డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధుల కొరత లేదు
Published Sat, Dec 10 2016 2:43 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధుల సమస్య లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు చెందిన కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డబుల్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలపై చర్చించారు. మూడు జిల్లాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్థల సేకరణ, లేఅవుట్లను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. టెండర్ల ప్రక్రియను మార్చి 2017 నాటికి పూర్తిచేసి పనులు ప్రారంభించాలని సూచించారు.
ఆరుమాసాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి నివేదికల ఆధారంగా జిల్లా కలెక్టర్ల ఖాతాలకు నిధులు మంజూరు చేస్తామని ఆమె చెప్పారు. టెండర్లలో ఎంపికై న కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చిందన్నారు. సిమెంట్ బస్తా రూ.230లుగా నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను కూడా ఉచితంగానే సరఫరా చేసేందుకు ప్రభుత్వం సమ్మతించిందన్నారు. పనులు జరిగే ప్రదేశం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో లభించే ఇసుక ఉచితంగానే. అంతకు పైబడి ఉన్నట్లయితే ఇసుక ధరలో 50 శాతం కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాలన్నారు.
పథకం అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు నియమించాలని పేర్కొన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, దాంట్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. నియోజకవర్గం వారీగా ఇళ్లు కేటాయించినందున ఎమ్మెల్యేలు, అధికారులను సంప్రదించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నుంచి రూ.213 కోట్ల సహాయం అందుతుందని, దాంతో పాటు హడ్కో నుంచి రూ.282 కోట్ల రుణం పొందినట్లు తెలిపారు. ఈ మొత్తం నిధులు ఖర్చు చేస్తే హడ్కో నుంచి మరో రూ.900 కోట్ల రుణం పొందే అవకా శం ఉందన్నారు.
నిర్ణీత వ్యవధిలో పూర్తిచేస్తాం : కలెక్టర్లు
నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ...ఆరునియోజకవర్గాల్లో చేపట్టే పనుల్లో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులు యాదాద్రి జిల్లాలో ఉన్నాయని తెలిపారు. స్థల సేకరణ, లే అవుట్లు పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామన్నారు. సూర్యాపేట కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. నాలుగు నియోజకవర్గాల పరిధిలో తుంగతుర్తి, సూర్యాపేటలో పనులు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇసుక సమస్య లేదని, రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా కూపన్లు జారీ చేస్తున్నామన్నారు. జనవరి నాటికి మిగిలిన పనులకు టెండర్లు పిలిచి, జులై నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని చెప్పారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ ..ఐదు నియోజకవర్గాల్లో స్థల సేకరణ, లే అవుట్‌లు పూర్తయ్యాయని త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. హౌసింగ్ కార్పొరేషన్ సీఈ ఈశ్వరయ్య మాట్లాడుతూ...ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఇళ్ల నిర్మాణ వ్యయం పెరగొద్దన్నారు. కాంట్రాక్టు సంస్థల ఎంపికలో ఎమ్మెల్యేల సహకారం తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈలు పాల్గొన్నారు.
Advertisement