న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్‌బీఐ వెల్లడించింది.
2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది.
ఎన్నో సానుకూలతలు..
ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి.
ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
క్రెడిట్ కార్డుకూ ఆదరణ
మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు.
ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment