ప్రస్తుత డిజిటల్ యుగంలో డెబిట్ కార్డులు , క్రెడిట్ కార్డు ఉండటం చాలా అవసరంగానూ సర్వసాధారణంగానూ మారిపోయింది. లావాదేవీల పరంగా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు రెండూ దాదాపు ఒకే పద్ధతిలో పనిచేస్తాయి. అయితే వాటికి కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుండి ఖర్చు చేయడానికి డెబిట్ కార్డ్ ఉపయోగపడితే, ఖాతాలో డబ్బులేకపోయినా, లిమిట్ మేరకు తక్షణ అవసరాలకు వాడుకుని భవిష్యత్తు చెల్లింపు సూత్రంపై క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. అలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా లభించే అతిపెద్ద ప్రయోజనాల్లో ఒకటి క్రెడిట్ స్కోర్.
క్రెడిట్ కార్డ్‌ని షాపింగ్ చేయడానికి, అవుట్‌లెట్‌లలో చెల్లింపులకు, ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి, ఏటీఎం నగదును విత్‌డ్రా చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ నగదు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా, క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ లేదా బ్యాంకు క్రెడిట్ పరిమితి నుండి లోన్‌గా లభిస్తుంది. లావాదేవీ జరిగిన తేదీ నుండి గరిష్టంగా 50 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిలో లోన్‌ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అయితే ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవాలి. లేదంటే భారీ షాక్ తప్పదు.
క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లకు రివార్డ్ పాయింట్‌లు, క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ వోచర్‌లను సంపాదించవచ్చు. ఈ పాయింట్లు క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్ నుండి ఆకర్షణీయమైన బహుమతులు, షాపింగ్ వోచర్‌ల ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు. అయితే క్రమశిక్షణతో ఉపయోగించక పోతే క్రెడిట్ కార్డ్ తిప్పలు తప్పవు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు నివారించాల్సిన అత్యంత సాధారణ తప్పులను చూద్దాం.
సకాలంలో చెల్లింపులు
క్రెడిట్ కార్డ్ గడువు తేదీని అస్సలు మిస్‌కాకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్‌లో మొత్తం ఖర్చులపై 48 రోజుల వరకు వడ్డీ రహిత వ్యవధిని అనుమతి ఉంటుంది. దీని ఆధారంగా ప్రతి నెల నిర్దిష్ట తేదీలోపు బకాయిలను క్లియర్ చేయాలి. గడువు తర్వాత బకాయి మొత్తంపై వడ్డీ బాదుడు ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో.. సకాలంలో బిల్ చెల్లించలేకపోతే, క్రెడిట్ స్కోర్ దెబ్బ తింటుంది. భవిష్యత్తులో లోన్ పొందే అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. (రాధిక మర్చంట్, ఫ్రెండ్ ఒర్రీ: ఈ టీషర్ట్, షార్ట్ విలువ తెలిస్తే షాకవుతారు)
చెల్లించాల్సిన కనీస మొత్తం, వడ్డీ వివరాలు పూర్తిగా చూడాలి
ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మొత్తం లోన్ అమౌంట్ చెల్లించలేక, ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే ఈ మెయిల్ ద్వారా అందించే క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను పూర్తిగా చదవాలి. ఇందులో లోన్లపై వివరాలు, వడ్డీ, చెల్లించాల్సిన మినిమం నగదు లాంటి వివరాలు పరిశీలించాలి.
ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది తనిఖీ చేసుకోవాలి
క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న అన్ని లావాదేవీలు ఖచ్చితమైనవేనా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా పొరబాటు లేదా మోసపూరిత లావాదేవీ జరిగినట్లయితే క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. అలాగే క్రెడిట్ కార్డ్‌లు వడ్డీ ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు, ఆలస్య చెల్లింపు రుసుములు, వార్షిక రుసుములు మొదలైన అనేక ఛార్జీలుంటాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో అలాంటి ఛార్జీలు ఏవైనా ఉంటే, అన్యాయమని భావిస్తే వాటిపై ప్రశ్నించవచ్చు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ)
క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణ
క్రెడిట్ కార్డ్ ద్వారా ఏటీఎం నగదు విత్‌డ్రా అవకాశం ఉన్నప్పటికీ, అత్యవసరమైతే తప్ప దీన్ని వాడ కుండా ఉండటమే బెటర్. ఎందుకంటే ఇలాంటి నగదు అడ్వాన్సులపై అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తాయి. అంతేకాదు ఉపసంహరించుకున్న వెంటనే వడ్డీ షురూ అవుతుంది. అంతేకాకుండా, రుణ మొత్తం పెరుగుతూనే ఉండి చివరికి బిల్లును తడిసి మోపెడవుతుంది.
క్రెడిట్ లిమిట్ మించకుండా
క్రెడిట్ కార్డ్ వాడేటపుడు మన లిమిట్‌ను ఖచ్చితంగా గమనించాలి. క్రెడిట్ రేషియోలో 50శాతం లేదా అంతకంటే తక్కువ వాడటం ఉత్తమం. ఇలాంటి వాటిల్లో తేడా వస్తే క్రెడిట్ స్కోర్‌ను గణనీయంగా దెబ్బ తింటుంది.
అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డ్
భారతదేశంలో అనేక బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCలు) క్రెడిట్ కార్డ్‌లను అందిస్తున్నాయి. సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు నిబంధనలు, షరతులు, ఛార్జీలు, ఫీచర్లు, ప్రయోజనాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ఉదాహరణకు విమాన టిక్కెట్లు ,హోటల్స్‌బుక్ చేసుకోవడానికి అదనపు ప్రయోజనా లందించే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ సదుపాయం ఉన్న క్రెడిట్ కార్డ్ కోసం కూడా వెతకవచ్చు, తద్వారా ఇతర క్రెడిట్ కార్డ్‌ల నుండి తక్కువ వడ్డీ రేట్లకు లోన్ బ్యాలెన్స్‌ను బదిలీ చేయవచ్చు.
చివరగా: క్రెడిట్ కార్డ్‌లు చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, కానీ వాటిని తెలివిగా వాడితేనే ఫలితం. లేదంటే అనవసరమైన అప్పులు చిక్కులు తెచ్చిపెడతాయి. అన్నింటికంటే మించి, అవసరాలకు సరిపోయే సరైన క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకోవాలి. నిర్లక్ష్యంగా అవకాశం ఉంది కదా అని ఎలాంటి ప్లాన్స్ లేకుండా వాడేస్తే ఆ తరువాత వాటిని చెల్లించలేక నానా అగచాట్లు పడాలి. వడ్డీకి వడ్డీకి పెరిగి పెద్ద గుదిబండలాగా మెడకు చుట్టుకుంటుంది. (బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?)
Comments
Please login to add a commentAdd a comment