Sakshi Special Story on Types of New Scams By Cyber Criminals - Sakshi
Sakshi News home page

ఆర్థిక మోసాలు.. నయా రూటు!

Published Mon, May 30 2022 12:58 AM | Last Updated on Mon, May 30 2022 12:37 PM

Sakshi Special story on new scams by cyber criminals

గతంలో మాదిరి కాకుండా, నేడు దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవలను డిజిటల్‌ రూపంలో ఉన్న చోట నుంచే కదలకుండా పొందే సౌలభ్యం ఉంది. చెల్లింపులను డిజిటల్‌గా చేస్తున్నాం. మొబైల్‌ నుంచే షాపింగ్‌ చేస్తున్నాం. కొన్ని క్లిక్‌లతో ఇన్‌స్టంట్‌గా రుణాలు తీసుకుంటున్నాం. యాప్‌ నుంచి అవతలి వ్యక్తికి క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్‌ వేదికల్లోని కీలక సమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది.

మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్‌ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్‌. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై అవగాహన కల్పించే కథనమే ఇది.   

ఫోన్‌ కాల్‌ వెరిఫికేషన్‌
టీకాల రూపంలోనూ మోసం చేస్తారని ఊహించగలమా? స్థానిక హెల్త్‌ సెంటర్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని, ఇంటికే వచ్చి టీకాలు ఇస్తున్నట్టు మీకు కాల్‌ వస్తే తప్పకుండా సందేహించాల్సిందే. ఇంటికే వచ్చి కరోనా టీకాను ఇస్తామని.. ఇందుకు ఎటువంటి చార్జీ ఉండదని చెబుతారు. ఇందుకోసం చిరునామా, మొబైల్‌ నంబర్, పాన్, ఆధార్‌తో ధ్రువీకరిస్తే చాలని చెబుతారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే ధ్రువీకరణ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇదే ఓటీపీని ఇంటికి వచ్చి టీకా ఇచ్చే వైద్య సిబ్బందికి కూడా చెప్పాల్సి ఉంటుందని సూచిస్తారు.

మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని మీరు చెప్పిన తర్వాత ఆ కాల్‌ను డిస్‌కనెక్ట్‌ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌కు.. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ నుంచి రుణ దరఖాస్తును ఆమోదించామంటూ ఎస్‌ఎంఎస్‌ రావచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రుణం మొత్తాన్ని ఆయా బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ మంజూరు చేయడం కూడా పూర్తి కావచ్చు. ఈ మొత్తాన్ని మీకు కాల్‌ చేసిన వాళ్లు అప్పటికే తీసేసుకోవడం కూడా పూర్తయి ఉంటుంది. ఫోన్‌ కాల్‌ చేసి, ఆధార్, పాన్, చిరునామా వివరాలు తీసుకుంటున్నారంటే అది మోసపూరిత కార్యక్రమమే అని గుర్తించాలి.  అధికారికంగా ఎవ్వరూ ఆ వివరాలు అడగరు.

ఏంటి మార్గం..?
ఆధార్, పాన్‌ ఈ తరహా వ్యక్తిగత, కీలకమైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వీటి సాయంతో ఓటీపీ రూపంలో రుణాలను తీసుకునే మోసాలు పెరిగిపోయాయి. ఓటీపీ పేరుతో మొబైల్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌ను పూర్తిగా చదవాలి. ఆ ఓటీపీ దేనికోసం అన్నది అందులో క్లుప్తంగా ఉంటుంది. అందులో లోన్‌అప్లికేషన్‌ అని ఏమైనా ఉంటే, వెంటనే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సదరు బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థకు కాల్‌ చేసి సమాచారం ఇవ్వాలి.  

క్రెడిట్‌ కార్డు ఫీజు ఎత్తివేత
2021 చివరికి 6.9 కోట్ల క్రెడిట్‌ కార్డులు వినియోగంలో ఉన్నాయి. పట్టణాల్లోని చాలా కుటుంబాలకు కనీసం ఒక క్రెడిట్‌ కార్డు అయినా ఉంది. క్రెడిట్‌ కార్డులు వార్షిక నిర్వహణ పేరుతో ఫీజు వసూలు చేస్తుంటాయి. అయినా, వార్షిక ఫీజుల్లేవంటూ క్రెడిట్‌ కార్డులను ఆయా సంస్థలు మార్కెటింగ్‌ చేసుకుంటాయి. అది మొదటి ఏడాది వరకేనన్న సూక్ష్మాన్ని ఆయా సంస్థలు చెప్పవు. రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు బాదుడు మొదలవుతుంది. దీన్ని కూడా సైబర్‌ నేరస్థులు దోపిడీకి మార్గంగా ఎంపిక చేసుకున్నారు.

జీవితకాలం పాటు ఎటువంటి వార్షిక ఫీజులేని ఉచిత క్రెడిట్‌ కార్డు ఇస్తున్నామంటూ సంప్రదిస్తారు. తాము ఫలానా బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నామని నమ్మిస్తారు. అప్పటికే వార్షిక ఫీజు చెల్లిస్తున్న వారిని దాన్ని ఎత్తివేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. వారి మాటలకు మనం స్పందించే విధానం ఆధారంగా మొత్తం అంచనా వేస్తారు. తర్వాత తాము సూచించినట్టు చేయాలంటూ తమ పని మొదలు పెడతారు. ముందు క్రెడిట్‌ కార్డు నంబర్, దానిపై ఉన్న పేరు చెబుతారు. దాంతో నమ్మకం ఏర్పడేలా చేస్తారు.

బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నారు కనుకనే తమ కార్డు వివరాలు తెలుసని భావిస్తాం. కానీ, ఆ వివరాలను వారు అక్రమ మార్గాల్లో సంపాదించారన్నది మనకు తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత వారికి అసలైన ఓటీపీ అవసరంపడుతుంది. జీవిత కాలం పాటు క్రెడిట్‌ కార్డు ఫీజును ఎత్తివేయాలనుకుంటే అందుకు మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెబుతారు. మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ పంపిస్తారు. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పిన వెంటనే.. క్రెడిట్‌ కార్డు ఫీజు రద్దయినట్టు చెప్పి కాల్‌ కట్‌ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మొబైల్‌కు వరుసగా వచ్చే డెబిట్‌ లావాదేవీల ఎస్‌ఎంఎస్‌లు చూసిన తర్వాత కానీ, మోసం జరిగినట్టు అర్థం కాదు. స్పందించేలోపే ఉన్న మొత్తాన్ని వారు ఊడ్చేస్తారు.  

ఏంటి మార్గం..?
తెలియని వ్యక్తులు కాల్‌ చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు గురించి మాట్లాడుతుంటే వెంటనే డిస్‌ కనెక్ట్‌ చేసేయాలి. వారితో చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు కాల్‌ చేస్తే, విషయం చెప్పి పెట్టేస్తారే కానీ, సున్నితమైన సమాచారం, వివరాలను చెప్పాలని  కోరరు. పైగా బ్యాంకు ఉద్యోగి కార్డు వివరాలను చెప్పే ప్రయత్నం అసలు చేయరు.

ఒకవేళ ఎవరైనా కాల్‌ చేసి, మీ క్రెడిట్‌ కార్డు వివరాలు చెబుతుంటే వెంటనే ఆ కాల్‌ను కట్‌ చేయాలి. బ్యాంకు యాప్‌లోకి వెళ్లి కార్డు ఆన్‌లైన్‌ లావాదేవీల యాక్సెస్‌ను, అంతర్జాతీయ యాక్సెస్‌ ను తాత్కాలికంగా నిలిపివేయాలి. మీకు తెలియకుండా క్రెడిట్‌ కార్డు వివరాలు సంపాదించినప్పటికీ.. మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేకుండా అందులోని బ్యాలన్స్‌ను వారు ఖాళీ చేయడం అసాధ్యం. అందుకుని  ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్‌ చేయవద్దు.    

కుక్క పిల్లనీ వదలరు..
హైదరాబాద్‌ వాసి శాంతి (33)కి పెట్స్‌ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్‌బుక్‌లో ‘ఇంటి వద్దకే పెట్స్‌ డెలివరీ’ పేరుతో పోస్ట్‌ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్‌ కు కాల్‌ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు.

రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్‌ ఏరియాలో తన సెంటర్‌ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్‌ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్‌ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి.  

 మార్కెట్‌ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్‌ కేటుగాడు ఆఫర్‌ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్‌ చేసి వాట్సాప్‌ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ రాలేదు.  

దాంతో ఉండబట్టలేక శాంతి కాల్‌ చేసింది. ఈ రోజు పెట్‌ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్‌ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్‌ నుంచి ఆమెకు కాల్‌ వచ్చింది. మీరు డీల్‌ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్‌ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్‌ అని అతడు చెప్పాడు.

ఇంతకీ వాట్సాప్‌ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్‌ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్‌ నంబర్‌/ వ్యాలెట్‌ నంబర్‌/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్‌ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్‌/ క్రెడిట్‌ కార్డు నంబర్‌.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్‌ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్‌లైన్‌లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం.  అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు.

నకిలీ రూపాలు..
రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్‌ వేసుకుని మార్కెటింగ్‌ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్‌ వ్యాలెట్‌ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్‌ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్‌ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు.

ఈ రోజే ప్లాన్‌ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్‌ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్‌ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదో విధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్‌ పాలసీ డాక్యుమెంట్‌ రెండు వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు.  

ఏంటి మార్గం..?
రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్‌ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్‌ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్‌ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్‌ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్‌లైన్‌ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్‌ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్‌ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది.

డబ్బులు కొట్టేశారా..!
ఆన్‌లైన్‌ లేదా టెలిఫోన్‌ కాల్‌ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్‌ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్‌మెంట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్‌ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్‌ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్‌ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement