కరెంటు కాల్చేస్తున్నారు... | Increased Electricity Usage In Vizianagaram District | Sakshi
Sakshi News home page

కరెంటు కాల్చేస్తున్నారు...

Published Mon, Aug 19 2019 9:13 AM | Last Updated on Mon, Aug 19 2019 9:18 AM

Increased Electricity Usage In Vizianagaram District - Sakshi

వర్షాకాలం వచ్చేసి అప్పుడే రెండు నెలలవుతోంది. వాతావరణం  చల్ల బడి విద్యుత్‌ వినియోగం తగ్గాలి. కానీ జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు.  వాతావరణం ఏమాత్రం చల్లబడలేదు. వేసవి పరిస్థితులే కొనసాగుతున్నాయి. దీనివల్ల ఏసీలు... కూలర్లు... వంటివి ఏమాత్రం ఆగట్లేదు. ఫలితంగా విద్యుత్‌ వినియోగం భారీగానే పెరుగుతోంది. దీనికి తోడు ఆశించిన వర్షాలు లేక వ్యవసాయానికి తప్పనిసరిగా మోటార్లు అధిక సంఖ్యలో వినియోగించడం కూడా మరో కారణం.  మొత్తమ్మీద విద్యుత్‌ను హద్దు... పద్దు లేకుండా వాడకంవల్ల కొరత ఏర్పడే ప్రమాదమూ లేకపోలేదు.

విజయనగరం మున్సిపాలిటీ: ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో జిల్లాలో పొడి వాతావరణమే కొనసాగుతోంది. అరకొర వర్షాలతో వాతావరణం నేటికీ చల్లబడలేదు. ఆగస్టులోనూ వేడిమి వేసవిని తలపిస్తోంది. ఉదయం 10 గంటల నుం చి ఎండతో వేడి గాలులు వీస్తున్నాయి. పగలూ, రాత్రీ తేడా లేకుండా అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. తీవ్ర ఉక్కపోత ప్రభావంతో కూలర్లు, ఏసీల వినియోగం నేటికీ తగ్గలేదు. దీనివల్ల విద్యుత్తుకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. అధికారిక లెక్కల ప్రకారం చెప్పాలంటే రోజుకు జిల్లా వాసులు 72 లక్షల యూనిట్లకుపైగా విద్యుత్‌ను విని యోగించేస్తున్నారు. ఈ ఏడాది మండు వేసవి లో 63 లక్షల నుంచి 65 లక్షల యూనిట్లు విద్యుత్‌వినియోగం కాగా... వర్షాకాలంలో తగ్గుముఖం పట్టాల్సిన వినియోగం అందుకు భిన్నంగా మరో 7 లక్షల యూనిట్లకు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమే. మరో వైపు ఆశించిన వర్షాలు లేక వ్యవసాయ విద్యుత్‌ సర్వీసుల నుంచి డిమాండ్‌ పెరగటం వల్లే ఇంత మొత్తంలో విద్యుత్‌ వినియోగం పెరిగిందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు.

వర్షాకాలంలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు..
జిల్లాలో ఏటా జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలు కురుస్తుంటాయి. వాతావరణం చల్లబడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పడిపోయేవి. ఈ ఏడాది కనిష్ఠంగా 26 డిగ్రీలు, గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోవుతోంది. జూలై నెలలో  గరిష్టంగా 37 నుంచి 38 డిగ్రీలు కూ డా నమోదవడం విశేషం. ఉక్కపోత వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అం దువల్ల ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. గృహ, వాణిజ్యావసరాల విద్యుత్తు వినియోగం భారీగా నమోదవుతోం ది. వర్షాలు లేక వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. జిల్లాలో ప్రస్తుతం కూరగాయలు, ఉద్యాన పంటలు, కొన్ని ప్రాం తాల్లో నారుమడులు, ఇతర వ్యవసాయ అవసరాలకు కొంతమేర విద్యుత్తు వినియోగిస్తున్నా రు. వ్యవసాయ విద్యుత్తు వాడకం మరో నాలు గు రోజుల్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మరింత ఒత్తిడి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌..
ప్రస్తుతం జిల్లాలో విద్యుత్తు డిమాండ్‌ అసాధారణంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 16వ తేదీన 72లక్షల 60వేల యూనిట్ల విద్యుత్‌ వినియోగించారు. జిల్లాలో ఉన్న 6.30 లక్షల విద్యుత్‌ సర్వీసులు ఏపీఈపీడీసీఎల్‌ సంస్థ మాత్రం 60లక్షల 36 వేల యూనిట్లను మాత్రమే రోజు వారీగా కేటాయిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఉన్న కేటాయింపులకన్నా హెచ్చుగా 12లక్షల 24వేల యూనిట్లను వినియోగించేస్తున్నారన్నమాట. ఏపీఈపీడీసీఎల్‌ విజయనగరం ఆపరేషన్‌ సర్కిల్‌ ఆవిర్భావం తరువాత ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ వినియోగించటం ఈ ఏడాదేనన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు.  అధికారిక లెక్కల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలు, మరల రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో ఎక్కువగా విద్యుత్‌ వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వినియోగదారులకు అవసరమయ్యే విద్యుత్‌ కన్నా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఉండటంతో ఇబ్బందులు ఉం డవన్న ధీమా అధికారుల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు సంబంధించి మాచ్‌ఖండ్, సీలేరు, సింహాచలం, వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి విద్యుత్‌ కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాలు లేవని నిరంతరాయ సరఫరా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు.

 అనధికారిక కోతలు...?
విద్యుత్తు అసాధారణ డిమాండ్, వర్షాలు లేకపోవడంతో జిల్లాలో అనధికారిక కోతలు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. నగరం, జిల్లాలోని పట్టణాల పరిధిలో కొంతమేర నయమే అయినా పల్లె ప్రాంతాల కు విద్యుత్తు సరఫరా చేసే పలు ఉపకేంద్రాల పరిధిలో గంటల తరబడి విద్యుత్తు నిలిపివేస్తున్నారని తెలుస్తోంది.

వినియోగం గణనీయంగా పెరిగింది.. 
జిల్లాలో పొడి వాతావరణం కారణంగా గృహ, వాణిజ్య విద్యుత్తు వినియోగం భారీ గా పెరిగింది. సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేవు. వినియోగం భారీగా నమోదయ్యే ఉపకేంద్రాల సామర్థ్యం పెంచాం. ఎక్కడైనా సరఫరాకు అంతరాయం కలిగి నా వెంటనే పునరుద్ధరిస్తున్నాం. ప్రతి ఒక్క రు కూలర్‌లు, ఏసీలు, ఫ్రిజ్‌లు వాడుతున్నారు. వినియోగదారులు కోరే డిమాండ్‌ ను ఎదర్కొనగలిగే సామర్ధ్యం ఉంది. అయి తే వినియోగదారులు అవసరం లేని సమయంలో విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించి పొదుపు పాటించాలి. 
–వై.విష్ణు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ,  విజయనగరం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement