కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది?  | TS Congress Government Facing Fund Hurdles For Six Guarantees | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది? 

Jan 14 2024 4:39 PM | Updated on Jan 14 2024 4:43 PM

TS Congress Government Facing Fund Hurdles For Six Guarantees - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. సవాళ్ళను అధిగమించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్‌ ఏం చేయబోతోంది? 

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది. నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం.

నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి, మంత్రులను సీఎం కలిసారట. ఇదే కాకుండా ఆర్దిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రజా పాలనలో స్వీకరించిన ధరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుపై దృష్టి సారించారట. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు.

ప్రజా పాలనలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అమలు చేయాలంటే 60 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం అవుతుంది. వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండడంతో పథకాల అమలుచేయడం అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య.. దీంతో ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు. చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో?

చదవండి:  చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement