ఇది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం బస్ డిపో సమీపంలోని రెండు పడక గదుల గృహ సముదాయం పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం 192 ఇళ్లను మంజూరు చేసింది. 2018లో రూ.12 కోట్లతో పనులు ప్రారంభించారు. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగు బ్లాకులుగా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కానీ ప్రస్తుతం నిధులు లేక పనులు ఆగిపోయాయి. దాదాపు మూడు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా చాలాచోట్ల కొన్ని నెలలుగా పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.850 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వారు పనులు నిలిపివేశారు.
బకాయిలు చెల్లిస్తేనే తిరిగి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేస్తున్నారు. కొందరు పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం, తెచ్చిపెట్టుకున్న సిమెంటు పాడవుతుందన్న ఉద్దేశంతో ఏవో కొన్ని పనులు చేస్తున్నా.. చిన్న కాంట్రాక్టర్లు మాత్రం దాదాపు అన్ని చోట్లా పనులు ఆపేశారు. దీంతో అసలుకే ప్రారంభం కాని ఇళ్లతో పాటు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం సందిగ్ధంలో పడింది.
నిండుకున్న నిధులు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రుణంపై ఆధారపడి జరుగుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి రూ.10,500 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. హడ్కో నుంచి రావాల్సిన రూ.8 వేల కోట్ల నిధులు దాదాపుగా వచ్చేశాయి. కేవలం రూ.120 కోట్లు మాత్రమే విడుదల కావాల్సి ఉంది.
మరోవైపు గృహనిర్మాణ శాఖ వద్ద నిధులు లేకుండా పోయా యి. ఫలితంగా కాంట్రాక్టర్లకు కొత్తగా బిల్లులు చెల్లించలేకపోతుండటంతో పనులు జరిగే కొద్దీ బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయి. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. చూస్తుండగానే బకాయిలు రూ.850 కోట్లకు చేరుకున్నాయి. అప్పటి నుంచి కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గృహనిర్మాణశాఖ అధికారులేమో ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిధులు అందకపోవడంతో కాంట్రాక్టర్లకు సర్దిచెబుతూ పనులు చేయించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. అయితే చిన్న కాంట్రాక్టర్లు తమ వల్ల కాదని చేతులెత్తేశారు.
అసలే అసంతృప్తి .. ఆపై బిల్లుల సమస్య
ఈ పథకం యూనిట్ కాస్ట్ విషయంలో కాంట్రాక్టర్లలో అసంతృప్తి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్‌గా నిర్ధారించారు. ఇంత తక్కువ మొత్తంతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించటం సాధ్యం కాదంటూ కాంట్రాక్టర్లు తొలినాళ్లలో టెండర్లలో పాల్గొనలేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో సమావేశాలు నిర్వ హించి, భవిష్యత్తులో అవసరమైతే ఇతర పనులు అప్పగించటంలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పటం, ఇళ్ల డిజైన్‌లలో స్వల్పమార్పులు చేయటంతో వారు ఎట్టకేలకు అంగీకరించారు.
ఈ పరిస్థితుల్లోనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన లేకపోవటంతో ఆయా చోట్ల పనులు ప్రారంభించలేదు. కాగా ఇప్పుడు చేసిన పనికి బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు మొండికేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో యూనిట్ కాస్ట్ రూ.7 లక్షలుగా ఉండటం, అంతస్తుల వారీగా నిర్మించే వాటికి మరింత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.
నలిగిపోతున్న అధికారులు
సెప్టెంబర్ రెండో వారంలో సుమారు 70 వేల ఇళ్లు చివరి దశకు చేరుకుని చిన్నచిన్న పనులు చేస్తే పూర్తయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. కేవలం 20 రోజుల పాటు పనులు చేస్తే అవన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిల్లో నాలుగు వేలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ అలాగే ఉండిపోయాయి. అప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో, ఫినిషింగ్ పనులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు అంగీకరించటం లేదు. ఆ పనులు పూర్తయితే ఇళ్లను కేటాయిస్తారని కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది.
కాగా కొన్ని చోట్ల బలవంతంగా ఇళ్లను ఆక్రమిం చుకుని గృహప్రవేశాలు చేసేసుకుంటున్నారు. చిన్నచిన్న పనులు పెండింగులో ఉన్నా.. అలాగే ఉంటామని చెబుతున్నారు. కానీ లబ్ధిదారుల ఎంపిక అధికారికంగా జరగకపోవటంతో అధికారులు వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో వారు అధికారులతో గొడవకు దిగుతుండగా.. కాంట్రాక్టర్లు వాగ్వివాదానికి దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment