Rice Water రైస్‌ వాటర్‌ మ్యాజిక్‌ నిజమేనా? లేక జిమ్మిక్కా?  | Does Rice Water Help With Hair Growth and skin check Dermatologists opinion | Sakshi
Sakshi News home page

రైస్‌ వాటర్‌ మ్యాజిక్‌ నిజమేనా? లేక జిమ్మిక్కా? 

Published Wed, Feb 21 2024 4:15 PM | Last Updated on Wed, Feb 21 2024 4:30 PM

Does Rice Water Help With Hair Growth and skin check Dermatologists opinion - Sakshi

ఆధునిక కాలంలో  అందమైన ముఖం, చక్కటి జుట్టు,  గ్లోయింగ్‌  స్కిన్‌ కోసం రకరకాల ఉత్పత్తులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీనికి తోడు అనేక గృహచిట్కాలు కూడా తరచూ పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సంరక్షణలో రైస్ వాటర్ కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని నమ్మకం. ఇంటర్నెట్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్న వీడియోలకు కొదవలేదు.  మరి నిపుణులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..!

సోషల్‌ మీడియా ప్రకారం రైస్ వాటర్ తయారు చేసి ముఖానికి అప్లై చేయాలంటే..
బియ్యాన్ని నీటిలో శుభ్రంగా,  మూడుసార్లు కడిగి మూడోసారి నీటిని నిల్వ చేసి ఉంచుకోవాలి. ఇలా ఫెర్మెంటెడ్‌ వాటర్‌తో ముఖాన్ని మృదువుగా కడుక్కోవాలి.  అలాగే బియ్యం వాటర్‌తో కడిగిన తరువాత మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. లేదంటే ముఖం డ్రైగా మారే అవకాశం ఉంది.

ఈ బియ్యం నీటిని దాదాపు 2 వారాల పాటు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకొని, సాధారణ ఉష్టోగ్రతకు వచ్చిన తరువాత  జుట్టుకు కూడా అప్లయ్‌ చేసుకొని, తరువాత కెమికల్స్‌లేని షాంపూతో తలంటుకోవాలి. దీని తరువాత కండీషన్‌ అప్లై చేయాలి. 

రైస్ వాటర్ చర్మానికి ఒకటి కాదు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాల కారణంగా  చర్మం  నూతనంగా ఉంటుంది.  ముఖంపై మచ్చలను తొలగించడం, వడదెబ్బ నుండి ఉపశమనం కలిగించడం వంటి ఉపయోగాలను అందిస్తుంది. 

 నిపుణులు ఏమంటున్నారు?
జపాన్‌, చైనా  కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తారని చెబుతారు. ఇందులో రైస్ వాటర్ టోనర్, ఫేస్ వాష్, రైస్ ఫ్లోర్ ఫేస్ మాస్క్, క్రీమ్ ప్రధానంగా ఉన్నాయి. 

అయితే బియ్యం కడిగిన నీటిని ముఖానికి జుట్టుకు వాడితే సైడ్ ఎఫెక్ట్స్  కూడా ఉంటాయంటున్నారు చర్మవ్యాధి నిపుణులు వరిలో పోషకాలు పుష్కలంగాఉన్నప్పటికీ,చర్మం, జుట్టుకు ఉపయోగపడుతుందనడానికి పరిశోధన, ఆధారాలు లేవని  ఆడుబాన్ డెర్మటాలజీ బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ డియర్డ్రే హూపర్ చెప్పారు. 

అయితే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి జుట్టుకు ట్రీట్‌మెంట్‌గా ఉపయోగించడం కొత్తది కాదు. వేలాది సంవత్సరాలుగా అనేక ఆసియా దేశాలలో నివసిస్తున్న ప్రజలు బియ్యం నీటిని ఉపయోగిస్తున్నారు. వారి పొడవాటి జుట్టుకి కారణం పులియబెట్టిన బియ్యం నీరే అని చెబుతారు.  1000 సంవత్సరంలో జపనీస్ మహిళలు యు-సు-రు లేదా కడిగిన బియ్యం నీళ్లతో జుట్టును వాష్‌  చేసుకునేవారట.

బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, థయామిన్ , నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి. అలాగే బియ్యం నీటిలో ఫినాల్స్ ఉంటాయి. ఇది అలోపేసియా అరేటా చికిత్సలో సహాయపడుతుంది. కానీ కొంతమందిలోమాత్రం పరిస్థితిని మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు బియ్యం నిల్వ ఉండేందుకు కొన్ని రకాల పౌడర్లు కలుపుతారు.  ఇవి చర్మానికి హాని కరం హానికరం.

రైస్ వాటర్‌లోని స్టార్చ్‌తో జుట్టు పెళుసుబారుతుంది
వెంట్రుకలను బియ్యం నీటిలో కడుక్కోవడం వల్ల  చిక్కు జుట్టు సులభంగా విరిగిపోయే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా మెడికల్ స్కూల్‌లోని డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ రోండా ఫరా చెప్పారు. రైస్ వాటర్‌లో  ఉంటే  స్టార్చ్,  తేమను  పీల్చేసుకుంటుంది. తద్వారా జుట్టు పెళుసుగా మారుతుందట.

అలాగే ప్రాసెస్ చేసిన బియ్యంతో తయారు చేసిన బియ్యం నీరు ఏ మేరకు ఉపయోపడుతుందో తేల్చ లేమన్నారు. సిల్కీ జుట్టు కారణాలు పలు అంశాలపై అధారపడి ఉంటాయని అంతేకాదు ఒక్కో మనిషి జుట్టు రకం భిన్నంగా ఉంటాయని, అందరికీ ఒకే వైద్య చిట్కాలు పనిచేయని కూడా నిపుణులు చెబుతున్నారు. 

నోట్‌: ఇంటర్నెట్‌లో దొరికే సమాచారం అంతా నిజమని నమ్మలేం. ఈ నేపథ్యంలో ఎవరైనా తమ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవాలనుకుంటే,  ఒత్తైన జుట్టు కావాలనుకుంటే (ఇది వారి జీన్స్‌ ఆధారితమైంది కూడా అనేది గమనించాలి)  జీవన శైలి మార్పులు అవసరం. ఒత్తిడికి దూరంగా ఉంటూ,  చుండ్రుకు చికిత్స చేయడం, హెయిర్‌ డ్రైయ్యర్‌ లాంటి వాటికి  దూరంగా ఉండాలి. సురక్షితమైన, సహజమైన  రైస్ బ్రాన్ మినరల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉత్పత్తులను వాడుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement