![Special offers from airlines for corporate companies](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/PASSENGERS-FLIGHT--10683102.jpg.webp?itok=Y7HxS_vm)
కంపెనీలకు విమానయాన సంస్థల స్పెషల్ ఆఫర్లు
కొత్త సర్వీసులు, ఫీచర్లు అందుబాటులోకి
ఎస్‌ఎంఈల కోసం ఎయిరిండియా ప్రత్యేక పోర్టల్
ఇండిగో కూడా బిజినెస్ క్లాస్ విభాగంలోకి ఎంట్రీ
ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్‌ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి.
కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్‌లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి.
ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్‌ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్‌పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్‌వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి.
గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రత్యేక సదుపాయాలు..
బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్‌లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.
అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా..
ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్‌లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్‌గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్‌ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది.
తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్‌బైజాన్, జార్జియా, కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment