usage
-
రూపాయికి ఆర్బీఐ టానిక్
అంతర్జాతీయంగా రూపాయి వాడకాన్ని ప్రాచుర్యంలోకి తేవడంపై రిజర్వ్ బ్యాంక్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సీమాంతర లావాదేవీలను రూపాయి మారకంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. భారతీయ అదీకృత డీలర్ (ఏడీ) బ్యాంకుల విదేశీ శాఖల్లో, ప్రవాస భారతీయులు (ఎన్నారై) రూపీ అకౌంట్లను తెరిచేందుకు అవకాశం కల్పించింది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు సీమాంతర లావాదేవీలను సులభతరం చేయడానికి తాజా నిబంధనలు ఉపయోగపడగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా దీని వెనుక గణనీయంగానే కసరత్తు జరుగుతోంది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా సహా ఇతర దేశాలతో వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునేందుకు వీలుగా, భారతీయ ఏడీ బ్యాంకుల్లో, ప్రత్యేక రూపీ అకౌంట్లను తెరిచేందుకు విదేశీ బ్యాంకులకు 2022లో ఆర్బీఐ అనుమతినిచ్చింది. ఆ తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ బాస్కెట్లో చేర్చడం సహా రూపాయిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అనుసరించతగిన మార్గదర్శ ప్రణాళికను సూచిస్తూ 2023లో ఆర్బీఐ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలోనూ, స్థానిక కరెన్సీల్లోనూ సెటిల్ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. అలాగే, ఎన్నారైలకి రూపాయి మారకం ఖాతాలను తెరిచేందుకు వీలు కల్పించాలని సూచించింది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ వీటన్నింటికి కొనసాగింపుగానే భావించవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంకర్లు ఏమంటారంటే.. ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయంగా వాణిజ్యంలో రూపాయి వాడకాన్ని ప్రోత్సహించడమే అయినప్పటికీ, రూపాయి నాన్–కన్వర్టబుల్ కరెన్సీ కావడం వల్ల ఎక్కువగా లావాదేవీలు జరగకపోవచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తానికి వాణిజ్య లావాదేవీల కోసం.. అది కూడా యూఏఈ, తదితర దేశాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రూపాయి మారకంలో సీమాంతర చెల్లింపులు.. ఉదాహరణకు అమెరికాలో ఉంటున్న ఎన్నారై న్యూయార్క్‌లోని ఏడీ బ్యాంకు శాఖలో రూపీ ఖాతా తెరవొచ్చు. ఎగుమతులకి సంబంధించి వచి్చన ఆదాయాలను జమ చేసుకునేందుకు, దిగుమతి చేసుకున్న వాటికి చెల్లింపులు జరిపేందుకు ఈ ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. అంటే.. భారత్‌కి చేసిన ఎగుమతులకు సంబంధించి వచ్చిన నిధులను ఆ అకౌంట్లో రూపాయి మారకంలో ఉంచుకోవచ్చు. భారత్‌లో ఉన్న వ్యక్తికి రూపాయి మారకంలో వ్యాపారపరమైన చెల్లింపులను జరిపేందుకు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. –సాక్షి, బిజినెస్ డెస్క్ -
రెండేళ్లలో ఈవీల వినియోగం వేగవంతం..
చెన్నై: దేశీయంగా ఈ రెండేళ్లలో (2025, 2026) విద్యుత్ ప్యాసింజర్ వాహనాల వినియోగం మరింత వేగవంతమవుతుందని హ్యుందాయ్ మోటర్ ఇండియా (హెచ్ఎంఐఎల్) సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో విద్యుత్ వాహనాల వినియోగం ప్రారంభ స్థాయిలో 2.4 శాతం స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది 17 శాతానికి చేరవచ్చనే అంచనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పెద్ద బ్రాండ్లు మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుండటం ఇందుకు దోహదపడగలదని తెలిపారు. విద్యుత్ వాహనాల వినియోగ వృద్ధికి తమ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా తోడ్పడగలదన్నారు. హ్యుందాయ్ సంస్థ భవిష్యత్తులో నాలుగు ఈవీలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీని ధర రూ. 15–25 లక్షల శ్రేణిలో ఉండొచ్చని అంచనా. అటు మారుతీ సుజుకీ ఇండియా తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ’ఈ–విటారా’ను ఆవిష్కరించనుంది. మరోవైపు, చార్జింగ్ సదుపాయాలకు సంబంధించి 10,000 చార్జింగ్ పాయింట్ల వివరాలతో ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, దీన్ని ఇతర వాహనదారులు కూడా వినియోగించుకోవచ్చని గార్గ్ చెప్పారు. వీటిలో 7,500 పాయింట్లలో యాప్ ద్వారా నేరుగా చెల్లింపులు జరిపే సదుపాయం ఉందన్నారు. ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్–విజయవాడ, ముంబై–పుణె తదితర హైవేల్లోని 30 చార్జింగ్ స్టేషన్లలో 80 ఫాస్ట్ చార్జర్లను ఇన్స్టాల్ చేసినట్లు గార్గ్ వివరించారు. -
భారత్.. ఆంగ్లంలో అందరికంటే మిన్నగా..
న్యూఢిల్లీ: ఇంగ్లిష్ భాష మాట్లాడటంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లోనే ఆంగ్లభాష వినియోగం అధికంగా ఉందని పియర్సన్ నివేదికలో వెల్లడైంది. ఇంగ్లిష్ భాష మాట్లాడటంలో ప్రపంచదేశాలు చూపుతున్న ప్రావీణ్యంపై పియర్సన్ సంస్థ రూపొందించిన ‘గ్లోబల్ ఇంగ్లిష్ ప్రొఫీషియన్సీ–2024’నివేదికలో ఇలాంటి పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంలో భారత్, ఫిలిప్సీన్స్, జపాన్, ఈజిప్ట్, కొలంబియా, యూరప్ దేశాల్లో ఇంగ్లిష్ భాష మాట్లాడగల సామర్థ్యంపై నివేదికలో ఎక్కువ వివరాలు ఉన్నాయి. వేర్వేరు దేశాల్లో దాదాపు 7,50,000 మందిలో ఆంగ్లభాషపై పట్టు, పాండిత్యాన్ని అధ్యయనకారులు పరీక్షించారు. ఈ మేరకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని అంచనావేసే వెర్సాంట్ టెస్ట్‌ను చేశారు. ఇందులో ఇంగ్లిష్ భాషానైపుణ్యం విషయంలో ప్రపంచ వ్యాప్త సగటు 57 స్కోర్‌కాగా భారత్‌లో ఇది 52గా నమోదైంది. అయితే దేశాలవారీగా చూస్తే ఇంగ్లిష్‌లో మాట్లాడే సంఖ్య పరంగా చూస్తే ప్రపంచ సగటు 54 స్కోర్‌తో పోలిస్తే భారత స్కోర్ ఏకంగా 57 ఉండటం విశేషం. ఇంగ్లిష్‌లో రాయగల సామర్థ్యానికి సంబంధించిన ప్రపంచ సగటు స్కోర్ 61కాగా భారత స్కోర్ సైతం 61 కావడం ఆశ్చర్యకరం. రాష్ట్రాలవారీగా ఢిల్లీ టాప్రాష్ట్రాలవారీగా చూస్తే 63 స్కోర్‌తో ఢిల్లీ అగ్రస్థానంలో, రాజస్థాన్(60), పంజాబ్(58) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ‘‘ప్రస్తుత ఆర్థికమయ ప్రపంచంలో ఇంగ్లిష్ సామర్థ్యం కేవలం ఒక నైపుణ్యంకాదు అదొక చక్కటి ఆస్తిగా మారింది. వ్యాపారవేత్తలు తమ సంస్థలో ఉద్యోగ నియామకాల, సిబ్బందిని మెరుగుపర్చుకునే క్రమంలో వారికి ఈ ఇంగ్లిష్ నైపుణ్య సంబంధ సమాచారం ఎంతో దోహదపడుతోంది. అంచనా తప్పి తక్కువ అర్హత ఉన్న ఉద్యోగిని పొరపాటున నియమించుకోవడం, తద్వారా సంస్థ విశ్వసనీయ దెబ్బతినడం వంటి తప్పులు జరక్కుండా ఇప్పుడు భారతీయ వ్యాపారవేత్తలు మరింత మెరుగ్గా వ్యవహరిస్తున్నారు. డిజిటల్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అంతర్జాతీయ వ్యాపార సత్సంబంధాలకు పెంపుకు దోహదపడేలా ఇంగ్లిష్‌లో రాయగలిగేలా సిబ్బంది నియమించుకుంటున్నారు. ఆర్థిక, బ్యాంకింగ్ రంగాల్లో ప్రపంచ సగటు 56 స్కోర్‌ను మించి భారత స్కోర్ 63 ఉండటం ఇందుకు నిదర్శనం ’’అని పియర్సన్ ఇంగ్లిస్ లాంగ్వేజ్ లెరి్నంగ్ డివిజన్ అధ్యక్షుడు గోవనీ గోవానెల్లీ అన్నారు. భారత్‌లో ఇంగ్లిష్ నైపుణ్యానికి సంబంధించిన మార్కెట్ పెరిగిందని, భవిష్యత్‌లో ఇది మరింత విస్తరించనుందని ఆయన చెప్పారు. అయితే భారత్‌లో ఆరోగ్యసంరక్షణ రంగంలో స్కోర్ మరీ తక్కువగా 45 వద్దే ఆగిపోయింది. టెక్నాలజీ, కన్సలి్టంగ్, బీపీఓ సేవలకు సంబంధించిన స్కోర్ చాలా మెరుగ్గా ఉండటం విశేషం. -
పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది. -
ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం
హెచ్-1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ సంస్కరణల విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్'(Elon Musk) మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్-1బీ వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.స్పేస్ ఎక్స్ఎం, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా.. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్-1బీ వీసా (H-1B Visa) అని మస్క్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల కారణంగానే దేశం బలమైన దేశంగా అవతరించింది. కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్నవారు ఓ అడుగు వెనక్కి వేయండి అని టెస్లా బాస్ అన్నారు.నిజానికి హెచ్-1బీ వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.The reason I’m in America along with so many critical people who built SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B.Take a big step back and FUCK YOURSELF in the face. I will go to war on this issue the likes of which you cannot…— Elon Musk (@elonmusk) December 28, 2024త్వరలో ప్రారంభం కానున్న ట్రంప్ క్యాబినెట్‌లోని.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కో-హెడ్స్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాల ద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అమలు చేయనున్నారు. దీనిపై కూడా కొన్ని వ్యతిరేఖ నినాదాలు వినిపిస్తున్నాయి.10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలుఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది. ఇందులో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం. -
రోజుకు 12వేల కొత్త కార్లు
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.నివేదికలో మరిన్ని వివరాలు.. → భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది. → 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది. → ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. → భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది. → సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది. → రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. → భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. → 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. → వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి. -
IBM Report: దేశీయంగా మెజారిటీ సంస్థల్లో ఏఐ వినియోగం
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా మటుకు పెద్ద కంపెనీలు (1,000 మందికి పైగా ఉద్యోగులున్నవి) కృత్రిమ మేథను (ఏఐ) వినియోగిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో పాల్గొ్న్న వాటిల్లో దాదాపు 59 శాతం సంస్థలు ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపాయి. ఐబీఎం గ్లోబల్ ఏఐ వినియోగ సూచీ 2023 ప్రకారం ఇప్పటికే ఏఐ వినియోగిస్తున్న కంపెనీల్లో 74 శాతం సంస్థలు గడిచిన 24 నెలల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు, ఉద్యోగులకు శిక్షణపై గణనీయంగా పెట్టుబడులు పెంచాయి. ఏఐ వినియోగానికి సంబంధించి సరైన నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం, నైతికతపరమైన అంశాలు సవాళ్లుగా ఉంటున్నాయి. వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోవడంలో ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ‘భారతీయ సంస్థల్లో ఏఐ వినియోగం, దానిపై పెట్టుబడులు పెట్టడం తద్వారా సానుకూల ప్రయోజనాలు పొందుతూ ఉండటం ఒక శుభ సంకేతం. ఇప్పటికీ కాస్త సందేహిస్తున్న చాలా మటుకు వ్యాపారాలు ఇకనైనా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. కృత్రిమ మేథ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే డేటా, ఏఐ గవర్నెన్స్ కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. గవర్నెన్స్ సాధనాలను ఉపయోగించకపోతే ఏఐ వల్ల కంపెనీలకు డేటా గోప్యత, లీగల్పరమైన సవాళ్లు, నైతికతపరమైన సందిగ్ధత వంటి సమస్యలు ఎదురు కావచ్చని సందీప్ పటేల్ వివరించారు. భారత్, ఆ్రస్టేలియా, కెనడా తదితర దేశాలకు చెందిన 8,584 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌పై ఐబీఎం ఈ సర్వే నిర్వహించింది. -
Rice Water రైస్ వాటర్ మ్యాజిక్ నిజమేనా? లేక జిమ్మిక్కా?
ఆధునిక కాలంలో అందమైన ముఖం, చక్కటి జుట్టు, గ్లోయింగ్ స్కిన్ కోసం రకరకాల ఉత్పత్తులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీనికి తోడు అనేక గృహచిట్కాలు కూడా తరచూ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటర్నెట్లో ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న వీడియోలకు కొదవలేదు. మరి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..! సోషల్ మీడియా ప్రకారం రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే.. బియ్యాన్ని నీటిలో శుభ్రంగా, మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంటెడ్ వాటర్‌తో ముఖాన్ని మృదువుగా కడుక్కోవాలి. అలాగే బియ్యం వాటర్‌తో కడిగిన తరువాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ముఖం డ్రైగా మారే అవకాశం ఉంది. ♦ ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకొని, సాధారణ ఉష్టోగ్రతకు వచ్చిన తరువాత జుట్టుకు కూడా అప్లయ్ చేసుకొని, తరువాత కెమికల్స్‌లేని షాంపూతో తలంటుకోవాలి. దీని తరువాత కండీషన్ అప్లై చేయాలి. ♦ రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా చర్మం నూతనంగా ఉంటుంది. ముఖంపై మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. నిపుణులు ఏమంటున్నారు? జపాన్, చైనా కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతారు. ఇందులో రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ ప్రధానంగా ఉన్నాయి. అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు వరిలో పోషకాలు పుష్కలంగాఉన్నప్పటికీ,చర్మం, జుట్టుకు ఉపయోగపడుతుందనడానికి పరిశోధన, ఆధారాలు లేవని ఆడుబాన్ డెర్మటాలజీ బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డియర్డ్రే హూపర్ చెప్పారు. అయితే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి జుట్టుకు ట్రీట్మెంట్గా ఉపయోగించడం కొత్తది కాదు. వేలాది సంవత్సరాలుగా అనేక ఆసియా దేశాలలో నివసిస్తున్న ప్రజలు బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. వారి పొడవాటి జుట్టుకి కారణం పులియబెట్టిన బియ్యం నీరే అని చెబుతారు. 1000 సంవత్సరంలో జపనీస్ మహిళలు యు-సు-రు లేదా కడిగిన బియ్యం నీళ్లతో జుట్టును వాష్ చేసుకునేవారట. బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ , నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే బియ్యం నీటిలో ఫినాల్స్ ఉంటాయి. ఇది అలోపేసియా అరేటా చికిత్సలో సహాయపడుతుంది. కానీ కొంతమందిలోమాత్రం పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు బియ్యం నిల్వ ఉండేందుకు కొన్ని రకాల పౌడర్లు కలుపుతారు. ఇవి చర్మానికి హాని కరం హానికరం. రైస్ వాటర్‌లోని స్టార్చ్‌తో జుట్టు పెళుసుబారుతుంది వెంట్రుకలను బియ్యం నీటిలో కడుక్కోవడం వల్ల చిక్కు జుట్టు సులభంగా విరిగిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్లోని డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రోండా ఫరా చెప్పారు. రైస్ వాటర్‌లో ఉంటే స్టార్చ్, తేమను పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు పెళుసుగా మారుతుందట. అలాగే ప్రాసెస్ చేసిన బియ్యంతో తయారు చేసిన బియ్యం నీరు ఏ మేరకు ఉపయోపడుతుందో తేల్చ లేమన్నారు. సిల్కీ జుట్టు కారణాలు పలు అంశాలపై అధారపడి ఉంటాయని అంతేకాదు ఒక్కో మనిషి జుట్టు రకం భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే వైద్య చిట్కాలు పనిచేయని కూడా నిపుణులు చెబుతున్నారు. నోట్: ఇంటర్నెట్లో దొరికే సమాచారం అంతా నిజమని నమ్మలేం. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలనుకుంటే, ఒత్తైన జుట్టు కావాలనుకుంటే (ఇది వారి జీన్స్ ఆధారితమైంది కూడా అనేది గమనించాలి) జీవన శైలి మార్పులు అవసరం. ఒత్తిడికి దూరంగా ఉంటూ, చుండ్రుకు చికిత్స చేయడం, హెయిర్ డ్రైయ్యర్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. సురక్షితమైన, సహజమైన రైస్ బ్రాన్ మినరల్ ఎక్స్ట్రాక్ట్ ఉత్పత్తులను వాడుకోవచ్చు. -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్‌కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
‘సామాజిక’ దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి
న్యూఢిల్లీ: అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోయేకంటే కాస్తంత సేపు వాటిని పక్కనబెడితే మానసిక ఆరోగ్యంతోపాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రూహర్–యూనివర్సిటీ బూచమ్, జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ► సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆర్యోగం మెరుగవడంతోపాటు వృత్తిజీవితం పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు ► సోషల్‌మీడియాలో ఆన్లైన్లో లేనపుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట ► ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పని చేసిన వాళ్లు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్‌మీడియా పక్కనబెడితే ‘అతిపని’ భావన కొంచెం తగ్గిందట ► పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్లు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు ► రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్‌మీడియాలో గడిపేవారిపై అధ్యయనం చేశారు ► అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా, మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరంపెట్టారు ► ఒక ఏడు రోజుల తర్వాత వారి పనిభారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది? వంటి ప్రశ్నలడిగి విశ్లేíÙంచారు. ► దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వే గాలను ‘సోషల్ మీడియా’ ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది ► కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు. ► వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇవిలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది. -
‘ఉప్పు’ వీరులు పురుషులే.. సర్వేలో ఆసక్తికర విషయాలు!
రోడ్డు పక్కన వేడివేడి పకోడీ, మిరపకాయ బజ్జీ, సమోసా మొదలుకుని మంట కింద మసాలా దాకా. ఇలా బయట ఏం తిన్నా మనలో చాలామందికి కాస్త ఉప్పు గట్టిగా పడాల్సిందే. ఇంట్లో కూడా కూరలు మొదలుకుని తెలుగు వారికే ప్రత్యేకమైన నానా రకాల పచ్చళ్ల దాకా అన్నింట్లోనూ ఉప్పు కాస్త ఎక్కువగా వేయనిదే ముద్ద దిగని వాళ్లు చాలామందే ఉన్నారు. ఇలా సగటు భారతీయుడు రోజూ ఎడాపెడా ఉప్పు తినేస్తున్నా డట. ఈ క్రమంలో నిర్ధారిత మోతాదును ఎప్పుడో దాటేశాడని తాజా అధ్యయ నం ఒకటి తేల్చింది...ఆరోగ్య వంతుడైన వ్యక్తి ఆహారంలో రోజుకు 5 గ్రాములు, అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారతీయులు మాత్రం రోజుకు ఏకంగా 8 గ్రాములు లాగించేస్తున్నారు! జర్నల్ నేచర్ పోర్టుఫోలియో తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ మేరకు తేలింది. ఇలా చేశారు... జాతీయ అంటేతర వ్యాధుల పర్యవేక్షణ సర్వేకు సేకరించిన శాంపిల్‌నే ఈ సర్వేకు ఆధారంగా తీసుకున్నారు. ► వారిలో 3,000 మంది వయోజనులను రాండమ్‌గా ఎంచుకున్నారు. ► ఉప్పులో కీలకంగా ఉండే సోడియం మోతాదు వారి మూత్రంలో ఏ మేరకు ఉందో పరిశీలించారు. ► అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని పోల్చి చూశారు. ► వారందరూ మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది! ‘ఉప్పు’ వీరులు పురుషులే! సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి... ► అన్ని సామాజిక వర్గాల వారూ ఉప్పు చాలా ఎక్కువగా తింటున్నారు. అయితే ఈ విషయంలో మహిళలతో పోలిస్తే పురుషులదే పైచేయి. ► మహిళలు రోజుకు 7.9 గ్రాముల ఉప్పు తింటుంటే పురుషులు 8.9 గ్రాములు లాగిస్తున్నారు! ► ఉద్యోగులు 8.6 గ్రాములు, పొగ తాగేవారు 8.3 గ్రాములు, హై బీపీ ఉన్నవారు 8.5 గ్రాముల ఉప్పు తింటున్నారని తేలింది. ► ఇక ఊబకాయులైతే ఏకంగా రోజుకు 9.3 గ్రాముల ఉప్పు తినేస్తున్నారు. ► వీరితో పోలిస్తే నిరుద్యోగులు, పొగ తాగని వారు, బీపీ, ఊబకాయం లేనివారు ఉప్పు తక్కువ తీసుకుంటున్నట్టు తేలడం విశేషం! సోడియం కథా కమామిషు... ► నరాలు, కండరాల పనితీరుకు సోడియం చాలా అవసరం. అలాగని ఒంట్లో దాని స్థాయి మితిమీరకూడదు కూడా. ► ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవాలి. ► అంతకంటే ఎక్కువైతే హైబీపీ, హైపర్ టెన్షన్ వంటివాటికి దారితీస్తుంది. ► సోడియం పరిమాణం తక్కువగా ఉన్న ఉప్పు తినడం ఆరోగ్యవంతులకు మంచిదే. కానీ షుగర్ పేషెంట్లు, ► హృద్రోగులు తదితరులకు రక్తంలో హెచ్చు పొటాషియం హైపర్ కలేమియాకు దారి తీస్తుంది. దానివల్ల కండరాలు బలహీనపడతాయి. అంతేగాక పల్స్, గుండె కొట్టుకునే వేగం కూడా పడిపోతాయి! ► సోడియం ఎక్కువగా ఉండే తిండి హై బీపీ, హైపర్ టెన్షన్ రిస్కును బాగా పెంచుతుందని ఈ అధ్యయనం మరోసారి తేల్చింది. ► అవి చివరికి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివాటికి దారితీసి ప్రాణాంతకంగా మారతాయి. ► అందుకే ఆరోగ్యవంతులైనా, మరొకరైనా ఆహారంలో ఉప్పు మోతాదు వీలైనంత తగ్గించడమే మంచిది. ‘మనమంతా ఆహారంలో ఉప్పును రోజుకు కనీసం 1.2 గ్రాముల మేరకు తగ్గిస్తే చాలు. హైబీపీ కేసులు సగానికి సగం తగ్గిపోతాయి! కనుక ఆహారంలో ఉప్పును తగ్గించుకోవాల్సిన ఆవశ్యకతపై అందరిలోనూ, ముఖ్యంగా భారతీయుల్లో అవగాహన పెరిగేలా ప్రచార తదితర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది’ – డాక్టర్ ప్రశాంత్ మాథుర్, అధ్యయనకర్త, డైరెక్టర్, ఐసీఎంఆర్– నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్, ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రాభవం కోల్పోతున్న డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: యూపీఐ అత్యంత సౌకర్యవంతమైన చెల్లింపుల సాధనంగా మారిపోవడంతో, ఇంత కాలం సంపద్రాయ చెల్లింపుల్లో సింహభాగం ఆక్రమించిన డెబిట్ కార్డ్ చిన్నబోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాతి నుంచి డిజిటల్ చెల్లింపుల్లో సమూల మార్పు కనిపిస్తోంది. వర్తకుల చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలకు సైతం యూపీఐని ఎక్కువ మంది అనుసరిస్తున్నారు. ఈ వివరాలను ఆర్బీఐ వెల్లడించింది. 2020 జూలైలో డెబిట్ కార్డులపై చేసిన చెల్లింపుల విలువ రూ.2.81 లక్షల కోట్లు. 2023 జూలైలో డెబిట్ కార్డుల చెల్లింపుల విలువ రూ.3.15 లక్షల కోట్లుగా ఉంది. అంటే మూడేళ్లలో వృద్ధి 12 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో యూపీఐ చెల్లింపుల్లో ఎన్నో రెట్ల వృద్ధి నమోదైంది. ఈ కాలంలో యూపీఐ చెల్లింపుల విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి రూ.15.33 లక్షల కోట్లకు దూసుకుపోయింది. ఇది 428 శాతం వృద్ధికి సమానం. చిన్న మొత్తాల చెల్లింపుల్లో యూపీఐకి ఉన్న సౌలభ్యంతో డెబిట్ కార్డు చెల్లింపులపై ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఎన్నో సానుకూలతలు.. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో యూపీఐ లావాదేవీలు మొదటి సారి 1000 కోట్లను అధిగమించాయి. విలువ రూ.15 లక్షల కోట్లుగా ఉంది. 2020 జూలై నాటికి బ్యాంకులు 85 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. వీటి సంఖ్య తాజాగా 97 కోట్లను అధిగమించాయి. ఈ వృద్ధి కూడా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాలకు అనుబంధంగా ఉచితంగా డెబిట్ కార్డులు జారీ చేయడం వల్లేనని చెప్పుకోవాలి. ముఖ్యంగా యూపీఐ లావాదేవీలు ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చార్జీల్లేకపోవడం, వేగంగా, సౌకర్యంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తరణ ఇందుకు దోహదం చేసినట్టు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అనికేత్ దని తెలిపారు. కేంద్రం డిజిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడంతో యూపీఐ చెల్లింపులు ఇక ముందూ జోరుగా కొనసాగుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. వచ్చే 18–24 నెలల్లో 2,000 కోట్ల నెలవారీ యూపీఐ లావాదేవీలు నమోదు కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డుకూ ఆదరణ మరోవైపు క్రెడిట్ కార్డు చెల్లింపులు కూడా గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2020 జూలైలో 0.45 లక్ష కోట్ల విలువైన లావాదేవీలు నమోదు కాగా, 2023 జూలై నెలకు రూ.1.45 లక్షల కోట్ల వినియోగం నమోదైంది. ‘‘రివార్డుల రూపంలో వచ్చే ప్రయోజనాలను పొందేందుకు, క్యాష్ బ్యాక్ లేదా తగ్గింపు ప్రయోజనాల కోసం ఎక్కువ మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గ్రోసరీ, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు తదితర పెద్ద చెల్లింపులకు క్రెడిట్ కార్డుల రూపంలో చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల వారు పలు రకాల ప్రయోజనాలు పొందే అవకాశం వారిని ఈ దిశగా ప్రోత్సహిస్తోంది’’అని పైసాబజార్ క్రెడిట్ కార్డ్ హెడ్ రోహిత్ చిబార్ తెలిపారు. కో బ్రాండెడ్ కార్డులు సైతం మొత్తం మీద క్రెడిట్ కార్డుల వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. కరోనా అనంతరం వినియోగదారుల వ్యయాల్లో వచి్చన మార్పులను గమనించిన బ్యాంకర్లు పలు రకాల ఆకర్షణీయమైన రివార్డులతో కస్టమర్లకు క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుండడం కూడా ఈ వృద్ధిని ప్రోత్సహిస్తోంది. -
రికార్డు స్థాయిలో ‘క్రెడిట్ కార్డ్’ వినియోగం
ముంబై: క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డులపై రూ.1.4 లక్షల కోట్లు వ్యయం చేయడమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్ కార్డులపై బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండగా, ఈ ఏడాది ప్రతీ నెలా 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నట్టు ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్ కార్డుల సంఖ్య 50 లక్షలకు పైగా పెరిగింది. మే చివరికి మొత్తం 8.74 కోట్లకు కార్డుల సంఖ్య చేరింది. కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డుల్లో 20 లక్షల యూజర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే గణనీయంగా వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్ (వినియోగంలో ఉన్నవి) క్రెడిట్ కార్డుల సంఖ్య 8.24 కోట్లు కాగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచి్చంది. 2022–23లో ఏడాది అంతటా క్రెడిట్ కార్డులపై వినియోగం ప్రతి నెలా సగటున రూ.1.1–1.2 లక్షల కోట్లుగా ఉంటూ వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలకు వచ్చే సరికి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కార్డుపై సగటు వ్యయం రూ.16,144గా ఉంది. మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మే చివరి నాటికి 1.81 కోట్ల కార్డులతో (వినియోగంలో ఉన్న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు రుణాల పరంగానూ 28.5 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్బీఐ కార్డ్ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.46 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో, 1,62,150 లక్షల కొత్త కార్డులు యాక్సిస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోకు తోడయ్యాయి. మరోవైపు క్రెడిట్ కార్డు రుణాలు గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో, ఈ విభాగంలో నిరర్థక ఆస్తులు (వసూలు కాని బకాయిలు/ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి 2.94 శాతానికి చేరినట్టు ఇటీవలే ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించడం గమనార్హం. -
కృత్రిమ మేధను తలచుకొంటే నిద్రలేని రాత్రులే.. గూగుల్ సీఈఓ సుందర్
వాషింగ్టన్: కృత్రిమ మేధను సరిగా వాడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. ముప్పు నుంచి బయటపడాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉండాలని చెప్పారు. కృత్రిమ మేధ వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి తలచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో పిచాయ్ చెప్పారు. ఈ టెక్నాలజీ ప్రయోజనకరమైన రీతిలో ఉపయోగించుకొనేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఐతో అసత్య సమాచారాన్ని సృష్టించే వీలుందని, ఇది సమాజానికి ప్రమాదకరమని అన్నారు. అణ్వాయుధాలను నియంత్రిస్తున్న తరహాలోనే ఏఐని నియంత్రించడానికి ఒక అంతర్జాతీయ కార్యాచరణ అవసరమని అభిప్రాయపడ్డారు. -
క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!
ప్రస్తుత డిజిటల్ యుగంలో డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డు ఉండటం చాలా అవసరంగానూ సర్వసాధారణంగానూ మారిపోయింది. లావాదేవీల పరంగా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండూ దాదాపు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. అయితే వాటికి కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి ఖర్చు చేయడానికి డెబిట్ కార్డ్ ఉపయోగపడితే, ఖాతాలో డబ్బులేకపోయినా, లిమిట్ మేరకు తక్షణ అవసరాలకు వాడుకుని భవిష్యత్తు చెల్లింపు సూత్రంపై క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి క్రెడిట్ స్కోర్. క్రెడిట్ కార్డ్‌ని షాపింగ్ చేయడానికి, అవుట్లెట్లలో చెల్లింపులకు, ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి, ఏటీఎం నగదును విత్‌డ్రా చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ నగదు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ లేదా బ్యాంకు క్రెడిట్ పరిమితి నుండి లోన్‌గా లభిస్తుంది. లావాదేవీ జరిగిన తేదీ నుండి గరిష్టంగా 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిలో లోన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అయితే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే భారీ షాక్ తప్పదు. క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వోచర్లను సంపాదించవచ్చు. ఈ పాయింట్లు క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ నుండి ఆకర్షణీయమైన బహుమతులు, షాపింగ్ వోచర్ల ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో ఉపయోగించక పోతే క్రెడిట్ కార్డ్ తిప్పలు తప్పవు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నివారించాల్సిన అత్యంత సాధారణ తప్పులను చూద్దాం. సకాలంలో చెల్లింపులు క్రెడిట్ కార్డ్ గడువు తేదీని అస్సలు మిస్‌కాకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్లో మొత్తం ఖర్చులపై 48 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని అనుమతి ఉంటుంది. దీని ఆధారంగా ప్రతి నెల నిర్దిష్ట తేదీలోపు బకాయిలను క్లియర్ చేయాలి. గడువు తర్వాత బకాయి మొత్తంపై వడ్డీ బాదుడు ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో.. సకాలంలో బిల్ చెల్లించలేకపోతే, క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. భవిష్యత్తులో లోన్ పొందే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు) చెల్లించాల్సిన కనీస మొత్తం, వడ్డీ వివరాలు పూర్తిగా చూడాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మొత్తం లోన్ అమౌంట్ చెల్లించలేక, ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే ఈ మెయిల్ ద్వారా అందించే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ను పూర్తిగా చదవాలి. ఇందులో లోన్లపై వివరాలు, వడ్డీ, చెల్లించాల్సిన మినిమం నగదు లాంటి వివరాలు పరిశీలించాలి. ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో పేర్కొన్న అన్ని లావాదేవీలు ఖచ్చితమైనవేనా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పొరబాటు లేదా మోసపూరిత లావాదేవీ జరిగినట్లయితే క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్‌లు వడ్డీ ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, వార్షిక రుసుములు మొదలైన అనేక ఛార్జీలుంటాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో అలాంటి ఛార్జీలు ఏవైనా ఉంటే, అన్యాయమని భావిస్తే వాటిపై ప్రశ్నించవచ్చు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నగదు విత్‌డ్రా అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసరమైతే తప్ప దీన్ని వాడ కుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఇలాంటి నగదు అడ్వాన్సులపై అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. అంతేకాదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ షురూ అవుతుంది. అంతేకాకుండా, రుణ మొత్తం పెరుగుతూనే ఉండి చివరికి బిల్లును తడిసి మోపెడవుతుంది. క్రెడిట్ లిమిట్ మించకుండా క్రెడిట్ కార్డ్ వాడేటపుడు మన లిమిట్‌ను ఖచ్చితంగా గమనించాలి. క్రెడిట్ రేషియోలో 50శాతం లేదా అంతకంటే తక్కువ వాడటం ఉత్తమం. ఇలాంటి వాటిల్లో తేడా వస్తే క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా దెబ్బ తింటుంది. అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డ్ భారతదేశంలో అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు నిబంధనలు, షరతులు, ఛార్జీలు, ఫీచర్లు, ప్రయోజనాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ఉదాహరణకు విమాన టిక్కెట్లు ,హోటల్స్బుక్ చేసుకోవడానికి అదనపు ప్రయోజనా లందించే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ సదుపాయం ఉన్న క్రెడిట్ కార్డ్ కోసం కూడా వెతకవచ్చు, తద్వారా ఇతర క్రెడిట్ కార్డ్‌ల నుండి తక్కువ వడ్డీ రేట్లకు లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు. చివరగా: క్రెడిట్ కార్డ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, కానీ వాటిని తెలివిగా వాడితేనే ఫలితం. లేదంటే అనవసరమైన అప్పులు చిక్కులు తెచ్చిపెడతాయి. అన్నింటికంటే మించి, అవసరాలకు సరిపోయే సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. నిర్లక్ష్యంగా అవకాశం ఉంది కదా అని ఎలాంటి ప్లాన్స్ లేకుండా వాడేస్తే ఆ తరువాత వాటిని చెల్లించలేక నానా అగచాట్లు పడాలి. వడ్డీకి వడ్డీకి పెరిగి పెద్ద గుదిబండలాగా మెడకు చుట్టుకుంటుంది. (బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) -
ఈ20 ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో తగు స్థాయిలో ఇంధనం అందుబాటులో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇథనాల్ ఉత్పత్తిని మరింతగా పెంచడంపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 31 నగరాల్లో 100 బంకుల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఈ20 ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. అంతా సక్రమంగా సాగితే ఈ ఇంధన వినియోగం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ అదనపు కార్యదర్శి సుబోధ్ కుమార్ తెలిపారు. దీంతో చక్కెర తరహాలోనే 2023–24 ఇథనాల్ సంవత్సరానికి గాను (డిసెంబర్–నవంబర్) ఇథనాల్ నిల్వలను పెంచుకునే యోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇథనాల్ ఉత్పత్తి కోసం మరింతగా చక్కెరను మళ్లించే అవకాశం ఉందని వివరించారు. ఫిబ్రవరి ఆఖరు నాటి వరకూ 120 కోట్ల లీటర్ల పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపినట్లు కుమార్ చెప్పారు. ఇథనాల్ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యాలు ఈ ఏడాది లక్ష్యాల సాధనకు సరిపడేంత స్థాయిలో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమకు ప్రోత్సాహం.. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం ద్వారా క్రూడాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం 20 శాతంగా ఉంటే దాన్ని ఈ20 ఇంధనంగా వ్యవహరిస్తారు. 2001ల నుంచి దీనికి సంబంధించి ప్రయోగాలు జరుగుతున్నాయి. గతేడాది 10.02 శాతం ఇథనాల్‌ను కలిపిన పెట్రోల్‌ను వినియోగంలోకి తెచ్చారు. 2022–23 ఇథనాల్ సంవత్సరంలో (డిసెంబర్–నవంబర్) దీన్ని 12 శాతానికి, వచ్చే ఏడాది 15 శాతానికి పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికల్లా దీన్ని 20 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యం గడువును కుదించుకుని 2025 నాటికే సాధించాలని నిర్దేశించుకుంది. ప్రస్తుత ఏడాదికి గాను 50 లక్షల టన్నుల చక్కెరను ఇథనాల్ ఉత్పత్తి కోసం మళ్లించనున్నారు. వచ్చే ఏడాది నిర్దేశించుకున్న 15 శాతం మిశ్రమ లక్ష్య సాధన కోసం అదనంగా 150 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరమవుతుందని అంచనా. దీనితో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ చక్కెర మిల్లులు, డిస్టిలరీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 243 ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించగా, బ్యాంకులు రూ. 20,334 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. వచ్చే 9–10 నెలల్లో అదనంగా 250–300 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రాగలదని అంచనా. -
యూసేజ్ ఫీజు సహేతుకమే
న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీస్ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్ ఇన్ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్ వ్యాఖ్యానించారు. లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్వర్క్ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు. -
స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మానవ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్‌ఫోన్స్ అండ్ దెయిర్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ రిలేషన్షిప్స్–2022’అనే అంశంపై వీవో–సైబర్ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ స్విచ్ఛాఫ్ స్టడీలో వెలువరించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్‌తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. తమతో కాకుండా ఫోన్‌తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుంటారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయాలను అధ్యయనం వెల్లడించింది. ముఖ్యాంశాలు ►అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది. ►స్మార్ట్ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది. ►తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. ►స్మార్ట్ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది. అంగీకారం. ►అతిగా ఫోన్ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం ►ఫోన్ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది. ►భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది. ►లివింగ్‌రూమ్‌లో స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం ►రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం ►జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం ►తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు ►రిలాక్స్ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. స్క్రీన్‌టైమ్‌పై స్వీయ నియంత్రణ అవసరం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్ సీకింగ్ డివైస్’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్రూమ్లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్‌ఫోన్ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఇవాళ్టి(జులై1, శుక్రవారం) నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో ఏయే వస్తువులపై నిషేధం విధించారో.. ఉల్లంఘిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్)లపై నిషేధం అమలులోకి వచ్చింది. ప్రత్యామ్నాయాలుగా.. పేపర్, జూట్, గ్లాస్, చెక్క, బంక, స్టెయిన్లెస్ స్టీల్, వెదురు.. ఇతరత్ర పర్యావరణానికి నష్టం కలిగించని వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2021 ప్రకారం.. పైవాటిపై నిషేధం అమలులోకి వచ్చింది. వీటిని ఉల్లంఘిస్తే.. నిబంధనలను ఉల్లంఘిస్తే.. తయారు చేయడం, అమ్మకాలు, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం..వీటిలో ఏదైనా సరే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హమే. ఐదేళ్ల వరకు గరిష్ఠ జైలుశిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఉల్లంఘనలు కొనసాగిస్తే.. అదనంగా ప్రతీ రోజూ ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని నేషనల్ కంట్రోల్ రూమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. దాని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్లతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తారు. -
పిల్లలకు వాటిని దూరం చేయండి.. లేదంటే రాత్రి నిద్రపోయే ముందు పడకపై..
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్... ఆధునిక యుగంలో మనుషుల శరీరంలో ఒక అవయవంగా మారిపోయిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కోవిడ్–19 మహమ్మారి రంగప్రవేశం చేశాక స్మార్ట్ఫోన్ల బెడద మరింత పెరిగింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో పిల్లలు సైతం ఈ ఫోన్లకు అలవాటుపడ్డారు. ఎంతగా అంటే.. మన దేశంలో 23.8 శాతం మంది పిల్లలు పడుకునే ముందు పడకపై ఫోన్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ఫోన్లు ఉపయోగిస్తున్న చిన్నారుల్లో 37.15 శాతం మందిలో ఏకాగ్రత స్థాయిలు తగ్గిపోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టిన అధ్యయనాన్ని బట్టి చూస్తే.. భారత్‌లో 23.80 శాతం మంది రాత్రిపూట నిద్రపోయే ముందు పడకపై స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. 37.15 శాతం మంది చిన్నారుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకంవల్ల ఎల్లప్పుడూ లేదా తరచుగా ఏకాగ్రతా స్థాయిలు తగ్గుతున్నాయి. -
తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్.. ఈ సారి ఏకంగా..
కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్లు పరిపాలన ఏమోగానీ తమ నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విదేశీ కరెన్సీపై తాలిబన్లు నిషేధం విధించారు. దీంతో ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండగా , ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత జఠిలంగా తయారుకానుంది. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్గనిస్తాన్ వెళ్లినప్పటినుంచి అంతర్జాతీయ సమాజం తాలిబాన్ల పరిపాలనను ప్రభుత్వంగా గుర్తించడానికి నిరాకరించింది. మరో వైపు ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో బ్యాంకులు నగదు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు పరిపాలనంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం లాంటివి గాక కేవలం తమకు తెలిసిన రాక్షస పాలన, ఏకాధిపత్య నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తూ వస్తున్నారు తాలిబన్లు. ఈ పరిస్థితిలో స్వదేశీ వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలుపుతూ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. దేశంలో ఆర్థిక పరిస్థితి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్గన్లందరూ ఇకపకై ప్రతి లావాదేవీలను ఆఫ్గనిస్తాన్ కరెన్సీలోనే చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపాడు. చదవండి: China: చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటనకు కారణం కోవిడా? ఆహార కొరతా? -
Telangana: కృష్ణా వినియోగం తక్కువే
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో కృష్ణా నదీజలాల వినియోగం తక్కువగా ఉంది. మూడు నెలల వ్యవధిలో మొత్తంగా 58 టీఎంసీ ల నీటిని మాత్రమే వినియోగించుకోగలిగింది. ప్రస్తుత సీజన్‌కు సైతం ప్రధాన ఎత్తిపోతల పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద మాత్రమే ఇప్పటివరకు గరిష్ట జలాల వినియోగం జరిగినట్లు రికార్దులు చెబుతున్నాయి. వరద జలాలు ఒడిసి పట్టలేక.. కృష్ణా బేసిన్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర నికర జలాల కేటాయింపులున్న విషయం తెలిసిందే. ఈ వాటాలకు అనుగుణంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉండగా, వరద జలాలపై ఆధారపడి తెలంగాణ నెట్టెంపాడు(20 టీఎంసీలు), కల్వకుర్తి (40 టీఎంసీలు), ఏఎంఆర్పీ (30 టీఎంసీలు), పాలమూరు–రంగారెడ్డి (90 టీఎంసీ లు), డిండి (30 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు కాకపోవడంతో కృష్ణా బేసిన్లో ఎంత నీరొచ్చినా, దానిని రెండు రాష్ట్రాలు 66ః34 నిష్పత్తిలో వాడు కోవాలని నిర్ణయించుకున్నాయి. తమకు వచ్చే వాటా లకు అనుగుణంగా నీటిని రాష్ట్రాలు తమ పరీవా హకంలో ఎక్కడైనా వినియోగించుకునేలా ఒప్పందం చేసుకుని ఆ మేరకు వాడుకుంటున్నాయి. ఈ విధంగా గత మూడు నెలల్లో కృష్ణా బేసిన్లో ఏపీ 113 టీఎంసీలు వినియోగించుకోగా తెలంగాణ 58 టీఎంసీ లు మాత్రమే వినియోగించుకుందని కృష్ణా బోర్డుకు సమర్పించిన లెక్కల్లో తెలంగాణ పేర్కొంది. సాగర్ ఎడమ కాల్వ కింద 14.68 టీఎంసీల వినియోగం జరగ్గా, జూరాల కింద 8, నెట్టెంపాడు కింద 4, బీమా కింద 4.60, కోయిల్‌సాగర్ కింద 2, కల్వ కుర్తి కింద 5 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించింది. వీటితోపాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు, ఏఎంఆర్పీ కింది అవసరాలకు కలిపి మరో 11 టీఎంసీల మేర నీటిని వాడగా, మధ్యతరహా ప్రాజెక్టుల కింద వినియోగం మరో 3 టీఎంసీల మేర ఉంది. కల్వకుర్తి కింది మూడు దశల్లో పూర్తి స్థాయిలో జరగని ఎత్తిపోతలకు తోడు, నిల్వలు చేసేందుకు రిజర్వాయర్లు లేక పోవడం, పాలమూరు, డిండి ప్రాజెక్టుల నిర్మాణం పాక్షికంగా అయినా పూర్తి కాకపోవడంతో నీటినిల్వకు అవకాశం లేకుండా పోయింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీ గా వరదలు వస్తున్నా ఒడిసి పట్టలేక పోయింది. దీంతో ఈ ఏడాది 205 టీఎంసీల నీరు వృ«థాగా సముద్రం లోకి వెళ్లింది. గతేడాది కృష్ణా జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డులు సృష్టించాయి. గత ఏడాది సీజన్ ఏపీ 647.559, తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకున్నాయి. -
శుభవార్త: త్వరలోనే నాలుగో వ్యాక్సిన్?!
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి అనే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా డిమాండ్‌కు తగినంత సరఫరా లేక వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ ఊరట నందించే కబురు చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ `జైకోవ్-డి` భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులకు దరఖాస్తు చేయనుంది. అంతేకాదు త్వరలోనే అనుమతులు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది. తమ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి భారతదేశంలో ఆమోదం పొందే సమయం చాలా దగ్గరలోనే ఉందని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ తెలిపారు. ఈ నెలలో అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతులు కూడా ఈ నెలలోనే లభించనున్నాయనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. తమ పెయిన్లెస్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే నెలకు కోటి మోతాదులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందన్నారు. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, జూలై నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని పటేల్ తెలిపారు. ఇంట్రాడెర్మల్ ఇంజెక్షన్ ద్వారా అందించే ఈ వ్యాక్సిన్ 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య నిల్వ చేయవలసి ఉన్నప్పటికీ, 25 డిగ్రీల సెల్సియస్ రూం టెంపరేచర్ వద్ద కూడా స్టోర్ చేయవచ్చని, నిర్వహించడం చాలా సులభమని పటేల్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 28 వేల మందిపై `జైకోవ్-డీ’ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను సంస్థ ప్రారంభించిందనీ, ఈ నెలలోనే దీనికి సంబంధించిన మధ్యంతర ఫలితాలు రానున్నాయని చెప్పారు. అంతేకాదు 12-17 ఏళ్లలోపు పిల్లలను కూడా ఇందులో చేర్చినట్టు తెలిపారు. ఈ మూడు డోసుల టీకా వల్ల యాంటీ బాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని కంపెనీ చెబుతోంది. మేడిన్ ఇండియా టీకా ఉత్పత్తికి ఇప్పటికే మరో రెండు తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది. తద్వారా నెలకు 3-4 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యం. దీనికి అమోదం లభిస్తే జైకోవ్-డీ దేశంలో నాలుగో వ్యాక్సిన్ అవుతుంది. చదవండి : కోవిన్ యాప్: కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే! -
జాగ్రత్త సుమ! ఇలా వాడితే మీ సెల్‌ఫోన్ సేఫ్..
ఇటీవల సెల్‌ఫోన్ వాడకం అన్నది ఎంత సాధారణమైన అంశంగా మారిందో మనకు తెలియంది కాదు. ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబ సభ్యుడికీ మొబైల్‌ఫోన్ ఉండనే ఉంటుంది. అందరకూ ఒకేసారి ఉపయోగించకపోయినా... ఒకరు కాకపోతే మరొకరు సెల్‌ఫోన్‌ను ఉపయోగిస్తూనే ఉంటారూ. ఇలాంటి వేళల్లో సెల్‌ఫోన్ నుంచి రేడియేషన్ వచ్చే మాట నిజమే. సెల్ టవర్‌కు దూరంగా ఉన్నప్పుడు, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు, కాల్ కనెక్ట్ అవడానికి ప్రయత్నం జరుగుతున్నప్పుడు రేడియేషన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడులో గడ్డలు వస్తాయన్న అపోహలు చాలామందిలో ఉన్నాయి. అయితే సెల్‌ఫోన్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పడానికి ఇంతవరకు కచ్చితమైన ఆధారాలు ఏమీ లభించలేదు. అయినా ముందుజాగ్రత్తగా కొన్ని సూచనలు పాటిస్తే సెల్‌ఫోన్‌ను సేఫ్‌గా ఉపయోగించినట్లవుతుంది. వీలున్న అన్ని సందర్భాలలో సాధారణ ఫోన్స్ (లైన్డ్ ఫోన్స్)లో మాట్లాడాలి. సెల్‌ఫోన్ సంభాషణలు క్లుప్తంగా ఉండేట్లు చూసుకోవాలి. చాలాసేపు సెల్‌ఫోన్ వాడటం తప్పనిసరి అయినప్పుడు హెడ్‌ఫోన్స్ వాడటం మంచిది. ఒకవేళ హెడ్‌ఫోన్స్ వాడని సందర్భాల్లో... సెల్‌ఫోన్‌ను మరీ చెవికి ఆనించి దగ్గరగా పెట్టుకోవడం కాకుండా కొద్ది సెంటీమీటర్లు దూరంలో ఉంచుకొని మాట్లాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రింగ్ చేసిన నెంబరు, కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే సెల్‌ఫోన్‌ను చెవి వద్దకు తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలతో పాటు... రోజు మొత్తం మీద కాల్స్ కలిసి, మూడునాలుగు గంటలు దాటుతున్నట్లు గమనిస్తే సెల్‌ఫోన్ వాడకాన్ని ప్రత్యేకంగా నియంత్రించడం మంచిది. వీలైన సందర్భాల్లో ఎస్ఎంఎస్, చాటింగ్, యాప్ బేస్డ్ మెసేజింగ్, డేటా సర్చింగ్ వంటి అవసరాలకు మాత్రమే సెల్‌ఫోన్‌ను పరిమితం చేయాలి. -
భారీగా తగ్గిన ఇంధన వినియోగం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఎకానమీ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో దేశీయంగా ఇంధన వినియోగం గణనీయంగా పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం క్షీణించింది. ఇంధన వినియోగం ఇంతగా తగ్గడం 1998–99 ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే ప్రథ మం. 2019–20లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 214.12 మిలియన్ టన్నులుగా ఉండగా 2020–21లో ఇది 194.63 మిలియన్ టన్నులకు క్షీణించింది. చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన డేటాలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అత్యధికంగా డీజిల్ తగ్గుదల .. దేశీయంగా అత్యధికంగా ఉపయోగించే ఇంధనమైన డీజిల్ వినియోగం 12 శాతం తగ్గి 72.72 మిలియన్ టన్నులుగా నమోదైంది. పెట్రోల్ డిమాండ్ 6.7 శాతం క్షీణించి 27.95 మిలియన్ టన్నులకు పరిమితమైంది. వంట గ్యాస్ ఎల్పీజీ వినియోగం మాత్రమే 4.7 శాతం పెరిగి 26.33 మిలియన్ టన్నుల నుంచి 27.59 మిలియన్ టన్నులకు చేరింది. కరోనా వైరస్ మహమ్మారి ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొంత మేర సిలిండర్లను ఉచితంగా ఇవ్వడం ఇందుకు దోహదపడింది. మరోవైపు, విమానయాన సంస్థలు చాలా భాగం మూతబడే ఉండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) డిమాండ్ 53.6 శాతం క్షీణించి 3.7 మిలియన్ టన్నులకు పరిమింతమైంది. నాఫ్తా అమ్మకాలు దాదాపు అంతక్రితం ఆర్థిక సంవత్సరం స్థాయిలో 14.2 మిలియన్ టన్నులుగా ఉండగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బిటుమెన్ వినియోగం 6 శాతం పెరిగి 7.11 మిలియన్ టన్నులకు చేరింది. ఎకానమీకి ఊతమిచ్చే దిశగా కేంద్రం నిర్మాణ కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవడం ఇందుకు దోహదపడింది. క్రమంగా కోవిడ్ పూర్వ స్థాయికి.. లాక్‌డౌన్‌ను కఠినతరంగా అమలు చేయడంతో గతేడాది ఏప్రిల్‌లో ఇంధన వినియోగం సగానికి సగం పడిపోయింది. ఆంక్షలను సడలించే కొద్దీ క్రమంగా కోలుకోవడం మొదలైంది. గతేడాది సెప్టెంబర్‌లో పెట్రోల్ అమ్మకాలు తిరిగి కోవిడ్–19 పూర్వ స్థాయికి చేరుకోగా, ఆ తర్వాత నెలల్లో పండుగ సీజన్‌తో డీజిల్ విక్రయాలు కూడా పుంజుకున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో ఇంధనానికి డిమాండ్ ఏకంగా 18 శాతం ఎగిసి 18.77 మిలియన్ టన్నులకు చేరింది. డీజిల్ వినియోగం అత్యధికంగా 27 శాతం, పెట్రోల్‌కు డిమాండ్ 25.7 శాతం ఎగిసింది. గత మార్చిలో బేస్ స్థాయి తక్కువగా ఉండటం కూడా ఇందుకు కొంత కారణమైంది. లాక్‌డౌన్‌పరమైన ఆంక్షలు గతేడాది మార్చి ఆఖరు నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.