Funds are Nil
-
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు.. ఏం చేయబోతోంది?
తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఆరు గ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. హామీల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది. అయితే ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. సవాళ్ళను అధిగమించడానికి కసరత్తు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోంది? పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే రెండు గ్యారెంటీల అమలు ప్రారంభించింది. మిగతా నాలుగు గ్యారెంటీల అమలు కోసం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికే అమలవుతున్న పథకాలకే నిధుల కొరతతో అల్లాడుతోంది. నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు రైతు బంధు నిధులు రైతుల ఖాతాలోకి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు వివిధ శాఖల్లో వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వాటిని కూడా ఎంతో కొంతమేర తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పథకాల అమలుకు ఇబ్బంది ఎదురవుతోందని సమాచారం. నిధుల సమీకరణలో భాగంగానే ప్రధానమంత్రి, మంత్రులను సీఎం కలిసారట. ఇదే కాకుండా ఆర్దిక భారం లేని నిర్ణయాలకు మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రజా పాలనలో స్వీకరించిన ధరఖాస్తుల్లో తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయగలిగే పథకాలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అమలుపై దృష్టి సారించారట. అయితే ఈ రెండింటిలో ఏ ఒక్కటి అమలు చేయాలన్నా ప్రభుత్వం అదనపు నిధులు సమకూర్చుకోక తప్పదు. ఈ సమస్యలన్నీ అధిగమించడానికి పథకాల అమలుపై ఆర్థిక నిపుణులతో ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నారు. ప్రజా పాలనలో కోటి 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ అమలు చేయాలంటే 60 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరం అవుతుంది. వీటిని సమకూర్చుకోవడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే వంద రోజుల గడువు ముగియనుండడంతో పథకాల అమలుచేయడం అనివార్యం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అమలు చేయడానికి అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పథకాలు అమలు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగని అమలు చేయాలనుకుంటే నిధుల సమస్య.. దీంతో ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు. చూడాలి మరి తెలంగాణ సర్కార్ గ్యారెంటీల అమలు గండం నుంచి ఎలా గట్టెక్కుతుందో? చదవండి: చేవెళ్ల ఎంపీ సీటు ఎవరిది ? -
అభివృద్ధి జాడేది
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిన, అప్‌గ్రేడ్ అయిన పురపాలికల్లో పాలన ఇంకా గాడిన పడలేదు. వరుస ఎన్నికలు, స్పెషలాఫీసర్ల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత వెరసి ఆయా మున్సిపాలిటీల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. పాలనాసౌలభ్యం కోసం గతేడాది ఆగస్టు 2న మేజర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త పురపాలికల్లో అభివృద్ధి పడకేసింది. సొంత, సరిపడా భవనాలు, అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో ఆయా పురపాలికల్లో పాలన గ్రామ పంచాయతీలుగా మాదిరిగానే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీలుండగా.. వాటిలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట పాత పురపాలికలు. నగరపంచాయతీలుగా ఉన్న నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, అయిజ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట, అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా మున్సిపాలిటీలకు ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన జిల్లాస్ధాయి, డివిజన్ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. దీంతో ఆయా పురపాలికల్లో పాలన పరుగులు పెడుతుందని అందరూ సంతోషించారు. అయితే కొందరు స్పెషలాఫీసర్లు తమకు కేటాయించిన మున్సిపాలిటీల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పలువురు అధికారులు ము న్సిపల్ కార్యాలయాలకు వెళ్లినా పని చేసేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పని చేయలేని పరిస్థితి నెలకొంది. పట్టణాల అభివృద్ధి, సుందరీకరణకు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) నుంచి ప్రతి మున్సిపాలిటీకి గతేడాది రూ.15కోట్ల నిధులు మంజూరయ్యా యి. ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఆదాయ వనరులు తక్కువగా ఉండటం, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అంతంత మాత్రంగా ఉండడంతో పురపాలికలు అభివృద్ధిలో వెనకబడ్డాయి. దీంతో చాలా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే కొత్త పాలకవర్గాలు కొలువుదీరితేనే గానీ ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెట్టదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనికి ఇంకా కనీసం నాలుగు నెలలైనా పట్టే అవకాశాలుండడం.. వచ్చేది వర్షాకాలం కావడంతో సమస్య తలెత్తే అవకాశాలుండడంతో అప్పటి వరకు స్పెషలాఫీసర్లు ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టారాజ్యం.. పలువురు స్పెషలాఫీసర్లు, మున్సిపల్ సంబంధిత విభాగాల ఇన్చార్జీలు అధికారులు సమయపాలన పాటించకపోవడం.. ఇష్టారాజ్యంతో అప్‌గ్రేడ్, కొత్త మున్సిపాలిటీల పరిధిలో రియల్టర్లు, వ్యాపారులతో పాటు ప్రజలు ఇష్టారాజ్యంగా ఇళ్లు, వెంచర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడి ఏడాది కావస్తున్నా.. చాలా వాటిలో వారం రోజుల వరకు వాటి పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు,జననమరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కాలేదు. ఇటీవలే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించుకున్నారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం అనుమతుల కోసం దరఖాస్తుల్లో సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం లేదు. సగానికి పైగా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేకపోవడం గమనార్హం. దీంతో చెత్తను ఆయా పట్టణ శివారు ప్రాంతాల్లో వేయడంతో పారిశుధ్యం లోపిస్తోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో గడిచిన పది నెలల్లో వార్డుల్లో కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. మున్సిపాలిటీల్లో కొన్ని సమస్యలు భూత్పూర్ తహసీల్దార్‌ను కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి ప్రభుత్వం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్ డీఆర్వోను ప్రత్యేక అధికారిగా నియమించారు. నేటికీ కమిషనర్, డీఆర్వో మున్సిపాలిటీలో పర్యటించి సమస్యలను పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆ మున్సిపల్ పరిధిలో ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణాలతో పాటు వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి 9 మంది దరఖాస్తులు రాగా, ఇద్దరికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, వడ్డేపల్లి కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోవడం లేదు. తాగడానికి పూర్తిస్థాయిలో మంచినీళ్లు లభించక, డ్రెయినేజీ శుభ్రం లేక, చెత్తాచెదారం పేరుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌భగీరథ పనులు పూర్తికాకపోవడం, రాజోలి తాగునీటి పథకం నీరు రెండు రోజులకోసారి రావడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడం, రోడ్ల సమీపంలోనే చెత్తాచెదారం వేయడంతో పారిశుద్ధ్యం లోపించింది. అమరచింత మున్సిపాలిటీ కార్యాలయం లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయం కొనసాగుతోంది. పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. పెబ్బేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులేవీ జరగలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు, నల్లా కనెక్షన్ల అనుమతులు జారీ కావడం లేదు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి.. పారిశుద్ధ్యం లోపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అచ్చంపేట నగరపంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలను కలుపుకుని మొత్తం 42,676 జనాభా, 20 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి నల్లా కనెక్షన్ల ఊసేలేదు. మిషన్ భగీరథ పైపులైన్స్, ట్యాంకుల నిర్మాణం ఇంతవరకు మొదలే కాలేదు. పాత లైన్ ద్వారా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తుండడంతో కొత్త కాలనీలు, కొత్త కనెక్షన్లకు నీళ్లు అందడం లేదు. నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదు. ఇప్పటి వరకు కనీసం డంపింగ్ యార్డు కూడా లేకపోవడంతో చెత్తను కేసరి సముద్రం శివారులో వేస్తున్నారు. రూ.65 కోట్లతో కొనసాగుతోన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. నిధులు రాలే.. కొత్తగా ఏర్పడిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక నిధులు రాలేదు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా ఉన్నవాళ్లు అంకితభావం, పట్టుదలతో పని చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్నాం.. ఇకపై మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాములు, వడ్డేపల్లి ఇన్చార్జ్ కమిషనర్ -
సర్పంచ్ల.. లబోదిబో!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది గ్రామ పంచాయతీల పరిస్థితి. మూడు నెలల కిందట పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచుల చేతి చమురు వదులుతోంది. పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా.. అత్యవసర పనుల కోసం పైసా ఖ ర్చు చేయలేని దుస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. కొత్త సర్పంచులు పదవీ బాధ్యతలు స్వీకరించి మూడు మాసాలు కావస్తోంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయాయి. గత సర్పంచుల పదవీ కాలం 2018 ఆగస్టు 1వ తేదీతో ముగిసింది. నాటినుంచి గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే పేరుకుపోయాయి. ప్రత్యేక అధికారులు బాధ్యత చేపట్టిన వెంటనే అసెంబ్లీ రద్దు కావడం, ముందస్తు ఎన్నికలు కూడా రావడం, ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తయి కొత్త సర్పంచులు కొలువుదీరారు. ప్రభుత్వం మొదట సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్చెక్ పవర్ ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత కార్యదర్శి, సర్పంచులకే చెక్ పవర్ ఇస్తామని ప్రకటించినా.. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 2018 మార్చిలో 14వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చి ఉన్నా కొత్త సర్పంచులు అత్యవసర పనులకు కూడా ఖర్చు చేయలేక పోతున్నారు. అత్యవసరమైన తాగునీటి సమస్య పరిష్కారం కోసం కొందరు సొంత డబ్బులు ఖర్చు చేస్తుండగా, మరికొందరు అప్పు తెచ్చి పనులు పూర్తి చేస్తున్నారు. పంచాయతీల ఖాతాల్లో రూ.31.69కోట్లు జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఈ సంవత్సరం జనవరిలో 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2వ తేదీన కొత్త సర్పంచులు అంతా కొలువుదీరారు. ఆ తర్వాత ప్రభుత్వం కొత్త సర్పంచులకు గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన పనులు, మొక్కల పెంపకం, ఆదాయ వనరులు ఎలా పెంపొందించుకోవాలనే విషయంతో పాటు రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చింది. కాగా, 2018 మార్చి మాసంలో 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు వచ్చాయి. అయితే, పాత సర్పంచుల పదవీ కాలం దగ్గరపడిన నేపథ్యంలో నిధులు వృథా అవుతాయని భావించి 14వ ఆర్థిక సంఘం నిధులపై ప్రభుత్వం ఫ్రీజింగ్ విధించింది. దీంతో పాత సర్పంచులు ఆ నిధులు ఖర్చు చేయకుండానే దిగిపోయారు. ఆ తర్వాత ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రత్యేక అధికారులు ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. కానీ, నిధులు మాత్రం ఖర్చు పెట్టలేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు గత సంత్సరం మార్చిలోనే రూ.31,69,41,000 జిల్లాకు అందాయి. ఆనిధులను ఆయా గ్రామ పంచాయతీల వారీగా జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు పంపిణీ కూడా చేశారు. అయితే, చెక్‌పవర్ వ్యవహారం ఇప్పటికీ తేలకపోవడంతో నిధుల పంచాయతీ ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. తల ఒక్కంటికి రూ.253.7 చొప్పున నిధులు 14వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.253.7 చొప్పున ఆయా గ్రామ జనాభాను బట్టి విడుదల చేసింది. ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఎక్కువ, తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు తక్కువగా ఆయా ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రభుత్వం గ్రామ పంచాయతీలో చెక్ పవర్ విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఎన్నికల అనంతరం బిన్నాభిప్రాయాలు రావడంతో ప్రభుత్వమే సర్పంచ్, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ పాత పద్ధతిలోనే ఇస్తామన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జీఓ విడుదల చేయలేదు. నిధులున్నా ఖర్చు చేయలేని పరిస్థితి ఒక్కో గ్రామ పంచాయతీలో ఆయా గ్రామ జనాభాను బట్టి 14వ ఆర్థిక సంఘం నిధులు జమ అయి ఉన్నాయి. కానీ చెక్ పవర్ తేలని కారణంగా నిధులు ఉన్నా వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి. గత ఆగçస్టు మాసంలో పాత సర్పంచులు దిగిపోయిన నాటి నుండి గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రత్యేక అధికారులు తాగునీరు, అత్యవసరాలకు తప్ప నిధులు ఖర్చు చేయలేదు. ప్రస్తుతం వచ్చిన కొత్త సర్పంచులుకు చెక్‌పవర్ లేక వాటిని ఖర్చు చేయలేని పరిస్థితి. దీంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాల్లో తాగునీరు, వీధి లైట్లతో పాటు మోటార్ల రిపేర్లు, కొత్త మోటార్ల కొనుగోలు వంటి పనులు చేస్తున్నారు. మరికొందరు సర్పంచులు తమ వద్ద డబ్బులు లేకున్నా అçప్పు చేసి మరీ గ్రామాల్లో అత్యవసర పనులు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సొంతడబ్బులు ఖర్చు చేస్తున్నాం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దాన్ని పరిష్కరించేందుకు కాలిపోయిన మోటార్ల స్థానంలో కొత్త మోటారు, స్టార్టర్లు కొనుగోలు చేశాం. దీంతో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం. వీధి లైట్లు ఏర్పాటు చేయడంతోపాటు మురుగు నీటి కాల్వను కూడా క్లీన్ చేసే కార్యక్రమాన్ని సొంత డబ్బులతోనే చేయించాల్సి వస్తుంది. – పంతంగి సరిత శ్రీనాథ్, గుండ్లపల్లి సర్పంచ్ సర్పంచ్‌గా ఎన్నిక అయిన నాటికి మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య అయితే మరింత తీవ్రంగా ఉంది. గతంలో బోర్లు బాగా పోసేవి. ప్రస్తుతం గ్రౌండ్ వాటర్ తగ్గి బోర్లు పోయకపోవడంతో కొత్తగా బోర్లు వేశాం. మూడు బోర్లను ఒకే పైప్‌లైన్‌కు జాయింట్ చేసి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌కు ఎక్కిస్తున్నాం. దానికోసం 100 పైపులు వేశాం. పక్కనబోరు నుంచి మరో వంద పైపులు వేసి అక్కడి నుంచి కూడా ట్యాంక్ పైకి నీరు ఎక్కించి తాగునీటి ఇబ్బందులను అధిగమించాం. వీధిలైట్లు కొత్తగా వేశాం. కొత్త మోటార్లను కూడా కొనుగోలు చేసి పనులు చేపట్టాం. ఇప్పటి వరకు రూ.6లక్షల పై చిలుకే ఖర్చు చేశాం. పంచాయతీ ఖాతాలో డబ్బులు ఉన్నా ఖర్చు చేయలేని పరిస్థితి.. ఇదీ.. తిప్పర్తి మండలం ఇండ్లూరు సర్పంచ్ మార్త శ్రీదేవీసైదులు ఆవేదన..!! -
జెండా పండుగకు డబ్బుల్లేవ్!
కర్నూలు సిటీ/పత్తికొండ రూరల్: స్వాతంత్య్ర దినోత్సవం మనందరికీ పెద్ద పండుగ. దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించే అతిపెద్ద వేడుక. కుల, మతాలకు అతీతంగా ‘భారత జాతి’ నిర్వహించుకునే సమున్నత కార్యక్రమం. ఇలాంటి పండుగను పాఠశాలల్లో ఎంతో ఘనంగా నిర్వహించాల్సిన అవసరముంది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు, ఆటల పోటీలు ఏర్పాటు చేయాలి. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వ తీరు వల్ల ఇవి కష్టసాధ్యమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు సర్కారు నిధులు కేటాయించకపోగా, ఉన్న అరకొర నిధులను సైతం వెనక్కి తీసుకుంది. దీంతో ఈ ఏడాది వేడుకలు ఏ విధంగా నిర్వహించాలో తెలియక ప్ర«ధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్లను విలీనం చేసి సమగ్ర శిక్ష అభియాన్‌గా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్ఎస్ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి ఇచ్చిన నిధులను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. వారం రోజుల్లో తిరిగి జమ చేస్తామని చెప్పింది. నెల దాటినా అతీగతీ లేకపోవడంతో పాఠశాలల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 2,902 ఉన్నాయి. వీటిలో సుమారు 4.38 లక్షల మంది చదువుతున్నారు. వివిధ గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులను ఎస్‌ఎంసీల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ నిధులతోనే సర్కార్ స్కూళ్ల నిర్వహణ చూడాలి. వచ్చేది అరకొర నిధులే. వీటినే ఏడాది పాటు చాక్‌పీస్‌లు, చీపుర్లు, స్కూల్ కరెంట్ బిల్లులు, తదితర వాటికి ఖర్చు చేయాలి. పైగా రెండేళ్ల నుంచి టీచర్ గ్రాంట్ నిలిపేశారు. దీనికి తోడు ఈ విద్యా సంవత్సరంలో పాఠ్య పుస్తకాలను ఐదు విడతల్లో ఇచ్చారు. వాటిని మండల విద్యా వనరుల కేంద్రం నుంచి స్కూల్ పాయింట్లకు చేర్చేందుకు అయిన రవాణా ఖర్చులనూ హెచ్ఎంలే భరించారు. ఇప్పుడు స్వాతంత్య్ర వేడుకల్లో విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చేందుకు కూడా డబ్బు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇదే తరుణంలో ప్రతి స్కూల్లో విద్యార్థులకు ఆటలతో పాటు, వివిధ రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి..బహుమతులు ఇవ్వాలని ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ ఉత్తర్వులు ఇవ్వడం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది. నిధుల్లేక ఇబ్బందులు స్కూళ్లలో చాక్‌పీస్‌లు కూడా కొనలేని పరిస్థితి. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం రవాణా కోసం హెచ్ఎంలు చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు నిధులు లేకపోవడం మరింత ఇబ్బందికరం. – డి.రామశేషయ్య, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నిధులు జమ చేయాలని కోరాం ఎస్ఎంసీ ఖాతాల నుంచి రూ.5.8 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఇటీవల రూ.3 కోట్లతో ఎస్ఎస్ఏ, కేజీబీవీ సిబ్బందికి వేతనాలు ఇచ్చాం. నిధులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు కొంత మంది హెచ్ఎంలు వినతులిచ్చారు. ఈ క్రమంలో ఇటీవల వెనక్కి తీసుకున్న నిధులను జమ చేయాలని ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కోరాం. – తిలక్ విద్యాసాగర్, ఎస్ఎస్ఏ పీఓ సొంత ఖర్చులతోనే.. స్వాతంత్య్ర వేడుకలకు గ్రాంట్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పే ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఎలా? స్కూల్ బాగుండాలంటే నిర్వహణ గురించి ఆలోచించాలి. – రమేష్ నాయుడు, హెచ్ఎం, దేవనబండ హైస్కూల్ -
ఉత్సవ విగ్రహాలు!
ఒకప్పుడు వెలుగు వెలిగిన జిల్లా పరిషత్ నేడు కళావిహీనంగా మారింది. నిధులు, విధులు లేక కొట్టుమిట్టాడుతోంది. జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్‌లలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు కూడా అష్టకష్టాలు పడే పరిస్థితి దాపురించింది. సమావేశాల నిర్వహణ అంటేనే అధికారులు ఆందోళన చెందుతున్నారు. బిల్లుల చెల్లింపులు, నిధుల కేటాయింపులకు డబ్బులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక, మండల కార్యాలయాల్లోనైతే కనీసం జిరాక్స్ బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్‌అర్బన్: గతంలో జిల్లా, మండల పరిషత్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు భారీగా వచ్చేవి. అయితే, మూడేళ్ల వ్యవధిలో కేంద్రానికి సంబంధించి కీలకమైన బీఆర్జీఎఫ్ సహా రెండు పథకాలు నిలిచిపోయాయి. బీఆర్జీఎఫ్ నిధులు జీపీలకే చెల్లిస్తున్నారు. ఇక, మూలధన నిధి సమకూరడం లేదు. 2016–17కు గాను సీనరేజ్ గ్రాంట్ రాలేదు. మొత్తంగా నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో జెడ్పీకి కేటాయించింది రూ.9.64 కోట్లు మాత్రమే. ఈ నిధులతో జిల్లా, మండల పరిషత్‌ల నిర్వహణ కష్టంగా మారింది. అభివృద్ధి పనులకు నిధుల్లేక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొంది. ప్రతి సమావేశంలో నిధుల కోసం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆందోళన చేస్తున్నారు. పేరుకే మండల పరిషత్‌లు.. ఉమ్మడి జిల్లాలో 36 మండల పరిషత్‌లు ఉన్నాయి. వీటి పరిస్థితి నామమాత్రంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక్కో మండలానికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆర్థిక సంఘం నిధులు, రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు బీఆర్జీఎఫ్ నిధులు విడుదల చేసేది. ప్రస్తుతం అన్ని రకాల నిధులు నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక్కో మండలానికి రూ.10 లక్షలు కుడా రాని పరిస్థితి ఏర్పడింది. నిధులు లేక గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి నిలిచి పోయింది. ‘మన ఊరు–మన ప్రణాళిక’, ‘గ్రామజ్యోతి’ పథకాలు పడకేశాయి. మురికినీటి కాలువలు, సీసీ రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు మూడేళ్లుగా నిలిచి పోయాయి. ఏం చేయలేక పోతున్నాం.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది. కానీ నిధులు లేక మేము ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి మండల, జిల్లా పరిషత్‌లను బలోపేతం చేయాలి. – శ్రీనివాస్, నవీపేట జెడ్పీటీసీ నిలిచిన అభివృద్ధి.. నిధులు లేక అభివృద్ధి నిలిచి పో యింది. గ్రామాలకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది. ప్రజలకు సమాధానం చెప్పు కోలేక పోతున్నాం. ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. – పుప్పాల శోభ, నిజామాబాద్ జెడ్పీటీసీ -
నిధులు నిల్.. వరాలు ఫుల్!
రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సాగుతున్న పరిణామాలు ప్రజల్ని విస్మయంలోకి నెడుతున్నాయి. 110 నిబంధనల మేరకు ప్రకటనలు జోరుగా సాగుతున్నాయి. వరాల వర్షం కురిపిస్తున్నా, ఇది అమలయ్యేనా అన్న ప్రశ్న ప్రజల్లో బయలు దేరుతోంది. ఇందుకు కారణం రాష్ట్ర ఖజానా మీద ఇప్పటికే లక్షల కోట్ల భారం అప్పుల రూపంలో ఉండటమే. ఇక, బుధవారం కూడా సీఎం వరాలు కురిపించడం గమనార్హం. ⇒ 110 ప్రకటనలో జోరు ⇒ అసెంబ్లీలో పళని హామీలు ⇒ పట్టు వీడని విక్రమార్కులుగా డీఎంకే సభ్యులు ⇒ యముడి కోసం అమ్మ త్యాగం సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో 110 నిబంధన తెర మీదకు వస్తుంది. ఈ నిబంధన మేరకు గతంలో అమ్మ జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేసేవారు. తాను చేసిన పని, చేయబోయే పని గురించి ఈ ప్రకటన రూపంలో వివరిస్తూ, ఆచరణలో పెట్టేవారు. విప్లవ నాయకిగా, అమ్మగా ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జయలలిత సైతం అనేక 110 ప్రకటన హామీలను పక్కన పెట్టక తప్పలేదు. మెజారిటీ శాతం అమల్లోకి వచ్చినా, కీలక ప్రకటనల అమలు కష్టతరంగా మారాయని చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు అమ్మ లేరు. అమ్మ ప్రభుత్వం సాగుతోంది. అమ్మ ఆశయ సాధన నినాదంతో సీఎం పళని స్వామి సైతం 110 బాటను అనుసరించే పనిలో పడ్డారు. రోజుకో ప్రకటనతో వరాలు కురిపిస్తున్నారు. హామీల వర్షం జోరందుకోవడం ఆహ్వానించదగ్గ విషయమే. అయితే, ఇవన్నీ అమల్లోకి వచ్చేనా అన్నది మాత్రం అనుమానమే. నిధులు నిల్ 2011 ఎన్నికల నాటికి లక్ష కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండేది. ఇది డీఎంకే ఘనత. ఈ అప్పు అన్నది లేకుండా చేస్తామన్న నినాదంతో ఆ ఎన్నికల్లో గెలిచిన అమ్మ జయలలిత 2016 నాటికి ఆ సంఖ్యను రెండు లక్షల కోట్లు దాటేలా చేశారు. ఈ భారం ఎన్నికల నాటికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా, చివరకు ప్రజలు అమ్మకే పట్టం కట్టారు. ప్రజలు తన మీద ఉంచిన నమ్మకంతో ఖజానా ఖాళీ అవుతున్నా, ఎక్కడా సమస్య తలెత్తకుండా జాగ్రత్తగా పథకాలను అమలుచేస్తూ అమ్మ ముందుకు సాగారు. చివరకు అందర్నీ వీడి అనంత లోకాలకు చేరారు.ప్రస్తుతం అమ్మ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పళని స్వామి ముందు ఖజానా భారం మరీ ఎక్కువే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండున్నర లక్షల కోట్ల మేరకు అప్పుల్లో ఉన్నా, సీఎం ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త వరాలు కురిపిస్తూ రావడంతో అమలయ్యేదెప్పుడో అని ప్రజలు పెదవి విప్పే పనిలో పడ్డారు. అయినా, తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా బుధవారం కూడా అసెంబ్లీ వేదికగా సీఎం వరాల వర్షం కురిపించారు. 5589 కోట్లతో లక్షా 86 వేల గృహాల నిర్మాణం, క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాలు జోరుతో హామీలు గుప్పిస్తూ, ఎన్నికల వాగ్దానంగా ఒకటి అమల్లోకి తీసుకురావడం విశేషం. వర్షా కాలంలో కుమ్మరి (మట్టి పాత్రల తయారీ రంగంలో ఉన్న వారికి) సాయంగా ఇదివరకు ఇస్తున్న రూ.4000కు ఇక, అదనంగా మరో వెయ్యి చేర్చి రూ.5000 ఇవ్వనున్నట్టు ప్రకటించడం గమనార్హం. నిధుల కొరత వెంటాడుతున్న నేపథ్యంలో ధైర్యంతో సీఎం కొత్త వరాలను హోరెత్తించడంపై ప్రజల్లో చర్చ బయలుదేరింది. ఇక, అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రామంద్రన్ తన ప్రసంగంలో అమ్మ ఎవ్వరు ఏమి అడిగినా లేదని చెప్పే వారు కాదని, అన్నీ ఇచ్చేవారని వ్యాఖ్యానించారు. అపోలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో యముడు వచ్చి ఆమె ప్రాణాలు కావాలని అడగ్గానే, అమ్మ ఇచ్చేశారంటూ వ్యాఖ్యానించి సభలో నిర్మానుష్య వాతావరణం సృష్టించారు. అందుకే అమ్మ తరహాలో ఎవరికీ లేదని చెప్పకుండా ఈ ప్రభుత్వం అన్నీ ప్రజలకు ఇచ్చే రీతిలో ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. పట్టువీడని విక్రమార్కులు డీఎంకే ఎమ్మెల్యేలు పట్టువీడని విక్రమార్కుల వలే అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ సీట్లో «ఎవరున్నా తమ గళం నొక్కేయడం ఖాయమని వారికి తెలుసు. దీంతో తమ డిమాండ్లు, సమస్యలను ఎత్తి చూపుతూ ప్రసంగించే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ, చివరకు వాకౌట్ల పర్వం సాగించి మళ్లీ సభలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. బుధవారం కూడా సభలో రేషన్ షాపుల్లో వస్తువుల కొరత, అధిక ధరల వ్యవహారంలో వారి గళాన్ని డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ నొక్కేయడంతో తీవ్రంగానే నినదించి, వాగ్యుద్ధం సాగించి సభ నుంచి ఆ సభ్యులు బయటకు వచ్చి మళ్లీ మరో అంశంపై చర్చలో రీఎంట్రీ ఇవ్వడం విశేషం.