మొత్తం మెక్సికోను మించి ఏసీల విద్యుత్ వినియోగం
2035 నాటికి భారత్‌పై ఐఈఏ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది.
భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.
నివేదికలో మరిన్ని వివరాలు..
→ భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది.
→ 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది.
→ ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది.
→ భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది.
→ సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్‌స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది.
→ రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి.
→ భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.
→ 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది.
→ వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment