
3 శాతం నుంచి 7 శాతానికి చేరిక
జ్యుయెలర్ల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం
ఆభరణాల రేట్లు పెరిగే అవకాశం
సాక్షి, బిజినెస్ డెస్క్: జ్యుయలర్లకు బంగారం లీజింగ్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరి నుంచి బంగారం ధర 14 శాతం పైగా పెరిగింది.దీంతో సంఘటిత రిటైల్ జ్యుయలరీ సంస్థలైన టైటాన్, సెంకోగోల్డ్, కల్యాణ్ జ్యుయలర్స్, పీఎన్ గాడ్గిల్ తదితర వాటి మార్జిన్లపై ప్రభావం పడనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ టారిఫ్‌లతో బంగారం లీజింగ్ రేట్లు మరింత పెరుగుతాయని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు.
‘‘వాణిజ్య, టారిఫ్ యుద్ధాలతో బంగారం లీజింగ్ రేట్లు రెట్టింపయ్యాయి. ఇది మార్జిన్లపై ఒత్తిళ్లను పెంచుతోంది. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’అని పీఎన్‌జీ జ్యుయలర్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కిరణ్ ఫిరోదియా తెలిపారు. జ్యుయలరీ సంస్థలు అరువుగా తీసుకునే బంగారంపై వసూలు చేసే రేట్లను గోల్డ్ లీజింగ్ రేట్లుగా చెబుతారు. జ్యుయలర్లు తమకు కావాల్సిన బంగారాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి బదులు బ్యాంక్‌లు, బులియన్ ట్రేడర్ల నుంచి పరిమిత కాలానికి అరువు కింద తెచ్చుకుంటాయి. స్థానిక బ్యాంక్‌లు విదేశీ బ్యాంకుల నుంచి బంగారాన్ని సమకూర్చుకుని.. జ్యుయలరీ వర్తకులకు అరువుగా ఇస్తుంటాయి.
కొంత వేచి చూశాకే నిర్ణయం
తాము మార్చి త్రైమాసికం ముగిసే వరకు వేచి చూసే ధోరణి అనుసరించనున్నట్టు, ఆ తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వస్తామని దేశంలోనే అతిపెద్ద ఆభరణాల రిటైల్ చైన్ టైటాన్ వెల్లడించింది. ‘‘బంగారం లీజింగ్ రేట్లు ఇంకా పెరుగుతాయని సంకేతాలు తెలియజేస్తున్నాయి. సరఫరా ఎలా ఉందన్న దాన్ని అర్థం చేసుకునేందుకు ఒకటి రెండు నెలలు పడుతుంది. అప్పుడే ధరల తీరు తెలుస్తుంది’’అని టైటాన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) విజయ్ గోవిందరాజన్
తెలిపారు.
రేట్ల పెంపు తప్పదా..?
బాడుగ బంగారంపై రేట్లు పెరిగిన నేపథ్యంలో తమ మార్జిన్లను కాపాడుకోవాలంటే జ్యుయలర్లు ఆభరణాల రేట్లను పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు డిమాండ్ లేని సీజన్ కావడంతో రేట్ల పెంపు విషయంలో జ్యుయలర్లు సౌకర్యంగా లేని పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో పండుగలు, వివాహాల కారణంగా కొనుగోళ్లు జోరుగా సాగాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం పెరగడానికి ఎలాంటి అనుకూలతలు లేని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
గోల్డ్ లీజింగ్ రేట్లు పెరగడం తమకు ఆందోళన కలిగిస్తున్నట్టు సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువాంకర్ సేన్ ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ప్రకటించడం గమనార్హం. లీజింగ్ రేట్లు పెరగడం వల్ల తమకు రుణ వ్యయాలు 0.5 శాతం మేర పెరగనున్నట్టు చెప్పారు. తద్వారా ఫిబ్రవరి, మార్చి నెలల్లో 7–8 కోట్ల మేర తమపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఎంసీఎక్స్‌లో బంగారం రేట్లు జనవరి నుంచి 14 శాతానికి పైగా పెరగడం గమనార్హం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్థిక అనిశ్చితులు బంగారం రేట్ల పెరుగుదలకు కారణమవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment