నిధులు నిల్.. వరాలు ఫుల్!
రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సాగుతున్న పరిణామాలు ప్రజల్ని విస్మయంలోకి నెడుతున్నాయి. 110 నిబంధనల మేరకు ప్రకటనలు జోరుగా సాగుతున్నాయి. వరాల వర్షం కురిపిస్తున్నా, ఇది అమలయ్యేనా అన్న ప్రశ్న ప్రజల్లో బయలు దేరుతోంది. ఇందుకు కారణం రాష్ట్ర ఖజానా మీద ఇప్పటికే లక్షల కోట్ల భారం అప్పుల రూపంలో ఉండటమే. ఇక, బుధవారం కూడా సీఎం వరాలు కురిపించడం గమనార్హం.
⇒ 110 ప్రకటనలో జోరు
⇒ అసెంబ్లీలో పళని హామీలు
⇒ పట్టు వీడని విక్రమార్కులుగా డీఎంకే సభ్యులు
⇒ యముడి కోసం అమ్మ త్యాగం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో 110 నిబంధన తెర మీదకు వస్తుంది. ఈ నిబంధన మేరకు గతంలో అమ్మ జయలలిత ప్రత్యేక ప్రకటనలు చేసేవారు. తాను చేసిన పని, చేయబోయే పని గురించి ఈ ప్రకటన రూపంలో వివరిస్తూ, ఆచరణలో పెట్టేవారు.
విప్లవ నాయకిగా, అమ్మగా ప్రజల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జయలలిత సైతం అనేక 110 ప్రకటన హామీలను పక్కన పెట్టక తప్పలేదు. మెజారిటీ శాతం అమల్లోకి వచ్చినా, కీలక ప్రకటనల అమలు కష్టతరంగా మారాయని చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు అమ్మ లేరు. అమ్మ ప్రభుత్వం సాగుతోంది. అమ్మ ఆశయ సాధన నినాదంతో సీఎం పళని స్వామి సైతం 110 బాటను అనుసరించే పనిలో పడ్డారు. రోజుకో ప్రకటనతో వరాలు కురిపిస్తున్నారు. హామీల వర్షం జోరందుకోవడం ఆహ్వానించదగ్గ విషయమే. అయితే, ఇవన్నీ అమల్లోకి వచ్చేనా అన్నది మాత్రం అనుమానమే.
నిధులు నిల్
2011 ఎన్నికల నాటికి లక్ష కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండేది. ఇది డీఎంకే ఘనత. ఈ అప్పు అన్నది లేకుండా చేస్తామన్న నినాదంతో ఆ ఎన్నికల్లో గెలిచిన అమ్మ జయలలిత 2016 నాటికి ఆ సంఖ్యను రెండు లక్షల కోట్లు దాటేలా చేశారు. ఈ భారం ఎన్నికల నాటికి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా, చివరకు ప్రజలు అమ్మకే పట్టం కట్టారు.
ప్రజలు తన మీద ఉంచిన నమ్మకంతో ఖజానా ఖాళీ అవుతున్నా, ఎక్కడా సమస్య తలెత్తకుండా జాగ్రత్తగా పథకాలను అమలుచేస్తూ అమ్మ ముందుకు సాగారు. చివరకు అందర్నీ వీడి అనంత లోకాలకు చేరారు.ప్రస్తుతం అమ్మ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పళని స్వామి ముందు ఖజానా భారం మరీ ఎక్కువే. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండున్నర లక్షల కోట్ల మేరకు అప్పుల్లో ఉన్నా, సీఎం ఏమాత్రం తగ్గడం లేదు. కొత్త వరాలు కురిపిస్తూ రావడంతో అమలయ్యేదెప్పుడో అని ప్రజలు పెదవి విప్పే పనిలో పడ్డారు. అయినా, తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా బుధవారం కూడా అసెంబ్లీ వేదికగా సీఎం వరాల వర్షం కురిపించారు.
5589 కోట్లతో లక్షా 86 వేల గృహాల నిర్మాణం, క్యాన్సర్ బాధితుల కోసం ప్రత్యేక చికిత్స కేంద్రాలు జోరుతో హామీలు గుప్పిస్తూ, ఎన్నికల వాగ్దానంగా ఒకటి అమల్లోకి తీసుకురావడం విశేషం. వర్షా కాలంలో కుమ్మరి (మట్టి పాత్రల తయారీ రంగంలో ఉన్న వారికి) సాయంగా ఇదివరకు ఇస్తున్న రూ.4000కు ఇక, అదనంగా మరో వెయ్యి చేర్చి రూ.5000 ఇవ్వనున్నట్టు ప్రకటించడం గమనార్హం. నిధుల కొరత వెంటాడుతున్న నేపథ్యంలో ధైర్యంతో సీఎం కొత్త వరాలను హోరెత్తించడంపై ప్రజల్లో చర్చ బయలుదేరింది. ఇక, అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే రామంద్రన్ తన ప్రసంగంలో అమ్మ ఎవ్వరు ఏమి అడిగినా లేదని చెప్పే వారు కాదని, అన్నీ ఇచ్చేవారని వ్యాఖ్యానించారు. అపోలో ఆస్పత్రిలో ఉన్న సమయంలో యముడు వచ్చి ఆమె ప్రాణాలు కావాలని అడగ్గానే, అమ్మ ఇచ్చేశారంటూ వ్యాఖ్యానించి సభలో నిర్మానుష్య వాతావరణం సృష్టించారు. అందుకే అమ్మ తరహాలో ఎవరికీ లేదని చెప్పకుండా ఈ ప్రభుత్వం అన్నీ ప్రజలకు ఇచ్చే రీతిలో ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.
పట్టువీడని విక్రమార్కులు
డీఎంకే ఎమ్మెల్యేలు పట్టువీడని విక్రమార్కుల వలే అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ సీట్లో «ఎవరున్నా తమ గళం నొక్కేయడం ఖాయమని వారికి తెలుసు. దీంతో తమ డిమాండ్లు, సమస్యలను ఎత్తి చూపుతూ ప్రసంగించే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతూ, చివరకు వాకౌట్ల పర్వం సాగించి మళ్లీ సభలో అడుగు పెట్టడం ఆనవాయితీగా మారింది. బుధవారం కూడా సభలో రేషన్ షాపుల్లో వస్తువుల కొరత, అధిక ధరల వ్యవహారంలో వారి గళాన్ని డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి.జయరామన్ నొక్కేయడంతో తీవ్రంగానే నినదించి, వాగ్యుద్ధం సాగించి సభ నుంచి ఆ సభ్యులు బయటకు వచ్చి మళ్లీ మరో అంశంపై చర్చలో రీఎంట్రీ ఇవ్వడం విశేషం.