
అన్నింటికీ డిజిటల్ చెల్లింపులే...
ఆరు నెలల్లో 9,323 కోట్ల లావాదేవీలు
2024 జూలై–డిసెంబర్ మధ్య నమోదు
డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ఆధిపత్యమే కొనసాగుతోంది. చెల్లింపుల్లో ఉన్న సౌకర్యంతో యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2024 ద్వితీయార్ధంలో (జూలై–డిసెంబర్) 9,323 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 సంవత్సరం ద్వితీయార్ధంలోని 6,577 కోట్ల లావాదేవీలతో పోల్చి చూస్తే 42 శాతం పెరిగాయి.
విలువ పరంగా పోల్చి చూసినప్పుడు 2023 ద్వితీయ ఆరు నెలల్లో రూ.99.68 లక్షల కోట్ల లావాదేవీలు జరిగితే.. 2024 ద్వితీయార్ధంలో రూ.130.19 లక్షల కోట్లకు చేరాయి. ఈ వివరాలతో వరల్డ్‌లైన్ ఇండియా సంస్థ ‘డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్’ను విడుదల చేసింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ఈ మూడు సంస్థలు యూపీఐ లావాదేవీల్లో అధిక వాటాను కాపాడుకుంటున్నాయి. గత డిసెంబర్ నెల యూపీఐ లావాదేవీల్లో 93 శాతం ఈ మూడు సంస్థల ప్లాట్‌ఫామ్‌ల నుంచే జరిగాయి. విలువ పరంగా 92 శాతంగా ఉంది. యూపీఐ కాకుండా ఇతర డిజిటల్ చెల్లింపుల్లో క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు ఉన్నాయి.
మర్చంట్ చెల్లింపుల్లో అధిక వృద్ధి..
యూపీఐ చెల్లింపులను వ్యక్తుల నుంచి వ్యక్తులకు (పీ2పీ), వ్యక్తుల నుంచి వ్యాపారస్థులకు (పీ2ఎం) అని రెండు విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇందులో పీ2పీ లావాదేవీల సంఖ్య 2023 ద్వితీయ ఆరు నెలల్లో 2704 కోట్లుగా ఉంటే, 2024 ద్వితీయ ఆరు నెలల్లో 3,521 కోట్లకు పెరిగాయి. అంటే 30 శాతం వృద్ధి కనిపించింది. ఇదే కాలంలో పీ2పీ లావాదేవీల విలువ 26 శాతం పెరిగింది.
పీ2ఎం లావాదేవీల సంఖ్య 3,873 కోట్ల నుంచి 5,803 కోట్లకు పెరగ్గా (50 శాతం వృద్ధి).. విలువ పరంగా 43 శాతం వృద్ధి చెందింది. 2024 ద్వితీయ ఆరు నెలల్లో ఒక్కో యూపీఐ లావాదేవీ సగటు విలువ రూ.1,396గా ఉంది. 2023 ద్వితీయ ఆరు నెలల్లో ఉన్న రూ.1,515తో పోల్చితే 8% తగ్గింది. ‘‘భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అసాధారణ వృద్ధిని చూస్తోంది. ఎక్కువ మంది యూపీఐ వినియోగానికి మొగ్గు చూపిస్తున్నారు. పీవోఎస్ సదుపాయాల విస్తరణతోపాటు, మొబైల్ లావాదేవీలకు ప్రాధాన్యం పెరుగుతోంది’’అని వరల్డ్‌లైన్ ఇండియా సీఈవో రమేష్ నరసింహన్ తెలిపారు.