![CM Chandrababu Government debts Details In AP](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/chandrababu.jpg.webp?itok=CEPbQh2o)
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ తమ సంపద కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తోంది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు మాత్రం సంపద సృష్టించకపోగా.. తన మనుషులకు ఆస్తులను అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
అప్పుల మీద అప్పులు చేయడమే సంపద సృష్టిలా భావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. సంపద సృష్టి అని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు, పోర్టులు అన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు సర్కార్.. రూ.1.45 లక్షల కోట్లు అప్పులు చేసింది.
అయితే.. ఆస్తులు అమ్మి, అప్పులు చేసిన సొమ్మంతా ఏమౌతుందని ప్రజల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టి అంటే ఆస్తుల అమ్మకమేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, ఇంతగా అప్పులు చేస్తున్నప్పటికీ ఒక్క సంక్షేమ పథకాన్నీ కూడా కూటమి సర్కార్ అమలు చేయడం లేదు. ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా మరో పక్క సూపర్‌సిక్స్ అమలు చేయకుండా ఇన్ని అప్పులు దేనికి వ్యయం చేస్తున్నారో తెలియడం లేదని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతగా అప్పులు చేస్తూనే.. మరో పక్క సూపర్ సిక్స్ అమలుకు డబ్బుల్లేవంటూ ప్రజలను మోసం చేయడానికి సీఎం చంద్రబాబు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటం గమనార్హం.
కేంద్రం నుంచి తీసుకునే అప్పులు అదనం
చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ బయట, బట్జెట్ లోపల కలిపి ఏడాది తిరగకుండానే లక్షల కోట్లు అప్పు చేస్తొంది. ఇంత పెద్ద ఎత్తున ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే గతంలో ఏ ప్రభుత్వం అప్పు చేయలేదు. కేంద్రం నుంచి తీసుకునే అప్పులు వీటికి అదనం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం, ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినప్పటికీ, ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు బృందం.. ఎక్కువ అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతోందంటూ గగ్గోలు పెడుతూ లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేశారు.
ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా, ఆస్తుల కల్పనకు, ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తున్నారా అంటే అదీ లేదు. కాగ్ గణాంకాల ప్రకారం చంద్రబాబు సర్కారు గత డిసెంబర్ వరకు మార్కెట్ రుణాల ద్వారా రూ.73,875 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. ఇందులో ఆస్తుల కల్పనకు సంబంధించి మూల ధన వ్యయం డిసెంబర్ నాటికి రూ.8,894 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment