దేవరకద్రలో రోడ్డుపైనే పారుతున్న మురుగు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిన, అప్‌గ్రేడ్ అయిన పురపాలికల్లో పాలన ఇంకా గాడిన పడలేదు. వరుస ఎన్నికలు, స్పెషలాఫీసర్ల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత వెరసి ఆయా మున్సిపాలిటీల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. పాలనాసౌలభ్యం కోసం గతేడాది ఆగస్టు 2న మేజర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు
అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు పడలేదు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త పురపాలికల్లో అభివృద్ధి పడకేసింది. సొంత, సరిపడా భవనాలు, అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో ఆయా పురపాలికల్లో పాలన గ్రామ పంచాయతీలుగా మాదిరిగానే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీలుండగా.. వాటిలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట పాత పురపాలికలు. నగరపంచాయతీలుగా ఉన్న నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, అయిజ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట, అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా మున్సిపాలిటీలకు ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన జిల్లాస్ధాయి, డివిజన్ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. దీంతో ఆయా పురపాలికల్లో పాలన పరుగులు పెడుతుందని అందరూ సంతోషించారు.
అయితే కొందరు స్పెషలాఫీసర్లు తమకు కేటాయించిన మున్సిపాలిటీల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పలువురు అధికారులు ము న్సిపల్ కార్యాలయాలకు వెళ్లినా పని చేసేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పని చేయలేని పరిస్థితి నెలకొంది. పట్టణాల అభివృద్ధి, సుందరీకరణకు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీయూఎఫ్‌ఐడీసీ) నుంచి ప్రతి మున్సిపాలిటీకి గతేడాది రూ.15కోట్ల నిధులు మంజూరయ్యా యి. ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఆదాయ వనరులు తక్కువగా ఉండటం, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అంతంత మాత్రంగా ఉండడంతో పురపాలికలు అభివృద్ధిలో వెనకబడ్డాయి. దీంతో చాలా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే కొత్త పాలకవర్గాలు కొలువుదీరితేనే గానీ ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెట్టదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనికి ఇంకా కనీసం నాలుగు నెలలైనా పట్టే అవకాశాలుండడం.. వచ్చేది వర్షాకాలం కావడంతో సమస్య తలెత్తే అవకాశాలుండడంతో అప్పటి వరకు స్పెషలాఫీసర్లు ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇష్టారాజ్యం..
పలువురు స్పెషలాఫీసర్లు, మున్సిపల్ సంబంధిత విభాగాల ఇన్‌చార్జీలు అధికారులు సమయపాలన పాటించకపోవడం.. ఇష్టారాజ్యంతో అప్‌గ్రేడ్, కొత్త మున్సిపాలిటీల పరిధిలో రియల్టర్లు, వ్యాపారులతో పాటు ప్రజలు ఇష్టారాజ్యంగా ఇళ్లు, వెంచర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడి ఏడాది కావస్తున్నా.. చాలా వాటిలో వారం రోజుల వరకు వాటి పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు,జననమరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కాలేదు. ఇటీవలే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించుకున్నారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం అనుమతుల కోసం దరఖాస్తుల్లో సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం లేదు. సగానికి పైగా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేకపోవడం గమనార్హం. దీంతో చెత్తను ఆయా పట్టణ శివారు ప్రాంతాల్లో వేయడంతో పారిశుధ్యం లోపిస్తోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో గడిచిన పది నెలల్లో వార్డుల్లో కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు.
మున్సిపాలిటీల్లో కొన్ని సమస్యలు
- భూత్పూర్ తహసీల్దార్‌ను కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి ప్రభుత్వం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్ డీఆర్వోను ప్రత్యేక అధికారిగా నియమించారు. నేటికీ కమిషనర్, డీఆర్వో మున్సిపాలిటీలో పర్యటించి సమస్యలను పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆ మున్సిపల్ పరిధిలో ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణాలతో పాటు వెంచర్‌లు ఏర్పాటయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి 9 మంది దరఖాస్తులు రాగా, ఇద్దరికి మాత్రమే అనుమతులు ఇచ్చారు.
- జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు.
- అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, వడ్డేపల్లి కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోవడం లేదు. తాగడానికి పూర్తిస్థాయిలో మంచినీళ్లు లభించక, డ్రెయినేజీ శుభ్రం లేక, చెత్తాచెదారం పేరుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌భగీరథ పనులు పూర్తికాకపోవడం, రాజోలి తాగునీటి పథకం నీరు రెండు రోజులకోసారి రావడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడం, రోడ్ల సమీపంలోనే చెత్తాచెదారం వేయడంతో పారిశుద్ధ్యం లోపించింది.
- అమరచింత మున్సిపాలిటీ కార్యాలయం లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయం కొనసాగుతోంది. పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. పెబ్బేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులేవీ జరగలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు, నల్లా కనెక్షన్ల అనుమతులు జారీ కావడం లేదు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి.. పారిశుద్ధ్యం లోపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
- అచ్చంపేట నగరపంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలను కలుపుకుని మొత్తం 42,676 జనాభా, 20 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి నల్లా కనెక్షన్ల ఊసేలేదు. మిషన్ భగీరథ పైపులైన్స్, ట్యాంకుల నిర్మాణం ఇంతవరకు మొదలే కాలేదు. పాత లైన్ ద్వారా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తుండడంతో కొత్త కాలనీలు, కొత్త కనెక్షన్లకు నీళ్లు అందడం లేదు.
- నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదు. ఇప్పటి వరకు కనీసం డంపింగ్ యార్డు కూడా లేకపోవడంతో చెత్తను కేసరి సముద్రం శివారులో వేస్తున్నారు. రూ.65 కోట్లతో కొనసాగుతోన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి.
నిధులు రాలే..
కొత్తగా ఏర్పడిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక నిధులు రాలేదు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా ఉన్నవాళ్లు అంకితభావం, పట్టుదలతో పని చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్నాం.. ఇకపై మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాములు, వడ్డేపల్లి ఇన్‌చార్జ్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment