ఖజానా ఖాళీ!
♦ ప్రస్తుతం రూ.3.5 కోట్లు మైనస్‌లోకి
♦ తగ్గిన రాబడి.. పెరిగిన ఖర్చులు
♦ గండికొట్టిన కొత్త మున్సిపాలిటీలు
♦ చక్కదిద్దే పనిలో యంత్రాంగం
♦ కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయం
జిల్లా ప్రజాపరిషత్ ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. ఒకప్పుడు రూ.కోట్లతో కళకళలాడిన జెడ్పీ ఖజానా ఇప్పుడు లోటు బడ్జెట్‌తో డీలా పడింది. రాబడి భారీగా తగ్గుతుండగా.. ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణ పద్దు కింద చేపట్టే పనులు భారీగా పెరగడంతో తాజాగా ఖజానా రూ.3.5కోట్ల లోటుకు పడిపోయింది. దీంతో ఆర్థిక పరిస్థితి చక్కబడే వరకు కొత్తగా పనులు చేపట్టవద్దని జెడ్పీ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాపరిషత్‌కు పలు పద్దుల కింద రాబడి ఉంటుంది. నగరం చుట్టూ విస్తరించి ఉండడం.. రియల్ వ్యాపారం జోరుగా సాగడంతో స్టాంపుడ్యూటీ పద్దులో ఏటా రూ.20కోట్ల వరకు ఆదాయం ఉండేది. అంతేకాకుండా పన్నుల రూపంలో వ చ్చే ఆదాయంలో తలసరి గ్రాంటు కింద ఏటా రూ.42లక్షలు, సీనరేజీ కింద రూ. 1.5కోట్ల వరకూ రాబడి వచ్చేది. పట్టణీకరణ నేపథ్యంలో కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో జిల్లా పరిషత్ ఆదాయం క్రమంగా తగ్గుతోంది. ఇటీవల కొత్తగా ఐదు నగరపంచాయతీలు ఏర్పాటయ్యాయి. జనాభా ప్రాతిపదికన గణాంకాలన్నీ మున్సిపల్ పరిధిలోకి చేర్చడంతో ఆదాయం అంతా మున్సిపాలిటీలకు దక్కుతోంది.
ఈ క్రమంలో జెడ్పీ ఆదాయానికి భారీగా గండిపడింది. 2014-15 వార్షిక సంవత్సరంలో జెడ్పీకి వివిధ పద్దుల కింద రూ.15.03 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుత వార్షికంలో ఇప్పటివరకు కేవలం రూ. 5.42 కోట్లు మాత్రమే సమకూరింది. జెడ్పీ సాధారణ నిధుల కింద రోడ్లు, ఇతర కమ్యునిటీ హాళ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర నిర్మాణాలు భారీగా చేపట్టారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచుల సంఖ్య గతంతో పోల్చితే ప్రస్తుతం అధికార పార్టీకి భారీ మెజార్టీ ఉంది. ఈక్రమంలో సభ్యుల డిమాండ్ల మేరకు పనులు పెద్ద సంఖ్యలో మంజూరు చేశారు. అయితే రాబడి భారీగా తగ్గడంతో తాజాగా జెడ్పీ ఖజానా లోటుకు చేరుకుంది. ప్రస్తుతం వివిధ పనులకు సంబంధించి రూ.3.5కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే జెడ్పీ ఖజానా నిండుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నా ఏర్పాట్లపై యంత్రాంగం దృష్టి సారించింది. స్టాంపు డ్యూటీ కింద ప్రభుత్వం నుంచి జెడ్పీకి నిధులు రావాల్సి ఉన్నప్పటికీ.. లోటును భర్తీ చేయాలంటే మరిన్ని నిధులు కావాల్సి ఉంటుందని జెడ్పీ అధికారవర్గాలు చెబుతున్నాయి.