సాక్షి, హైదరాబాద్: వానకాలం..చలికాలం...ఇలా సీజన్‌తో సంబంధం లేకుండా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏటా గ్రేటర్ సిటీ నిండా మునుగుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి నవంబర్ 19 వరకు సరాసరిన 21.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో సాధారణం కంటే 50 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం, ఇలా పలు కారణాలతో ప్రతి నెలా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
కుండపోతగా వర్షపాతం...
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 28 మండలాల్లో అల్వాల్, కుత్భుల్లాపూర్, పటాన్‌చెరు మినహా..ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు 19 వరకు సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. కొన్ని మండలాల్లో ఏకంగా 50 శాతానికంటే అధిక వర్షపాతం నమోదవడం విశేషం. విశ్వవ్యాప్తంగా వాతావరణ పరంగా చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు, ఎల్‌నినో, లానినో ప్రభావాలు, గతితప్పిన రుతుపవనాలు, సముద్రంలో తరచూ ఏర్పడుతున్న అల్లకల్లోల పరిస్థితులు, అల్పపీడనాలు, వాయుగుండాలు, తీవ్ర తుపానులు కూడా సీజన్‌తో సంబంధం లేకుండా అకాల వర్షాలకు కారణమౌతున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
వరద నీరు వెళ్లే దారేదీ...
నగరంలో గంట వ్యవధిలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసినా.. నిండా మునుగుతోంది. సుమారు 300 బస్తీలు ఏటా ముంపునకు గురవుతున్నట్లు బల్దియా లెక్కలు చెబుతున్నాయి. గతంలో ముంపు సమస్యల పరిష్కారానికి ముంబై ఐఐటీ నిపుణులు, కిర్లోస్కర్ కమిటీ సూచనలు, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నిపుణులు చేసిన సూచనల అమలుపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఏటా ఇవే సీన్‌లు పునరావృతమౌతుండడం గ్రేటర్ పిటీ. నాలాల ఆక్రమణల పరిస్థితీ అలాగే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment