new municipalities
-
కొత్త మునిసిపాలిటీలకు ప్రత్యేక అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన 5 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ తాడిగడప (కృష్ణా)కు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, అల్లూరు నగర పంచాయతీ (నెల్లూరు జిల్లా)కు కావలి మునిసిపల్ కమిషనర్, బి.కొత్తకోట (చిత్తూరు)కు రాయచోటి మునిసిపల్ కమిషనర్, చింతలపూడి (పశ్చిమ గోదావరి)కి ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యదర్శి, పొదిలి (ప్రకాశం)కు ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. -
కొత్త పురపాలికల్లో నవంబర్ వరకు ఎల్ఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం గడువును పెంచామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేలా త్వరలో ప్రత్యేకంగా ఎల్ఆర్ఎస్ మేళాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదారేళ్లలో సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశముందని, దీనికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని వివరించారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తెచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశానాల వంటి ప్రాథమిక అంశాలపై శ్రద్ధ వహించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనల మేరకు తమ జిల్లాల పరిధిలోని పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మెన్లు పాల్గొన్నారు. -
కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన
సాక్షి, వనపర్తి: ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలని ఉద్దేశ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టి సరిగ్గా శుక్రవారానికి ఏడాది పూర్తయ్యింది. కొత్త పంచాయతీల ఏర్పాటు చేసిన ఆరు మాసాల్లోనే ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీల విషయంలో ఉదాసీనత వహిస్తోంది. పాత, కొత్త మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావించినా సాధ్యం కాలేదు. ఫలితంగా ఏడాది కాలంగా అధికారుల పాలనే సాగుతోంది. జిల్లా ఏర్పాటు అనంతరం.. 2016 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం 14 మండలాలతో వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేసింది. నాడు ఒకే మున్సిపాలిటీతో ఏర్పాటు చేసిన జిల్లాలో రెండేళ్ల పూర్తికావస్తున్న తరుణం 2018 ఆగస్టు 2వ తేదీన 15 వేల జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య ఐదుకు చేరింది. పాత మున్సిపాలిటీ వనపర్తి సరసన కొత్తగా పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట పట్టణాలు మున్సిపాలిటీలుగా చేరాయి. కానీ మున్సిపాలిటీల్లో అందించాల్సిన సేవలుగాని, ఏర్పాటు చేయాల్సిన సేవలుగాని పూర్తిస్థాయిలో అమలుచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా మండల ఎంపీడీఓలకే, ఆయా మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను అప్పగించి పాలన నెట్టుకొస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి సైతం అనుమతులు ఇవ్వకుండా అధికారులు ఎనిమిది నెలల పాటు ఆయా మున్సిపాలిటీల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో నెమ్మదిగా ఇంటి నిర్మాణాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా 79 పంచాయితీలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా ఉన్న తండాలను, ఆవాస ప్రాంతాలను ప్రభుత్వం పంచాయతీలుగా గుర్తించింది. జిల్లాలో మునుపు 185 గ్రామ పంచాయతీలు ఉండగా సుమారు తొమ్మిది గ్రామపంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీల్లో విలీనం చేసింది. కొత్తగా 33 గిరిజన తండాలను, 46 ఆవాస ప్రాంతాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. 2019 జనవరి కొత్త పాత పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ఆరు నెలల తర్వాత సర్పంచులకు చెక్‌పవర్ ఇచ్చారు. కొద్దోగొప్పో పాలన గాడిన పడుతోంది. కానీ కొత్త మున్సిపాలిటీల విషయంలోనే.. ప్రజల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 255కు చేరింది. పెరిగిన పన్నులు కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందించటం పక్కన పెడితే పంచాయితీ ఉన్నప్పటికంటే ఎక్కువగా ఇంటి టాక్సీలు వసూలు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీగా ఎందుకు అప్‌గ్రేడ్ చేశారోనని అసంతృప్తి వాదనలు లేకపోలేదు. వేల మందికి ఉపాధి కరువు జిల్లాలో నాలుగు పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయటంతో జిల్లా సుమారు 9084 మంది కూలీలు ఉపాధి కోల్పోయారు. వారికి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యామ్నాయంగా ఇప్పటివరకు పని లభించలేదు. చేసేది లేక కూలీలు ఇతర పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొత్త గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను ఏర్పాటు చేసింది కానీ నేటికీ ఎన్ఆర్ఈజీఎస్ పనులు ఉమ్మడి పంచాయతీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, సంక్షేమ పథకాలు ఉమ్మడి పంచాయతీ లెక్కనే వర్తింప జేస్తున్నారు. పారిశుద్ధ్య సేవలు అంతంతే.. మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయిన పట్టణాల్లో గతంలో కంటే పారిశుధ్య నివారణ చర్యలు ఎలాంటి పురోగతిని సాధించలేదు. నాటి పంచాయతీలో ఉన్న సిబ్బందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఏర్పాటు కాని పాలనా విభాగాలు కొత్త మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగాలను ఏర్పాటు నేటికీ ఏర్పాటు కాలేదు. అన్ని పనులను ఇన్చార్జ్ కమిషనర్ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు విమర్శలు ఉన్నాయి. నూతన మున్సిపాలిటీలకు పాలకవర్గాలు వస్తేగాని పాలన గాడిలో పడే పరిస్థితులు కనిపించటం లేదు. -
నెల్లూరు జిల్లాలో ఏడు కొత్త మున్సిపాలిటీలు
జిల్లాలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీల డిమాండ్ ఫైల్‌కు కొత్త ప్రభుత్వంలో మోక్షం లభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా రాష్ట్ర మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అన్నీ సక్రమంగా జరిగితే వచ్చే నెలాఖరు నాటికి జిల్లాలో ఏడు కొత్త గ్రేడ్–3 మున్సిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. విస్తీర్ణం, జనాభా పరంగా నెల్లూరు జిల్లా పెద్దది. ఇతర జిల్లాలో లేని విధంగా ఇక్కడ వాణిజ్య సెజ్‌లు ఉండడంతో సమీప గ్రామాల్లో జనాభా పెరగడంతో పాటు గ్రామ పంచాయతీల ఆదాయ వనరులు కూడా పెరిగాయి. కొన్ని నియోజక వర్గాల్లో మండల కేంద్రాలుగా ఉన్న పెద్ద పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు కసరత్తు జోరుగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం, కోట, అల్లూరు, పొదలకూరు, ముత్తుకూరు, రాపూరు, తడ తదితర గ్రామ పంచాయతీలను నగరపాలిక పంచాయతీ (గ్రేడ్–3 మున్సిపాలిటీ)గా మార్చనున్నారు. 2013లోనే జిల్లాలోని బుచ్చిరెడ్డి పాళెం, పొదలకూరులు మున్సిపాలిటీలు చేయడానికి ప్రతిపాదనలు పంపినా అప్పటి సర్కార్ దీనిని పట్టించుకోలేదు. గడిచిన ఐదేళ్లలో దీనిపై రెండు పర్యాయాలు ప్రతిపాదనులు పంపినా వాటికి మోక్షం లభించలేదు. ఇటీవల అసెంబ్లీలో కొందరు ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీల ఏర్పాటుపై మాట్లాడడం, రాష్ట్ర మున్సిపల్ శాఖ స్థానిక సంస్థల కంటే ముందుగానే రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలని భావించడంతో వేగంగా ప్రతిపాదనలు తెరపైకి వచ్చి కార్యరూపం దిశగా అడుగులు వేస్తున్నారు. మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ ప్రభుత్వ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో కలిపి 50 ప్రధాన గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడానికి వీలుగా ఉన్న ప్రతిపాదనల్ని పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా జనాభా, గ్రామ పంచాయతీ ఆదాయం, విస్తీర్ణం తదితర అంశాలతో పాటు ఇతర ప్రత్యేక అంశాలను పరిగణలోకి తీసుకొని నివేదికలు ఈ నెల 31లోగా పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. సమీప గ్రామాలను కలుపుకుని.. జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలను గుర్తించి కొన్నింట్లో వాటికి సమీపంలోని గ్రామాలను కూడా కలుపుకొని మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడానికి కసరత్తు మొదలు పెట్టారు. మున్సిపల్ శాఖ మార్గదర్శకాల ప్రకారం 20 వేల పైన 40 వేల లోపు జనాభా ఉండాలని సూచించారు. అలాగే ఏటా రూ.40 లక్షలపైనే వార్షిక పంచాయతీ ఆదాయం ఉండాలని కూడామార్గదర్శకాల్లో ఉంది. దీనికి అనుగుణంగానే జిల్లాలో గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. కోవూరు నియోజకవర్గంలో బుచ్చిరెడ్డిపాళెం, దాని పక్కన ఉన్న వవ్వేరును కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. దీనికి అనుగుణంగా బుచ్చిరెడ్డిపాళెం జనాభా 24,975, వవ్వేరు జనాభా 6359గా ఉంది. గూడూరు నియోజకవర్గంలోని కోట, వాకాడు Ðగ్రామాలు, గూడలి గ్రామం కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నారు. కోటలో 16,200 మంది, వాకాడులో 8,420 మంది గూడలిలో 6,472 మంది జనాభా ఉన్నారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు గ్రామ పంచాయతీ జిల్లాలోని ప్రధాన గ్రామ పంచాయతీల్లో ఒకటి. ఇక్కడ జనాభా 28 వేల మంది ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు గ్రామ పంచాయతీలో జనాభా 25 వేల పైచిలుకు ఉంటుంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు గ్రామ పంచాయతీ ఆదాయపరంగా పెద్దది. ఇక్కడ జనాభా 15 వేల పైచిలుకు ఉంటారు. అయితే ఇక్కడ సమీపంలో కృష్ణపట్నం పోర్టు ఉండటంతో పారిశ్రామికంగా ముత్తుకూరు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు గ్రామ జనాభా 15 వేల పైనే ఉంది. అయితే భౌగోళికంగా పంచాయతీ పెద్దది కావడం, ఆదాయం కూడా ఎక్కువగా ఉండడంతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సరిహద్దు ప్రాంతం తడ, తడ కండ్రికలను కలిపి 15 వేల పైనే జనాభా ఉంటుంది. అయితే ఇది పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో వలస ఉద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కావలి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్తగా వచ్చే వాటితో కలిపి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త మున్సిపాలిటీలను దాని కంటే ముందుగా ఏర్పాటు చేసి అక్కడ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అభివృద్ధి జాడేది
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా ఏర్పడిన, అప్‌గ్రేడ్ అయిన పురపాలికల్లో పాలన ఇంకా గాడిన పడలేదు. వరుస ఎన్నికలు, స్పెషలాఫీసర్ల నిర్లక్ష్యం, సిబ్బంది కొరత వెరసి ఆయా మున్సిపాలిటీల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. పాలనాసౌలభ్యం కోసం గతేడాది ఆగస్టు 2న మేజర్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు అభివృద్ధిలో ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కొత్త పురపాలికల్లో అభివృద్ధి పడకేసింది. సొంత, సరిపడా భవనాలు, అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో ఆయా పురపాలికల్లో పాలన గ్రామ పంచాయతీలుగా మాదిరిగానే దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 19 మున్సిపాలిటీలుండగా.. వాటిలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట పాత పురపాలికలు. నగరపంచాయతీలుగా ఉన్న నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, అయిజ మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఆత్మకూరు, అమరచింత, పెబ్బేరు, కొత్తకోట, అలంపూర్, వడ్డేపల్లి, భూత్పూర్ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఆయా మున్సిపాలిటీలకు ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన జిల్లాస్ధాయి, డివిజన్ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది. దీంతో ఆయా పురపాలికల్లో పాలన పరుగులు పెడుతుందని అందరూ సంతోషించారు. అయితే కొందరు స్పెషలాఫీసర్లు తమకు కేటాయించిన మున్సిపాలిటీల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పలువురు అధికారులు ము న్సిపల్ కార్యాలయాలకు వెళ్లినా పని చేసేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పని చేయలేని పరిస్థితి నెలకొంది. పట్టణాల అభివృద్ధి, సుందరీకరణకు తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) నుంచి ప్రతి మున్సిపాలిటీకి గతేడాది రూ.15కోట్ల నిధులు మంజూరయ్యా యి. ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఆదాయ వనరులు తక్కువగా ఉండటం, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అంతంత మాత్రంగా ఉండడంతో పురపాలికలు అభివృద్ధిలో వెనకబడ్డాయి. దీంతో చాలా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య కార్మికుల కు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అయితే కొత్త పాలకవర్గాలు కొలువుదీరితేనే గానీ ఆయా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెట్టదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అయితే దీనికి ఇంకా కనీసం నాలుగు నెలలైనా పట్టే అవకాశాలుండడం.. వచ్చేది వర్షాకాలం కావడంతో సమస్య తలెత్తే అవకాశాలుండడంతో అప్పటి వరకు స్పెషలాఫీసర్లు ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇష్టారాజ్యం.. పలువురు స్పెషలాఫీసర్లు, మున్సిపల్ సంబంధిత విభాగాల ఇన్చార్జీలు అధికారులు సమయపాలన పాటించకపోవడం.. ఇష్టారాజ్యంతో అప్‌గ్రేడ్, కొత్త మున్సిపాలిటీల పరిధిలో రియల్టర్లు, వ్యాపారులతో పాటు ప్రజలు ఇష్టారాజ్యంగా ఇళ్లు, వెంచర్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడి ఏడాది కావస్తున్నా.. చాలా వాటిలో వారం రోజుల వరకు వాటి పరిధిలో ఇళ్ల నిర్మాణాలు, నల్లా కనెక్షన్లు,జననమరణ ధ్రువీకరణ పత్రాలు వంటివి జారీ కాలేదు. ఇటీవలే ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభిస్తున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే భవనాలు నిర్మించుకున్నారు. మున్సిపాలిటీ చట్టం ప్రకారం అనుమతుల కోసం దరఖాస్తుల్లో సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడంతో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం లేదు. సగానికి పైగా మున్సిపాలిటీల్లో డంపింగ్ యార్డులే లేకపోవడం గమనార్హం. దీంతో చెత్తను ఆయా పట్టణ శివారు ప్రాంతాల్లో వేయడంతో పారిశుధ్యం లోపిస్తోంది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో గడిచిన పది నెలల్లో వార్డుల్లో కనీసం ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. మున్సిపాలిటీల్లో కొన్ని సమస్యలు భూత్పూర్ తహసీల్దార్‌ను కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి ప్రభుత్వం కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మహబూబ్‌నగర్ డీఆర్వోను ప్రత్యేక అధికారిగా నియమించారు. నేటికీ కమిషనర్, డీఆర్వో మున్సిపాలిటీలో పర్యటించి సమస్యలను పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఆ మున్సిపల్ పరిధిలో ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణాలతో పాటు వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి 9 మంది దరఖాస్తులు రాగా, ఇద్దరికి మాత్రమే అనుమతులు ఇచ్చారు. జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ కావడం లేదు. అలంపూర్ నియోజకవర్గంలో అలంపూర్, వడ్డేపల్లి కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ కనీసం మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోవడం లేదు. తాగడానికి పూర్తిస్థాయిలో మంచినీళ్లు లభించక, డ్రెయినేజీ శుభ్రం లేక, చెత్తాచెదారం పేరుకుపోయి నానా అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌భగీరథ పనులు పూర్తికాకపోవడం, రాజోలి తాగునీటి పథకం నీరు రెండు రోజులకోసారి రావడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడం, రోడ్ల సమీపంలోనే చెత్తాచెదారం వేయడంతో పారిశుద్ధ్యం లోపించింది. అమరచింత మున్సిపాలిటీ కార్యాలయం లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే ప్రస్తుతం మున్సిపాలిటీ కార్యాలయం కొనసాగుతోంది. పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. పెబ్బేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులేవీ జరగలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు లేకపోవడంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు, నల్లా కనెక్షన్ల అనుమతులు జారీ కావడం లేదు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి.. పారిశుద్ధ్యం లోపిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అచ్చంపేట నగరపంచాయతీని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఎనిమిది గ్రామాలను విలీనం చేస్తూ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో విలీన గ్రామాలను కలుపుకుని మొత్తం 42,676 జనాభా, 20 వార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు రూపాయి నల్లా కనెక్షన్ల ఊసేలేదు. మిషన్ భగీరథ పైపులైన్స్, ట్యాంకుల నిర్మాణం ఇంతవరకు మొదలే కాలేదు. పాత లైన్ ద్వారా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తుండడంతో కొత్త కాలనీలు, కొత్త కనెక్షన్లకు నీళ్లు అందడం లేదు. నగరపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన నాగర్‌కర్నూల్‌లో అభివృద్ధి ఏ మాత్రం జరగలేదు. ఇప్పటి వరకు కనీసం డంపింగ్ యార్డు కూడా లేకపోవడంతో చెత్తను కేసరి సముద్రం శివారులో వేస్తున్నారు. రూ.65 కోట్లతో కొనసాగుతోన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు నత్తకు నడక నేర్పుతున్నాయి. నిధులు రాలే.. కొత్తగా ఏర్పడిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేక నిధులు రాలేదు. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా ఉన్నవాళ్లు అంకితభావం, పట్టుదలతో పని చేస్తున్నారు. మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్నాం.. ఇకపై మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – రాములు, వడ్డేపల్లి ఇన్చార్జ్ కమిషనర్ -
కొత్త పురపాలికల్లో బాదుడు షురూ!
సాక్షి, హైదరాబాద్: కొత్త మునిసిపాలిటీల్లో అప్పుడే బాదుడు ప్రారంభమైంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 68 మునిసిపాలిటీల్లో ఆస్తి పన్నులు మినహాయించి ఇతర పనులైన ఖాళీ స్థలాలపై పన్నులు, నల్లా చార్జీలు, మార్కెట్ ఫీజులు, పశు వధశాలల ఫీజులు, మునిసిపల్ భవనాలు/గదులు/ కార్యాలయ సముదాయాల అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, టౌన్ఫ్లానింగ్కు సంబంధించిన ఇతర ఫీజులు/చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ఎంక్రోచ్మెంట్ ఫీజు, మ్యుటేషన్ ఫీజు, వినోద పన్ను, స్టాంపు డ్యూటీపై సర్‌చార్జీలను రాష్ట్ర పురపాలక శాఖ చట్టంలోని నిబంధనల మేరకు పెంచాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఈ నెల 25న సర్క్యులర్ జారీ చేశారు. 173 గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసి కొత్తగా 38 మునిసిపాలిటీల ఏర్పాటుతోపాటు పాత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మరో 131 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి చివరిలో పురపాలక శాఖ చట్టాలకు సవరణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1, 2వ తేదీల నుంచి 68 కొత్త మునిసిపాలిటీలు మనుగడలోకి రాగా, 131 గ్రామ పంచాయతీలు సంబంధిత మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో విలీనమైపోయాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో వసూలు చేసిన పన్నులు, పన్నేతర చార్జీలు, ఫీజులను ఇకపై పురపాలక శాఖ చట్టాల ప్రకారం పెంచి వసూలు చేయాలని ఆ శాఖ డైరెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు కొత్త పురపాలికల్లో ఆస్తి పన్నులను మాత్రం పెంచరాదని స్పష్టం చేశారు. మునిసిపాలిటీల చట్టం ప్రకారం కొత్త పురపాలికలు, పురపాలికల్లో విలీనమైన గ్రామాల్లోని ఖాళీ స్థలాలు/ప్లాట్లపై 0.22 శాతం మార్కెట్ విలువన ఖాళీస్థలం పన్నుగా వసూలు చేయాలని కోరారు. నల్లా చార్జీలకు రెక్కలు కొత్త మునిసిపాలిటీల్లో పాలక మండళ్ల తీర్మానంతో నల్లా చార్జీలను పెంచాలని పురపాలక శాఖ ఆదేశించింది. నిబంధనల మేరకు గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు వేర్వేరు చార్జీలను నిర్ణయించాలని సూచించింది. చిన్న హోటళ్లు, వ్యాపార గృహా ల నుంచి కూడా వాణిజ్య కేటగిరీ కింద నీటి చార్జీలు వసూలు చేయనున్నారు. పైప్లైన్ల మరమ్మతు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వ్యయాన్ని వాటర్ డొనేషన్ చార్జీల రూపంలో ఏకకాలం(వన్‌టైం)లో వసూలు చేస్తారు. కొత్త మునిసిపాలిటీల్లో నల్లా చార్జీలను పట్టికలో సూచించిన విధంగా నిర్ణయించి వసూలు చేయాలని పురపాలక శాఖ కోరింది. భవన నిర్మాణ అనుమతులు ఇక భారం.. కొత్త మునిసిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు ఇకపై భారం కానున్నాయి. ఇకపై మునిసిపల్ బిల్డింగ్ రూల్స్(జీవో 168) ప్రకారం భవన నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం నామ మాత్రపు ఫీజులతో అనుమతులు జారీ చేస్తుండగా, ఇకపై మూడో శ్రేణి మునిసిపాలిటీలకు వర్తించే భవన అనుమతుల ఫీజులను కొత్త మునిసిపాలిటీల్లో దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించిన కౌన్సిల్ తీర్మానం చేయాలని పురపాలక శాఖ కోరింది. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సైతం.. కొత్త పురపాలికల్లో వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక, వినోద అవసరాలకు వినియోగించే భవనాలు, గృహాల నుంచి ఇక ముందు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయనున్నారు. కౌన్సిల్లో వివిధ రకాల ట్రేడ్లకు ఫీజులను నిర్ణయించాలని పురపాలక శాఖ ఆదేశించింది. మ్యుటేషన్ ఫీజులను సైతం కౌన్సిల్లో నిర్ణయించి వసూలు చేయాలని కోరింది. మునిసిపల్ చట్టాల ప్రకారం.. వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వినోద పన్నులో 90శాతం వాటాతోపాటు ఆస్తుల క్రయ విక్రయాల సందర్భంగా రిజిస్ట్రేషన్ల శాఖ వసూలు చేసే స్టాంపు డ్యూటీలో 2 శాతాన్ని సర్‌చార్జీగా మునిసిపాలిటీలు తిరిగి రాబట్టుకోవాలని మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మార్కెట్, పశువధశాలల్లో ఫీజులు కొత్త మునిసిపాలిటీల్లోని మార్కెట్లో, పశువధశాలల్లో వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసే హక్కులను కాంట్రాక్టర్లకు ఇవ్వాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ఆదేశించింది. అత్యధిక ధర పలికిన కాంట్రాక్టర్‌కు ఫీజులు వసూలు చేసే హక్కులను అప్పగించాలని కోరింది. కాంట్రాక్టర్ల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు కౌన్సిల్ తీర్మానంతో టెండర్ ప్రకటన జారీ చేయనున్నారు. మునిసిపాలిటీల స్వీయ నిర్వహణలో ఉన్న మార్కెట్లు, పశువధశాల ల్లో టికెట్ల ద్వారా ఫీజులు వసూలు చేయనున్నారు.మూడేళ్లకోసారి ఈ ఫీజులను పెంచనుంది. కొత్త మునిసిపాలిటీల యాజమాన్యంలోని ఖాళీ స్థలాలు, దుకాణాలు, గోదాములు, భవనాలను కౌన్సిల్ తీర్మానంతో కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల కాలా నికి ఆయా మునిసిపాలిటీలు అద్దెకు ఇచ్చుకోవచ్చని పురపాలక శాఖ సూచించింది. మునిసిపాలిటీల చట్టం ప్రకారం అద్దెలు నిర్ణయించాలని తెలిపింది. -
మున్సి‘పాలకులు’ వచ్చేశారు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు కమిషనర్లను, ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో నస్పూర్, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మేజర్ గ్రామ పంచాయితీలను మార్చి నెలాఖరులో మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిన వెంటనే మున్సిపాలిటీలుగా మారుతాయని ప్రకటించింది. బుధవారంతో గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేకాధికారుల నియామక ప్రక్రియ పూర్తి చేశారు. కొత్త వాటితో కలుపుకుని ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 12కు పెరగనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లను, ప్రత్యేకాధికారులను సైతం ఎంపిక చేసి, హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. తహసీల్దార్లకే కమిషనర్ బాధ్యతలు ఉమ్మడి ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన ఐదు మున్సిపాలిటీలకు కమిషనర్లుగా ఆయా మండలాల తహసీల్దార్లనే ఎంపిక చేశారు. వీరంతా ఆగస్టు 2వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. నస్పూర్‌కు ఇన్చార్జిగా ఉన్న మంచిర్యాల తహసీల్దార్ కుమారస్వామికి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇక నుంచి రెండు మండలాలకు తహసీల్దార్‌గా, నస్పూర్ మున్సిపల్ కమిషనర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. చెన్నూర్ మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆ మండల తహసీల్దార్ శ్రీనివాస్ వ్యవహరిస్తారు. లక్సెట్టిపేట తహసీల్దార్ రాజేశ్వర్ కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీకి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి మందమర్రి తహసీల్దార్ ఇంతియాజ్ అహ్మద్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్‌కు ఆ మండల తహసీల్దార్ ఆరె నరేందర్ కమిషనర్లుగా వ్యవహరించనున్నారు. స్పెషలాఫీసర్లుగా జిల్లా స్థాయి అధికారులు మున్సిపాలిటీల ప్రత్యేకాధికారులుగా ఆర్డీవో స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. నస్పూర్‌కు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్యామలాదేవి, చెన్నూర్‌కు జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, క్యాతనపల్లికి మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, లక్సెట్టిపేట మున్సిపల్ ప్రత్యేకాధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్యకు బాధ్యతలు అప్పగించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ స్పెషలాఫీసర్‌గా ఆర్డీవో ప్రసూనాంబ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మున్సిపాలిటీలకు చైర్పర్సన్ ఉండనందున అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు వీరే తీసుకుంటారు. నేటితో సర్పంచుల పాలనకు వీడ్కోలు గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టు ఒకటితో ముగుస్తోంది. ఈ మేరకు అన్ని గ్రామాల్లో వీడ్కోలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. గ్రామ సర్పంచులకే ప్రత్యేక అధికారాలు ఇచ్చి కొనసాగించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి గ్రామ పంచాయతీలు వెళ్లనున్నాయి. ప్రభుత్వం సాధారణ ఎన్నికలను గడువు కన్నా ముందే ఈ సంవత్సరం డిసెంబర్లో నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ఆరు నెలల వరకు తప్పనిసరి కానుంది. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 1508 గ్రామ పంచాయతీలకు గాను పదవీకాలం మిగిలి ఉన్న ఐదు జీపీలను మినహాయించి 1503 మంది స్పెషలాఫీసర్లను నియమించారు. వీరు కూడా 2వ తేదీ నుంచి పాలన పగ్గాలు చేపట్టనున్నారు. కొత్త మున్సిపాలిటీలకు పాలకులు వీరే! మున్సిపాలిటీ కమిషనర్ ప్రత్యేకాధికారి నస్పూరు కుమారస్వామి శ్యామలాదేవి చెన్నూరు శ్రీనివాస్ సంజీవరెడ్డి క్యాతనపల్లి ఇంతియాజ్ అహ్మద్, శ్రీనివాస్ లక్సెట్టిపేట రాజేశ్వర్ వీరయ్య ఖానాపూర్ నరేందర్ ప్రసూనాంబ -
‘ప్రత్యేక’ కసరత్తు షురూ
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల ఒకటి నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లు, 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకాలపై ప్రతిపాదనలను రెండ్రోజుల్లోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్.కె.జోషి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం, హరితహారం, మత్స్యశాఖ, పాడిగేదెల పంపిణీ, వివిధ కేసుల్లో మెడికల్, పోస్టుమార్టం నివేదికల జారీలో జాప్యం, లారీల సమ్మె తదితర అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇన్‌చార్జీలుగా పంచాయతీ కార్యదర్శులు, 68 కొత్త మున్సిపాలిటీలకు మున్సిపల్ కమిషనర్లుగా తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులుగా ఆర్డీవోలు, లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు పంపించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రత్యేకాధికారులు, ఇన్చార్జి కమిషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కోరారు. కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ కొత్త పురపాలికలుంటే అందుకనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. కొత్త పుర పాలికలు ప్రస్తుతమున్న బ్యాంకు ఖాతాలను మూసే సి జాతీయ బ్యాంకుల్లో కొత్తగా అకౌంట్లు తెరవాలని సూచించారు. పురపాలికల్లో టీయూఎఫ్ఐడీసీ ద్వారా చేపట్టే పనులు డిసెంబర్‌కు పూర్తి చేయాల న్నారు. పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకంపై పంచాయతీ రాజ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. పోస్టుమార్టం, వైద్య నివేదికల్లో జాప్యం వద్దు వివిధ కేసుల్లో పోస్టుమార్టం, వైద్య నివేదికలు జిల్లాల వారీగా పెండింగ్‌లో లేకుండా చూడాలని సీఎస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కేసుల దర్యాప్తును నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తిచేసేందుకు వైద్య, పోస్టు మార్టం నివేదికల జారీలో జాప్యం లేకుండా చూడా లని డీజీపీ మహేందర్ రెడ్డి కలెక్టర్లను కోరారు. 20 నుంచి లారీల సమ్మెకు ప్రైవేటు యజమానులు పిలుపునిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోషి ఆదేశించారు. -
కొత్తగా 28 పురపాలికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త పురపాలికల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. 28 కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుతో పాటు ప్రస్తుత పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండటం తో కొత్త పురపాలికలు, విలీన గ్రామ పంచాయతీల సంఖ్య పెరగనుంది. సమీపంలోని రెండు, మూడు గ్రామ పంచాయతీలను విలీనం చేసి కొత్త పురపాలిక ఏర్పాటు చేయా లని ప్రతిపాదనలు వచ్చాయి. మొత్తం 52 గ్రామ పంచాయతీల విలీనం ద్వారా 28 కొత్త పురపాలికలు ఏర్పాటు చేయాలని 15 జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 5 పురపాలికల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. జనాభా 15 వేలు మించితే పురపాలికే 15 వేలకు మించిన జనాభా కలిగిన మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ప్రస్తుతం ఉన్న పురపాలికలకు చుట్టూ 1 నుంచి 5 కి.మీల పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను కొత్త పురపాలికలుగా ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుతం ఉన్న పురపాలికల్లో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ లక్షణాలు, స్వభావం కలిగిన గ్రామ పంచాయతీలను గుర్తించి పురపాలికలుగా ఏర్పాటు చేసేందుకు లేదా సమీప పురపాలికల్లో విలీనం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనల తయారీ కోసం ప్రభుత్వం గత నెలలో 9 మంది ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రత్యేకాధికారులు 28 కొత్త పురపాలికల ఏర్పాటుతో పాటు ప్రస్తుతం ఉన్న 73 పురపాలికల్లో 199 శివారు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. ఆగస్టులో కొత్త పురపాలికల ఏర్పాటు గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం వచ్చే జూలైతో ముగియనుంది. ఆ వెంటనే కొత్త పురపాలికల ఏర్పాటు, పురపాలికల్లో శివారు గ్రామ పంచాయతీల విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆ లోపే పూర్తి చేయనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు, గ్రామ పంచాయతీల విలీన ప్రతిపాదనలకు తుదిరూపు లభించిన తర్వాత ప్రభుత్వం ఈ కసరత్తు ప్రారంభించనుంది. కొత్త పురపాలికల ఏర్పాటు లేదా పురపాలికల్లో విలీనంపై సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బహిరంగ ప్రకటన జారీ చేయనుంది. అభిప్రాయాలు తెలపడానికి స్థానిక ప్రజలకు 10 రోజుల గడువు లభించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన అనంతరం సంబంధిత గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ వెంటనే ఆయా గ్రామ పంచాయతీలను కొత్త నగర పంచా యతీలు, మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ, శివారు పురపాలికల్లో విలీనం చేస్తున్నట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంచరీ దాటనున్న పురపాలికలు రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు 73 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 28 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, తుది ప్రతిపాదనలు సిద్ధమ య్యే సరికి ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త పురపాలికలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో పురపాలికల సంఖ్య 100కి మించిపోనుంది. -
కొత్త పురపాలికలకు నిధులు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన నిధులను కూడా పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పురపాలకశాఖ కార్యక్రమాలపై కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రాజెక్టులు, ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమాలకు అవసరమైన నిధులతో అంచనాలను రూపొందించాలని కోరారు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కేశవపురం రిజర్వాయర్‌పై చర్చించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైలు విభాగాలకు సంబంధించిన నిధుల అవసరాలను ఆరా తీశారు. సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
ఖజానా ఖాళీ!
♦ ప్రస్తుతం రూ.3.5 కోట్లు మైనస్‌లోకి ♦ తగ్గిన రాబడి.. పెరిగిన ఖర్చులు ♦ గండికొట్టిన కొత్త మున్సిపాలిటీలు ♦ చక్కదిద్దే పనిలో యంత్రాంగం ♦ కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయం జిల్లా ప్రజాపరిషత్ ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఒకప్పుడు రూ.కోట్లతో కళకళలాడిన జెడ్పీ ఖజానా ఇప్పుడు లోటు బడ్జెట్‌తో డీలా పడింది. రాబడి భారీగా తగ్గుతుండగా.. ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణ పద్దు కింద చేపట్టే పనులు భారీగా పెరగడంతో తాజాగా ఖజానా రూ.3.5కోట్ల లోటుకు పడిపోయింది. దీంతో ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకు కొత్తగా పనులు చేపట్టవద్దని జెడ్పీ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాపరిషత్‌కు పలు పద్దుల కింద రాబడి ఉంటుంది. నగరం చుట్టూ విస్తరించి ఉండడం.. రియల్ వ్యాపారం జోరుగా సాగడంతో స్టాంపుడ్యూటీ పద్దులో ఏటా రూ.20కోట్ల వరకు ఆదాయం ఉండేది. అంతేకాకుండా పన్నుల రూపంలో వ చ్చే ఆదాయంలో తలసరి గ్రాంటు కింద ఏటా రూ.42లక్షలు, సీనరేజీ కింద రూ. 1.5కోట్ల వరకూ రాబడి వచ్చేది. పట్టణీకరణ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో జిల్లా పరిషత్ ఆదాయం క్రమంగా తగ్గుతోంది. ఇటీవల కొత్తగా ఐదు నగరపంచాయతీలు ఏర్పాటయ్యాయి. జనాభా ప్రాతిపదికన గణాంకాలన్నీ మున్సిపల్ పరిధిలోకి చేర్చడంతో ఆదాయం అంతా మున్సిపాలిటీలకు దక్కుతోంది. ఈ క్రమంలో జెడ్పీ ఆదాయానికి భారీగా గండిపడింది. 2014-15 వార్షిక సంవత్సరంలో జెడ్పీకి వివిధ పద్దుల కింద రూ.15.03 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత వార్షికంలో ఇప్పటివరకు కేవలం రూ. 5.42 కోట్లు మాత్రమే సమకూరింది. జెడ్పీ సాధారణ నిధుల కింద రోడ్లు, ఇతర కమ్యునిటీ హాళ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర నిర్మాణాలు భారీగా చేపట్టారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచుల సంఖ్య గతంతో పోల్చితే ప్రస్తుతం అధికార పార్టీకి భారీ మెజార్టీ ఉంది. ఈక్రమంలో సభ్యుల డిమాండ్ల మేరకు పనులు పెద్ద సంఖ్యలో మంజూరు చేశారు. అయితే రాబడి భారీగా తగ్గడంతో తాజాగా జెడ్పీ ఖజానా లోటుకు చేరుకుంది. ప్రస్తుతం వివిధ పనులకు సంబంధించి రూ.3.5కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే జెడ్పీ ఖజానా నిండుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నా ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి సారించింది. స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి జెడ్పీకి నిధులు రావాల్సి ఉన్నప్పటికీ.. లోటును భర్తీ చేయాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంటుందని జెడ్పీ అధికారవర్గాలు చెబుతున్నాయి. -
కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంపు
త్వరలో ఆస్తుల గణనకు సర్వే అనంతరం కొత్త రేట్లపై నిర్ణయుం ఏప్రిల్ 2015 నుంచి సవరించిన పన్నుల వసూళ్లు పురపాలక శాఖ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం 8 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు మోక్షం హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీలతో పాటు నరగపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో విలీనమైన గ్రామ పంచాయతీల్లో త్వరలో ఆస్తి పన్ను పెరిగే అవకాశముంది. కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో మున్సిపల్ చట్టం ఆధారంగా ఆస్తి పన్నుల సవరణకు అనుమతులు కోరుతూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి 8 నెలల క్రితం అప్పటి పురపాలక శాఖ కమిషనరేట్ కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. అరుుతేమున్సిపల్ ఎన్నికల కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పెండింగ్‌లో పెట్టింది. తాజాగా పాత ఫైళ్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవలే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించారుు. దీంతో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 46 నగర పంచాయతీలతో పాటు వందకు పైనే ఉన్న విలీన గ్రామాల్లో 2015 ఏప్రిల్ నుంచి సవరించిన ఆస్తి పన్నులు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీల్లో పంచాయతీ చట్టాలకు అనుగుణంగానే ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. భూమి విలువ, అద్దెధర తదితర అంశాల ఆధారంగా రాష్ట్రంలోని పంచాయతీల్లో ఆస్తి పన్నులను నిర్ణయించి వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో చోట ఒక్కో విధంగా ఆస్తి పన్నుల రేట్లు ఉంటున్నాయి. నివాస, వ్యాపార సంస్థల నుంచి వసూలు చేసే పన్నుల్లో సైతం పెద్దగా తేడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ కోసం త్వరలో గెజిట్ ప్రకటన జారీ చేయనున్నారు. మెుదట మున్సిపాలిటీని వివిధ భాగాలుగా విభజించి శాస్త్రీయ పద్ధతులో ఆస్తుల గణనకు సర్వే నిర్వహిస్తారు. దీని కోసం భవనాల కొలతలు నమోదు చేస్తారు. అద్దె విలువ, వినియోగం, ఏరియా ఆధారంగా ఆస్తి పన్నులను నిర్ణయించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రకటన జారీ చేస్తారు. గడువులోగా అభ్యంతరాలు పరిష్కరించిన అనంతరం మరో మారు అభ్యంతరాలకు అవకాశమిస్తారు. చివరగా నిర్ణయించిన ఆస్తి పన్నుల రేట్లతో తుది గెజిట్ ప్రకటన జారీ చేస్తారు. ఆస్తి పన్నుల గణన, ప్రజామోదం పొందే వరకు కనీసం మూడు నెలల సమయం ఇస్తారు. ఆస్తి పన్ను బోర్డుకు సుస్తి! మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నుల సవరణ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. రిటైర్డు హైకోర్టు జడ్జి నేతృత్వంలో స్వతంత్ర సంస్థగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. కొత్త నగర పంచాయతీల్లో ఆస్తి పన్నుల సవరణ విషయంలో ఈ బోర్డును అప్పటి ప్రభుత్వం పక్కనపెట్టింది. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు సైతం ఆస్తి పన్ను బోర్డును పక్కనపెట్టి స్వయంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నారుు. -
కొత్త మున్సిపాలిటీలకు లైన్ క్లియర్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: శివారు పంచాయతీలకు త్వరలో ‘పట్టణ’ హోదా రానుంది. నగరానికి చేరువలో ఉన్న 35 గ్రామ పంచాయతీలను ప్రతిపాదిత 12 పురపాలక సంఘాల పరిధిలోకి తెచ్చేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయాలని ప్రతిపాదించిన ఈ పంచాయతీల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకావడంతో ప్రభుత్వం.. గ్రేటర్లో కలిపే అంశంపై వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే మణికొండ జాగీర్, గుండ్లపోచంపల్లి, కాల్వంచ గ్రామాలు మినహా.. మిగతావాటిని నగర పంచాయతీలు/ మున్సిపాలిటీలుగా మారుస్తూ రూపొందించిన ఫైలుపై పురపాలకశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి సోమవారం సంతకంచేసి ఆమోదం తెలిపారు. మున్సిపల్ శాఖలో విలీనం చేసుకుంటున్న గ్రామాలను డీనోటిఫై చేయాలని సూచిస్తూ పంచాయతీరాజ్‌శాఖకు ఫైలు పంపారు. అక్కడి నుంచి ఫైలు ముఖ్యమంత్రి వద్దకు చేరనుంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. శివారు పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి. ఈ ప్రక్రియ నెలాఖరులోపు పూర్తయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. కొత్త మున్సిపాలిటీలివే: శంషాబాద్, నార్సింగి, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, కొంపల్లి, జిల్లెలగూడ, మీర్‌పేట, కొత్తపేట, జల్పల్లి, బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం -
కొత్తగా పది పురపాలికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని నగర పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది నగర పంచాయతీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. కొత్త మున్సిపాలిటీలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శివారు పంచాయతీలను హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం.. వీటిని నగర పంచాయతీలుగా మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో కలెక్టర్ బి.శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం కొత్త మున్సిపాలిటీలపై ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపింది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత 32 గ్రామాలను పది నగర పంచాయతీల పరిధిలోకి తేవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీలను ఈ జాబితాల్లో చేర్చకూడదని భావించింది. శామీర్‌పేట మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా ఉన్న జవహర్‌నగర్‌ను విలీనం చేసుకునేందుకు గ్రేటర్ పాలకవర్గం మొగ్గు చూపుతోంది. అక్కడే డంపింగ్ యార్డు ఉండడం, విస్తారంగా ప్రభుత్వ భూములు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు ఈ గ్రామ విలీనం అనివార్యమని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఈ పంచాయతీని కలుపుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే గుండ్లపోచంపల్లి గ్రామాన్ని గ్రేటర్లో విలీనం చేయకుండా నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేద్దామని తొలుత భావించినప్పటికీ, నగర పంచాయతీ ఏర్పాటుకు నిర్ధేశించిన జనాభా లేనందున.. ప్రస్తుతానికి దీన్ని గ్రామ పంచాయతీగానే కొనసాగించాలనే అభిప్రాయానికొచ్చింది. పదింటికీ ఒకే..! గ్రేటర్లో శివారుగ్రామాల విలీన ప్రక్రియ చట్టబద్ధంగా సాగలేదని న్యాయస్థానం ఆక్షేపించడంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా ఈ పంచాయతీల విషయంలో తుది నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాలతో త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు వారం రోజులుగా వీటి భవిష్యత్తుపై తర్జనభర్జనలు పడ్డ జిల్లా యంత్రాంగం ఓ నివేదికను రూపొందించింది. ఈ నేపథ్యంలో గుండ్లపోచంపల్లి, జవహర్‌నగర్‌ను మినహాయించి మిగతా గ్రామాలను 8 నుంచి పది మున్సిపాలిటీలు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లా ప్రజాప్రతినిధులను సంప్రదించి తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించాలని యోచిస్తోంది. వీటికి ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే రాష్ట్రంలోనే అత్యధిక మున్సిపాలిటీల(16)తో మన జిల్లా అగ్రస్థానంలో నిలవనుంది.