సాక్షి, హైదరాబాద్: కొత్త మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ పథకం గడువును పెంచామని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకునేలా త్వరలో ప్రత్యేకంగా ఎల్‌ఆర్‌ఎస్ మేళాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఐదారేళ్లలో సింహభాగం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశముందని, దీనికి తగ్గట్టు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని వివరించారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తెచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు కచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలని సూచించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీలపై మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలతో కలసి సమీక్ష నిర్వహించారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, శ్మశానాల వంటి ప్రాథమిక అంశాలపై శ్రద్ధ వహించాలని కోరారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. టాయిలెట్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు. కేటీఆర్ సూచనల మేరకు తమ జిల్లాల పరిధిలోని పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపడతామని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, చైర్మెన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment