అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు కసరత్తు
విదేశాల్లోని భారతీయ బ్యాంకు శాఖల్లో రూపీ ఖాతాలు తెరిచేందుకు అనుమతి
ట్రేడర్లు, ఇన్వెస్టర్ల లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యం
అంతర్జాతీయంగా రూపాయి వాడకాన్ని ప్రాచుర్యంలోకి తేవడంపై రిజర్వ్ బ్యాంక్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా సీమాంతర లావాదేవీలను రూపాయి మారకంలో నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేసింది. భారతీయ అదీకృత డీలర్ (ఏడీ) బ్యాంకుల విదేశీ శాఖల్లో, ప్రవాస భారతీయులు (ఎన్నారై) రూపీ అకౌంట్లను తెరిచేందుకు అవకాశం కల్పించింది.
ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు సీమాంతర లావాదేవీలను సులభతరం చేయడానికి తాజా నిబంధనలు ఉపయోగపడగలవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత కొన్నాళ్లుగా దీని వెనుక గణనీయంగానే కసరత్తు జరుగుతోంది. అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా సహా ఇతర దేశాలతో వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో సెటిల్ చేసుకునేందుకు వీలుగా, భారతీయ ఏడీ బ్యాంకుల్లో, ప్రత్యేక రూపీ అకౌంట్లను తెరిచేందుకు విదేశీ బ్యాంకులకు 2022లో ఆర్‌బీఐ అనుమతినిచ్చింది.
ఆ తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధి, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ బాస్కెట్‌లో చేర్చడం సహా రూపాయిని అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు అనుసరించతగిన మార్గదర్శ ప్రణాళికను సూచిస్తూ 2023లో ఆర్‌బీఐ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ద్వైపాక్షిక, బహుళపాక్షిక వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలోనూ, స్థానిక కరెన్సీల్లోనూ సెటిల్ చేసుకోవచ్చని సిఫార్సు చేసింది. అలాగే, ఎన్నారైలకి రూపాయి మారకం ఖాతాలను తెరిచేందుకు వీలు కల్పించాలని సూచించింది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ వీటన్నింటికి కొనసాగింపుగానే భావించవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
బ్యాంకర్లు ఏమంటారంటే..
ఈ నిబంధనల ప్రధాన లక్ష్యం.. అంతర్జాతీయంగా వాణిజ్యంలో రూపాయి వాడకాన్ని ప్రోత్సహించడమే అయినప్పటికీ, రూపాయి నాన్–కన్వర్టబుల్ కరెన్సీ కావడం వల్ల ఎక్కువగా లావాదేవీలు జరగకపోవచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తు తానికి వాణిజ్య లావాదేవీల కోసం.. అది కూడా యూఏఈ, తదితర దేశాల్లో
మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
రూపాయి మారకంలో సీమాంతర చెల్లింపులు..
ఉదాహరణకు అమెరికాలో ఉంటున్న ఎన్నారై న్యూయార్క్‌లోని ఏడీ బ్యాంకు శాఖలో రూపీ ఖాతా తెరవొచ్చు. ఎగుమతులకి సంబంధించి వచి్చన ఆదాయాలను జమ చేసుకునేందుకు, దిగుమతి చేసుకున్న వాటికి చెల్లింపులు జరిపేందుకు ఈ ఖాతాలను ఉపయోగించుకోవచ్చు. అంటే.. భారత్‌కి చేసిన ఎగుమతులకు సంబంధించి వచ్చిన నిధులను ఆ అకౌంట్లో రూపాయి మారకంలో ఉంచుకోవచ్చు. భారత్‌లో ఉన్న వ్యక్తికి రూపాయి మారకంలో వ్యాపారపరమైన చెల్లింపులను జరిపేందుకు ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.
–సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment