సంక్షేమ వసతి గృహాల నిర్వహణకు కాగితాల మీద మాత్రమే నిధులు మంజూరవుతున్నాయి. నిర్వహణ ఖర్చుల కోసం పెడుతున్న బిల్లులను ఖజానా శాఖ పాస్ చేయడం లేదు. దీంతో నెలల తరబడి బిల్లులు రాక వార్డెన్లు (హాస్టల్ వెల్ఫేర్ అధికారులు)ప్రైవేట్ గా వడ్డీలకు తెచ్చి ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు. పాలు, పండ్లు, గుడ్లతో పాటు కిరాణ సరుకులు, కూరగాయలు, తదితర వస్తువులను
అప్పులు తెచ్చి కొనుగోలు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నెలలు తరబడి ప్రభుత్వం నుంచి డబ్బులు అందకపోవడంతో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ భారంగా మారింది. కిరాణ సరుకులు, గుడ్లు, పాలు, పండ్లు అరువుకు తేవడంతో దుకాణదారులు డబ్బులు అడుగుతుండడంతో వారికి డబ్బులు ఎలా చెల్లించాలో అర్థంకాక సతమతమవుతున్నారు. వార్డెన్లు బిల్లుల కోసం ప్రతిరోజూ ట్రెజరీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం పైసా కూడా విదిల్చలేదు. జిల్లాలో సాంఘిక, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు నడుస్తున్నాయి. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే బాలబాలికల కోసం ప్రీ మెట్రిక్ హాస్టళ్లను, ఇంటర్‌మీడియట్‌నుంచి పోస్ట్రుగాడ్యుయేషన్ (పీజీ) వరకు చదివే విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం హాస్టళ్ల నిర్వహణకు సంబంధించి బడ్జెట్‌లను మూడు, నాలుగు విడతలుగా విడుదల చేస్తుంటుంది. ఆ బడ్జెట్‌ను అవసరాన్ని బట్టి ఆయా హాస్టళ్ల వార్డెన్లకు జిల్లా సంక్షేమ శాఖల అధికారులు విడుదల చేస్తారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 8 మాసాలు కావస్తుండగా, మొదటి విడతకు సంబంధించి ఆగసుట్ వరకు బడ్జెట్ విడుదల చేశారు. ఆయా హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులకు కూడా పంపిణీ చేశారు. కాగా, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బడ్జెట్ విడుదల చేసినట్లు చూపించినా, అది కాగితాల వరకే పరిమితం అయ్యింది. విడుదలైన బడ్జెట్ ఆధారంగానే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని బిల్లులు తయారు చేసి నవంబర్‌లో ట్రెజరీ కార్యాలయాలకు బిల్లులు పంపించారు. కానీ, ట్రెజరీలో బడ్జెట్ ఫ్రీజింగ్ మొదలు కావడంతో నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా పాస్ కాలేదు.
ఇదీ ... తంతు !
∙ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి జిల్లాలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లు 46, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 15 మొత్తం 61 హాస్టళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 7,097 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రీమెట్రిక్‌కు సంబంధించి రూ.5,10,935 కాస్మొటిక్ చార్జీల కింద బడ్జెట్ విడుదలైంది. అదే విధంగా డైట్ చార్జీల కింద రూ.81.38 లక్షలు విడుదల కాగా, ఈ రెండింటి బిల్లులు ట్రెజరీకి చేరినా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు పాస్ కాకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అవస్థలు పడుతున్నారు. నాలుగు మాసాలకు సంబం ధించి బిల్లులు పాస్ కావాల్సి ఉంది.
∙బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో .. జిల్లాలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 32 ఉండగా పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు 12 ఉన్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 3,407 మంది విద్యార్థులు ఉండగా, పోస్ట్‌మెట్రిక్‌లో 2,050 మంది ఉన్నారు. వీరికోసం ప్రభుత్వం రూ.3.10 కోట్లు బడ్జెట్ విడుదల చేసింది. అందులో రూ.1.80 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం నవంబర్ నుంచి ఫ్రీజింగ్ కొనసాగుతుండడంతో రెండో విడత పెట్టుకున్న బిల్లులు కూడా పాస్ కాలేదు. నాలుగు నెలలకు సంబం«ధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోస్ట్ మెట్రిక్‌కు సంబంధించి రూ.2.98 కోట్లు రాగా, రూ.1.98 కోట్లు మొదటి రెండు మాసాల్లో ఖర్చయింది. ఆ తర్వాత పంపిన బిల్లులకు నేటికీ మోక్షం లేదు. అన్నీ ట్రెజరీల్లోనే మగ్గుతున్నాయి.
ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు 22 ఉండగా కళాశాల హాస్టళ్లు 11 ఉన్నాయి. ఇందుకు సంబంధించి 11,298 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టళ్ల నిర్వహణ కోసం రూ.8.57 లక్షల బడ్జెట్ కేటాయించారు. అందులో రూ.6.20 లక్షలు ఖర్చు చేశారు. మిగిలిన బడ్జెట్‌కు సంబంధించి బిల్లులు పెట్టగా ఒక్కబిల్లూ పాస్ కాలేదు. దీంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని హాస్టళ్లే ఉన్నా వాటికి సంబంధించి కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
నిధుల్లేకే... ఫ్రీజింగ్
ప్రభుత్వం కాగితాల మీద బడ్జెట్ విడుదల చేస్తుంది కానీ ఖజానాలో మాత్రం డబ్బులు లేవు. దీంతో బిల్లులు పాస్ చేయకుండా పెండింగ్‌లో పెడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బయటికి చూడడానికి బడ్జెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇటు బిల్లులు పాస్ కాకుండా ట్రెజరీలో ఫ్రీజింగ్ పెట్టి అడ్డుకట్ట వేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా, ఇటు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, అటు హాస్టళ్లకు వస్తువులు సరఫరా చేసే వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బిల్లులు పాస్ అయ్యే విధంగా చూడాలని కోరుతున్నారు. ఈ విషయంపై ట్రెజరీ అధికారులను వివరణ కోరితే.. ఫ్రీజింగ్ ఉండడం వల్లే బిల్లులు పాస్ చేయలేయమని అంటున్నారు. ఇతర విషయాలు తమకేం తెలియదంటూ జవాబిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment