్‌లో కూడా భారీ తేడాలున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న మొత్తాలకు, ఖజానా కార్యాలయాలు ఆన్లైన్ ద్వారా చేసిన చెల్లింపులకు సంబంధించిన మొత్తాల్లో కూడా భారీ తేడాలున్నాయి. ఈ వివరాలన్నింటిపై కాగ్ అధికారులు తమ అభిప్రాయాలను 2011-12 నివేదికలో కుండబద్దలు కొట్టారు. ఈ అభిప్రాయాలతో ఏకీభవించిన పీఏసీ... కాగ్ అభిప్రాయాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించి నివేదికను సమర్పించనుంది. 2010 ఏప్రిల్ 1 నుంచి 2013 మార్చి 31 వరకు పీడీ అకౌంట్స్‌లో జరిగిన లావాదేవీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. ఆడిట్‌కు మార్గదర్శకాలివీ... ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించి ఆర్థిక శాఖ అంతర్గత ఆడిట్ విభాగం, స్థానిక సంస్థల నిధుల విడుదల, వినియోగాన్ని పరిశీలించే స్టేట్ ఆడిట్ విభాగం, ప్రభుత్వ శాఖలకు నిధుల విడుదల వినియోగాన్ని పరిశీలించే ఖజానా శాఖ అధికారులను ఆడిట్‌కు నియమించారు. ఆడిట్ నిర్వహణకు ప్రభుత్వమే మార్గదర్శకాలు నిర్దేశించింది. మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్లో తేలిన విషయాలను ఒకే నివేదికగా సమర్పించనున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు పీడీ అకౌంట్, ఎస్బీ అకౌంట్, పాస్ పుస్తకాలు, క్యాష్ పుస్తకాలు, చెక్కుల పుస్తకం కౌంటర్ ఫాయిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం నిర్దేశించిన పనులకే వినియోగించారా, ఇతర పనులకు వినియోగించారా అన్న విషయాన్ని పరిశీలించనున్నారు. నాలుగు కమిటీల ఏర్పాటు ప్రకాశం జిల్లాలో గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు నిధుల మంజూరు, వినియోగం గురించి సమగ్ర సమాచారం సేకరించేందుకు జిల్లా ఖాజానా ఉప సంచాలకుడు ఎన్.నాగేశ్వరరావు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సివిల్, క్రిమినల్ కోర్టుల్లో డిపాజిట్లు, నిధుల మంజూరు, వినియోగాలకు సంబంధించిన వివరాలను ఒంగోలు ఎస్టీవో పి.శ్రీనివాసులు, సీనియర్ అకౌంటెంట్లు ఎం.సీతయ్య, ఈవి అనిల్‌కుమార్‌ల బృందం పరిశీలిస్తుంది. ముఖ్య ప్రణాళికాధికారి (సీపీవో), సంబంధిత పీడీ అకౌంట్స్నుఎస్టీవో ఎ.రాజేశ్వరి, సీనియర్ అకౌంటెంట్లు ఏ.పద్మావతి, పి.వరకుమార్ల బృందం పరిశీలిస్తుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇతర పీడీ అకౌంట్లను సబ్ ట్రెజరీ అధికారులు ఏవీఎస్ఎస్ ప్రసాద్, పి.వెంకట్రావు, బి.అక్కేశ్వరరావుల బృందం పరిశీలిస్తుంది. విద్యా సంస్థల్లోని డిపాజిట్లు, ఇతర నిధుల వివ రాలను కందుకూరు ఎస్టీఓ షేక్ అహ్మద్, సీనియర్ అకౌంటెంట్లు ఏవీ ప్రసాదరావు, ఎ.ఆంజనేయులు బృందం పరిశీలిస్తుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (ిసీపీఎస్)కు సంబంధించిన పీడీ అకౌంట్ల వివరాలను సహాయ ఖాజానా అధికారి వి.రమణయ్య పరిశీలించి నివేదించాలి. ఈ ప్రత్యేక బృందాలన్నీ తమకు కేటాయించిన ప్రభుత్వ శాఖల గత మూడేళ్ల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆగస్టు 20 వ తేదీకి నివేదిక సమర్పించాలని కోరినట్లు ఖజానాశాఖ ఉప సంచాలకుడు ఎన్.నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాలో న్యాయశాఖకు సంబంధించిన పీడీ అకౌంట్ల పరిశీలన విషయంలో ఆడిట్ బృందానికి సహకరించాలని కోరుతూ జిల్లా జడ్జిని వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.