special offers
-
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్‌ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్‌లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్‌లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్‌లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్‌పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్‌ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్‌లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్‌లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్‌గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బంగారంపై ఆఫర్లు
హైదరాబాద్: పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్ ‘వివాహ ఉత్సవ్’ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాల కొనుగోలుపై 10 గ్రాముల వెండి బార్‌ను ఉచితంగా ఇస్తుంది. డైమండ్లు, అన్ కట్ డైమండ్లు, ఫ్రెషస్ స్టోన్లపై ఫ్లాట్ 25% తగ్గింపు ఇస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు అన్ని జోయాలుక్కాస్ షోరూంల్లో డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. -
‘బంగారానికి వెండి ఉచితం’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దీపావళికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. బంగారు ఆభరణాల బరువుకు సమానమైన వెండిని పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. వజ్రాలపై ప్రతి క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్‌కట్ డైమండ్స్‌పై క్యారెట్‌కు 2 గ్రాముల వెండి, ప్లాటినం ఆభరణాల బరువుకు సమానమైన వెండి ఉచితంగా పొందవచ్చు. అలాగే వెండి వస్తువుల మేకింగ్ చార్జీలపై 25% తగ్గింపు, వెండి ఆభరణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ గరిష్ట విక్రయ ధరపై 10 శాతం తగ్గింపు ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అన్ని షోరూమ్‌ల్లో ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ పండుగ సీజన్లో ‘బంగారానికి వెండి ఉచితం’ ఆఫర్ కస్టమర్లకు మరింత ఆనందాన్ని అందిస్తుందని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. -
బిగ్ ‘సి’ ఉగాది ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ ఉగాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీల కొనుగోలుపై 7.50% వరకు తక్షణ తగ్గింపు అందిస్తుంది. ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో వీటిని కొనుగోలు చేయవచ్చు. మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు సంవత్సరం పూర్తిగా, రెండో ఏటా రూ.8వేల వరకు ‘మొబైల్ ప్రొటెక్షన్’ అదనంగా పొందవచ్చు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51% వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రజలంతా ఉగాది ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ బాలు చౌదరి కోరారు. -
విమానంలో ప్రయాణించాలా.. ఇదిగో స్పెషల్ ఆఫర్స్!
న్యూఢిల్లీ: సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైన స్కూట్ తాజాగా మరిన్ని ఆఫర్లు ప్రకటించింది. వీటి కింద పలు దేశాలకు విమాన ప్రయాణ చార్జీలు అత్యంత తక్కువగా రూ. 7,600 నుండి (వన్ వే) ప్రారంభమవుతాయి. ఈ సేల్ సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది ఆగస్టు వరకు ప్రయాణాలకు వీటిని బుక్ చేసుకోవచ్చు. క్రిస్‌ఫ్లయర్ సభ్యులు టికెట్‌ను కొనుగోలు చేయడం ద్వారా మైల్స్‌ను పొందవచ్చని, వాటిని క్రిస్‌ప్లస్ యాప్‌లో రిడీమ్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆఫర్ ప్రకారం హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాల నుంచి కౌలాలంపూర్‌కు టికెట్ చార్జీ రూ. 8,900 నుండి ప్రారంభమవుతుంది. బాలీ, సింగపూర్, సిడ్నీ తదితర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. -
లలితా జ్యువెల్లరీ అక్షయ తృతీయ ఆఫర్లు
హైదరాబాద్: అక్షయ తృతీయ పండుగ సందర్భంగా లలితా జ్యువెల్లరీ ప్రత్యేకమైన ఆఫర్లు ప్రకటించింది. అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు ఇస్తుంది. వజ్రాభరణాలకు క్యారెట్లో రూ.2000 తగ్గింపు అందిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 24 వరకూ కొనసాగుతుంది. కస్టర్లంతా ఈ అద్భుతమైన ఆఫర్‌ను వినియోగించుకోవాలని కంపెనీ చైర్మన్ ఎం.కిరణ్ కుమార్ తెలిపారు. అందరి ఇళ్లలో బంగారం, వజ్రాలు, వెండి నిండాలని అక్షయ తృతీయ సందర్భంగా కుబేర లక్ష్మీని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్: అదిరిపోయే ఆఫర్లును ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. రూ.50 చెల్లిస్తే..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ పని తీరుతో ఆకట్టుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీ ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. కొత్త ఆఫర్ వచ్చేసింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట సరికొత్త ఆఫర్లను ప్యాసింజర్లకు కోసం తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. టీ-6 ఆఫర్ ఏంటంటే.. మహిళలు, సీనియర్ సిటిజన్ల టీ-6ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. 6 గంటల పాటు (అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) సిటీ ఆర్డినరీ బస్ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎఫ్-24 .. కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల కోసం ఈ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది శనివారం, ఆదివారం, సెలవు దినాలలో వర్తిస్తుంది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌పై 4 వ్యక్తులు రోజంతా సిటీ ఆర్డినరీ బస్ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. వారిలో 55.50 లక్షల మంది T-24 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023 -
Independence Day: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అలాగే ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేవరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అదేరోజు 120 రూపాయలు ఉన్న డేపాస్...కేవలం 75 రూపాయలకే అందించాలని నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 75 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాలకు రెగ్యులర్‌గా ప్రయాణించే 75 మంది ప్రయాణికులకు.. తర్వాత చేసే ప్రయాణానికి సంబంధించిన ఒక ఉచిత టికెట్‌ను అందజేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి పుష్పక్ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు ఆగస్టు 15న 75శాతం ఛార్జీలనే వసూలు చేస్తారు. అలాగే 18వ తేదీన రక్తదాన శిబిరం నిర్వహించి 7 వేల 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచిత హెల్త్ చెకప్‌తో పాటు మందులను అందించనున్నారు. 75 ఏళ్ల లోపు ఉన్న వారికి 750 రూపాయలకే హెల్త్ ప్యాకేజీతో పాటు.. మందులపై 75శాతం మందుల కొనుగోలుపై రాయితీ అందించనున్నారు. చదవండి: నేతిబీరకాయలో నేతి లాంటిదే.. నీతి ఆయోగ్‌లోని నీతి: మంత్రి కేటీఆర్ ట్వీట్ -
స్కూటర్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన యమహా మోటార్స్..!
ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా మోటార్ ఇండియా పలు స్కూటర్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. కాగా ఈ ఆఫర్స్ ఎంపిక చేయబడిన ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండనున్నాయి. ఈ మోడల్స్‌పై..! యమహా మోటార్స్ శ్రేణిలోని హైబ్రిడ్ మోడల్స్‌పై క్యాష్‌బ్యాక్ రానుంది. యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్స్‌పై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్ రానుంది. ఆయా రాష్ట్రాల వారు ఫిబ్రవరి నెల మొత్తం ఈ ఆఫర్‌ను పొందవచ్చును. యమహా అందిస్తోన్న ఆఫర్స్‌లో భాగంగా... Yamaha Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్‌పై అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలు , పశ్చిమ బెంగాల్లో రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. మహారాష్ట్రలో...Fascino 125 FI హైబ్రిడ్, RayZR 125 FI హైబ్రిడ్ స్కూటర్లపై రూ. 2,500 వరకు క్యాష్ బ్యాక్‌ను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లపై తమిళనాడులో రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. ఇక విభిన్న రాష్ట్రాల్లో క్యాష్‌బ్యాక్‌ను యమహా అందిస్తోంది. ఈ హైబ్రిడ్ స్కూటర్స్ 125సీసీ ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజిన్‌తో పనిచేయనున్నాయి. ఇది 6,500 rpm వద్ద 8 bhp సామర్థ్యాన్ని, 5,000 rpm వద్ద 10.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ స్కూటర్లలో హైబ్రిడ్ పవర్ అసిస్ట్ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. SMG ఆన్‌బోర్డ్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది మెరుగైన పుల్లింగ్ పవర్ కోసం అదనపు టార్క్‌ను అందిస్తోంది. Fascino 125 FI హైబ్రిడ్, అలాగే RayZR FI 125 హైబ్రిడ్ స్కూటర్స్ రెండూ కూడా సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో వస్తాయి.Yamaha Fascino 125 FI, Yamaha Ray ZR 125 FI స్కూటర్స్ రెండూ కూడా ప్రామాణికంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్‌ను కలిగి ఉన్నాయి. చదవండి: మహీంద్రా అండ్ మహీంద్రా కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు!! -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ మళ్లీ వచ్చింది
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ‘డిజిటల్ ఇండియా సేల్’ మళ్లీ వచ్చింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై రిలయన్స్ డిజిటల్ భారీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏదైనా క్రెడిట్ కార్డు/ డెబిట్‌కార్డు లావాదేవీలపై 6%.., సిటీ బ్యాంక్ క్రిడెట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ ఈఎంఐ లావాదేవీలపై ఏకంగా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్ వోచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. కంపెనీ వెబ్సైట్ www. reliancedigital.in ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. -
ఫ్లిప్‌కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్'లో వాటిపై అదిరిపోయే ఆఫర్స్..!
తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తూ ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ పేరుతో మరో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. నిన్ననే ముగిసిన బిగ్ సేవింగ్ డేస్ తర్వాత ఈ సేల్ ప్రకటించడం విశేషం. ఫ్లిప్‌కార్ట్ 'ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్' జనవరి 23 నుంచి 26 వరకు కొనసాగుతుంది. అయితే, ది గ్రాండ్ గాడ్జెట్ డేస్ సేల్‌లో మీకు మొబైల్ కవర్, స్మార్ట్ వాచ్, టీడబ్ల్యుఎస్, ల్యాప్ టాప్, కెమెరాల వంటి వాటి మీద అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా సేల్కు పోటీగా ఈ సేల్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఈ రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ కూడా జనవరి 26 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ల్యాప్ టాప్స్ మీద 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. డెల్ ఇన్ స్పిరాన్ రైజెన్ 5, డెల్ ఇన్ స్పిరాన్ వోస్ట్రో కోర్ ఐ3 11వ-జెన్, ఇన్ స్పిరాన్ కోర్ ఐ3 11వ జెన్ మోడల్స్ మీద ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. హెచ్‌పీ, ఎంఎస్ఐ, ఎల్జి, డెల్, ఏసర్, లెనోవోతో సహా కొన్ని ప్రముఖ బ్రాండ్లపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే,యాపిల్,శామ్ సంగ్ కంపెనీలకు చెందిన టాబ్లెట్లపై కూడా ఆఫర్స్ అందిస్తుంది. బోస్ ఆడియో ప్రోడక్ట్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టిడబ్ల్యుఎస్ ఇయర్ బడ్స్, సౌండ్ బార్లు, హోమ్ థియేటర్లు, బ్లూటూత్ స్పీకర్ల మీద వరుసగా 30 శాతం, 40 శాతం, 60 శాతం, 40 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాలు, స్మార్ట్ వాచ్ మీద కూడా ఆఫర్స్ లభిస్తున్నాయి. డిఎస్ఎల్ఆర్ & మిర్రర్ లెస్ కెమెరాలపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ సేల్లోఫిట్ నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌లను రూ.1,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. రూ.699 నుంచి పవర్ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. చివరగా, మొబైల్ కేసులు మరియు కవర్లు కేవలం రూ.99 నుండి అందుబాటులో ఉంటాయి. (చదవండి: టాటా మోటార్స్ దూకుడు.. ఇక ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ తగ్గేదె లే!) -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్..! వాటిపై 80 శాతం డిస్కౌంట్
ఈ ఏడాదిలో తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022ను ప్రకటించింది. దీని కోసం వెబ్సైట్లో ఒక ప్రత్యేక పేజీని క్రియేట్ చేసింది. ఈ సేల్ జనవరి 17 నుంచి 22 వరకు కొనసాగుతుంది. అమెజాన్ కూడా 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్' పేరుతో ప్రత్యేక సేల్‌ను తీసుకొస్తుంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17 నుంచి 20 వరకు కొనసాగనుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ ఐటమ్, దుస్తులపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కొంత సేల్‌ను తీసుకువస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు జనవరి 16 నుంచి ఈ సేల్‌లో పాల్గొనవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు తమ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్ పొందుతారు. ఏ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ మీద ఎంత డిస్కౌంట్ అందిస్తున్నారో ఇంకా వెల్లడించలేదు. వీటిపై 80% వరకు డిస్కౌంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 80% వరకు డిస్కౌంట్ అందిస్తే, హెడ్ ఫోన్లు & స్పీకర్లు 70 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. మరోవైపు స్మార్ట్ వేరియబుల్స్ మీద 60% వరకు డిస్కౌంట్, ల్యాప్ టాప్ & డెస్క్ టాప్స్ మీద 40 శాతం వరకు డిస్కౌంట్, మొబైల్ యాక్ససరీల మీద 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. అలాగే, టాప్ స్మార్ట్ వాచీల మీద 60% వరకు డిస్కౌంట్, టీవీ & గృహోపకరణాల మీద 75% వరకు డిస్కౌంట్, దుస్తుల మీద 60 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. త్వరలో ఏ ప్రొడక్ట్ మీద ఎంత డిస్కౌంట్ ఇవ్వనున్నారో ప్రకటించనుంది. (చదవండి: 2021లో దేశంలో ఎక్కువగా డౌన్లోడ్ చేసిన మొబైల్ యాప్ ఇదే..!) -
రిలయన్స్ నెక్లెస్‌లు, బ్రాస్లెట్స్, స్పెషల్ ఆఫర్ కూడా
సాక్షి, హైదరాబాద్: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన రిలయన్స్ జ్యువెల్స్ నూతన సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చిన వినూత్న ఆభరణాల ఆఫర్‌ను హాలిడే కలెక్షన్స్ పేరుతో కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కలెక్షన్‌ను తీసుకొచ్చింది. అత్యధ్బుతమైన హస్తకళా నైపుణ్యాన్ని జోడించి ‘బెల్లా ది హాలిడే కలెక్షన్’ పేరుతో సరికొత్త, సమకాలీన స్టైలిష్ ఆభరణాలను ప్రారంభించింది. రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్, డైమండ్ కేటగిరీల్లో స్పెషల్ నెక్లెస్‌లను, బ్రాస్లెట్లను లాంచ్ చేసింది. అధునాతన డిజైన్, స్టయిల్‌తో తమ బెల్లా కలెక్షన్ ఆకట్టుకుంటుందని రిలయన్స్ జ్యువెల్స్ ప్రకటించింది. తమ బెల్లా ఆభరణాలకు వినియోగదారులనుంచి మంచి ఆదరణ లభిస్తుందనే విశ్వాసాన్ని రిలయన్స్ ప్రతినిధి వెల్లడించారు. రూ. 5 వేల నుంచి ఇవి లభ్యమని చెప్పారు. అలాగే అందమైన డైమండ్ లైన్ బ్రాస్లెట్స్ రూ .69,999 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక ధరలో లభిస్తాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను కూడా అందిస్తోంది. బంగారు ఆభరణాలపై 20 శాతం, డైమండ్ ఆభరణాలపై 20 శాతం మేకింగ్ చార్జీలపై డిస్కైంట్ లభ్యం. ఈ ఆఫర్ 16 వ తేదీ ఫిబ్రవరి 2020 వరకు చెల్లుతుంది. వందకు పైగా నగరాల్లో 200 పైగా స్టోర్లతో సేవలను అందిస్తున్న రిలయన్స్ జ్యువెల్స్ త్వరితగతిన విస్తరిస్తోంది. రిలయన్స్ జ్యువెల్స్ బ్రాండ్ 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ ఆభరణాలను మాత్రమే అందిస్తోంది. -
పర్యటకుల కోసం సదరన్ ట్రావెల్స్ ప్రత్యక ఆఫర్లు
-
మరాఠాలకు ‘మహా’ వరాలు
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఆందోళన చేస్తున్న మరాఠాలను శాంతింపజేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది. మరాఠా యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీగా ఉండనుంది. ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక ఫెలోషిప్ అందించనుంది. మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి చంద్రకాంత్ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేబినెట్ సబ్‌కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. మరాఠా యువతకు బ్యాంకులు రుణాలకు సంబంధించి అన్నాభూ సాథే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పథకం కింద బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు. వార్షికాదాయం రూ.8 లక్షలు దాటని మరాఠా సామాజికవర్గం పిల్లలు వృత్తివిద్యా కోర్సుల్లో చేరితే ఫీజులో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆర్థిక మంత్రి పాటిల్ తెలిపారు. ఈ జాబితాలో 608 వృత్తివిద్యా కోర్సుల్ని చేర్చినట్లు వెల్లడించారు. విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్ కోసం మరాఠాలు గత 11 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరాఠాలను మోసం చేయాలనుకోవట్లేదు దుందుడుకుగా లోపభూయిష్టమైన రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చి తమ ప్రభుత్వం మరాఠాలను మోసం చేయాలనుకోవడం లేదని ఆర్థికమంత్రి సుధీర్ తెలిపారు. దీనివల్ల ఆయా చట్టాలను కోర్టులు కొట్టేసే అవకాశం ఉందన్నారు. మరాఠాల రిజర్వేషన్లను కోర్టులో సవాలు చేయలేని విధంగా అన్ని జాగ్రత్తలతో పటిష్టమైన చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. -
వోడాఫోన్ రంజాన్ స్పెషల్ ఆఫర్లు
ముంబై: వోడాఫోన్ ఇండియా తన ఖాతాదారులకోసం పవిత్ర రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఆఫర్ లో అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ప్రత్యేక డేటా ప్లాన్లను ప్రకటించింది. రంజాన్ స్పెషల్ ప్యాక్ లో ఒకరోజు వ్యాలిడిటీతో , 2జీ వినియోగదారులు 444 * 5 # డయలింగ్ ద్వారా రూ.5 తో అపరిమిత డేటా ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే 3జీ కస్టమర్లు * 444 * 19 # డయలింగ్ ద్వారా రూ.19 లపై అపరిమిత డేటా ఆఫర్‌ను పొందవచ్చు. అయితే యుపి (వెస్ట్) ఉత్తరాఖండ్ ప్రాంతంలోని నివాసితులకు మాత్రమే ఈ ఆఫర్లు లభ్యం. -
ఎల్జీ జీ6 ఆ రోజుకొంటే 10వేల క్యాష్ బ్యాక్
శాంసంగ్ గెలాక్సీ లేటెస్ట్ మొబైల్ ఎస్8కి గట్టి పోటీగా మరో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేసింది. ఎల్జీ జీ6 పేరుతో అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ లాంచింగ్ తో పాటు స్పెషల్ ఆఫర్లను కూడా మీకోసం కంపెనీ తీసుకొచ్చేసింది. ఎల్జీ జీ6 ఫోన్ ను ప్రీ బుక్ చేసుకునే వారికి 7000 రూపాయల డిస్కౌంట్ ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఆ వినియోగదారులు హెచ్డీఎఫ్సీ లేదా ఎస్బీఐ క్రెడిట్/ డెబిట్ కార్డు హోల్డర్లు అయి ఉండాలని తెలిపింది. అంతేకాక ఏప్రిల్ 25న కొనుగోలు చేసే కస్టమర్లకు 10వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను ఇవ్వనున్నట్టు తెలిపింది. రిలయన్స్ జియో కూడా ఈ ఫోన్ పై బంపర్ ఆఫర్లనే తీసుకొచ్చింది. ఈ ఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు 2018 మార్చి వరకు 100జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే ప్రతి 309 రీఛార్జ్ పై 10జీబీ అదనపు డేటా అన్నమాట.రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన ఈ ఫోన్ ఏప్రిల్ 25 నుంచి ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ప్లాట్ ఫామ్ పై అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర 51,990 రూపాయలు. మిస్టిక్ వూట్, అస్ట్రో బ్లాక్, ఐస్ ప్లాటినం మూడు రంగుల్లో ఇది లభ్యం కానుంది. డాల్బీ విజన్ ఫీచర్ తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ ఇదేనని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. -
బిగ్‌బజార్ మాల్స్‌లో అదరగొట్టే ఆఫర్లు
-
రూ. 829 నుంచి విమాన టికెట్లు!
వర్షాకాలం మొదలవ్వడంతో విమాన చార్జీలు కూడా తగ్గుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇండిగో సంస్థ తన కొత్త ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకొని రూ. 829 నుంచి స్వదేశీ విమాన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు స్వదేశంలో చేసే విమాన ప్రయానాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ స్కీంలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయో మాత్రం ఇండిగో ప్రకటించలేదు. అన్నింటికంటే తక్కువగా ఇంఫాల్-గువాహటి మార్గంలో టికెట్ రూ. 829కి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. అయితే ఇతర రూట్లలో మాత్రం టికెట్ల ధరలు దానికంటే కొంత ఎక్కువగానే ఉన్నాయి. ఢిల్లీ-ముంబై మార్గంలో రూ. 2,486, ఢిల్లీ -చెన్నై మార్గంలో రూ. 3,338 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. అయితే ఇండిగో వెబ్సైట్లో చూస్తే మాత్రం ఢిల్లీ-ముంబై మార్గంలో వచ్చే వారానికి టికెట్ రూ. 5వేలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటినుంచి అమలవుతుందో ఇంకా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఏషియా లాంటి అనేక సంస్థలు వర్షాకాలం ఆఫర్లను ప్రకటించాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ 20 శాతం డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
'గరుడ' సంక్రాంతి ఆఫర్లు
న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ప్రముఖ కొరియర్ సంస్థ గరుడ వేగ.. కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలతో సహా సుమారు 200 దేశాలకు తమ సేవలను విస్తరించిన గరుడ వేగ.. విదేశాల్లోని భారతీయులు, పండుగ సందర్భంగా ఇక్కడున్న తమ వారికి పంపే గిఫ్టులు.. తమవారి నుంచి అక్కడకు చేర్చాల్సిన పండగ రుచులను చేరవేయడానికి భారీ ఆఫర్లను ప్రకటించింది. గరుడ బజార్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ బ్యాంగిల్స్ లో ప్రత్యేకమైన వాటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ప్రత్యేక స్వీట్లు ఇప్పుడు ఎక్కువమంది విక్రేతల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా 20 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించడమే కాకుండా పొంగల్ కూపన్ కోడ్ ద్వారా మరో 5 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
కొత్త ఏడాదిన ఎయిరిండియా ఆఫర్లు
చెన్నై: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎయిరిండియా రెండు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దేశంలోని మెట్రో నగరాల మధ్య విమాన సర్వీసుల టికెట్ల ధరలకు డిస్కౌంట్ ఇచ్చింది. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి జనవరి 1 ఉదయం 8 గంటల మధ్య దేశంలోని ప్రధాన నగరాల మధ్య నడిచే ఎయిరిండియా సర్వీసులలో అన్ని పన్నులతో సహా 5,016 రూపాయలతో ప్రయాణించవచ్చు. ఇక జనవరి 1 నుంచి 15 వరకు ఢిల్లీ-ముంబై మహానగరాల మధ్య ఎయిరిండియా బీ 777 విమానాల్లో ఎకానమీ లేదా బిజినెస్ క్లాస్‌ల్లో ప్రయాణించే ప్రయాణికుల టికెట్లను లక్కీ డ్రా తీస్తారు. విమానం టేకాఫ్ తీసుకునేముందు డ్రా తీస్తారు. విజేతను ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. -
ఉప్మా 40 పైసలు, ఫిల్టర్ కాఫీ 15 పైసలే!
ముంబై: తమ వ్యాపారాలు ప్రారంభించాకా వార్షికోత్సవాలను జరుపుకోవడంలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి విశేష సందర్భాన్ని ఆసక్తికరమైన రీతిలో సెలబ్రేట్ చేసుకుంది ముంబైలోని మతుంగా మద్రాస్ కేఫ్. 1940లో మొదలైన ఈ కేఫ్ ఇటీవలే 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ కేఫ్‌కు వచ్చే వాళ్లకు ఈ సందర్భం గుర్తుండిపోయేలా చేశారు దాని నిర్వాహకులు. తమ కేఫ్ ప్రారంభమైన సమయంలో తినుబండారాలు ఏ ధరకు అందించారో.. 75 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా వాటిని అవే ధరలకు అందించారు. ఉప్మా కేవలం 40 పైసలకు, ఫిల్టర్ కాఫీని పదిహేను పైసలకు అందించారు. ఇవేగాక ఈ మద్రాస్ కేఫ్‌లో దక్షిణాది స్పెషల్స్ అయిన రసం, బటర్ ఇడ్లీ, దోసె, అప్పలం, మైసూర్ పాక్ వంటి వాటిని కూడా 1940 నాటి ధరలకు అందించారు. తమ రెస్టారెంట్‌కు వచ్చిన వారికి పాతధరలతో కొత్త అనుభవాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ పరిమిత సమయం మాత్రమే. -
సెల్‌పాయింట్‌లో ఆఫర్ల వెల్లువ
విశాఖపట్నం సిటీ : సెల్పాయింట్ 16వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 రోజులుగా వినియోగదారులకు ఇస్తున్న ప్రత్యేక ఆఫర్లు దీపావళితో ముగియనున్నాయి. ఆధునిక మోడళ్లతో సెల్పాయింట్ షోరూమ్‌లు కళకళలాడుతున్నాయి. భారీ డిస్కౌంట్లతో పాటు కాంబో, జోడీ ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా సెల్పాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ మోహన్‌ప్రసాద్ పాండే మాట్లాడుతూ మొబైల్ కొనుగోలుదారులకు బంపర్ బహుమతుల కింద 10 మందికి మలేషియా ఫారిన్ ట్రిప్, ఐదుగురికి స్కూటీ పెప్స్లను డ్రా ద్వారా అందజేయనున్నట్టు తెలిపారు. తమ షోరూమ్స్‌లో శామ్సంగ్, సోనీ, నోకియా, కార్బన్, సెల్కాన్, మైక్రోమ్యాక్స్, ఎల్జీ, హెచ్‌టీసీ, ఐఫోన్ కంపెనీల సెల్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నామని చెప్పారు. జోడి ఆఫర్‌తో కొన్ని రకాల సెలెక్టెడ్ బ్రాండ్లపై బ్లూటూత్, ఫ్లిప్ కవర్స, మెమరీ కార్డులు, హెడ్ఫోన్లు, ట్యాబ్, సౌండ్ సిస్టమ్స్, మిక్సీ, ఇండక్షన్ స్టవ్, రైస్కుక్కర్లతోపాటు మరెన్నో ఆకర్షణీయమైన వస్తువులు అందజేయనున్నట్లు తెలిపారు. ఒక మొబైల్ కొనుగోలు చేస్తే మూడు మొబైల్స్ ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. గెలక్సీ నోట్-4 కొనుగోలుపై ఎల్ఈడీ టీవీ ఉచితంగా, ఐఫోన్ 6(ఎస్), ఐఫోన్ 6(ఎస్) ప్లస్ కొనుగోలుపై మలేషియా ట్రిప్‌ని గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. తమ ఆఫర్లకు విశేష స్పందన లభిస్తోందన్నారు. డైమండ్ పార్కు, డాబాగార్డెన్‌స, గాజువాక, ఎన్ఏడీ, అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, తణుకు, అమలాపురం, విజయవాడ, గుంటూరులో మొత్తం 60 శాఖలున్నాయని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
సిమ్ కొంటే ఉల్లి ఫ్రీ
హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు మా కంపెనీ సిమ్ కొంటే... టాక్ టైం ఫ్రీ... మెసేజ్ బ్యాలెన్స్ ఫ్రీ... డేటా ఫ్రీ అంటూ ప్రచారం చేసిన మొబైల్ నెట్వర్క్ కంపెనీలు కొత్త బాట పట్టాయి. మా కంపెనీకి చెందిన సిమ్ కొనుగోలు చేస్తే ఓ కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ అని బ్యానర్లు ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ చౌరస్తాలో బ్యానర్లు వెలిశాయి. -
వేడెక్కిన రాజకీయం
కాంగ్రెస్‌లో మళ్లీ చర్చనీయాంశమైన వలసలు వైఎస్సార్సీపీలో నూతనోత్సాహం టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం పోటాపోటీ సభ్యత్వ నమోదుకు తెలుగుతమ్ముళ్ల ప్రత్యేక ఆఫర్లు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. అన్ని రాజకీయ పార్టీలు వివిధ కార్యకలాపాలలో నిమగ్నం కావ డం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సమయం దగ్గరపడుతుండడంతో ఒక్కసారిగా రాజకీయాలు రస వత్తరంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మళ్లీ వలసలుఉంటాయన్న ప్రచారం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు టీఆర్ఎస్లోనూ రాజకీయ సమీకరణలకు తావిస్తుండగా, టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ప్రతిష్టాత్మకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్, టీడీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నా, అవి నామమాత్రంగానే సాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలో సమన్వయలేమి కారణంగా అక్కడక్కడా తూతూమంత్రంగా సభ్యత్వ నమోదు సాగుతోంది. టీడీపీలోనూ అదే పరిస్థితి ఉండగా, తమ సభ్యత్వాల సంఖ్యను వీలున్నంత ఎక్కువ చూపించేందుకు గాను ఆ పార్టీ ప్రమాద బీమా లాంటి ఆఫర్లు ఇస్తూ ముందుకెళుతోంది. వాతావరణంలో చలి తీవ్రత పెరుగుతున్నట్టుగానే రాజకీయాల్లో కూడా అదేస్థాయిలో వేడి పుడుతోందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. జంపింగ్.. జపాంగ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు సాగుతున్నాయి. ఇదే క్రమంలో జిల్లా వ్యాప్తగా 1100 మందికిపైగా ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లారు. జెడ్పీ చైర్మన్ బాలునాయక్ టీఆర్ఎస్లోకి వెళ్లే యోచనలో ఉన్నట్టు గతంలోనే వార్తలు వినిపించినా, ఇటీవల సీఎం ను కలవడంతో ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే, నాయక్ మాత్రం ఎక్కడా తన అంతరంగాన్ని వెల్లడిం చడం లేదు. జెడ్పీచైర్మన్‌గా సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్న ఆయన.. టీఆర్ఎస్లో చేరే అంశాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. అయితే, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నేతల వలసల అంశం ఈ రెండు పార్టీల్లో కూడా వేడిపుట్టిస్తోంది. ఇటీవలి పరిణామాలపై వస్తున్న వార్తలే నిజమైతే జిల్లా పార్టీలో ఆధిపత్యపోరుకు తెరలేస్తుందనేది ఓ వర్గం వాదన. ఈ పరిస్థితుల్లో మొదటి నుంచీ టీఆర్ఎస్లో పనిచేస్తున్న వారిని కాకుండా కొత్తగా వస్తున్న వారిని పార్టీ అధినాయకత్వం పరిగణనలోనికి తీసుకుంటుందా అనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతోంది. నూతనోత్సాహంతో వైఎస్సార్సీపీ ఇక, వైఎస్సార్సీపీ కూడా ఎన్నికల అనంతరం మళ్లీ క్రియాశీలమవుతోంది. ఇటీవల జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించుకున్న ఆ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశానికి హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు ఈ మేరకు దశానిర్దేశం చే శారు. అయితే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల త్వరలోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర నిర్వహించి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని కలుస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. దీంతో ఆమె రాక కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. నువ్వా... నేనా.. సై మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం కూడా జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు ఈస్థానంపై తమ వ్యూహాలకు పదును పెడుతుండగా, టీఆర్ఎస్లో మాత్రం అభ్యర్థిత్వం విషయంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల నియోజకవర్గం కావడంతో ఆ రెండు జిల్లాలతో పాటు మన జిల్లా నుంచి ఆశావహులు సీటు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి టికెట్ రేసులో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి ముందుండగా, సీనియర్ నాయకుడు చాడా కిషన్‌రెడ్డి కూడా తనకు పార్టీ అధినేత ఆశీస్సులుంటాయని భావిస్తున్నారు. గతంలో ఎంపీగా పోటీచేసిన రాజేశ్వర్‌రెడ్డి ఇంకా రేసులోనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, జర్నలిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వర మూర్తికి టికెట్ ఇవ్వాలని ఉద్యోగ వర్గాలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం జిల్లాలో పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. సా... గుతున్న సభ్యత్వాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సభ్యత్వ నమోదులో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు మొక్కుబడిగానే సాగుతోంది. ఏఐసీసీ నాయకులు వచ్చినా జిల్లా నాయకులంతా ఒకే వేదికపై కనిపించే సమన్వయం లేకపోవడం, జిల్లాలో సభ్యత్వ నమోదును ముందుండి నడిపించాల్సిన పార్టీ జిల్లా అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి కొంతకాలంగా స్తబ్దుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎవరికి వారే అన్నరీతిలో కాంగ్రెస్ సభ్యత్వాలు జరుగుతున్నాయి. ఇక, తెలంగాణలో నానాటికీ బలహీనపడుతోన్న తెలుగుదేశం పార్టీ కూడా సభ్యత్వ నమోదును ప్రారంభించింది. జిల్లాలో పార్టీకి దిక్సూచిగా ఉండే నాయకులు లేకపోవడం, ఉన్న నలుగురు నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన నేతలు నియోజకవర్గాలకు మొహం చూపించకపోవడంతో ఆ పార్టీలో సభ్యులను చేర్చేందుకు తెలుగుతమ్ముళ్లు నానా తంటాలు పడుతున్నారు. ఇక, ఆ పార్టీ ఈసారి సభ్యత్వ న మోదులో విన్నూత్న రీతిలో ముందుకెళుతోంది. తమ పార్టీలో చేరితే పార్టీ సభ్యత్వంతో పాటు రూ.2లక్షల ప్రమాదబీమా కల్పిస్తామని, ప్రయాణాల్లో రాయితీలు కల్పిస్తామని ఆఫర్లు ఇస్తోంది. అయినా, సభ్యత్వ నమోదు మందకొడిగా సాగుతుండడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేత డాక్టర్. కె.లక్ష్మణ్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా, కార్యకర్తలంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే నెలలో జరగనున్న జిల్లా మహాసభలకు సీపీఎం సిద్ధమవుతోంది. కాగా, సీపీఐ శ్రేణులు కూడా త్వరలోనే పార్టీ మహాసభలు నిర్వహించుకునేందుకు సిద్ధమవుతువున్నాయి. -
బీఎస్ఎన్ఎల్ దసరా ప్రత్యేక స్కీములు
లక్ష్మీపురం(గుంటూరు) దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు అందజేయనున్నామని టెలికం జనరల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్.రావు చెప్పారు. స్థానిక చంద్రమౌళినగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్రాండ్‌బ్యాండ్ హోమ్ అన్ లిమిలెటెడ్ వినియోగదారులకు డౌన్లోడ్ స్పీడ్‌ను పెంచుతున్నామన్నారు. ఇది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. 2014 సెప్టెంబర్ 23 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు ప్రీపెయిడ్ టాప్ అప్ ఓచర్లపై పూర్తి టాక్‌టైమ్ అందజేస్తామని, ఇవి రూ. 100, రూ. 150, రూ. 250, రూ. 350లలో లభ్యమవుతాయన్నారు. రూ.550, రూ. 575, రూ.750, రూ.790 టాప్ అప్ ఓచర్లకు ఫుల్ టాక్ టైమ్‌కు మరికొంత అదనంగా లభిస్తుందన్నారు. నేస్తం ప్రీ పెయిడ్ మొబైల్ ప్లాన్ కాల్చార్జిల్లో మార్పులు చేశామని, ఈ మార్పు ఈ నెల 23 నుంచి వర్తింస్తుందని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ లోకల్, ఎస్టీడీ కాల్చార్జిని ఇప్పటి వరకు సెకనుకు రూ.1.2 పైసలు వసూలు చేశామని, మార్పు చేసిన తరువాత సెకనుకు రూ.1.3 పైసలు వసూలు చేస్తున్నామని వివరించారు. ఇతర నెట్‌వర్క్‌లకు రూ.1.3పైసల నుంచి రూ. 1.4పైసలకు పెంపుదల చేశామన్నారు. బ్రాండ్‌బ్యాండ్ హోమ్ అన్లిమిటెడ్-545 ప్రస్తుతం ఉన్న డౌన్లోడ్ స్పీడ్‌ను 15 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ ఆపైన 512 కేబీపీఎస్‌కు మార్పు చేశామని వివరించారు. బీబీ హోమ్ కాంబో యూఎల్డీ-675, యూఎల్డీ-800, యూఎల్డీ -900, యూఎల్డీ-999 ప్లాన్లలో కూడా డౌన్లోడు స్పీడ్ మార్పు చేశామని చెప్పారు. జన్ ధన్ యోజన స్కీము బ్యాంకు ఖాతాదారులకు బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ సిమ్‌ను ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు, పాస్‌పోర్టుసైజు ఫొటోలు, నివాస ధృవీకరణ పత్రం అందజేస్తే సిమ్ ఇస్తామన్నారు. ఈ పథకం 90 రోజులపాటు అమలులో ఉంటుందని, మొదటి రీచార్జి కూపన్ విలువ మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. విలేకరుల సమావేశంలో అధికారులు మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీసేవలో బిల్లుల చెల్లింపు.: అనంతరం టెలికం జనరల్ మేనేజర్ ఎం.ఎల్.ఎన్.రావు సాక్షితో మాట్లాడుతూ ఒక వారం రోజుల్లో మీ సేవ కేంద్రాల్లో బీఎస్ఎన్ఎల్ బిల్లులు కట్టించుకునే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పారు. మీసేవ ప్రతినిధులతో చర్చలు ఫలవంతమయ్యాయని, మీ సేవ, బీఎస్ఎన్ఎల్ మధ్య సర్వర్‌ను లింక్చేసే ప్రక్రియ నడుస్తోందని వివరించారు.